ఉజ్వలంగా వెలుగుతున్న రష్మిక మందన్న కెరీర్‌లో మాయని మచ్చ అదే!
on Apr 5, 2025
(ఏప్రిల్ 5 రష్మిక మందన్న పుట్టినరోజు సందర్భంగా..)
రష్మిక మందన్న.. చిత్ర పరిశ్రమలో గోల్డెన్ లెగ్ అని పేరు తెచ్చుకున్న అందాల నటి. అంతేకాదు, ఇండియాలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా చెప్పుకుంటున్న ఆమె.. ప్రస్తుతం పలు భాషల్లో సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్ అయిపోయారు. కన్నడలో మొదలైన ఆమె సినీ ప్రస్థానం.. తెలుగు, తమిళ్, హిందీ సినిమాలతో కొనసాగుతోంది. అందం, అభినయం కలగలిసిన రష్మిక ఇప్పుడు యూత్ ఐకాన్ అనిపించుకుంటోంది. ఇప్పటివరకు రష్మిక నటించిన పాతిక సినిమాల్లో ఎక్కువ శాతం సూపర్‌హిట్ అయిన సినిమాలే. సౌత్‌లోనే కాదు, నార్త్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న రష్మికను తమ సినిమాల్లో హీరోయిన్‌గా ఎంపిక చేసుకునేందుకు దర్శకనిర్మాతలు క్యూలు కడుతున్నారంటే అతిశయోక్తి కాదు. 2016లో ‘కిరిక్ పార్టీ’ అనే కన్నడ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన రష్మిక.. సినిమా రంగంలోకి ఎలా వచ్చారు? ఎలాంటి విజయాలు సాధించారు? ఆమె వ్యక్తిగత జీవిత విశేషాలు ఏమిటి? అనేది తెలుసుకుందాం.
1996 ఏప్రిల్ 5న కర్ణాటకలోని విరాజ్‌పేటలో సుమన్, మదన్ మందన్న దంపతులకు మొదటి సంతానంగా జన్మించారు రష్మిక. ఈమెకు ఒక చెల్లెలు షిమాన్ ఉన్నారు. మదన్ మందన్నకు విరాజ్‌పేటలో కాఫీ ఎస్టేట్ ఉంది. కూర్గ్ పబ్లిక్ స్కూల్‌లో చదువుకున్న రష్మిక.. బెంగళూరులో కాలేజీ విద్యను అభ్యసించింది. ఎం.ఎస్.రామయ్య ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్ కాలేజీలో సైకాలజీ, జర్నలిజం మరియు ఇంగ్లీష్ లిటరేచర్‌లో డిగ్రీ తీసుకున్నారు. 2014లో టైమ్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన క్లీన్ అండ్ క్లియర్ ఫేస్ పోటీలో టైటిల్‌ను గెలుచుకుంది రష్మిక. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ చేతులమీదుగా ఆ అవార్డును అందుకున్నారు రష్మిక. ఆ తర్వాత క్లీన్ అండ్ క్లియర్ పోటీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు. తనకు నటనపై ఆసక్తి ఉండడంతో ముందుగా మోడలింగ్ చేస్తే అవకాశాలు వస్తాయని గుర్తించిన రష్మిక.. ఆ దిశగా అడుగులు వేసింది.
ఒక ఇంటర్వ్యూలో రష్మికను చూసిన కన్నడ హీరో, డైరెక్టర్ రిషబ్ శెట్టి.. తను చేయబోతున్న ‘కిరిక్ పార్టీ’ చిత్రంలో హీరోయిన్‌గా సెలెక్ట్ చేసుకున్నారు. ఈ సినిమాలో రక్షిత్‌శెట్టి సరసన హీరోయిన్‌గా నటించింది రష్మిక. 4 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ సాధించి 50 కోట్లు కలెక్ట్ చేసింది. నటిగా రష్మికకు చాలా మంచి పేరు తెచ్చిందీ సినిమా. ఆ తర్వాత రెండు కన్నడ సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన రష్మికకు తెలుగులో ‘ఛలో’ చిత్రంలో నాగశౌర్య సరసన నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమా సూపర్‌హిట్ అయింది. ఆ వెంటనే ‘గీత గోవిందం’ చిత్రంలో విజయ్ దేవరకొండతో కలిసి నటించింది. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ కావడంతో టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. ఆ తర్వాత సరిలేరు నీకెవ్వరు, భీష్మ వంటి సినిమాలతో తన స్థానాన్ని పదిలపరుచుకుంది.
2021లో అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప’ చిత్రం రష్మిక కెరీర్‌ను టాప్ లెవల్‌కి తీసుకెళ్లింది. ‘పుష్ప’ పాన్ ఇండియా సినిమా కావడంతో దేశవ్యాప్తంగా ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత తెలుగులో ‘సీతారామం’, తమిళ్‌లో ‘వారిసు’, హిందీలో ‘గుడ్‌బై’, ‘మిషన్ మజ్ను’ వంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. 2023లో రణబీర్ కపూర్ హీరోగా సందీప్‌రెడ్డి వంగా రూపొందించిన ‘యానిమల్’ చిత్రంతో మరో పెద్ద బ్లాక్‌బస్టర్‌ని తన ఖాతాలో వేసుకున్నారు రష్మిక. ఈ సినిమాలో కొన్ని ఇంటిమసీ సీన్స్‌లో ఆమె నటనకు యూత్ ఫిదా అయిపోయింది. ఆ మరుసటి సంవత్సరం ‘పుష్ప’కి సీక్వెల్‌గా వచ్చిన ‘పుష్ప2’తో మరో భారీ విజయాన్ని అందుకుంది. దీంతో రష్మిక ఇమేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో వచ్చిన ‘ఛావా’ ఆమె కెరీర్‌లో మరో భారీ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ‘కుబేర’, ‘ది గర్ల్‌ఫ్రెండ్’, ‘తమా’ చిత్రాల్లో నటిస్తోంది రష్మిక.
ఇక రష్మిక వ్యక్తిగత జీవితం గురించి చెప్పాలంటే.. తన మొదటి సినిమా ‘కిరిక్ పార్టీ’ షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆ సినిమాలో హీరోగా నటించిన రక్షిత్‌శెట్టితో ప్రేమలో పడ్డారు. వారి పెళ్లికి ఇరు కుటుంబాల వారు అంగీకరించారు. దాంతో 2017 జూలై 3న విరాజ్‌పేటలో రక్షిత్ శెట్టి, రష్మిక మందన్నల నిశ్చితార్థం ఎంతో ఘనంగా జరిగింది. అయితే ఆ తర్వాత ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో సంవత్సరం తర్వాత 2018 సెప్టెంబర్‌లో ఆ ఎంగేజ్‌మెంట్‌ను రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని రష్మిక తల్లి సుమన్ అధికారికంగా ప్రకటించారు. ‘గీత గోవిందం’ చిత్రంలో విజయ్ దేవరకొండతో కలిసి నటించిన సమయంలో అతనితో రష్మికకు స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత ‘డియర్ కామ్రేడ్’ చిత్రంలో కూడా ఇద్దరూ కలిసి నటించారు. వారి మధ్య ప్రేమాయణం కొనసాగుతోందని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో విస్తృతంగా వార్తలు వచ్చాయి. అయితే వాటిని ఇద్దరూ ఖండించలేదు. దాంతో వారిద్దరి పెళ్లిని సోషల్ మీడియా దాదాపు ఖరారు చేసింది. కానీ, విజయ్ దేవరకొండగానీ, రష్మిక మందన్నగానీ వారి మధ్య ఉన్నది స్నేహమా, ప్రేమా అనే దాని గురించి ఏ సందర్భంలోనూ స్పష్టం చేయకపోవడంతో ఇప్పటికీ అది రూమర్‌గానే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
