Facebook Twitter
నిజం చెప్పనా

నిజం చెప్పనా

 

 

ఊహల తోటలో వసంతమై నే నిలుచున్నప్పుడు, సరాగాల కోయిలవై నీవు పదే పదే కుహూల సవ్వడిని నావైపు వదిలితే.. నీవు నేను మాత్రమే ఉన్న క్షణానికి అచ్చెరువొంది, ఆ మనో గానానికి మంత్రముగ్దుడినై లోకాన్ని మరిచి..
నీ కోసం వెతికే వెతుకులాటలో తగిలిన ఎదురు దెబ్బలు ఎంత మధురమని నీకు చెప్పగలను?

కోయిల తో పోల్చానని బుంగమూతి దేనికి బంగారం?
అందంలో హంసవే లే.. అప్యాయత కోసం పరుగులిడే మనసుని కప్పిన దేహానికి అలసటే లేదు తెలుసా ఆ క్షణాల్లో!
వర్ణిద్దామంటే పదాలు దొరకట్లేదు,కొత్త గా కనిపెడదామనుకుంటే నీ పేరు ని మించిన పదం దొరకలేదు.
అది సరే పరిచయపు నవ్వులో అంత మధురాన్ని దాచుకున్నావు, మత్తునలా చల్లి వశీకరించావు. ఏ మాయో అది!
నీవున్న క్షణాలు అలా జారిపోతే నా కనులముందే, రేయి జాము నిను చూడక దాటాలంటే ఎన్ని యుగాల రాదారి పయనాలు చేసానో తెలుసా?
ఎప్పటికైన ఏమైనా నను తాకిన ఆ చూపులు చెప్పనలవి కావు.
కనురెప్పలకి ఏ మువ్వని కట్టి అరంగేట్రమిచ్చావో.. ఆ నాట్యానికి దాసుడనయ్యా.. నను వీడి పోయే క్షణాన ఆ కనులు చేసిన ముక్తాయింపుకి కలలో నిలిచి కమ్మని రసికత్వ జ్వాలలు కురిసినప్పుడు పదాలలా నా పెదాల వెంట ఆగి కలాన్ని తాకి కావ్యమై ప్రసవిస్తే ఉక్క పట్టలేక రాసిన లేఖాస్త్రమిది.
నీ ఎద కాంతిపై
నా మది శాంతికై!!!!

ఇట్లు,
నీకై వేచిన క్షణానికి ప్రతిబింబం!

- Raghu Alla