శ్రీకాంత్ అడ్డాల కొత్త సినిమా.. హీరో ఎవరో తెలిస్తే షాక్!
on Aug 18, 2025

'కొత్త బంగారు లోకం' లాంటి విజయవంతమైన చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన శ్రీకాంత్ అడ్డాల.. తన రెండో సినిమా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'తో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. మూడో చిత్రం 'ముకుంద'తో కూడా మెప్పించాడు. ఆ తర్వాత చేసిన 'బ్రహ్మోత్సవం' మాత్రం దారుణంగా నిరాశపరిచింది. అప్పటి నుంచి శ్రీకాంత్ అడ్డాలకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. తదుపరి సినిమాని పట్టాలెక్కించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎట్టకేలకు ఐదేళ్ళ తర్వాత 'నారప్ప' అనే రీమేక్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. అయితే అది డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల కావడంతో శ్రీకాంత్ అడ్డాలకు పెద్దగా క్రెడిట్ రాలేదు. రెండేళ్ళ క్రితం 'పెదకాపు' సినిమాతో అదృష్టాన్ని పరీక్షించుకోగా.. అది కూడా నిరాశపరిచింది. దీంతో ఇకసలు శ్రీకాంత్ అడ్డాలకు ఎవరైనా హీరో అవకాశం ఇస్తాడా? ఆయన డైరెక్షన్ లో మరో సినిమా రావడం కష్టమేనా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇలాంటి సమయంలో అడ్డాలకు ఒక హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్న వార్త ఆసక్తికరంగా మారింది.
దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తన తదుపరి చిత్రాన్ని కిరణ్ అబ్బవరంతో చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇద్దరి మధ్య కథా చర్చలు జరిగాయని.. ఫైనల్ స్క్రిప్ట్ ను రెడీ చేసే పనిలో శ్రీకాంత్ ఉన్నాడని సమాచారం. రానా దగ్గుబాటి నిర్మించనున్న ఈ చిత్ర ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశముంది అంటున్నారు.
'రాజావారు రాణిగారు', 'ఎస్ఆర్ కల్యాణమండపం' వంటి సినిమాలతో కెరీర్ ప్రారంభించి అందరి దృష్టిని ఆకర్షించిన కిరణ్.. ఆ తర్వాత పెద్దగా విజయాలను చూడలేదు. గతేడాది చేసిన 'క' మంచి విజయాన్ని సాధించింది. ఈ ఏడాది చేసిన 'దిల్ రూబా' మాత్రం నిరాశపరిచింది. ప్రస్తుతం కిరణ్ చేతిలో 'కె-ర్యాంప్', 'చెన్నై లవ్ స్టోరీ' సినిమాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు శ్రీకాంత్ అడ్డాలతో ఓ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అబ్బవరం కోసం అడ్డాల తన శైలి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను ప్లాన్ చేస్తాడేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



