సినిమా డాన్స్ ట్రెండ్ సెట్టర్ ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా!
on Apr 3, 2025
(ఏప్రిల్ 3 ప్రభుదేవా పుట్టినరోజు సందర్భంగా..)
ఇండియన్ డాన్స్‌లో ఒక సంచలనం. అతని స్టెప్పులకు కుర్రకారు ఉర్రూతలూగిపోతారు. అతని డాన్స్ మూమెంట్స్‌ని కళార్పకుండా చూస్తుండిపోతారు. అతనే ప్రభుదేవా అలియాస్ ఇండియన్ మైఖేల్ జాక్సన్. ఎన్నో భాషల్లో తన కొరియోగ్రఫీతో కొత్త స్టెప్పులకు రూపకల్పన చేసిన డాన్స్‌మాస్టర్ ప్రభుదేవా. ప్రముఖ కొరియోగ్రాఫర్ సుందరం మాస్టర్ వారసుడిగా చిత్రపరిశ్రమలో ప్రవేశించిన ప్రభుదేవా చాలా తక్కువ సమయంలోనే తన డాన్స్‌తో అందర్నీ మెప్పించారు. డాన్స్‌మాస్టర్‌గానే కాదు, నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా కూడా తన ప్రతిభను నిరూపించుకున్న ప్రభుదేవా పుట్టినరోజు ఏప్రిల్ 3. ఈ సందర్భంగా ఆయన సినీరంగంలోకి ఎలా అడుగుపెట్టారు, ఎలాంటి విజయాలు సాధించారు అనే విశేషాల గురించి తెలుసుకుందాం.
1973 ఏప్రిల్ 3న కర్ణాటకలోని మైసూర్‌లో ముగుర్ సుందర్, మహదేవమ్మ దంపతులకు రాజుసుందరం తర్వాత రెండో సంతానంగా జన్మించారు ప్రభుదేవా. ఇతని తర్వాత నాగేంద్రప్రసాద్ పుట్టారు. ఈ ముగ్గురూ కొరియోగ్రాఫర్లుగా పనిచేస్తున్నారు. ప్రభుదేవాకి చదువు కంటే డాన్స్ మీదే ఎక్కువ దృష్టి ఉండేది. అందుకే తండ్రితో కలిసి షూటింగ్స్‌కి వెళుతుండేవాడు. డాన్స్‌పై ప్రభుకి వున్న ఆసక్తిని గమనించి తన దగ్గరే అసిస్టెంట్‌గా చేర్చుకున్నారు సుందరం. ఆ సమయంలోనే భరతనాట్యంతోపాటు ఇతర భారతీయ నృత్యరీతుల్ని ఉడిపి లక్ష్మీనారాయణన్, ధర్మరాజు వద్ద నేర్చుకున్నారు ప్రభు. అలాగే వెస్ట్రన్ స్టైల్ డాన్స్‌ను కూడా అభ్యసించారు. తండ్రి దగ్గరే కొన్ని సంవత్సరాలు శిష్యరికం చేసిన తర్వాత సినిమాల్లో ప్రయత్నాలు ప్రారంభించారు.
1986లో మణిరత్నం డైరెక్షన్‌లో వచ్చిన ‘మౌనరాగం’ చిత్రంలోని ‘తడి తడి తలపు..’ అనే పాటలో 13 ఏళ్ళ వయసులో మొదటిసారి స్క్రీన్‌పై చిన్న బిట్‌లో కనిపించారు ప్రభుదేవా. ఆ తర్వాత 16 సంవత్సరాల వయసులోనే మొదటిసారి కొరియోగ్రఫీ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. 1989లో ప్రతాప్ పోతన్ దర్శకత్వంలో కమల్‌హాసన్, ప్రభు హీరోలుగా నటించిన ‘వెట్రి విజా’ చిత్రంతో కొరియోగ్రాఫర్‌గా పరిచయమయ్యారు. 1991లో మురళి హీరోగా కదిర్ దర్శకత్వంలో వచ్చిన ‘హృదయం’ చిత్రంలోని ‘ఏప్రిల్ మేలలో పాపల్లేరురా..’ పాటలో మొదటిసారి స్టెప్స్ వేస్తూ కనిపించారు. ఆ ఒక్క పాటతోనే అందరి దృష్టిలో పడ్డారు ప్రభుదేవా. ఆ తర్వాత శంకర్ డైరెక్షన్‌లో వచ్చిన ‘జెంటిల్‌మెన్’ చిత్రంలోని ‘చికుబుకు చికుబుకు రైలే..’ పాటతో ఒక్కసారి లైమ్‌లైట్‌లోకి వచ్చేశారు.
మంచి కొరియోగ్రాఫర్‌గా పేరు తెచ్చుకొని వరసగా సినిమాలు చేస్తున్న సమయంలోనే 1994లో దర్శకుడు పవిత్రన్ ‘ఇందు’ అనే చిత్రం ద్వారా ప్రభుదేవాను హీరోగా పరిచయం చేశారు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ప్రభుదేవా డాన్స్‌కి అందరూ ఫిదా అయిపోయారు. ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే డైరెక్టర్ శంకర్ తను చేస్తున్న ‘కాదలన్’ చిత్రంలో ప్రభుని హీరోగా బుక్ చేసుకున్నారు. ఈ సినిమా తెలుగులో ‘ప్రేమికుడు’గా విడుదలై ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత తమిళ్‌లో, తెలుగులో కొరియోగ్రఫీ చేస్తూనే కొన్ని సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించారు. తెలుగులో ప్రభుదేవా నటించిన చుక్కల్లో చంద్రుడు, తొట్టిగ్యాంగ్, సంతోషం, కళ్యాణరాముడు వంటి సినిమాలు నటుడిగా అతనికి మంచి పేరు తెచ్చాయి.
సిద్ధార్థ్, త్రిష జంటగా యం.యస్.రాజు నిర్మించిన ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ చిత్రం ద్వారా దర్శకుడిగా మారారు ప్రభుదేవా. ఈ సినిమా ఘనవిజయం సాధించి డైరెక్టర్‌గా ప్రభుకి మంచి పేరు తెచ్చింది. అదే బేనర్‌లో ప్రభాస్, త్రిష, ఛార్మి ప్రధాన పాత్రల్లో ప్రభుదేవా రూపొందించిన ‘పౌర్ణమి’ పరాజయాన్ని చవిచూసింది. ఆ తర్వాత దర్శకుడిగా ఎన్నో విజయవంతమైన సినిమాలను రూపొందించారు. తెలుగులో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ‘పోకిరి’ చిత్రాన్ని అదే పేరుతో తమిళ్‌లో, హిందీలో ‘వాంటెడ్’ పేరుతో రీమేక్ చేసి అక్కడ కూడా సూపర్‌హిట్ చేశారు. డాన్సర్‌గా, కొరియోగ్రాఫర్‌గా, దర్శకుడిగా, నిర్మాతగా, సింగర్‌గా, గేయ రచయితగా.. ఇలా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించిన ప్రభుదేవా దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా పేరు తెచ్చుకున్నారు. నటుడిగా దాదాపు 50 సినిమాల్లో నటించిన ప్రభుదేవా డాన్సర్‌గా 30, దర్శకుడిగా 15, నిర్మాతగా 3 సినిమాలు చేశారు. ఇప్పటికీ కొరియోగ్రాఫర్‌గా దేశంలోని వివిధ భాషల సినిమాలకు పనిచేస్తున్నారు ప్రభుదేవా.
ఇక ప్రభుదేవా వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. 1995లో రమాలత్‌ని వివాహం చేసుకున్నారు. దాదాపు 15 సంవత్సరాలపాటు సజావుగా సాగిన వీరి వైవాహిక జీవితానికి 2011లో ఫుల్‌స్టాప్ పెట్టారు. హీరోయిన్ నయనతారతో ప్రభుదేవా కొన్నాళ్ళు ప్రేమాయణం నడపడం, ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకోవడంతో ప్రభుదేవా, రమాలత్‌ల మనస్పర్థలు వచ్చాయి. అయితే ప్రభుదేవా, నయనతార పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నారు. అయినప్పటికీ ప్రభుదేవా నుంచి రమాలత్ విడిపోయారు. అప్పటి నుంచి 9 సంవత్సరాల పాటు ఒంటరిగానే ఉన్న ప్రభుదేవా 2020లో హిమాని సింగ్‌ని వివాహం చేసుకున్నారు. అంతకుముందు ప్రభుదేవాకు ముగ్గురు పిల్లలు వున్నారు. 2023లో ఓ పాపకు జన్మనిచ్చారు హిమాని సింగ్.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
