రాజు గారి గది 2 క్లైమాక్స్ ఇలా ఉంటే బాగుండేది
on Oct 17, 2017
సినిమా సాంతం ఎలా ఉంది అనేది ఒక ఎత్తయితే... అది ఎలా ముగిసింది అనేది మరో ఎత్తు. సగటు ప్రేక్షకుడు- అయితే సంతోషం గా బయటకి రావాలి... లేదా సంబ్రమాశ్చర్యం పొందాలి... లేదా భయం పుట్టాలి... మొత్తానికి ఏదో ఒక భావనతో లేదా సంతృప్తితో థియేటర్ నుండి బయటకి రావాలి. క్లైమాక్స్ యొక్క ప్రభావం ప్రేక్షకుడి మీద అంతలా ఉంటుంది. వాస్తవానికి, దర్శకులు కొన్ని కథల కోసం జుట్టు పీక్కునేది, సినిమాని ఎలా ముగిస్తే బాగుంటుంది అని. అక్కడ దర్శకుడు వేసే అడుగు సినిమా ఫలితం పైన ప్రభావం చూపిస్తుంది. ప్రేమాభిషేకం, ఖైదీ, జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి సినిమాలు చరిత్రలో నిలిచిపోయే చిత్రాలుగా అవ్వడానికి గల ప్రధాన కారణం దర్శకులు వీటికి సరయిన ముగింపు ఇవ్వడమే.
దర్శకుడు ఓంకార్ రాజు గారి గది 2 సినిమా గురించి మాట్లాడిన ప్రతిసారి క్లైమాక్స్ అద్భుతంగా ఉంటుంది అని చెప్పారు. మరి ఆ సినిమా క్లైమాక్స్ ఆయన చెప్పినంత అద్భుతంగా ఉందా? కొందరు చెప్పినంత కాకపోయినా బాగానే ఉంది అంటున్నారు... కానీ ఆ క్లైమాక్స్ ఇంకోలా ఉంటే ఇంకా బాగుండేదేమో...
రాజు గారి గది 2 క్లైమాక్స్ లో సమంత పగతో రగిలిపోతూ తన జీవితంతో ఆడుకున్న అభినయని హింసిస్తుంది. ఇంతలో నాగార్జున కలుగజేసుకొని సమంత తండ్రి చెప్పిన నీతి వ్యాఖ్యలు చెప్పి ఆమెని శాంతి పరుస్తాడు. అయితే, ఈ సీన్ వల్ల అభినయలో భయం కనిపిస్తుంది కానీ తాను తప్పు చేసిన భావన ఎక్కడా చూపించలేదు. అలా కాకుండా సమంత తనకు జరిగిన అవమానమే అభినయకూ జరిగేలా చూస్తా అని భయపెడితే... ఆ అవమానం కన్నా చావే మేలు అనే భావన ఆమెకు కలిగి తద్వారా అసూయతో తాను ఎంత పెద్ద తప్పు చేసిందనే విషయంలో కనువిప్పు కలిగేది. దీనివల్ల సినిమాకి సరయిన ముగింపు వచ్చేది.