Facebook Twitter
మా గోఖలే (వాస్తవ చిత్ర కధ రచయిత)

 

మా గోఖలే(వాస్తవ చిత్ర కధ రచయిత)

స్వచ్ఛమైన పల్లెటూరి భాష, ఎక్కడా పక్కకుపోని సజీవ పాత్ర చిత్రణ, కథకోసం ఊహల్లో విహరించని సజీవత్వం, ఆకలి, పేదరికం, చిన్నచిన్న ఆనందాలు, గ్రామాల జీవనంలోని సన్నివేశాలు కలిస్తే మాగోఖలే కథలు. సుమూరు ఒక డెబ్బై సంవత్సరాల నాటి పల్లె సీమల ప్రకృతిని, ఆ మనుషుల బతుకుల్లోని యదార్థ సంఘటనలను మనకు కథల ద్వారా చెప్పారు మా గోఖలే. చెప్పారు అనడం కంటే చూపించారు అనడం బాగా ఉంటుంది. ఎందుకంటే గొప్ప చిత్రకారుడైన మాగోఖలే. కథను చెప్పడు, చూపిస్తాడు. ఇదే అతని కథా టెక్నిక్. అవి కథలు కావు వాస్తవ చిత్రాలు. నేలబారు కథలు అని విమర్శకులు చెప్తే అవి నేలబారు కథలు కావు, ఊహల్లో తిరిగే మనిషిని కిందకు దించి నేల తల్లి గొప్పతనాన్ని రుచి చూపేవి అని ప్రముఖ కథా రచయిత పాపినేని శివశంకర్ చెప్పారు. కానీ తెలుగు కథా సాహిత్య చరిత్రలో మాగోఖలేకు రావాల్సినంత పేరు రాలేదు అన్నది మాత్రం వాస్తవం.

ఎన్నో ఆణిముత్యాల్లాంటి కథలు రాసిన మాగోఖలే అసలుపేరు మాదవపెద్ది గోపాలకృష్ణ గోఖలే. గుంటూరు జిల్లా తెనాలి దగ్గరున్న బ్రాహ్మణకోడూరులో 1917లో జన్మించారు. మద్రాసులోని ఆర్ట్స్ కళాశాలలో దేవీ ప్రసాద్ రాయ్ చౌదరీ దగ్గర డ్రాయింగ్ నేర్చుకున్నాడు. కొంతకాలం ఆంధ్రపత్రిక, ప్రజాశక్తి పత్రికలలో రాజకీయ కార్టున్లు వేశారు. తర్వాత వెండితెరకు పరిచయం అయ్యారు. నాగిరెడ్డి, చక్రపాణి వీరిని 1950లలో ఆర్ట్ డైరెక్టురుగా చలన చిత్రసీమకు పరిచయం చేశారు. వీరిలోని ఆర్ట్ ఒక పార్శ్వమైతే, అతనిలోని రచనా సృజనాత్మకత మరో పార్శ్వం. 1940లలో అప్పటి ప్రజల వాడుకభాషలో మొదటి కథ "కిట్టకాలువ గట్టుకాడ" రాశారు. ఇది ఆంధ్రపత్రికలో ముద్రితమైంది. ఈ కథలోని ఇతివృత్తాన్ని, భాషను చూసి గ్రాంధికభాషా వాదులు నొచ్చుకున్నారు. అలా ప్రారంభమైన గోఖలే కథా ప్రస్తానం అనేక కథల్ని అలాంటి పల్లెటూరి వాతావరణంతోనే అలాంటి వ్యవహారిక భాషతోనే కొనసాగింది.

మాగోఖలే మొత్తం 89 కథలు రాసినట్లు తెలుస్తుంది. ఈ కథలన్నీ మా గోఖలే కథల పేరుతో పుస్తకంగా వచ్చాయి. వీరు కథలతోపాటు వ్యాసాలు కూడా రాశారు. వీరి కథలన్నీ గుంటూరు జిల్లాలోని వీరి సొంతూరైన బ్రాహ్మణకోడూరు చుట్టూ ఉన్న వాతావరణంలోనే సాగుతాయి. అక్కడి మనుషుల జీవితాన్నే ప్రతిబింబిస్తాయి. గోఖలే మద్రాసు వెళ్లినా తన మూలాలనే కథలుగా రాశారు. అక్కడి మోతుబరీ రైతులు, బీదాసాదా, ముసలి వాళ్లు, పేదల ఆకలి, పశువులు, పొలాలు, కూలీలు- వారి ఆకలి బాధలు, తోలుబొమ్మలాటలు, పొలాల్లో జరిగే పనులు, పడుచుపిల్లలు... ఇలా పల్లెటూరి వాతావరణాన్ని తన కుంచెతో బొమ్మ గీసినట్లే ఉంటాయి. పాలెంలో దీపాలమాస, నుప్పు కుడుపులు, కోండాయి పక్షి, రాయి మడుసులు, కిష్టమ్మగారి పెద్ద జీతగాడు, బండిరాముడు పెళ్ళాం, రత్తికోక కట్టింది, వెంకటస్వామి పాలెం, నిస్సహాయులు, బల్లకట్టు పాపయ్య, పిప్పిదంట్లు, గూడెం పోకడ, పులి విస్త్రాకులు, మూగజీవాలు... వంటి ఎన్నో అద్భుతమైన కథలు రాశారు. ప్రతికథా ఓ సజీవచిత్రమే. వీరి కథల్లో గొడ్డకాడ బుడ్డోళ్లు, ఆకలి తీరని జీతగాళ్లు, కోటప్పకొండ తిరునాళ్ల సందళ్లు, బొమ్మలాటలు ఆడేవాళ్లు, గుక్కెడు చల్లకోసం అడుక్కునే వాళ్లు, రాళ్లు పగలగొట్టే కష్టజీవులు, ఎరుకలు, యానాదులు, అమాయకులు, నాగరికత అనే నగీషికి దూరంగా ఉండే పల్లెటూరి ప్రజలే మనకు కనిపిస్తారు.

"మూగ జీవాలు" కథలో యానాది ముసలాయి పావల్డబ్బులకోసం రామయగారింట్లో నీళ్లుతోడతాడు, సుబ్బయ్యకు బెణికిన కాలు తోముతాడు కానీ డబ్బులు మాత్రం దొరకవు, శశిరేఖను పెళ్లిచేసుకుని ఉంటాడు. చిల్లరకొట్లో అప్పు పుట్టదు. చివరకు బుట్టలో మిగిలిన ఎండుచేపలే భార్యాభర్తల ఆకలి తీరుస్తాయి. "పాలెంలో తోలుబొమ్మలాట" కథలో ఎంకట సుబ్బయ్యగారి జీతగాడు సూరాయి రాత్రి తోలుబొమ్మలాట చూడడానికి పడే తిప్పలు అన్నీఇన్నీ కావు. అందుకు కారణం కామందుడంటే అతనికి ఉండే భయం. "రాయి మడుసులు" కథలో కూలి మనుషులు రక్తం చిందిస్తూ నల్లరాళ్లతో భవనాన్ని కడతారు. కానీ ఆఖరికి కూలీ అర్థరూపాయి దక్కుతుంది. గృహప్రవేశం విందులో కూడా చోటు దక్కదు. ఇలా భూస్వామ్య వ్యవస్థలో సాధారణ ప్రజల కష్టాలే వీరి కథల్లో కనిపిస్తాయి. కానీ ఎక్కడా పోరాటానికి దిగరు. పెత్తందార్ల చేతుల్లో నలిగి పోతుంటారు. ఎక్కడో ఒకటో రెండో పాత్రలు ఎదురు తిరుగుతాయి. ఇలా వాస్తవచిత్రణ చేసే గోఖలే ఎక్కడా నేల విడిచి సాముచేయడు కథాటెక్నిక్ కోసం పాకులాడడు. ఉన్నది ఉన్నట్లు సహజంగా చిత్రిస్తాడు. అణగారిన వర్గాల జీవన లోతుల్ని ఎంతగానో అర్థం చేసుకుంటే తప్ప ఇలాంటి కథలు రాయలేరు. కథలో రచయిత ప్రవేశించడు. ఉపన్యాసాలు ఇవ్వడు. అనవసరమైన వర్ణనలు చేయడు. ఒక్కో కథలో ఒక్క సన్నివేశమే కథగా మారిపోతుంది. మరో కథలో సంభాషణే కథను నడిపిస్తుంది. వీరి భాషకూడా పాత్రోచిత భాష. పూర్తిగా మాండలికం.

" కిష్ణమ్మగారి పెద్దజీతగాడు" కథలో- "అరె నాయనా ఎట్టూటి కోడెగిత్తలు... సూరాయ్ కోడెగిత్తలు... గిత్తల మీన కిష్ణమ్మ సెయి వేశాడంటే ఒసి కర్రతో తన ఏటుకి పగిలిందన్నమాటే... ఇంకా నెమరేత్తా పండుకున్నారేందే లెగవండి లెగవండి ఏలయిపోతుండది - దూరపయానం జేశారు గావాల్ను కూసేపు జనపకట్టల్ని తినండి...." ఇలా సాగుతుంది.

గోఖలేకు కథా రచయిత కన్నా ఆర్టు డైరెక్టరుగా మంచిపేరు ఉంది. "రైతుబిడ్డ" సినిమాకు పనిచేసిన గోఖలే... తర్వాత చక్రపాణి- నాగిరెడ్డి చిత్రాలకు పనిచేశారు. పాతాళభైరవి, గుండమ్మ కథ, మాయాబజార్ వంటి ఎన్నో చిత్రాలకు పనిచేశారు. ఎన్టీఆర్ ను కృష్ణుడిగా చూపించే మొదటి స్కెచ్ ను గోఖలే గీశారట. అలానే మాయాబజార్ చిత్రంలో ఎస్వీరంగారావు ఆహార్యం వీరిదే. పలు కోటలకు వీరు గీసిన స్కెచ్ లు బ్యాగ్రౌండ్ లో ఎంతో సహజంగా కనిపించేవి, నిజమైనట్లు ప్రేక్షకులను మాయజేసేవి. జగదేకవీరుని కథ, మాయాబజార్, పాతాళభైరవి వంటి చిత్రాల్లో వీరి స్కెచ్ లకు ఎనలేని పేరు వచ్చింది. పిల్లల పత్రిక "చందమామ"లోని "బాలనాగమ్మ" సీరియల్ కు కూడా బొమ్మలు వేశారు. ఇలా కథకునిగా. ఆర్ట్ డారెక్టరుగా పేరుపొందిన మా.గోఖలే 1981లోమరణించారు. కానీ ఇప్పటికీ 1940ల నాటి గుంటూరు జిల్లా పల్లెసీమల చరిత్రను తెలుసుకోవాలంటే వీరి కథలే ఆధారం అంటే అతిశయోక్తి కాదు. కళ - గోఖలే అని పాత సినిమాల్లో పేరు కనపడితే ఆయన ఆర్ట్ గొప్పతనం ఇట్టే తెలిసిపోతుంది.

-  ఎ.రవీంద్రబాబు