శ్రద్ధాకపూర్ సై అనడానికి కారణం అదేనా?
on Aug 7, 2017
‘బాహుబలి’థియేటర్లలో ‘సాహో’ట్రైలర్ చూపించి... సినిమాపై కొత్త కొత్త ఆలోచనలకు తెర లేపారు. నిజానికి అప్పటికి ఆ సినిమా షూటింగే సరిగ్గా మొదలవ్వలేదు. చూపించిన ట్రైలర్ కేవలం ఫాంటసీ మాత్రమే. ఇది చాలామందికి తెలీదు. ఆ ట్రైలర్ చూసినవారందరూ ఇదేదో సైంటిఫిక్ థ్రిల్లర్ లా ఉందే అనుకున్నారు. కానీ... యూనిట్ వర్గాల సమాచారం ప్రకారం ‘సాహో’ఓ మామూలు యాక్షన్ ఎంటర్టైనర్. ప్రభాస్ లోని మాస్ యాంగిల్ ని బయపెట్టే కథ, కథనాలతో సినిమా ఉంటుందని టాక్. చత్రపతి, మిర్చి లా అనమాట.
రీసెంట్ గా ఆ సినిమా షూటింగ్ మొదలైంది. దర్శకుడు సుజిత్ సన్నివేశాలు తీయడం అప్పుడే మొదలుపెట్టాడు కూడా. అయితే.. ఇందులో కథానాయిక ఎవరు? అనేది మొన్నటి దాకా తేలలేదు. అనుష్క పేరు ప్రధానంగా వినిపించినా... ఆమె స్థానంలో ఇప్పుడు బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ వచ్చి చేరింది.
బరువు పెరగడం కారణంగానే అనుష్కను ఈ సినిమా నుంచి తప్పించారనే టాక్ ఉంది. అయితే... చిత్ర యూనిట్ మాత్రం ఈ విషయాన్ని వేరే విధంగా చెబుతోంది. అనుష్క అప్పటికే కొన్ని తమిళ చిత్రాలకు సైన్ చేసిందట. ‘సాహో’కు అడిగిన డేట్స్, తమిళంలో అమె ‘ఓకే’చెప్పిన సినిమాల డేట్స్ ఒకే సారి రావడంతో ముందు ఒప్పుకున్న తమిళ సినిమాల కోసం ‘సాహో’ను త్యాగం చేసిందట స్వీటి.
ఈ విషయంలో ఈ రెండూ కాక మరో టాక్ కూడా నడుస్తోంది. అదేంటంటే... గత కొన్ని రోజులుగా ‘అనుష్క, ప్రభాస్ పెళ్లి’ అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ‘వరుసగా ఒకే హీరోయిన్ తో సినిమాలు చేస్తే... ఇలాంటి పుకార్లు రావడం సహజం’ అని ప్రభాస్ ఈ వార్తను తేలిగ్గా కొట్టి పారేశాడు. అనుష్క అయితే... మరో అడుగు ముందుకేసి, ‘నాపై ఇలాంటివి పుట్టిస్తే పోలీస్ కేసు పెట్టాల్సొస్తుంద‘ని ఘాటుగానే స్పందించింది. ఈ పుకార్ల షికార్లకు చెక్ పెట్టడానికే ‘సాహో’నుంచి అనుష్కను తప్పించారనే వాదన కూడా ఉంది.
ఏది ఏమైనా... ఈ సినిమాకు శ్రద్ధాకపూర్ కథానాయికగా ఎన్నికవ్వడం మాత్రం ప్రభాస్ అభిమానులకు తెగ సంతోషాన్నిస్తోంది. కారణం.. ఆమె బాలీవుడ్ లో పెద్ద స్టార్. దక్షిణాది సినిమాలు చేసేంత తీరికే లేని శ్రద్ధ.. ‘సాహో’కు ఓకే అనడం నిజంగా విశేషమే కదా. దానికి కారణం కూడా లేకపోలేదు. ఇప్పుడు ప్రభాస్ నేషనల్ స్టార్. దానికి తగ్గట్టే ‘సాహో’కూడా 150 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. పైగా తెలుగు, తమిళంతో పాటు బాలీవుడ్ లో కూడా ఈ చిత్రం విడుదల కానుంది. వీటన్నింటినీ మించి యూనివర్సల్ కథ, కథనాలతో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ కారణాలే శ్రద్ధాకపూర్ ఈ చిత్రాన్నిఅంగీకరించడానికి కారణమయ్యాయి.