Facebook Twitter
ఎర్రచీర

ఎర్రచీర

 

 

శ్రీరంగం రాజేశ్వరరావు పదహారేళ్లు వచ్చే సరికి సమాజాన్ని, మనుషుల భావనా ప్రపంచాన్ని అర్థం చేసుకోడానికి ప్రయత్నించాడు. పందొమ్మిదేళ్లు వచ్చేసరికల్లా తన ఆలోచనల ఆవేదనల్ని కథల రూపంలో తీసుకొచ్చాడు. 12 కథలు రాశాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎం.ఎ. చదవుతూ ఎవరికీ చెప్పకుండా అదృశ్యమైపోయాడు. ఇప్పటికీ ఆచూకీ తెలియదు. కానీ అతను రాసిన కథలు మాత్రం అదృశ్యం కాలేదు. మనలోని సున్నిత భావోద్వేగాల్ని అదృశ్యం కాకుండా చేస్తున్నాయి. ఆయన రాసిన 12 కథలు ఎర్రచీర పేరుతో పుస్తకంగా వచ్చాయి. ఎర్రచీర కథ ఓ యువతి ఆలోచనా తరంగాల సముద్రం.

కథలోకి ప్రవేశిస్తే- విశాలాక్షికి తన స్నేహితురాళ్లకు వచ్చే ప్రేమలేఖల్ని చూసినా, వారి ప్రేమల గురించి విన్నా దిగులు. ఎందుకంటే తనను ఎవరూ ప్రేమించడం లేదని, తనకు ఎవరూ ఒక్క ప్రేమలేఖ కూడా రాయలేదని మనసులో బాధ. తన అందం గురించి బెంగ. అలాగని విశాలాక్షి అందంగాలేని అనాకారి కాదు. కానీ అబ్బాయిల్ని పిచ్చెక్కించి ప్రేమలేఖ రాయడానికి పురికొల్పే శక్తి లేదు... అంతే.

విశాలాక్షి పట్నంలో హాస్టల్లో ఉంటూ బి ఎస్సీ చదువుకుంటుంది. ఆ రోజు క్లాసులో తలనొప్పిగా ఉందని మధ్యలోనే హాస్టలకు వచ్చేస్తుంటే ఓ పదేళ్ల అమ్మాయి వచ్చి ఓ లేఖ ఇచ్చి వెళ్తుంది. దాన్ని అలా ఉండలా మడిచి చేత్తో పట్టుకొని, పంజాబ్ మెయిల్ లా గుండెలు కొట్టుకుంటూ ఉంటే రూమ్ లోకి వస్తుంది. కాస్త భయంగా, బెరుగ్గా, గాబరాగా ఉత్తరాన్ని చదువుతుంది. మరో వైపు నాకు ఉత్తరం రాయడానికి ఎంతధైర్యం అని తిట్టుకుంటూంది. గులాబీ రంగు కాగితం మీద నల్లటి ఇంకుతో అందంగా ఉంటాయి అక్షరాలు. ఉత్తరంలో... చెయ్యకూడని పనులు చెయ్యడమంటే మనుషులకు ఇష్టం. నేను మీ హాస్టల్ కు ఎదురుగా ఉండే బిల్డింగ్ లో ఉంటాను. మిమ్మల్ని ఎర్రచీరలో చూశాను. నాకు ఎర్రచీరంటే చాలా ఇష్టం. ఆ రోజు ఆ చీరలో మీరు దానిమ్మగింజల మధ్య, మల్లెపువ్వులా ఉన్నారు. మిమ్మల్ని ప్రేమించానని పిచ్చిపిచ్చి రాతలు రాయడం నాకు ఇష్టం లేదు. నాకు మీ ముఖపరిచయం కూడా లేదు. ఎమ్మే సెకండ్ క్లాసులో పాసయ్యాను. రేపు ఆదివారం ఇంటర్ వ్యూకని బొంబాయి వెళ్తున్నాను. మిమ్మల్ని చూసిన వేళ ఊహాతీతమైన భావాలు నన్ను చుట్టుముట్టాయి. నాది ఒక్కకోరిక ఆఖరి సారిగా మిమ్మల్ని ఎర్రచీరలో చూడాలి అని. అందుకే ఆదివారం సాయంత్రం ఆరుగంటలకు ఎర్రచీరలో బీచ్ కు వస్తారు కదూ... నా పేరు చక్రవర్తి.

ఆ ప్రేమలేఖ చదివిన విశాలాక్షికి ఇంతకాలం మూలన పడేసిన వీణనెవరో మీటినట్లు, తంత్రులు సవరించినట్లు అనిపించింది. తనను ఒకరు ప్రేమిస్తున్నారు అన్న ఆలోచనతో అద్దం ముందుకు వెళ్లి మెరిసే చిరునవ్వును చూసుకొంది. ఉత్తరాన్ని మరోసారి చదువుకుంది. ఆకాశమంత సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయింది విశాలాక్షి. అసలు ఎర్రచీర విశాలాక్షిది కాదు. రూమ్మెట్ సరోజది. అప్పుడప్పుడు కట్టుకుంటుంది.  మరసటి రోజే ఆదివారం. ఎర్రచీరలో వెళ్లి అతనికి కనిపించాలని నిర్ణయించుకుంటుంది. అయితే తర్వాతి నిద్రలేచే సరికి విశాలాక్షి అన్నయ్య వస్తాడు. రూమ్మెట్ సరళ కూడా మార్నింగ్ షో సినిమాకు పిలుద్దామని వచ్చి వాళ్ల అన్నయ్య వచ్చాడని తెలిసి వెళ్లిపోతుంది. ఎర్రచీర అడుగుదామని అనుకొని కూడా... సాయంత్రం తీసుకుందామని ఆగిపోతుంది విశాలాక్షి. వాళ్ల అన్నయ్యతో ఇష్టం లేకపోయినా వాళ్ల అత్తగారింటికి వెళ్తుంది. అక్కడ భోజనం. కానీ మనసులో మాత్రం ఆరాటంగా ఉంటుంది. అక్కడ నుండి వచ్చి రూమ్ లో అలారం 5 గంటలకు పెట్టుకుని నిద్రపోతుంది.

తలలో ఎవరో సుత్తులతో నెమ్మదిగా కొడుతున్నట్లు అనిపించి లేచేసరికి, అలారం ఆగిపోయి ఉంటుంది. రిస్ట్ వాచి ఆరు, పదినిముషాలు చూయిస్తుంది. ఎర్రచీర కోసం సరళ పెట్టంతా వెతుకుతుంది. కనిపించదు. అర్థంలేని ఆతృత, గుండెదడ ఎక్కువ అవుతుంది. వొళ్లు స్వాధీనం తప్పుతుంది. చివరకు గులాబీరంగు చీర కట్టుకొని బీచ్ కు వెళ్తుంది. అక్కడ సరళ ఎర్రరంగు చీరలో కనిపిస్తుంది. మనసు స్వాధీనం తప్పుతుంది. పరధ్యానంగా ఉన్న విశాలాక్షికి సరళ చెప్తుంది. ఇందాక ఎవరో వచ్చి- ఎర్రచీరలో మీరు చాలా అందంగా ఉన్నారు. నా మాట కొట్టేయకుండా వచ్చినందుకు థాంక్స్ మీ, పేరు చెప్తారా అని అడిగాడు. నేను, మన ఫ్రెండ్స్ కలిసి వాడ్ని దుమ్ముదులిపాం అని చెప్తుంది. పైగా దూరంగా కనిపించే అతడ్ని చూపిస్తుంది. తెల్లటి ఫ్యాంటు, నల్లటి షర్టులో ఉన్న అతడు బస్ వైపు నడుస్తూ కనిపిస్తాడు విశాలాక్షికి. అతడిని బస్ ఎక్కకుండా ఆపాలని, చేతులు పట్టుకొని నేనే నీకు కనిపించింది అని చెప్పాలను కుంటుంది. అఛేతనంగా కళ్లనుండి నీళ్లు వచ్చేస్తాయి, ఆ కన్నీళ్లలో ఆమెలోని మధురమైన భావాలు కూడా కొట్టుకుపోతాయి. అప్పుడు సరళ కట్టుకున్న ఎర్రచీర ఆ కన్నీళ్లలోంచి రక్తపు ముద్దలా కనిపిస్తుంది.

ఈ కథను నడిపిన తీరు అత్యంత అద్భుతం. కథమొత్తంలో ఎక్కువగా యుక్త వయసులో ఉన్న అమ్మయి ఆలోచనల్ని రచయిత బాగా చెప్పాడు. తన తోటి వారందరికీ  ప్రేమికులు ఉండడంతో ఓ అమ్మాయి మానసిక స్థితి ఎలా ఉంటుందో తెలిపాడు. కథలోని ప్రేమలేఖను కూడా అత్యంత సహజంగా ఎలాంటి విపరీతమైన వర్ణనలు లేకుండా రాశాడు. అలానే ప్రేమకోసం తపించే అమ్మాయికి ఓ అబ్బాయి దొరినట్లే దొరికి వెెళ్లిపోవడాన్ని కథగా మార్చిన తీరు రచయిత ప్రతిభకు గొప్పనిదర్శనం. కథలో కనిపించే వర్ణనలు పాఠకులను ఊహాలోకాల్లోకి తీసుకెళ్తాయి. సాయంత్రాన్ని వర్ణిస్తూ- చీకటి వెలుగు ఒకే సరిహద్దుకు చేరుకుంటున్నాయి, ప్రేమలేఖ చదివిన విశాళాక్షిని వర్ణిస్తూ- చివరిగా ఆమె హృదయాన్ని గురించి చెప్తూ- ఆమెతోపాటు ఆమె మనసు కార్చిన కన్నీళ్లలో మధురమైన భావాలన్నీ తడిసి ఎటో కొట్టుకుపోయాయి. హృదయంలో లెఖ్ఖలేనన్ని డైనమైట్లు బద్దలవుతున్నాయి. అంతా పీడకలలులాగా... అందరూ శత్రువుల్లాగా సయనైడ్ లో ముంచిన కత్తుల్లాగా కనపడుతున్నారు.

అందుకే వర్ణన పరంగా, వస్తువు పరంగా, కథానిర్మాణం పరంగా, అన్ని విధాలా ఇది గొప్ప కథ అని చెప్పడం అతిశయోక్తికాదు.

- డా. ఎ.రవీంద్రబాబు