ఇంట గెలిచాడు... ఇక రచ్చ గెలిచే పనిలో పడ్డాడు
on Aug 2, 2017
మన హీరోలందరూ పక్క రాష్ట్రాల్లో కూడా మార్కెట్ పెంచుకోడానికి తెగ ప్రయత్నాలు చేసేస్తున్నారు. ఈ విషయంలో బన్నీ అందరికంటే ముందున్నాడనే చెప్పాలి. ‘బాహుబలి’ రాకముందు... పక్క రాష్ట్రాల్లో మార్కెట్ ఉన్న ఏకైక తెలుగు హీరో బన్నీ ఒక్కడే. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ కి పక్క రాష్ట్రాల్లో కూడా ఊహించని రేంజ్ లో మార్కెట్ పెరిగింది. ఇది వేరే విషయం.
ఇక బన్నీ విషయానికొస్తే... కేరళలో అతనికున్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. బన్నీ నటించిన ప్రతి సినిమా అక్కడ హిట్టే. అక్కడందరూ... అల్లు అర్జున్ ని ‘మల్లు అర్జున్’ అంటారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి తమిళ మార్కెట్ పై కూడా కన్నేశాడు ఈ అల్లూవారి అబ్బాయి. ప్రస్తుతం ఆయన ‘నా పేరు సూర్య... నా ఊరు ఇండియా’సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత బన్నీ... తమిళ దిగ్గజ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. ఆ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందనుందని విశ్వసనీయ సమాచారం. మరో విషయం ఏంటంటే... ఆ సినిమా ద్వారా తమిళంలో సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవాలని బన్నీ నిర్ణయించాడు.
మన హీరోల్లో వచ్చిన ఈ మార్పు నిజంగా అభినందనీయం. ఎందుకంటే... ఇన్నాళ్లూ... తమిళ హీరోలు వారి రాష్ట్రంలోనే కాక, మన దగ్గర కూడా హవా సాగించారు. మన హీరోల సినిమాలు అరాకొరా మాత్రమే అక్కడ విడుదలయ్యేవి. కానీ... ఇప్పుడు మన వాళ్లు జూలు విదిల్చారు. ఓ వైపు బన్నీ, మరో ప్రభాస్.. ఇంకో వైపు మహేశ్.. ఇలా మన హీరోలందరూ తమిళ తెరపై కూడా హవా సాగించడం నిజంగా మనకు గర్వకారణమే.
మన బాలయ్య ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ సినిమా కూడా తమిళ వెర్షన్ త్వరలో విడుదల కానున్న విషయం తెలిసిందే.