Facebook Twitter
ధైర్యం నింపే అక్షరం

i consider myself a poet first and a musician seccond . i live like a poet and i will die like a poet - bob dyla 

ఈ వాక్యం ఈ కవికి చక్కగా సరిపోతుంది. ఐదు పుస్తకాల వయస్సు ఈ కవిది. 2001 నుంచి ఇప్పటివరకు తనని తానూ నరుక్కుంటూ, పేర్చుకుంటూ, అక్షరాలను పేనుకుంటు కవిత్వాన్నీ శ్వాసిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక పేజీని రూపొందించుకున్న కవి శ్రీనివాస్ గౌడ్. ఆరవ పుస్తకం ధైర్యవచనం తో కవిత్వ ప్రేమికుల ముందుకు వచ్చేసారు. నిజం చెప్పాలంటే ఏడాది నుంచి కరోనా కోరల మధ్య జనం బెంబేలెత్తిపోతున్నారు. భయంతో ముడుచుకుపోతున్న మనసులలోకి ధైర్యాన్ని నూరిపోయడం ఈ పుస్తకం యొక్క ఉద్దేశం. ఈ పుస్తకంలో పిల్లల మీద, అమ్మల మీద, వలస కూలీల మీద అన్ని అంశాల మీద అందంగా ఒదిగిన కవితలే కాదు జపనీయులు రాసిన కవితలను తెలుగులోకి అనువాదం చేసి అలరించారు. ధైర్యవచనం మనల్ని మరో లోకంలోకి తీసుకెళ్లిపోతుంది. కవి ఎంత విశాలమైన ప్రపంచాన్ని చూశాడో ఆ కవితలే చెప్తాయి. మన చుట్టూ జరుగుతున్న జీవితాల పని తీరును, ప్రపంచం వేస్తున్న పిల్లి మొగ్గలను చాలా సూటిగా చెప్పారు. కవి ఎప్పుడూ, ఎక్కడ నిలబడతాడు అంటే ప్రపంచం చివర్న నడుస్తూ, పరిగెడుతూ, అప్పుడప్పుడు నవ్వుతూ, కొన్ని కన్నీళ్లను కారుస్తూ, ఎంతో మందితో అంతర్గతంగా యుద్ధం చేస్తాడు. అరుస్తాడు, ఆవేదనతో అల్లకల్లోలమౌతాడు, మకిలి పడతాడు, మలినమౌతాడు..చివరికి అక్షరమై వెలుగుతాడు. తీసుకున్న వస్తుశిల్పాలతో అనుకున్న దాన్ని కొన్ని చోట్ల ఘాటుగా, గట్టిగా, కొన్ని చోట్ల సున్నితంగా వ్యక్తీకరించారు కవి. హిందీ టైటిల్స్ తో కొన్ని చోట్ల అలాగే జపాన్ దేశానికి చెందిన ప్రాచీన కవితలను తెలుగులోకి అనువాదం చేసి అందరినీ ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్లి వ్వాహ్ అనిపించేలా చేస్తారు. మనిషి మారాలంటే ఒక్క క్షణం చాలు. ఆ క్షణం లోపలుంటే మనిషి ఎలా ఉంటాడు. ఆ ఒక్క క్షణం దాటితే మూడ్ ఎలా చేంజ్ అవుతుంది అనేది ఒక్క క్షణం కవితలో మనిషి నిజ స్వరూపాన్ని చూపించారు. ''ఆ క్షణం దాటిందంటే /ముమ్మాటికీ నేను నేను కాదు / ప్రేమగానో / ద్వేషంగానో / ఆ క్షణంలో అలాగే వుంటాను '' అంటారు కవి. మాటల మీద మాటు వేయండి అనే కవితను తీసుకుంటే '' మౌనంగా మాట్టాడే పనిముట్లను సృజించిన పనోడు ఇప్పుడు మాట్టాడాలి / మట్టిలోంచి అన్నం ముద్దల్ని సృష్టించే మట్టి మనిషి ఇప్పుడు మందికి ముందుండాలి '' ఈ వాక్యాలు చదివితే నిజమే కదా అనిపిస్తుంది. సృష్టించేవాడు వెనకబడుతున్నాడు. అర్భక మాటలు చెప్పేవాళ్ళు ముందుకు దూసుకెళుతూ వీళ్ళ మీద పెత్తనం చేస్తూ దోచుకుతింటున్నారనే నేపథ్యంలో ఈ కవితను చాలా ఘాటుగా, సూటిగా రాసారు కవి. మరో కవిత '' గేటు దగ్గర '' కవితను పరిశీలిస్తే '' ఒక్కోసారి గేటు పడుతుండాలి / జీవితం కళ్లబడింది / ఒక్కోసారి గేటు తీసుండాలి / జీవితం తుళ్ళి పడుతుంది '' అంటారు కవి.,

ఇక్కడ గేటు అనే పదాన్ని మనసుకు ప్రతీకగా వాడారనిపిస్తుంది. అనవసమైన చోట మనసును అదుపులో ఉంచుకోవాలి. అలాగే ఏ రిలేషన్ ఐనా పట్టూ విడుపు వుండాలని చెప్పకనే చెప్తారు కవి. '' బదలా'' అనే హిందీ టైటిల్ తో రాసిన కవిత చదివిన ప్రతీ ఒక్కరికీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. మతం పేరుతో జరుగుతున్న అనర్ధం పై ప్రతీకారం తీర్చుకోవాలి అంటారు. '' గుండె రాయి చేసుకుని /గునపం చేతిలోకి తీసుకుని నేనూ బదలా తీర్చుకోవాల్సి ఉంటుంది ''అనే వాక్యాలతో ఆ కవితను ముగిస్తారు. పిల్లలంటే ఎవరికి ఇష్టముండదు చెప్పండి. ఒక స్కూల్ నేపధ్యాన్ని తీసుకుని పిల్లల చేత పాఠాల్ని బట్టీ పట్టిస్తున్న దృశ్యాన్ని కవిత్వం చేశారు. '' ఆమె పిచ్చి గాని / ఎక్కడైనా తూనీగలు / వరసలో ఒదిగి ఉంటాయా ..? / ఎక్కడైనా పిట్టలు ముక్త కంఠంతో ఒకే పాట పాడతాయా ..? '' అని చాలా సింపుల్గా, సూటిగా, ఆలోచింపజేసేలా చిన్న వాక్యాల్లో ఎక్కువ అర్థాన్ని చెప్పారు. పాఠకుడికి ఏది ఎక్కువ గుర్తుంటుంది. జ్వలించే కవిత్వాన్ని ముందు వరసలో గుర్తుపెట్టుకుంటాడు. అలాంటి కవిత్వం చీకట్లోంచి మెలకువలోకి తెస్తుంది. తర్వాత పాఠకుడికి అణువణువునా ఆ కవిత్వం రగులుతూనే ఉంటుంది. కొన్ని కవితల రుచి చేదుగా ఉంటుంది. ఎందుకంటే జీవితంలో ఎదురైన అనుభవాలు, సంఘటనలు, మనసును కదిలించే దృశ్యాలే చేదు కవితలకు నేపధ్యాలౌతాయి.. ప్రతీ ఒక్కరి జీవితంలో ఏదో ఒక చోట ఇలాంటి ఒక చెడును రుచి చూడక తప్పదు. కవి కూడా అలాంటి సందర్భంలోంచి '' చేదు సమయాలు'' పేరుతో చిక్కని వాక్యాలు రాసి అందరినీ ఒప్పించి తీరుతారు ''ఇద్దరం / దొరికిన ఏకాంతాన్ని / తప్పుకు తిరుగుతున్నాం / అడ్డుగా పెరిగి అహం గీతలు / ఇప్పుడు ఇద్దరం కలిసి / ఒకే కలను కనలేం / తెల్లారితే తలో దారి '' ..అహం మనుషుల మధ్య ఎన్ని కంచెలు వేస్తుందో ఈ కవితలో చెప్తారు....నాన్న మీద ప్రతీ కవి స్పందిస్తాడు. అమ్మానాన్నల మీదే కొన్ని అక్షరాలూ రాసి కవిగా తోలి అడుగు వేస్తాడు.

''మనసు మాగాణి మీద / అమ్మను, నన్నూ నాటుకుని / ప్రాణాల్ని రెండు చేతులు చేసి / అడ్డు పెట్టి సాగుతాడు/ ఎం చేస్తాడు నాన్న '' అంటూ ఎంతో ఆర్ద్రం గా మనసు ద్రవించేలా రాశారు. కన్నందుకు అమ్మను అందరూ గౌరవిస్తారు, పూజిస్తారు. కానీ నాన్న జీవితాంతం అమ్మను, బిడ్డల్ని మోస్తున్నందుకు ఆయన్ని ఇంకా ఎంత గౌరవించాలి, పూజించాలి. ఇక టైటిల్ కవిత ''ధైర్యవచనం'' చూస్తే ''అదొక రూపంలో ఉండదు / ఒక చోట ఉండదు / చూడడానికి అతను / మనలాంటి మనిషే గాని / మనలా గడ్డ కట్టుకుపోయిన మనిషి కాదు / లోపల జల ఎండిపోయిన మనిషి కాదు '' అంటూ గుండెకు తాకేలా తాను అనుకున్నది రాశారు కవి. ఈ కవితను ఆపదలో ఆపన్నులను ఆదుకునే తన మిత్రుడు రమణారెడ్డి ఇంకా అతని లాంటి వాళ్ళ కోసం కవి ఈ కవితను రాసి అంకితం చేశారు. ధైర్యం ఎటు నుంచైనా రావొచ్చు. మనిషి రూపంలో, పుస్తకం రూపంలో, ఇంక ఏదైనా రూపంలో.. నిజమే కదా. ఇంకో విషయం చెప్పాల్సి వస్తే జపాన్ కవితలను తెలుగులోకి అనువదించిన కవితల్లో '' మానుకోనా / లేదంటే గుర్తుంచుకోనా / ఈ లోకాన్ని కాదని / మన చివరి కలయికని '' అని ఇజుమీ షికాబు అనే జాపనీస్ కవయిత్రి రాసిన కవితను తెలుగులో అనువదించి తెలుగు పాఠకులను అలరించడం నిజంగా గొప్ప విషయం. ఈ పుస్తకంలోని కవితలు నిజంగా ఎండిపోయిన చెట్టు మళ్ళీ చిగురించినట్టు, భయం తప్ప ఇంకేం లేని ఈ పరిస్థితిలో ధైర్యాన్ని ఇచ్చేలా ఉంటాయి. వాస్తవాలను కవిత్వం చేయాలంటే, దాన్ని పాఠకులు నిక్కచ్చిగా మెచ్చుకుని ఒప్పుకోవాలంటే దానికి కవి ఎంతో ఆచితూచి తెగువ చూపించాలి. కవిత్వం చదివిన వారిలో మనోధైర్యాన్ని నింపాలి. ఎందుకంటే కవి ఎప్పుడూ కలం సైనికుడు మరి. అలాంటి తెగువ, ధైర్యం వున్నా కవి శ్రీనివాస్ గౌడ్ అని చెప్పొచ్చు. 


- అమూల్యచందు