మిస్టర్ శ్రీనువైట్ల.. నువ్వు మారవా??
on Apr 20, 2016
కొంతమంది దర్శకులంతే. ఎప్పుడూ ఒకే పంథా ఫాలో అయిపోతుంటారు. కొన్నిసార్లు ఆ ఫార్ములా విజయాల్ని తెచ్చిపెట్టినా, చాలా సార్లు అవే కొంపలు ముంచేస్తుంటాయి. ఆ విషయం అర్థమైనా, కాకపోయినా.. నడిచే దారిమాత్రం మారదు గాక మారదు. శ్రీనువైట్ల కూడా సేమ్ టూ సేమ్. ఆయన సినిమా అంటే అంతకు ముందు మందు కొట్టే సీన్లు ఉండేవి. ఆ తరవాత... స్నూఫ్‌లు మొదలెట్టారు. సినిమా ఇండ్రస్ట్రీ మీదే సెటైర్లు, పేరడీలు చేస్తుంటాడు. తనకు ఎవరిపైనైనా కోపం ఉంటే.. ఆ వ్యక్తిని గుర్తుకు తెచ్చేలా కొన్ని సన్నివేశాలు అల్లి.. దాన్నే కామెడీ అనుకోవాలనేవాడు. అవి మరీ ఓవర్ అయిపోయి.. శ్రీనువైట్లకు విజయాలు కూడా దూరమైపోయాయి. వరుస డిజాస్టర్లతో ఫ్లాప్ దర్శకుడు అనే ముద్ర వేయించుకొన్నాడు. అయినా సరే.. ఆ పంథా మారడం లేదు.
బ్రూస్లీ తరవాత శ్రీనువైట్లకు హీరో దొరకడం కష్టమనుకొంటే, ఏదోలా వరుణ్‌తేజ్‌ని పట్టుకొని ఓ సినిమా పట్టాలెక్కిస్తున్నాడు. ఆసినిమాకి మిస్టర్ అనే టైటిల్ కూడా పెట్టాడు. అంతా బాగానే ఉంది. ఈసారైనా ట్రాక్ మార్చి, కొత్తగా ఆలోచించి తనని తాను ప్రూవ్ చేసుకోవాలి కదా? కానీ అదేం జరగడం లేదిప్పుడు. యధావిధిగా అదే మూసదారిలో ప్రయాణిస్తున్నాడని టాక్. మిస్టర్ నిండా మళ్లీ స్నూఫ్‌లు నింపేస్తున్నాడట. ఇటీవల విజయవంతమైన సోగ్గాడే చిన్నినాయిన, ఊపిరి సినిమాల్లో కొన్ని సన్నివేశాలకు పేరడీ సీన్లు సృష్టిస్తున్నాడట శ్రీనువైట్ల. అవి రెండూ నాగార్జున సినిమాలే. నాగ్‌కీ, శ్రీనువైట్లకూ మంచి రిలీషన్ ఉంది. ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన కింగ్ హిట్టయ్యింది కూడా. మరెందుకు నాగ్‌పై ఇంత కసి పెంచకొన్నాడో? బహుశా. అఖిల్ తో సినిమా చేద్దామని ప్రయత్నించి విఫలమయ్యాడు నాగ్. ఆ కోపాన్ని ఇలా తీర్చుకొంటున్నాడేమో..?? మరి ఈ స్నూఫ్‌లు వర్కవుట్ అవుతాయో లేదో తెలియాలంటే కనీసం ఆరు నెలలైనా ఆగాలి.