ఇంకా అతిధి పాత్రలకే పరిమితమవుతున్న ప్రభాస్
on Jun 27, 2017
ప్రభాస్ మొదటి బాలీవుడ్ సినిమా ఏంటో తెలుసా? బాహుబలి అని మాత్రం చెప్పకండి. ఎందుకంటే, రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి అనువాద చిత్రంగా బాలీవుడ్ లో విడుదలయింది. అయితే, బాహుబలి మొదటి భాగం విడుదలవకముందే ప్రభాస్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు కానీ అతిధి పాత్రలో. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా? ప్రభు దేవా దర్శకత్వంలో అజయ్ దేవగన్, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో చేసిన ఆక్షన్ జాక్సన్ అనే హిందీ సినిమాలో ప్రభాస్ ఒక పాటలో కనిపించాడు. అయితే, బాహుబలి మొదటి భాగం కన్నా ముందే విడుదలవడం, అది కాకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా ఆక్షన్ జాక్సన్ బోల్తా కొట్టడంతో ప్రభాస్ ఈ సినిమా లో కనిపించాడు అనే విషయం గురించి పెద్దగా ప్రచారం జరగ లేదు.
అయితే, ప్రభాస్ బాలీవుడ్లో రెండో సారి దర్శనమివ్వనున్నాడు. అయితే, ఈ సారి కూడా ప్రధాన పాత్రలో కాకుండా అతిధి పాత్రలో. అవునండీ, ప్రభాస్, తమన్నా బాలీవుడ్ చిత్రం ఖామోషి లో క్యామియో రోల్ లో మెరవనున్నాడు. ఇంతకీ ఈ చిత్రానికి దర్శకుడు ఎవరో తెలుసా? మళ్ళీ ప్రభుదేవానే నండి బాబూ. అయితే, ఈ సారి ప్రభాస్ అతిధి పాత్ర చేయడానికి ప్రధాన కారణం తమన్నా అట. బాహుబలిలో ప్రభాస్, తమన్నా కలిసి చేసిన విషయం మనకు తెలిసిందే. తమన్నా రిక్వెస్ట్ చేయడంతో కాదనలేక ప్రభాస్ ఖామోషీలో అతిధి పాత్ర చేయడానికి అంగీకరించాడట. ప్రస్తుతం సాహో సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్న ప్రభాస్ కరణ్ జోహార్ తో మూడు సినిమాల ఒప్పందం చేసుకున్నాడని వార్తలు వస్తున్నాయి. కానీ, డైరెక్ట్ ఎంట్రీ విషయంలో నాన్చుడు ధోరణిలో ఉన్న ప్రభాస్, క్యామియో రోల్స్ మాత్రం ఠక్కున ఒప్పుకోవడం ఫాన్స్ కి మింగుడు పడడం లేదని అంటున్నారు.
Also Read