బాలకృష్ణ నిజంగా అతడ్ని కొట్టాడా?
on Aug 10, 2017
ఈ మధ్య సోషల్ మీడియా పుకార్లకు హద్దే లేకుండా పోయింది. కొంతమంది మేధావులు వాస్తవాలను పక్కన పెట్టేసి ఊహించేసుకొని రాసేసుకుంటున్నారు. గాసిప్స్ అంటే... వింటున్న మాట చెప్పడం. ఊహించి రాయడం కాదు. మరి ఈ విషయం వీళ్లు ఎప్పుడు తెలుసుకుంటారో పాపం.
ఈ మధ్య నటుడు ప్రకాశ్ రాజ్ పై ఓ వార్త ఫిలిం నగర్ లో చక్కెర్లు కొట్టింది. కొరటాల శివ-మహేశ్ బాబు కాంబినేషన్లో రూపొందుతోన్న ‘భరత్ అనే నేను’ చిత్రం నుంచి ప్రకాశ్ రాజ్ ని తప్పించారనేది ఈ వార్త సారాంశం. ప్రకాశ్ రాజ్ షూటింగ్ కి సమయానికి రాకపోవడం వల్ల దర్శకుడు కొరటాల శివ అసహనానికి లోనయ్యాడట. ప్రతి సారీ ఇలాగే ప్రవర్తిస్తుండటంతో ఇక వేగలేక ప్రకాశ్ రాజ్ ని సినిమా నుంచి తప్పించాడట. ఆయన పాత్రకు రావురమేశ్ ని తీసేసుకోవడం కూడా జరిగిందట. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే టాపిక్.
అయితే... ఇందులో నిజానిజాలెంత? అనే విషయాన్ని పరిశీలిస్తే... ఈ ఉత్త గాలి వార్తని తేలిపోయింది. ప్రస్తుతం ‘భరత్ అనే నేను’ చిత్రం షూటింగ్ లక్నోలో జరుగుతోంది. ప్రస్తుతం ప్రకాశ్ రాజ్ కూడా అక్కడే ఉన్నాడు. మహేశ్, ప్రకాశ్ రాజ్ లపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడు కొరటాల శివ.
అంతేకాదు... షకలక శంకర్ ని బాలకృష్ణ కొట్టాడనే వార్త కూడా ఇప్పుడు మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. తన ‘పైసా వసూల్ ’ స్టంపర్లోని డైలాగ్ ని సినిమా విడుదల కాకముందే... మరో సినిమా కోసం పేరడీ చేశాడనే కారణంగా షకలక శంకర్ ని పిలిచి మరీ బాలయ్య కొట్టాడనేది ఈ గాసిప్ సారాంశం. అయితే... ఈ విషయంలో కూడా ఏ మాత్రం నిజం లేదని బాలయ్య అంతరంగికులు తేల్చిపారేశారు.
మరి ఈ గాలివార్తలను ఏ ప్రతిఫలం ఆశించి సృష్టించారో ఆ మహానుభావులకే తెలియాలి.