హ్యాట్రిక్ కొట్టడానికి రెడీ అవుతున్నారు?
on Aug 10, 2017
కొన్ని కాంబినేషన్లుంటాయ్. ఆ కాంబినేషన్లో సినిమా అంటే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవ్. బాలకృష్ణ-బోయపాటి శ్రీను అలాంటి కలయికే... కోడి రామకృష్ణ, కోదండరామిరెడ్డి, బి.గోపాల్ తర్వాత బాలకృష్ణతో వరుస హిట్స్ ఇచ్చిన ఏకైక దర్శకుడు బోయపాటి శ్రీను. దాంతో నందమూరి అభిమానులకు కూడా ఇష్టుడయ్యాడు బోయపాటి.
ఆయన దర్శకత్వం వహించిన ‘జయ జానకి నాయక’ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో నందమూరి అభిమానులకు తీపి కబురు చెప్పేశారు బోయపాటి. తన తర్వాతి సినిమా బాలయ్యతోనే ఉంటుందని తేల్చేశాడు. ఇక ఈ ప్రకటనతో నందమూరి అభిమానుల ఆనందానికి పట్టపగ్గాలుండవని వేరే చెప్పాలా?
వచ్చే ఏడాది జులైలో షూటింగ్ ప్రారంభిస్తామనీ, బాలకృష్ణగారికి.. ఆ సినిమా 103వదా? 104వదా? అనేది మాత్రం కచ్చితంగా చెప్పలేననీ బోయపాటి చెప్పారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన వివరాలు త్వరలో తెలియజేస్తానని ఆయన అన్నారు.