ఇక్కడ ఇలా... అక్కడ అలా
on Aug 3, 2017
ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో మన హీరోయిన్లు అగ్రగణ్యులు. ఇక్కడున్నప్పుడేమో... ‘ఐ లవ్ టాలీవుడ్... తెలుగు సినిమా అంటే నాకు ప్రాణం... అందునా... హైదరాబాద్ లో ఉంటే సొంత ఊర్లో ఉన్నట్టుంటుంది’అని మెలికలు తిరుగుతూ చెబుతారు గోముగా. చెన్నయ్ వెళ్లగానే ... అక్కడి భజన మొదలు పెడతారు. ఇక బాలీవుడ్ కెళ్తే చెప్పేదేముంది... ఇక ఆ చిడతలకు అసలు విరామమే ఉండదు.
మన రకుల్ ప్రతీసింగ్ ఆ విషయంలో అందరికంటే ముందుందనే చెప్పాలి. ఎక్కడుంటే అక్కడి భజన. వినగ వినగ రాగమతిశయించు.. తినగ తినగ వేము తీయగుండు అన్నట్లు... సినిమాలు చేయంగ చేయంగ రాటుదేలిపోయింది ఈ ముద్దుగుమ్మ.
రీసెంట్ గా రకుల్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పొంతన లేని సమాధానాలు ఆమె మెంటాలిటీని బయటపెట్టాయి. అన్ని భాషల్లో చేస్తున్నారు కదా. ఏ భాషా చిత్రాలకు మీ ప్రాధాన్యత? అని అడిగితే... ‘ఐ లవ్ టాలీవుడ్... తెలుగు సినిమాను నేను ప్రేమిస్తాను. ఈ మధ్య నేను ఇతర భాషలవైపు చూస్తున్నానే వార్త నన్ను చాలా ఇబ్బందికి గురి చేసింది. తెలుగు సినిమా తర్వాతే ఏదైనా’అని సమాధానమిచ్చింది రకుల్.
హిందీలో నీరజ్ పాండే ఫిలిం ‘ఐయారీ’ గురించి అడిగితే.. ‘నీరజ్ సార్... నా కెరీర్ తొలినాళ్లలో నన్ను ప్రోత్సహించిన మనిషి. నాకు ఫస్ట్ అడిషన్ చేసింది కూడా ఆయనే. అయితే... అప్పుడు చాలా చిన్న పిల్లను. ఆ సినిమా కూడా ప్రారంభం కాలేదు. తర్వాత ‘ఎం.ఎస్.ధోని’ సినిమా కోసం అడిగారు. చేయలేకపోయాను. ఇన్నాళ్లకు నా కోరిక నెరవేరింది. ‘ఐరియా’చేస్తున్నాను. బాలీవుడ్ లో నా ప్రయాణం ఈ సినిమా జయాపజయాలపై ఆధారపడి ఉంది. మంచి హిట్ అవుతుందని నా నమ్మకం’ అని అంతర్లీనంగా ఉన్న నిజాన్ని బయటపెట్టేసింది రకుల్.
‘జయ జానకీ నాయక’ సినిమా విషయం వచ్చి... ‘బెల్లంకొండ శ్రీనివాస్ మీ జూనియర్ కదా. నటనలో ఏమైనా మెళకువలు నేర్పారా? అనడిగితే... ‘నేనేమైనా యాక్టింగ్ స్కూల్ పెట్టుకున్నానా? అందరికీ నేర్పుకుంటూపోడానికి . శ్రీనివాస్ మంచి నటుడు. రెండు సినిమాలు చేసి ఉన్నాడు. అతనికి ఒకరు చెప్పాల్సిన పనిలేదు’అంటూ ఘాటుగా సమాధానమిచ్చింది రకుల్.
ఏది ఏమైనా ఉత్తరాది భామలు ఉత్తరాది భామలే. ఆ తెలివితేటలే వేరు.