వాళ్లకి సాధ్యంకానిది పూరీకి సాధ్యమా..?
on Oct 11, 2017
‘గ్రీకు వీరుడు’ అనే సినిమాతో స్వర్గీయ దాసరి నారాయణరావు... తన కుమారుడు అరుణ్ కుమార్ ని హీరోగా పరిచయం చేశాడు. కానీ... ఆ సినిమా దారుణమైన డిజాస్టర్ అయ్యింది. ఎందరికో సినీ జీవితాన్నిచ్చిన దాసరి.. తన కొడుక్కి మాత్రం చనిపోయే దాకా సక్సెస్ ఇవ్వలేకపోయాడు. ఇక కె.రాఘవేంద్రరావు... ఈయన కూడా అంతే. అయితే... తాను చేయకుండా వెనకుండి.. వేరే దర్శకుడితో... తన కుమారుడు హీరోగా ‘నీతో ’పేరుతో ఓ సినిమా చేయించాడు. రామోజీరావు నిర్మాత. ఆ సినిమా కూడా అంతే.. సోదిలో లేకుండా పోయింది. ఇప్పుడు అదే సాహసం పూరి చేస్తున్నాడు. అదన్నమాట విషయం.
ఇంతకీ పూరీ ఆకాష్ హీరోగా పూరి జగన్నాథ్ తీస్తున్న సినిమా పేరేంటో చెప్పనేలేదు కదూ. సినిమా పేరు ‘మెహబూబా’. బుధవారం ఉదయం 8.20 నిమిషాలకు హిమాచల ప్రదేశ్ లో కుర్రాడిపై క్లాప్ కొట్టేశాడు. ఈ ముహూర్తాన్ని బాలకృష్ణ సూచించడం విశేషం. బాలకృష్ణ సూచించిన ముహూర్తంలో సినిమా మొదలుపెడితే... కచ్చితంగా విజయం లభిస్తుందని పూరీ నమ్మకం అట. అందుకే... బుధవారం ఉదయం ‘యాక్షన్’ చెప్పేశాడు. మరి ‘పైసా వసూల్’ ముహూర్తం కూడా బాలయ్యే పెట్టాడు. సినిమా ఎందుకు అలా అయ్యింది? అని మాత్రం ఇక్కడ అడగొద్దు ప్లీజ్. ఏదిఏమైనా... తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకులు తమ కుమారుల్ని హీరోలుగా పరిచయం చేయడం అంటే... అది నిజంగా సాహసమే. గత అనుభవాలు అలా ఉన్నాయ్ మరి.
అయితే.. పరిస్థితులెప్పుడూ ఒకేలా ఉండాలని లేదు. దర్శకుడు టి.కృష్ణ కుమారుడు గోపిచంద్ కి కూడా తొలి ప్రయత్నం బెడిసికొట్టింది. కానీ.. ఆ తర్వాత విలన్ గా రాణించి.. ఇప్పుడు సక్సెస్ ఫుల్ హీరోల లిస్ట్ లో ఉన్నాడు. తమిళ హీరో విజయ్ ఓ దర్శకుని కొడుకే. ఇప్పుడాయన ‘ఇలయదళపతి’. లిటిల్ సూపర్ స్టార్ గా తమిళ ప్రజలు పిలుచుకునే శింబూ కూడా దర్శకుడు టి.రాజేందర్ కొడుకే. సో... సరిగ్గా తీస్తే.. విజయం సాధించడం తథ్యం. పూరీకి ఆ ప్రతిభ ఉంది. అయితే వచ్చిన చిక్కల్లా... హీరోల కేరక్టర్ల పై పెడుతున్న శ్రద్ధ కథలపై పెట్టడం లేదు. ‘పైసా వసూల్’ విషయంలో అదే జరిగింది.
ఇక ‘మెహబూబా’ విషయానికొస్తే.. 1971లో జరిగిన ఇండో-పాక్ యుద్ధ నేపథ్యంలో సాగే.. మనసులని మెలిపెట్టే ప్రేమకథట. తాను తొలిసారి ఇలాంటి ప్రేమకథను తీస్తున్నాననీ, కథలోని ఆత్మను పూర్తిగా అర్థం చేసుకొని చేస్తున్న సినిమా ఇదనీ.. తాను ఇప్పటివరకూ చేసిన ప్రేమకథలకు భిన్నంగా ఉంటుందనీ పూరీ తెలిపారు. కథ రిత్యా... హిమాచల్ ప్రదేశ్ లో ఎక్కువభాగం చిత్రీకరణ ఉంటుందట. అక్కడ మంచు కురిసే కాలం ప్రారంభమవ్వడంతో చిత్రీకరణ మొదలుపెట్టామని పూరీ తెలిపారు. అలాగే పంజాబ్, రాజస్థాన్ లలో కూడా కొంత పార్ట్ ఉంటుందట. 200 మంది అమ్మాయిలను ఆడిషన్ చేసి.. చివరకు నేహాశెట్టి అనే కన్నడ అమ్మాయిని హీరోయిన్ గా ఎంచుకున్నారు. మరి ఆ అమ్మాయ్ స్పెషాలిటీ ఏంటోమరి. ఏది ఏమైనా... పూరీ ఈ దఫా విజయం సాధించాలని బెస్ట్ ఆఫ్ లక్ చెబుదాం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
