'వార్-2' తెలుగు రైట్స్.. నాగవంశీ సేఫ్..!
on Aug 20, 2025

జూనియర్ ఎన్టీఆర్ గత చిత్రం 'దేవర'ను తెలుగు రాష్ట్రాలలో డిస్ట్రిబ్యూట్ చేసి మంచి లాభాలను చూశారు నిర్మాత నాగవంశీ. అదే ఉత్సాహంతో ఎన్టీఆర్ నటించిన బాలీవుడ్ ఫిల్మ్ 'వార్-2' తెలుగు థియేట్రికల్ రైట్స్ ని కూడా దాదాపు రూ.80 కోట్లకు దక్కించుకున్నారు. ఆగస్టు 14న విడుదలైన 'వార్-2' మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోతోంది. దీంతో 'దేవర'తో లాభాలను చూసిన నాగవంశీ.. 'వార్-2'తో భారీ నష్టాలను చూడబోతున్నారని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇలాంటి సమయంలో నాగవంశీకి ఓ గుడ్ న్యూస్ అందినట్లు తెలుస్తోంది. భారీ నష్టాల నుంచి ఆయన తప్పించుకోబోతున్నట్లు సమాచారం.
'వార్-2' చిత్రాన్ని ఇండియాలోని టాప్ ప్రొడక్షన్ హౌస్ లలో ఒకటైన యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించింది. యశ్ రాజ్ ఫిలిమ్స్ చాలా ప్రొఫెషనల్ గా ఉంటుంది. సినిమాలను కూడా ఓన్ గా రిలీజ్ చేసుకుంటూ ఉంటుంది. కానీ, 'వార్-2'లో ఎన్టీఆర్ నటించడంతో తెలుగు రైట్స్ వరకు నాగవంశీకి ఇచ్చింది. అయితే, తెలుగు రాష్ట్రాల్లో 'వార్-2' ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేయకపోవడంతో.. ఏకంగా రూ.22 కోట్లు రిటర్న్ ఇవ్వడానికి యశ్ రాజ్ ఫిలిమ్స్ ముందుకు వచ్చినట్లు న్యూస్ వినిపిస్తోంది. నైజాం ఏరియాకి రూ.10 కోట్లు, ఆంధ్రాకు రూ.7 కోట్లు, సీడెడ్ కు రూ.5 కోట్లు చొప్పున మొత్తం రూ.22 కోట్లు తిరిగి ఇవ్వడానికి అంగీకరించినట్లు వినికిడి. ఈ వార్త నిజమైతే నాగవంశీకి బిగ్ రిలీఫ్ వచ్చినట్లే అని చెప్పవచ్చు. యశ్ రాజ్ ఫిలిమ్స్ తీసుకున్న నిర్ణయం వల్ల ఆయన భారీ నష్టాలను తప్పించుకున్న వాడవుతాడు.
'వార్-2'లో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు 14న థియేటర్లలో అడుగుపెట్టింది. డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్నప్పటికీ.. మొదటి ఐదు రోజుల్లో రూ.300 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. ముఖ్యంగా నార్త్ ఇండియా మరియు నార్త్ అమెరికాలో ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతోంది. ఫుల్ రన్ లో రూ.400 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



