20 ఏళ్లలో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగి.. నేషనల్ అవార్డు సాధించిన ఏకైక హీరో అల్లు అర్జున్!
on Apr 8, 2025
(ఏప్రిల్ 8 అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా)
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అల్లు అర్జున్ అంటే ఒక స్టైల్.. అల్లు అర్జున్ అంటే ఒక మెరుపు. తన డాన్సులతో, డైలాగులతో, విచిత్రమైన మేనరిజమ్స్‌తో ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటున్న హీరో. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, కేరళలోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న తొలి హీరోగా అల్లు అర్జున్ నిలిచారు. కుటుంబ సభ్యులతోపాటు అభిమానులు సైతం అతన్ని బన్నీ అని ముద్దుగా పిలుచుకుంటారు. అల్లు అరవింద్ వంటి స్టార్ ప్రొడ్యూసర్ కుమారుడిగా, మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత తనకంటూ ఓ ప్రత్యేకమైన స్టైల్‌ని ఏర్పరుచుకొని స్టైలిష్ స్టార్‌గా ఎదిగారు అల్లు అర్జున్. ‘గంగోత్రి’ నుంచి ‘పుష్ప2’ వరకు ఎన్నో విభిన్నమైన సినిమాలతో ఒక స్టాండర్డ్ ఇమేజ్‌ని ఏర్పరుచుకున్న అల్లు అర్జున్ జీవిత విశేషాల గురించి తెలుసుకుందాం.
1983 ఏప్రిల్ 8న అల్లు అరవింద్, నిర్మల దంపతులకు రెండో సంతానంగా చెన్నయ్‌లో జన్మించారు అల్లు అర్జున్. ఆయనకు అన్నయ్య వెంకటేశ్వరరావు, తమ్ముడు శిరీష్ ఉన్నారు. 18 ఏళ్ళ వరకు చెన్నయ్‌లోనే పెరిగిన బన్నీ.. తన ప్రాథమిక విద్యను కూడా అక్కడే పూర్తి చేశారు. చదువులో అంతంత మాత్రంగా ఉండే బన్నీ ఇతర కళల పట్ల ఎక్కువ ఆసక్తి కలిగి ఉండేవాడు. స్కూల్‌లో చదువుకునే రోజుల్లోనే జిమ్నాస్టిక్స్, పియానో ప్లే చేయడం నేర్చుకున్నారు. 1985లో తన రెండేళ్ళ వయసులో తండ్రితో కలిసి చిరంజీవి ‘విజేత’ షూటింగ్‌కి వెళ్లాడు. అక్కడ డైరెక్టర్ కోదండరామిరెడ్డి అతన్ని చూసి ముచ్చటపడి ఆ సినిమాలో నటింపజేశారు. ఆ తర్వాత 1986లో కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘స్వాతిముత్యం’ చిత్రంలో కమల్‌హాసన్ మనవడిగా నటించాడు. 18 ఏళ్ళ వయసులో చిరంజీవి హీరోగా నటించిన ‘డాడీ’ చిత్రంలో ఒక డాన్సర్‌గా నటించాడు బన్నీ. అప్పుడే అతనికి సినిమాలపై ఆసక్తి కలిగింది. స్కూల్‌లో చదువుకునే రోజుల్లోనే బన్నీ బొమ్మలు బాగా వేయడాన్ని గమనించిన అరవింద్.. యానిమేషన్ నేర్చుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని కెనడాలోని ఒక యానిమేషన్ సంస్థకు ఫీజు కూడా కట్టారు. కానీ, కెనడా వెళ్లేందుకు ఇష్టపడలేదు బన్నీ. తాను హీరో అవ్వాలనుకుంటున్నాననే విషయాన్ని తండ్రికి చెప్పాడు. కానీ, కుటుంబ సభ్యులు దానికి ఒప్పుకోలేదు. హీరో అవ్వడం అంటే అంత ఈజీ కాదని అతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ, బన్నీ వినలేదు. ఈ విషయాన్ని చిరంజీవి దృష్టికి తీసుకెళ్లారు అరవింద్. ముందు యాక్టింగ్ కోర్స్ చేయించమని ఆయన సలహా ఇచ్చారు. అలా ముంబయిలో యాక్టింగ్ కోర్సులో జాయిన్ చేశారు. దీంతో అతన్ని హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చెయ్యాలని నిర్ణయించుకున్నారు అరవింద్. అయితే బన్నీ మొదటి సినిమా చేసే బాధ్యత ఎవరికి అప్పగించాలని ఆలోచిస్తున్న తరుణంలో రాఘవేంద్రరావును అప్రోచ్ అవ్వమని చిరంజీవి చెప్పారు.
అప్పటికే 99 సినిమాలకు దర్శకత్వం వహించి ప్రతిష్ఠాత్మక 100వ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవితో చెయ్యాలని స్క్రిప్ట్ సిద్ధం చేసుకునే పనిలో ఉన్నారు రాఘవేంద్రరావు. ఆ సమయంలో ఆయన్ని కలిసిన అరవింద్ తన కుమారుడిని హీరోగా పరిచయం చెయ్యమని అడిగారు. దానికి రాఘవేంద్రరావు ఒప్పుకోలేదు. తన 100వ సినిమా చిరంజీవితో చెయ్యాలని డిసైడ్ అయినట్టు చెప్పారు. ఇదే విషయాన్ని చిరంజీవికి చెప్పారు అరవింద్. అప్పుడు రాఘవేంద్రరావు కన్విన్స్ చేసి అల్లు అర్జున్‌ని హీరోగా మీరే పరిచయం చెయ్యాలని కోరారు. చిరు మాట కాదనలేక ఆ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. తనపై చిరంజీవి, అరవింద్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు కథ, మ్యూజిక్‌తోపాటు మిగతా విషయాల్లో కూడా ఎంతో కేర్ తీసుకున్నారు రాఘవేంద్రరావు. అలా అల్లు అర్జున్, కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో ‘గంగోత్రి’ ప్రారంభమైంది.
2003 మార్చి 28న ‘గంగోత్రి’ విడుదలై మ్యూజికల్‌గా, బాక్సాఫీస్ పరంగా పెద్ద విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో పెర్‌ఫార్మెన్స్ పరంగా అల్లు అర్జున్‌కి మంచి మార్కులే పడినా లుక్ పరంగా అనేక విమర్శలు ఎదుర్కొన్నాడు. ‘ఇతను హీరో ఏంటి’ అని అందరూ అతన్ని ఎద్దేవా చేశారు. ఆ విమర్శలకు మొదట బాధపడినా ఆ తర్వాత వాటిని పాజిటివ్‌గా తీసుకున్నాడు. తనని తాను మార్చుకోవాలనే స్థిర నిర్ణయానికి వచ్చాడు. దాని కోసం కోఠర శ్రమ చేశాడు. మెగా ఫ్యామిలీ ముద్ర తనపై పడకూడదని.. తనకంటూ ఒక కొత్త స్టైల్‌ని ఏర్పరుచుకున్నాడు.
ఆ సమయంలోనే సుకుమార్ డైరెక్షన్‌లో దిల్‌రాజు ఒక సినిమా నిర్మించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. స్క్రిప్ట్ వర్క్ అయిపోయింది. ఆ కథను మొదట ప్రభాస్‌కి వినిపించారు. కానీ, అందులోని క్యారెక్టర్‌కి తను సూట్ కానని చెప్పేశారు ప్రభాస్. అప్పుడు అల్లు అర్జున్ దగ్గరికి వచ్చింది ఆ కథ. అలా ‘ఆర్య’ చిత్రం ప్రారంభమైంది. అప్పటివరకు వున్న ట్రెండ్‌ని మారుస్తూ సుకుమార్ తొలిసారి దర్శకత్వం వహించిన ఈ సినిమా 2004లో విడుదలై ఘనవిజయం సాధించింది. గంగోత్రి చిత్రాన్ని విమర్శించిన వారంతా ఆర్య సినిమాలో బన్నీ లుక్, యాక్టింగ్ చూసి ఆశ్చర్యపోయారు. ఈ సినిమా తర్వాత వి.వి.వినాయక్ దర్శకత్వంలో ‘బన్ని’ చిత్రం చేశారు. అది కూడా సూపర్‌హిట్ అయింది. ఆ తర్వాత 2006లో బన్నీ, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘దేశముదురు’ సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా కోసం బన్నీతో సిక్స్ ప్యాక్ చేయించారు పూరి. అలా టాలీవుడ్‌లో తొలి సిక్స్ ప్యాక్ హీరోగా ఘనత సాధించారు బన్నీ. ఈ సినిమా తర్వాత ‘శంకర్‌దాదా జిందాబాద్’ చిత్రంలో గెస్ట్‌గా నటించారు. మరోసారి దిల్‌రాజు బేనర్‌లో బన్నీ చేసిన ‘పరుగు’ చిత్రానికి మొదట డివైడ్ టాక్ వచ్చినా ఆ తర్వాత సూపర్‌హిట్ సినిమా అనిపించుకుంది. అలా తన కెరీర్‌ని పర్‌ఫెక్ట్‌గా డిజైన్ చేసుకుంటూ వెళ్లిన బన్నీకి కొన్ని అపజయాలు కూడా ఎదురయ్యాయి.
ఆ క్రమంలోనే క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ‘వేదం’ చిత్రంలో బన్నీ చేసిన కేబుల్ రాజు క్యారెక్టర్ అతనికి మంచి పేరు తెచ్చింది. అంతేకాదు, ఉత్తనటుడిగా ఫిలింఫేర్ అవార్డు కూడా గెలుచుకున్నారు. జులాయి, ఇద్దరమ్మాయిలతో, రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి వంటి సినిమాలు హీరోగా అతని ఇమేజ్‌ని పెంచడమే కాకుండా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడమే కాకుండా ఐకాన్ స్టార్‌గా ఎదిగేలా చేశాయి. ఆ క్రమంలోనే గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన రుద్రమదేవి చిత్రంలో గోన గన్నారెడ్డిగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఒకవిధంగా ఈ చిత్రంలో అనుష్క, రానా కంటే బన్నీకే ఎక్కువ పేరు వచ్చింది. గుణశేఖర్ స్వీయ నిర్మాణంలో ఈ సినిమా రూపొందడం, ఆర్థికంగా ఇబ్బందుల్ని ఎదుర్కోవడం గమనించిన బన్నీ ఎలాంటి పారితోషికం తీసుకోకుండా ఈ సినిమాలో నటించారు. ఈ సినిమా తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన సరైనోడు బన్నీ కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత చేసిన డి.జె., నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రాలు నిరాశ పరిచాయి.
అలాంటి సమయంలో త్రివిక్రమ్ కాంబినేషన్‌లో చేసిన అల వైకుంఠపురములో చిత్రంతో మళ్లీ విజయపథంలోకి వచ్చారు బన్నీ. ఈ సినిమా ఘనవిజయం సాధించడమే కాకుండా హీరోగా అతని ఇమేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అప్పటివరకు బన్నీ చేసిన సినిమాలు ఒక ఎత్తయితే 2021లో సుకుమార్ దర్శకత్వంలో చేసిన ‘పుష్ప’ ఒక ఎత్తు. ఒక కొత్త లుక్‌తో, కొత్త బాడీ లాంగ్వేజ్‌తో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేశారు బన్నీ. టాలీవుడ్‌లో కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టించింది ‘పుష్ప’ధీ సినిమాలోని నటనకు ఉత్తమ నటుడుగా జాతీయ అవార్డు అందుకొని తెలుగు సినీ చరిత్రలో ఎవరూ సాధించని ఘనతను అల్లు అర్జున్ సాధించారు. ఈ సినిమా దానికి సీక్వెల్‌గా సుకుమార్ రూపొందించిన ‘పుష్ప2’ కోసమే పనిచేశారు బన్నీ. ఈ సినిమా నిర్మాణం జరుపుకున్న మూడేళ్ళు మరో సినిమా చేయలేదు. 2024 డిసెంబర్ 5న విడుదలైన ‘పుష్ప2’ ప్రపంచవ్యాప్తంగా ఘనవిజయం సాధించడమే కాకుండా.. అప్పటివరకు ఇండియాలో వున్న కలెక్షన్ల రికార్డులను అధిగమించింది. ‘దంగల్’ తర్వాత అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా ‘పుష్ప2’ రికార్డుల కెక్కింది.
ప్రస్తుతం అల్లు అర్జున్ మూడు సినిమాలు కమిట్ అయినట్టు తెలుస్తోంది. త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఒక సినిమా, అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా, సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారని సమాచారం. వీటిలో మొదట అట్లీ సినిమా ప్రారంభమవుతుందని, కొంత షూటింగ్ జరిగిన తర్వాత త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. ఆ తర్వాత సందీప్ వంగా సినిమా ఉండే అవకాశం ఉంది. త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మైథలాజికల్ సినిమా చేయబోతున్నారు బన్నీ. ఈ సినిమా అతని కెరీర్‌లో మరో మైల్‌స్టోన్ సినిమా అయ్యే అవకాశం ఉంది.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
