Facebook Twitter
21 రకాల ఆకులతో విఘ్నేశ్వరుని పూజ




21 రకాల ఆకులతో విఘ్నేశ్వరుని పూజ

ఏదైనా ఒక సాధారణ కార్యక్రమం ప్రారంభించేటప్పుడే కాదు, ఒక పూజ చేసే టప్పుడు కూడా ముందుగా వినాయకున్ని పూజించడం హిందూ సాంప్రదాయం. అలాంటి వినాయకుడ్ని ప్రత్యేకంగా పూజించే రోజు వినాయక చవితి. అందరికీ నచ్చే దైవం. అందరూ కొలిచే దైవం వినాయకుడు. శివ పార్వతుల కుమారుడైన వినాయకుడ్ని పూజిస్తే అందరు దేవుళ్లన్నీ పూజించినట్లే అని పురాణాలు చెబుతున్నాయి. హిందూ సంప్రదాయంలో సకల దేవతా గణములకు అధిపతి వినాయకుడు. విద్యకు, సకల శుభాలకు అధినాయకుడు విఘ్నేశ్వరుడు. అలాంటి శివ పార్వతుల ముద్దుల కుమారుడ్ని వినాయక చవితి నాడు పూజిస్తే ఎంతో ఫలం. వినాయక చవితి నాడు చేసే పూజలో పత్రాలు ప్రధానమైనవి. విఘ్నేశ్వరుని 21 రకాల ఆకులతో పూజించడం ఆనవాయితీ. అయితే ఈ 21 ఆకుల పేర్లేంటని తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి.

1. మాచీ పత్రం: మాచ పత్రి అనేది తెలుగు పేరు. చేమంతి జాతికి చెందిన దీని ఆకులు సువాసనా భరితంగా ఉంటాయి. చేమంతి ఆకుల మాదిరే ఉంటాయి.

2. దూర్వా పత్రం: దూర్వా పత్రం అంటే గరిక. తెల్ల గరిక, నల్ల గరిక అని రెండు రకాలుంటాయి. గడ్డిజాతి మొక్కలు విఘ్నేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనవి.

3. అపామార్గ పత్రం: తెలుగులో దీనిని ఉత్తరేణి అంటారు. దీని ఆకులు గుండ్రంగా వుంటాయి. గింజలు, ముళ్ళు కలిగి వుండి కాళ్ళకు గుచ్చుకుంటాయి.

4. బృహతీ పత్రం: దీనిని ములక అంటారు. దీనిలో చిన్న ములక, పెద్ద ములక అని రెండు రకాలున్నాయి. పత్రాలు వంగ ఆకులు మాదిరి. తెల్లని చారలుండే గుండ్రని పండ్లతో వుంటాయి.

5. దుత్తూర పత్రం: దుత్తూర పత్రం అంటే ఉమ్మెత్త. ఇది వంకాయ జాతికి చెందింది. ముళ్ళతో కాయలు వంకాయ రంగు పూలు వుంటాయి.

6. తులసీ పత్రం: హిందువులకు తులసి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తులసీ పత్రాలను దేవతార్చనలో వాడతారు.

7. బిల్వ పత్రం: బిల్వ పత్రం అంటే మారేడు ఆకు. మూడు ఆకులుగా, ఒక ఆకుగా ఉంటాయి. ఇవి శివునికి చాలా ఇష్టం. శ్రీ మహాలక్ష్మీదేవికి కూడ ఇష్టమైందిగా చెపుతారు.

8. బదరీ పత్రం: బదరీ పత్రం అంటే రేగు. దీనిలో రేగు, జిట్రేగు, గంగరేగు అని మూడు రకాలు ఉంటాయి.

9. చూత పత్రం: చూత పత్రం అంటే మామిడి ఆకు. ఈ ఆకుకు శుభకార్యాల్లో విశిష్ట స్థానం ఉంది. మామిడి తోరణం లేని హైందవ గృహం పండుగరోజులలో కనిపించదు.

10. కరవీర పత్రం: దీనినే గన్నేరు అంటారు. తెలుపు, పసుపు, ఎరుపు రంగుల పూలుంటాయి. పూజలో ఈ పూలకు విశిష్ట స్థానం ఉంది.

11. మరువక పత్రం: దీన్ని వాడుక భాషలో ధవనం, మరువం అంటారు. ఆకులు ఎండినా మంచి సువాసన వెదజల్లుతుండటం ఈ పత్రం ప్రత్యేకత.

12. శమీ పత్రం: జమ్మిచెట్టు ఆకులనే శమీ పత్రం అంటారు. దసరా రోజుల్లో ఈ చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

13. విష్ణుక్రాంత పత్రం: ఇది నీలం, తెలుపు పువ్వులుండే చిన్న మొక్క. నీలి పువ్వులుండే రకాన్ని విష్ణుక్రాంత అంటారు.

14. సింధువార పత్రం: సింధువార పత్రాన్నే వాడుకలో వావిలి అనికూడ పిలుస్తుంటారు.

15. అశ్వత్థ పత్రం: రావి ఆకులనే అశ్వత్థ పత్ర మంటారు. రావి చెట్టుకు పూజలు చేయటం మనసంప్రదాయం.

16. దాడిమీ పత్రం: దాడిమీ అంటె దానిమ్మ ఆకు. శక్తి స్వరూపిణి అంబకు దాడిమీఫల నైవేద్యం ఎంతో ఇష్టం.

17. జాజి పత్రం: ఇది సన్నజాజి అనే మల్లిజాతి మొక్క. వీటి పువ్వుల నుంచి సుగంధ తైలం తీస్తారు.

18. అర్జున పత్రం: మద్దిచెట్టు ఆకులనే అర్జున పత్రమంటారు. ఇవి మర్రి ఆకుల్ని పోలి వుంటాయి. అడవులలో పెరిగే పెద్ద వృక్షం ఇది.

19. దేవదారు పత్రం: దేవతలకు అత్యంత ఇష్టమైన ఆకు దేవదారు. ఇది చాలా ఎత్తుగా పెరుగుతుంది. ఈ మానుతో చెక్కిన విగ్రహాలకు సహజత్వం ఉంటుంది.

20. గండలీ పత్రం: దీనినే లతాదూర్వా అనికూడా అంటారు. భూమిపైన తీగమాదిరి పాకి కణుపులలో గడ్డిమాదిరి పెరుగుతుంది.

21. అర్క పత్రం: జిల్లేడు ఆకులను అర్క పత్రమంటారు. తెల్లజిల్లేడు పేరుతో తయారుచేసిన వినాయకప్రతిమను పూజించడం వల్ల విశేష ఫలం వుంటుందంటారు. ఈ 21 పత్రాలతో వినాయక చవితి రోజున పూజించే వారికి సకల సంపదలు, అష్టైశ్వర్యాలు, కార్యసిద్ధి చేకూరుతుందని పండితులు అంటున్నారు.