" స్క్రిప్ట్ సిద్దంగా ఉంది సినిమా తీయండి"
పొత్తూరి విజయలక్ష్మి గారి రచనలు అంటేనే హాస్యానికి బ్రాండ్ నేమ్. ఇది వారి సాహిత్యం తో పరిచయమున్న మనందరికీ తెలిసిన విషయమే.
ఇది 1982 లో ఆంధ్ర భూమి లో ధరావాహికగా వచ్చింది. సందర్భానుసారంగా సత్యమూర్తి గారు వేసిన కార్టూన్ల తో, ఆ సీరియల్ బంపర్ హిట్. పాఠకులు ప్రశంసలతో ఉత్తరాల వర్షం కురిపించారు. ఆ కథనె పొత్తూరి విజయలక్ష్మి గారు ఇంకో నాలుగు హస్యకధలతో కలిపి తన తొమ్మిదో పుస్తకంగా శ్రీ రిషిక పబ్లికేషన్స్ లో ప్రచురించారు. 25-07-2015 నాడు త్యాగరాజ గాన సభ లో లేఖిని ఆధ్వర్యంలో జరిగిన రచయిత్రి తో ముఖాముఖి కార్యక్రమం లో ఆవిష్కరించారు.
కధ విషయానికి వస్తే ఎంత సీరియస్ గా ఉండే మనుషులైనా పగలబడి నవ్వాకుండా ఉండడం అసాధ్యం. 1952 నుండి 1982 వరకు వచ్చిన సూపర్ హిట్ సినిమాలన్నింటి కధల సారాంశాన్ని కలిపి స్క్రిప్ట్ తయారు చేశారు. ఇది 1982 లో రాశారు కదా, అప్పటినుండి ఇప్పటి వరకు వచ్చిన చాలా సినిమాలు రచయిత్రి కి చెప్పకుండా కాపీ కొట్టి సినిమాలు తీశారని నాకో అనుమానం. 1950 నుండి 2015 వరకు వచ్చిన అలాంటి చాలా సినిమాలు మనం చూసి తరించాం కదా.
"వోడఅంత ఇంపోర్టెడ్ కారులో హీరో రావడం తో కధ మొదలవుతుంది. టైటిల్స్ కారు అద్దాల పైన, బానెట్ పైన, కాసేపు డిక్కి పైన చివరికి హీరొ మొహం పైన డిరెక్టర్ పేరు పడడంతో టైటిల్స్ ముగుస్తాయి " అని స్క్రిప్ట్ మొదవుతుంది. రక్తి కట్టే లాగా కధ నడిపిస్తూ, అవసరమైన చోట దర్శకుడికి
" డ్యూఎట్లకు చరణానికీ ఒక డ్రెస్ తప్పనిసరిగా మార్చాలి. శక్తి ఉంటే పదానికి ఒక డ్రెస్ మార్చినా బాగానే ఉండ్‌థుంది"
" కావాలి అనుకుంటే హీరోయిన్ తండ్రిని రెక్కలు విరిచి కట్టి పెట్రోలు డ్రమ్ము మీద కూర్చోబెట్టవచ్చు. మరింత రోమాంచీతంగా ఉంటుంది."
లాంటి అమూల్యసలహా లిస్తారు(ద.ర.స.). అట్ల్లాగే నిర్మాతలకు కూడా
" కాస్త ఏడవగల హేరొయిన్ను పెట్టేస్తే నిక్షేపంలా తాను ఏడుస్తుంది. ప్రేక్షకులను ఏడిపిస్తుంది."
" ఏడుపు సీన్లు ఎక్కువగా ఉన్నాయి కనుక ఓ కిరసనాయిలు డబ్బాడూ గ్లీజరిన్ కొనెస్తే కలిసొస్తుంది",
" మనకు రక్తం సన్నివేశాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి గ్లీజరిన్ లాగానే పెద్ద డ్రమ్ము ఎర్ర రంగు కొనేసుకుంటే సరిపోతుంది."
లాంటి ఉపయోగకరమైన సలహాలు ఇచ్చారు.
శాంత, శృంగార, భీభత్స, రౌద్ర, భయానక, హాస్య రసాల్లాంటి నవరసాలూ దిట్టంగా దట్టించిన స్క్రిప్ట్. సెంటిమెంటు ఉంది డ్రామా ఉంది. ఫైటింగ్ ఉంది. టన్నుల కొద్ది డైలాగులు రాసే అవకాశం ఉంది. సందర్భోచితమైన " తెల్ల ఆవు వేసింది నల్ల పేడ, ఆ క్షణమే వచ్చాను నిన్ను చూడ" లాంటి పాటలు కూడా సూచించారు. ఇంతకంటే ఎంకావాలి సినిమా సూపర్ హిట్ కావడానికి?
నవ్వు ఒక యోగం, నవ్వక పోవడం ఒక రోగం. అన్న జంధ్యాల గారి మాటలు గుర్తోస్తాయి ఈ పుస్తకం చదివితే. నేనిలా ఎంతసేపు చెప్పినా తాలింపు ఘుమ ఘుమ లే తప్ప అసలు రుచి పుస్తకం చదివితేనే.
మిగిలిన నాలుగు కధలు కూడా నిండా హాస్యమున్న కధలే. ఆనందరావు ఆవూ కధలో పొద్దున తాగే గుక్కెడు కాఫీ లోకి కల్తీ లేని చిక్కటి పాలు కావాలని ఆనందరావు భార్య ఆవును కొని అతన్ని ఇబ్బందులు పెట్టడం, అందంగా ఉన్నా భయంకరంగా పాటలు పాడే బాసుగారి కూతురిని పెళ్లి చేసుకోవలసి వస్తే, ఉపాయంగా ఆమె పాటలు మాన్పించిన మాధవరావు( మధురిమ కధ), " 'అన్నపూర్ణ' బ్రాండ్ అంబాసిడర్" అనే కధా " ముకుందం " కధా అన్నిట్లో హాస్యం మనలను పుస్తకం వదిలిపెట్టనివ్వదు.
పాఠకులకు ముఖ్య గమనిక. వెంటనే పుస్తకం కొనండి. లేకపోతే దొరకక పోవచ్చు. పొత్తూరి విజయలక్ష్మి గారి పుస్తకాలు మార్కెట్ లో చాలా కొరత.
...........Jhansi Manthena
