మరోసారి పవన్‌కళ్యాణ్‌ని టార్గెట్ చేసిన ప్రకాష్‌రాజ్!
on Oct 1, 2024
తిరుమల లడ్డు వ్యవహారం జాతీయ సమస్యగా పరిణమించింది. దీంతో సుప్రీమ్ కోర్టు కూడా దీనిలో జోక్యం చేసుకుంటోంది. ఈ కల్తీ లడ్డు విషయంలో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు జరుగుతున్నాయి. ఈ విషయంలో దోషులెవరు, వారిని ఎలా శిక్షిస్తారు అనే దాని గురించి ఓ పక్క చర్చించుకుంటూ ఉంటే, మరో పక్క ప్రకాష్‌రాజ్ వంటి వారు ఏదో ఒక సాకుతో ట్వీట్స్ పెడుతూ పవన్‌కళ్యాణ్‌ని కెలుకుతున్నారు. ప్రతిసారీ జస్ట్ ఆస్కింగ్ అంటూ సోషల్ మీడియాలోకి వస్తున్న ఆయన.. ఇప్పటికే పలుమార్లు పవన్‌కళ్యాణ్‌పై ట్వీట్లు వదిలారు. అయితే తన ట్వీట్‌లో ఎక్కడా పవన్ కళ్యాణ్ పేరును ప్రస్తావించకపోయినా అది అతన్ని ఉద్దేశించి చేసినదనే విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు.
ప్రకాష్‌రాజ్ మొదట పెట్టిన ట్వీట్‌పై పవన్‌కళ్యాణ్ తీవ్రంగా స్పందించడంతో తన రెండో ట్వీట్‌లో నేను చెప్పింది ఏమిటి, మీరు అర్థం చేసుకున్నదేమిటి.. అంటూనే తను విదేశాల్లో ఉన్నాననీ, వచ్చిన తర్వాత అన్నింటికీ సమాధానం చెప్తానని అన్నారు. ఇది జరిగిన రెండు రోజులకే కార్తీ వ్యాఖ్యల విషయంలో పవన్‌కళ్యాణ్ సీరియస్ కావడంతో, కార్తీ.. పవన్‌కి సారీ చెప్పారు. దీనిపై స్పందిస్తూ చేయని తప్పుకు క్షమాపణలు చెప్పించారు. మీరు హ్యాపీనా అంటూ ట్వీట్ చేశారు.
తాజాగా మరో వివాదాస్పదమైన ట్వీట్‌తో వచ్చారు ప్రకాష్‌రాజ్. కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ కదా? ఇక చాలు. ప్రజల కోసం చేయవలసిన పనులు చూడండి’ అంటూ ట్వీట్ చేశారు. ఇటీవల పవన్‌కళ్యాణ్ 11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష చేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని టార్గెట్ చేస్తూ దీక్షలు మానేసి ప్రజలకు చెయ్యాల్సిన పనులు చూడండి అని అర్థం వచ్చే పెట్టిన ట్వీట్‌పై నెటిజన్లు సీరియస్ అవుతున్నారు. ఇలాంటి ట్వీట్లు పెట్టడం వల్ల నీకు ఒరిగేదేమిటి అంటూ ప్రకాష్‌రాజ్‌ని నిలదీస్తున్నారు.
Also Read