Facebook Twitter
నామకరణం


నామకరణం (కథ)

 

మునిమాణిక్యం పేరు వినగానే అందరికీ గుర్తు వచ్చేవి కాంతం కథలు. తెలుగువారికి కాంతాన్ని పరిచయం చేసిన మహానుభావుడు ఆయన. మధ్య తరగతి జీవితాల్లోని బంధాల్ని సున్నితమైన హాస్యంతో కథలుగా అందించారు. మునిమాణిక్యం భార్య ప్రేరణతోనే ఈ కథలు రాశారు. ఇందులో ప్రతి కథ ఓ మణిపూసలా, జీవితాల్లోని అనేక మధురమైన అనుభూతుల్ని పంచుతుంది. అసలు కాంతం ప్రస్తావన మునిమాణిక్యం నరసింహరావు రాసిన టీ కప్పులో తుఫాను నవలలోనే కనిపిస్తుంది. తర్వాతే తన కథల ద్వారా తెలుగువారికి కాంతాన్ని పరిచయం చేశారు నరసింహారావు. వాటిలోని ఓ కథే నామకరణం. ఈ కథలో పాపకు పేరు పెట్టడంలో భార్యా, భర్తల మధ్య జరిగే చర్చను చమత్కారంగా చెప్పారు.
       కథలోకి వెళ్తే- పండంటి పాపతో కాంతం పురిటిమంచం మీద  పడుకుని ఉంటుంది. ఆ గదికి పక్కగదిలో రచయిత మరో మంచం మీద పడుకుని ఉంటాడు. కొంత దూరంగా బావమరిది కూడా పడుకొని ఉంటాడు. కాంతం భర్తను ఉద్దేశించి- 'ఈ చిట్టి తల్లికి ఏ పేరు పెడదాం. రేపే కదా బారసాల. మీకిష్టమైన పేరు పెట్టండి' అని అడుగుతుంది. 'ఒకప్పుడు మీ తాతల పేర్లు, నాయనమ్మల  పేర్లు లేదా మా తండ్రుల పేర్లు, తల్లుల పేర్లు పెట్టేవాళ్లం. ఇప్పుడు అలా కాదుగా...' అని చివరకు 'జానకి పేరు పెడదాం' అంటాడు. దానికి భార్య కాంతం 'జానకి వద్దండి. జానకి అంటే సీత. సీత పడిన కష్టాలన్నీ గుర్తొస్తాయి' అంటుంది. తర్వాత రచయిత 'సుగుణ పేరు పెడదాం' అంటాడు. దానికి భార్య 'సుగుణ, వివేకం లాంటివి కిరస్తాని పేర్లు అలాంటివి వద్దు' అంటుంది. దానికి భర్త 'అంటే నీకులాగా పెంకితనం, మెగుడ్ని లెక్కచేయని తనం వంటివి అలవడితే ఆ పేరు వ్యర్థమై పోతుంది. మా నాన్నకు శేషగిరి అనే పేరు చాలా ఇష్టం, ఆ పేరు పెడదాం' అంటారు. అందుకు కాంతం 'శేషాచలం, వింధ్యాచలం, కృష్ణ, గోదావరి ఇలాంటి పేర్లు మా మేస్టారు పెట్టేవాడు. అయినా అలాంటి పేర్లు వద్దు' అంటుంది.
            చివరికి రచయిత 'మనకు ఇక పిల్లలు వద్దు అనుకుంటున్నాం కాబట్టి సంపూర్ణం అనే పేరు పెడదాం' అంటాడు. అందుకు బావమరిది 'మీరు వద్దునుకుంటే సరిపోతుందా... మరో పిల్ల పుడితే ఏం పేరు పెడతారు' అని చమత్కారంగా అడుగుతాడు. రచయిత కోపంతో 'మంగళహారతి అని పెడతాను' అంటాడు. కాంతం విసుక్కొంటుంది. రచయిత 'ఊర్వశి' అనే పేరు చెప్తే... 'రంభ, ఊర్వశి, తిలోత్తమ లాంటి భోగంముండల  పేర్లు మన కూతురుకు వద్దు' అంటుంది. మళ్లీ 'నీ ఇష్టం వచ్చిన పేరు పెట్టు' అని భర్తను అడుగుతుంది. కానీ చివరకు కాంతమే 'శుక్రవారం పుట్టింది కాబట్టి లక్ష్మి అని పేరు పడెదాం' అంటుంది. భావమరిది మాత్రం 'హిందూస్థానంలో వాళ్లు కమలాబాయి, నెహ్రూ , కుసమ కోమలి లాంటి పేర్లు పెడతారు, అవి బాగుంటాయి' అని చెప్పినా చివరకు లక్ష్మి పేరును ఖరారు చేస్తారు.
             బారసాల రోజు పళ్లెంలో సన్నబియ్యం పోసి ఉంగరంతో  'ఏం పేరు రాయమంటావు' అని భార్యను అడుగుతాడు రచయిత. అప్పుడు కాంతం 'సుబ్బలక్ష్మి' అని రాయమంటుంది. పైగా 'మా నాయనమ్మ వచ్చి తన పేరు కలపమంది' అని చెప్తుంది. అంతలో రచయిత వాళ్ల నాన్న వచ్చి 'మన ఇలవేల్పు వెంకటేశ్వర్లు కాబట్టి వెంకటసుబ్బలక్ష్మి' అని రాయమంటాడు. అలా చివరకు రచయిత వెంకటసుబ్బలక్ష్మి అని కూతురుకు నామకరణం చేస్తాడు.
            ఎనిమిది నెలల తర్వాత బావమరిది పాపకు బంగారు వత్తులు తీసుకొని చూడడానికి వచ్చి 'సుబ్బలక్ష్మి ఎలా ఉంది' అని అడుగుతాడు. కాంతం 'సుబ్బలక్ష్మి ఎవరు' అని అడుగుతుంది. 'పాప పేరు పద్మావతి' అని చెప్తుంది. తను అలానే పిలుచుకుంటున్నాను అని అంటుంది. రచయిత దగ్గరకెళ్తే 'పద్మావతి కాదు సరోజిని' అని చెప్తాడు. దాంతో బావమరిదికి తిక్కలేస్తుంది. 'ఇక నుంచి తను కూడా సరోజిని అని పిలుస్తాన'ని రచయితకు మాట ఇస్తాడు. కానీ కాంతం దగ్గరకు వెళ్లగానే పద్మావతి అని పిలుస్తాడు. బంగారు వత్తులతో మిసమిస లాడుతున్న పాపను చూసి అందరూ సంతోషిస్తారు.
             ఇలా కథంతా హాస్యంతో, భార్యాభర్తల మధ్య జరిగే చమత్కారమైన సంభాషణలతో సాగుతుంది. కథ చదువుతుంటే- పేరు పెట్టటం భర్త ఇష్టమని చెప్పిన భార్య, భర్త సూచించిన ప్రతి పేరును కాదంటూ, కారణాలు చెప్తుంటే... ఆయనలో వచ్చే కోపాన్ని, చివరకు కాంతమే లక్ష్మి అని పేరు పెట్టడాన్ని కథలో చాలా ఆసక్తిగా చెప్పాడు రచయిత. పేరు పెట్టడంలో భార్యల మనస్తత్వాన్ని సూచించాడు. ఇలాంటివి ప్రతి ఇంటిలో జరిగే సన్నివేశాలే, కానీ మునిమాణిక్యం మాత్రం చిక్కటి హాస్యంతో రాశారు. చివరకు పాపను 'వెంకట సుబ్బలక్ష్మి' అని కాకుండా భార్య 'పద్మావతి', భర్త 'సరోజిని' అని పిలవడం మంచి ట్విస్టు. కథ ఎక్కువభాగం సంభాషణాత్మకంగా సాగుతుంది. భాష విషయానికి వస్తే-  మధ్యతరగతి బ్రహ్మణ ఇళ్లల్లోని సహజమైన మాటలు కనిపిస్తాయి.
            అందుకే మునిమాణిక్యం రాసిన కాంతం కథలు  ఇప్పుడు చదివినా మనసకు ప్రశాంతతని, గిలిగింతల్ని కలిగిస్తాయి.

- డా. ఎ.రవీంద్రబాబు