తెలుగువారం అని చెప్పుకోవడమేనా!
అభిమన్యుడు తన తల్లి గర్భంలో ఉన్నప్పుడే పద్మవ్యూహం గురించి విన్నాడని పురాణాలు చెబుతున్నాయి. అందులోకి ప్రవేశించడమే కానీ నిష్క్రమించడం తెలియక అతను యుద్ధంలో ఓడిపోయాడు. పిల్లలు మాతృగర్భంలో ఉన్నప్పటి నుంచే బయట నుంచి వచ్చే శబ్దాలని గ్రహించగలుగుతారని ఇప్పటి శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ బయటకి వచ్చాక ఏ భాష తనదో తెలియక జీవితంలో ఓడిపోతున్నారు. పిల్లవాడు తన తల్లిదండ్రుల ద్వారా, సమాజం ద్వారా జ్ఞానాన్ని ప్రోదిచేసుకునే భాష మాతృభాష. పసి మనసులోని భావాలను స్పష్టంగా చెప్పడానికీ, అనుమానాలను నివృత్తి చేసుకోవడానికిమాతృభాష ఎంతగానో దోహదపడుతుంది. ఎవరు ఎంత ఎదిగినా బాధ కలిగితే `అమ్మ` అనే కదా తల్చుకునేది! పిల్లవాడి మెదడులో సహజసిద్ధంగా ఉన్న భాషలోనే అతను వీలైనంత ఎక్కువ జ్ఞానాన్ని పొందగలుగుతాడని నివేదికలు చెబుతున్నాయి. ప్రపంచంలోనే మేథావులుగా ఎన్నదగినవారి గురించిపరిశోధించినప్పుడు వాళ్లంతా మాతృభాషలో ప్రాథమిక విద్యాబ్యాసం చేశారని తేలింది.
ఇంతకీ తెలుగుని మాతృభాషగా మనం ఎంతవరకు గౌరవిస్తున్నాం అంటే తెల్లమొగం వేయాల్సిందే. తెలుగుకి ఇప్పటికిప్పుడు అంతరించిపోయే భయం ఏదీ లేదు. తెలుగు భాష ఉనికికి వచ్చిన ప్రమాదమూ ఏమీ లేదు. కానీ తెలుగుని మర్చిపోతే నష్టపోయేది మనమే! ఒక భాషకు దూరం కావడం అంటే దాని వెనుక ఉన్న పదసంపదకీ, సంస్కృతికీ దూరం కావడమే! మేం తెలుగువారం అని చెప్పుకోలేని పరిస్థితి వస్తే ఇక మన ఉనికికి అర్థం ఏముంటుంది? అలాగని ఇప్పటి పిల్లలను ప్రపంచభాష అయిన ఆంగ్లం నుంచి దూరం చేయడంలో కూడా అర్థం లేదు.
ఇప్పటి పిల్లల్లో అధికశాతం ఎలాగూ ఆంగ్లమాధ్యమంలోనే చదువుకుంటున్నారు. వారిలో చాలామంది తెలుగును ద్వితీయభాషగా కూడా నేర్చుకోవడం లేదు. ఇక విదేశాలలో చదువుకునే పిల్లలకు బడిలో తెలుగు అన్న ప్రసక్తే లేదు. అందుకనే తెలుగువన్ కు అనుబంధంగా నడుస్తున్న కిడ్స్‌వన్ వెబ్‌సైట్ తెలుగుపిల్లలకు మాతృభాషను, మనదైన సంస్కృతినీ అందించే ధ్యేయంతో సాగుతోంది. కంప్యూటర్ ద్వారానే పిల్లలు పెద్దబాలశిక్షలోని అంశాలను తెలుసుకునేలా e- పెద్దబాలశిక్షకు రూపకల్పన చేసింది. తేటతెలుగును అంతే తేలికగా నేర్చుకునేందుకు, అక్షరమాలను ఆటల రూపంలో అందించింది. కథల ద్వారా తెలుగుపదాలను నేర్చుకునేలా వందలాది కథలను నిపుణులచేత చెప్పించింది. తెలుగులో ఉన్నంత శతక, పద్య సాహిత్యం మరే ఇతర భాషలోనూ లేదు. వాటిలో పిల్లలకు అనువైన, అవశ్యమైన సాహిత్యాన్నంతా శ్రవణ, దృశ్యరూపాలలో పిల్లలకు అందించింది కిడ్స్‌వన్. తెలుగును కాపాడుకోవాలి అన్న నినాదాలు ఏవీ మొదలవకముందు నుంచే కిడ్స్‌వన్ తన మాతృభాషా యజ్ఞాన్ని నిశ్శబ్దంగా కొనిసాగిస్తూ వస్తోంది. ఇది ఎవరో వస్తారనో, గుర్తిస్తారనో సాగించిన శ్రమ కాదు. తెలుగుభాషకు, జాతికి తనవంతు బాధ్యతగా అందించిన చేయూత ఇది!
ఇక తెలుగుసాహిత్యాన్ని చదివేది ఎవరు? ప్రపంచస్థాయి సాహిత్యం తెలుగులో సాధ్యమేనా? అన్న ప్రశ్నలకు తెలుగువన్ కావల్సినన్ని జవాబులని అందిస్తోంది. సాహిత్యానికి ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పరిచి పద్యం, గద్యం, కవిత, కథ... ఇలా అన్ని రకాల సాహితీసృజనలకు వేదికగా నిలిచింది. నాటి ప్రసిద్ధ రచయితలని, వారి రచనలనీ పరిచయం చేయడమే కాదు. ఇప్పటి తరం రచనలని కూడా లక్షలాదిమందికి చేరువ చేస్తోంది. `తెలుగు సాహిత్యంలో హాస్యం` అంటూ ఏడు సంవత్సరాలుగా వీక్షకులని అలరించినా, `చరిత్రలో ప్రబంధపరమేశ్వరుడు` వంటి భక్తి సాహిత్యాన్ని పాఠకులకు అందించినా... అక్షరం నిలిచి ఉన్నంతవరకూ, తెలుగు సాహిత్యానికి ఢోకా లేదని చెప్పకనే చెబుతోంది.
తెలుగుని ప్రపంచభాషగా మార్చేయాలని ఎవరూ కోరుకోరు. కానీ ఇల్లు అనే ఓ చిన్ని ప్రపంచంలో తెలుగుది తొలిస్థానంలో నిలవాలని కోరుకోవడం తప్పేమీ కాదు కదా! మాతృమూర్తిని అమ్మా అని పిలిచే తరం, దానిని ప్రోత్సహించే పెద్దరికం ఉండాలని ఆశించడం నేరం కాదు కదా! ఇజ్రాయిల్ దేశంలో వందల సంవత్సరాలుగా మరగున పడిపోయి ఉన్న హిబ్రూ భాషను, ఆంగ్లానికి దీటుగా తీర్చిదిద్దగలిగారు. అలాంటిది తెలుగును కాపాడుకోలేమా! కానీ ఇది ఎవరో ఒక్కరు చేయగలిగేది కాదు, ఏదో ఒక్క సంస్థ సాధించగలిగేదీ కాదు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా ఒక్కతాటి మీదకు వచ్చి, తెలుగుకు పునర్వైభవాన్ని తీసుకురావాలని తెలుగువన్ ఏళ్ల క్రితమే కోరుకుంది. దురదృష్టవశాత్తూ, తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని కోరుకునే స్థితిలో విస్తృతమైన ఈ లక్ష్యంలో కలిసి నడిచేందుకు ఎవరూ ముందుకు రాలేదు. తెలుగుభాషా దినోత్సవం నాటి రోజునో, ఉగాదినాటి పండుగనో తెలుగు గొప్పతనం గురించీ, తెలుగువారి సంస్కృతి గురించీ ఉపన్యాసం ఇచ్చినంత మాత్రాన తెలుగు వెలిగిపోదు. తెలుగు ప్రభుత్వాలకు తోడుగా, తెలుగుభాషోన్నతే ధ్యేయంగా ఉన్న సంస్థలన్నీ కలిసి ముందుకు సాగినప్పుడే భాషాపరిరక్షణ అన్న మాటకు అర్థం పరమార్థం ఏర్పడుతుంది. లేకపోతే మరో వంద సంవత్సరాలు గడిచినా ఇంకా శ్రీకృష్ణదేవరాయలవారు `దేశభాషలందు తెలుగులెస్స` అన్నారనీ, సుబ్రహ్మణ్యభారతి `సుందర తెలుంగు` అని పొగిడాడనీ వల్లెవేసుకోవడమే మిగిలిపోతుంది. అప్పటికి తెలుగు కూడా ఒక దేవభాషగా మారిపోతుంది.
- నిర్జర.
