ఆవకాయ ఉన్నంతవరకూ... తెలుగు భాషా దినోత్సవం స్పెషల్
తెలుగుభాష ప్రాచీనత గురించి కొత్తగా ఏం చెప్పగలం! క్రీస్తుపూర్వం 500
సంవత్సరానికి చెందిన ఐతరేయ బ్రాహ్మణంలోనే ఆంధ్రుల ప్రసక్తి ఉంది. ఇక
దేశంలోనే మూడో స్థానంలో ఉన్న తెలుగువారి ప్రాముఖ్యత గురించి మళ్లీ
గుర్తుంచుకోనవసరమూ లేదు. కానీ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఓసారి
అందులోని ప్రత్యేకతను తల్చుకుందాం.
ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ ఎందుకంటే: తెలుగు భాషకు ఉన్న `ఇటాలియన్ ఆఫ్ ద
ఈస్ట్` బిరుదు సరదాగా పుచ్చుకున్నది కాదు. మన భాష అజంతభాష, అంటే
ప్రతి పదమూ ఒక అచ్చు(అచ్+అంతము)తో ముగుస్తుంది. హిందీలో రా`మ్`గా ఉండే
పదం తెలుగులోకి వచ్చేసరికి రాము`డు`గా మారిపోతుంది! ప్రపంచంలో,
ముఖ్యంగా యూరోపియన్ భాషల్లో చాలావరకు హలంతంతో ముగుస్తాయి. ఇటాలియన్
వంటి కొద్ది భాషలు మాత్రమే అజంతంతో ముగుస్తాయి. దీన్ని గమనించే 15వ
శతాబ్దములో ప్రసిద్ధ ఇటాలియన్ యాత్రికుడు నికొలో డి కాంటి తెలుగుని
`ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్` అని ప్రస్తుతించాడు. తెలుగుభాష అజంతభాష
కాబట్టి పద్యాలను సైతం రాగయుక్తంగా పాడుకోగలగడం మనకే సాధ్యం!
భాషలో కలుపుగోలుతనం: తెలుగువారికి కలుపుగోలుతనం ఎక్కువంటారు.
పరిచయం కలిగిన కొద్ది నిమిషాలకే అత్తా, పిన్నీ అంటూ వరసలు
కలిపేయగల ఉదారత్వం మనది. మన భాష కూడా అంతే! అవడానికి ద్రావిడ భాషా
వర్గానికి చెందిన భాషే అయినా... సంస్కృతం, ఉర్దూ వంటి భాషలలోని
సౌందర్యాన్ని సైతం తనలో కలుపుకోగలిగింది. నిజానికి మనం రోజువారీ
పలికే పదాలలో ఏది నిఖార్సైన తెలుగు పదం, ఏది సంస్కృత పదం అని
విడదీయలేనంతగా ఈ కలివిడి ఉంది. ఇక ముస్లిం పాలకుల ఏలుబడిలో,
ఉర్దూతో కలిసిమెలిసి ఉంటూనే తన ఉనికిని నిలుపుకొంది తెలుగు. ఆఖరు,
గుమాస్తా వంటి ఎన్నో ఉర్దూ పదాలు తెలుగులో భాగంగా ఉండిపోయాయి.
ప్రపంచభాషలలో ఇలాంటి లక్షణం ఒక్క ఆంగ్లభాషకే ఉంది. అన్నరకాల
పదశబ్దాలనూ తనలో కలుపుకోవడం వల్ల తెలుగుభాషను
మాట్లాడగలిగేవారు, ఏ భాషనైనా త్వరగా నేర్చుకోవడమే కాదు... దాన్ని
స్పష్టంగా ఉచ్ఛరించగలరన్న భావన కూడా ఉంది.
జగదానంద తారక: దక్షిణాదిన ఉన్న సంప్రదాయ సంగీతమే కర్ణాటక సంగీతం.
కానీ ఇందులోని ముఖ్య కృతులన్నీ తెలుగులోనే కనిపిస్తాయి. తెలుగువారైన
త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రిలను కర్ణాటక
సంగీతానికి త్రిమూర్తులుగా భావిస్తారు. భాషాభిమానులైన తమిళురు సైతం
త్యాగయ్య రచించిన `ఘనరాగ పంచరత్నాల`ను శ్రద్ధగా ఆలపిస్తారు. ఇక
అన్నమాచార్య, రామదాసు వంటి భక్తాగ్రేసులు ఆలపించిన వేలాది
కీర్తనలల్లోని తెలుగుని వర్ణించాలంటే ప్రత్యేక నిఘంటువులు
అవసరపడతాయి. ఈ కీర్తనల్లో ఉట్టంకించి తెలుగు సోయగాన్ని
గుర్తించేందుకు `అన్నమయ్య పదకోశం` వంటి ఎన్నో గ్రంథాలు వచ్చాయి.
అవధానం: ప‌్రపంచ భాషల్లో ఒక్క తెలుగు, సంస్కృత భాషల్లో మాత్రమే అవధాన
ప్రక్రియ సాధ్యం. విస్తృతమైన పదసంపదతోపాటు, విలక్షణమైన శబ్దం
సౌందర్యం ఉండటం వల్లే ఇది సాధ్యమైంది. అవధానమంటే సామాన్యమా!
పురాణాలు మొదలుకొని ప్రబంధాల వరకూ పాండిత్యం ఉండాలి. సంధులు
మొదలుకొని సమస్యాపూరణాల వరకూ భాష మీద పట్టు ఉండాలి. ఇన్ని ఉన్నా
ఆశువుగా పద్యాలను ఆలపించగలగాలి. ధారణతో పృచ్ఛకులను
మెప్పించగలగాలి. ఫలానా అక్షరం ఫలానా స్థానంలో రావాలి అని
నిర్దేశించినా, ఫలానా అక్షరాన్ని అసలు వాడకూడదు అని నిర్భంధించినా...
నెగ్గగలగాలి. అప్రస్తుత ప్రసంగాన్ని అప్రమత్తతతో దాటగలగాలి.
సచిన్ తెందూల్కర్‌ను సైతం సత్యదేవునితో పోల్చగలగాలి. ఇన్ని సాధ్యం
కావాలంటే ఒక మనిషి మేథస్సు అత్యున్నత స్థితిలో ఉండాలి. అందుకనే
అవధానం చేయడమే కాదు, దాన్ని చూడటం సైతం ఒక గొప్ప సందర్భంగా
భావిస్తారు తెలుగువారు. క్రికెట్ మ్యాచ్‌లకు పోటీగా అవధాన ప్రక్రియను
లైవ్‌లో ప్రసారం చేసి ఆనందించగల భాగ్యం ఒక్క తెలుగువారికే సొంతం.
అంచేత ఈ ప్రపంచంలో ఆవకాయ, అవధానప్రక్రియ ఉన్నంతవరకూ తెలుగువారి
ప్రభకు ఢోకా లేదు!!!
-నిర్జర.
