వాళ్లు అడిగితే.. కాజల్ కాదనలేదు..!
on Apr 21, 2016
కృతజ్ఞత అన్నది చిత్రసీమలో అరుదుగా కనిపించే పదార్థం! ఇక్కడ బంధాలు, స్నేహాలూ అన్నీ డబ్బుతోనే ముడిపడి ఉంటాయి. 'నాకు లైఫ్ ఇచ్చారు కదా..' అన్న కృతజ్ఞత ఎప్పుడూ ఎవరిలోనూ కనిపించదు. అలా కనిపించిందంటే.. గొప్ప విషయమే. కాజల్‌లో మాత్రం ఆ కృతజ్ఞత ఎప్పుడూ ఉంటుంది. కాజల్ కెరీర్‌లో రెండు చిత్రాలు ప్రత్యేకం. అందులో ఒకటి లక్ష్మీ కల్యాణం. ఈ సినిమాతోనే కాజల్ టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. అందుకే దర్శకుడు తేజ అంటే గురువులా భావిస్తుంది. కాజల్‌కి స్టార్ డమ్, గుర్తింపు తెచ్చింది మాత్రం చందమామ. ఆసినిమాలో కాజల్ పేరుకి తగ్గట్టే అందంగా కనిపించింది. అందుకే కృష్ణవంశీ అన్నా కాజల్‌కి గౌరవమే. ఇప్పుడు వీరిద్దరూ ఫ్లాపుల్లో ఉన్నారు. అయినా సరే.. వాళ్లు అడిగితే కాజల్ `నో` చెప్పలేదు. ఇప్పుడు మళ్లీ ఈ ఇద్దరు దర్శకులతో పనిచేయడానికి కాజల్ ఒప్పుకొంది.
రానా కథానాయకుడిగా తేజ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అందులో కథానాయికగా కాజల్‌ని ఎంచుకొన్నారు. బీజీ షెడ్యూల్‌లో కూడా తేజ అడిగిన వెంటనే ఈ సినిమా చేయడానికి ముందుకొచ్చింది కాజల్. ఇప్పుడు కృష్ణవంశీ విషయంలోనూ అదే జరిగింది. కృష్ణవంశీ - సందీప్ కిషన్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో కథానాయికగా కాజల్‌నే ఎంచుకొన్నారు కృష్ణవంశీ. ఆయన అడిగారని.. కథ కూడా వినకుండా కాజల్ ఒప్పేసుకొందట. నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో సందీప్ కిషన్‌తో నటించాల్సిన అవసరం కాజల్‌కి ఏమాత్రం లేదు. కానీ.. కేవలం కృష్ణవంశీపై ఉన్న కృతజ్ఞతతోనే కాజల్ ఈ సినిమా ఒప్పుకొందట. కాజల్‌లా ఎంతమంది ఆలోచిస్తారు?? ఈవిషయంలో కాజల్‌ని మెచ్చుకొని తీరాల్సిందే.