ప్రభాస్ కి నిజంగా అంత సీన్ ఉందంటారా?
on Aug 3, 2017
‘బాహుబలి’ముందు ప్రభాస్ ఏంటి?
అతనొక స్టార్ హీరో అంతేకదా! నంబర్ వన్ స్టారేం కాదు కదా! ‘బాహుబలి’క్రెడిట్ మొత్తం కూడా ప్రభాస్ ది కాదు కదా! నిజానికి ఆ సినిమా క్రెడిట్ లో 50 శాతం రాజమౌళి తీసేసుకున్నాడు. ఇక మిగిలిన యాభై శాతంలో అందరూ పంచుకోవడమే. ఇప్పుడు ఇదంతా దేనికి? అనుకుంటున్నారా?
‘బాహుబలి’తర్వాత ప్రభాస్ సినిమా బడ్జెట్లు వింటుంటే... ఎవరైనా నోరెళ్ల బెట్టాల్సిందే. కొందరైతే... ‘ఇంత అవసరమా’ అని డైరెక్టుగానే అంటుంటే... కొందరేమో... ‘అది వాపో... బలుపో అర్థం కావడం లేదు’అని విమర్శలు గుప్పిస్తున్నారు. అభిమానులు మాత్రం ‘మా యంగ్ రెబల్ స్టార్ స్టామినా అలాంటిది’ అని స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు. వీరిలో ఎవరి అభిప్రాయం సరైనదనుకోవాలో తెలీక జుత్తు పీక్కోవాల్సిన పరిస్థితి.
నిజానికి తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ బలం ఎంత? అనే విషయాన్ని చర్చించుకుంటే... ‘బాహుబలి’కి ముందు వరకూ... వసూళ్ల పరంగా పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, ఎన్టీయార్ సినిమాల స్థాయిలో ప్రభాస్ సినిమా వసూళ్లు ఉండేవి కావు. దానికి కారణం... ఆ కుటుంబాల బలం కావొచ్చు.. లేక ఆ ముగ్గురికీ ఉన్న మాస్ ఫోలోయింగ్ కావొచ్చు.
తొలి సినిమా‘ఈశ్వర్’నటునిగా ప్రభాస్ కి మంచి మార్కులు సంపాదించిపెట్టినా.... అతని కెరీర్ మాత్రం పాపం ఒడిదుడుకులతోనే సాగింది. మధ్య మధ్యలో వర్షం, ఛత్రపతి సినిమాలు మాత్రం ఊరట అందించాయి. అవి కూడా లేకపోతే.. ప్రభాస్ కెరీర్ ని అస్సలు ఊహించలేం. ఓ విధంగా ప్రభాస్ కెరీర్ కాస్తంత గాడిలో పడింది మాత్రం ‘డార్లింగ్’నుంచే. ఆ వెంటనే వచ్చిన ‘మిస్టర్ పర్ ఫెక్ట్’తో క్లాస్ ఆడియన్స్ కు చేరువైన ప్రభాస్... ‘మిర్చి’తో పవన్, మహేశ్, తారక్ తర్వాత మళ్లీ అంతటి మాస్ హీరో అనిపించేశాడు. అయితే... ఇప్పుడున్న పరిస్థితి మాత్రం కాస్త భిన్నమే.
అదెలాగంటారా? తెలుగు రాష్ట్రాల్లో ‘బాహుబలి’చిత్రాలు... ప్రభాస్ కి ఎంతమేర ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచాయో చెప్పలేం కానీ... ఇతర రాష్ట్రాల్లో మాత్రం అతడికి ఎక్కడ లేని క్రేజ్ తెచ్చిపెట్టేశాయి. ఇప్పుడు ప్రభాస్ బాలీవుడ్ లో కూడా స్టార్. అందులో నో డౌట్. దాంతో... సినిమా నిర్మాణాల విషయంలో సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. మార్కెట్ అనూహ్యంగా పెరిగిపోవడంతో ప్రభాస్ రెమ్యునరేషన్ లో కూడా గణనీయమైన మార్పు వచ్చినట్టు అంతరంగిక వర్గాల భోగట్ట. ప్రస్తుతం పరిస్థితి ఎలామారిందంటే... ప్రభాస్ సినిమాకు పెడుతున్నంత బడ్జెట్... ఏ తెలుగు హీరోకీ పెట్టడంలేదు.
మనం నిజాలు మాట్లాడుకుంటే... ‘బాహుబలి’సిరీస్ ని పక్కన పెట్టి తెలుగు సినిమా వసూళ్లను చూస్తే... నంబర్ వన్ ప్లేస్ లో ఉన్న సినిమా ‘ఖైదీ నంబర్ 150’. 100 కోట్ల షేర్ వసూలు చేసిన సినిమా ఇది. రీ ఎంట్రీలో కూడా బాక్సులు బద్దలు కొట్టారు మెగాస్టార్. కానీ... ఏం లాభం? చివరకు ఆయన సినిమా కంటే కూడా ప్రభాస్ సినిమా బడ్జెట్టే ఎక్కువ.
ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సినిమాల వివరాలు:-
మహేశ్ ‘స్పైడర్’ సినిమా బడ్జెట్ 110 కోట్లు.
పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రానికి ముందు అనుకున్న బడ్జెట్ వంద కోట్లు అయితే... తర్వాత అది కాస్తా.. 125 కోట్లకు చేరింది.
ఇక మెగాస్టార్ 151వ చిత్రం ‘ఉయ్యాలవాడ నరసిహారెడ్డి’చిత్రానికి 140 కోట్ల బడ్జెట్ ని నిర్ణయించారు.
మరి ప్రభాస్ నటిస్తున్న ‘సాహో’ సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా...? అక్షరాలా ‘150 కోట్లు’
అసలు తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ బలం ఎంత? పవన్, మహేశ్, తారక్ ని మించే అభిమానగణం... ఇప్పుడు ప్రభాస్ సొంతమా? ‘బాహుబలి’అంటే... రాజమౌళి సినిమా. దాని క్రేజ్ అలాగే ఉంటుంది. పైగా వందల కోట్ల బడ్జెట్. అన్ని భాషల్లో విడుదల చేశారు. దాంతో... అలా కలిసొచ్చింది. మరి ఇప్పుడు ప్రభాస్ చేయనున్న మామూలు మాస్ సినిమాలకు కూడా అన్నన్ని కోట్ల బడ్జెట్ పెడితే.. ఆ భారాన్ని ప్రభాస్ మోయగలడా? ఇవి నిజంగా మిలియన్ డాలర్ల ప్రశ్నలే. వీటికి సమాధానం కాలమే చెప్పాలి.