TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
చిన్నారిలా ఓ కవిత
విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ జపాన్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మిత్రుడి ఇంట ఆయన కవితా గానానికి ఏర్పాట్లు చేసారు. టాగోర్ తన ధోరణిలో కవితలు చదవడం మొదలుపెట్టారు. ఆయన గానం ఓ జలపాతంలా ఉంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ తమను మైమరచిపోయి ఆ కవితాఝరిలో స్నానం చేస్తున్నారు. ఇంతలో అక్కడ ఓ చిన్నారి అటూ ఇటూ పరుగులు తీస్తూ ఆడుకుంటోంది. టాగోర్ దృష్టి ఆ చిన్నారి మీద మళ్ళింది. ఆయన తన కవిత చదవడం ఆపి ఆ చిన్నారినే చూస్తున్నారు. అయితే కవితను వింటున్న ప్రేక్షకులు తమ ఆనందానికి అడ్డుగా వచ్చిన చిన్నారిపై రుసరుసలాడారు. మండిపడ్డారు. కొందరైతే ఆ చిన్నారిని అక్కడినుంచి బయటకు పంపే ప్రయత్నం చేసారు. అందుకు టాగోర్ అడ్డుపడ్డారు. పాపను ఆడుకోనివ్వమని మృదువైన ధోరణిలో చెప్పారు. ఆయన మాటతో ఆ చిన్నారిని ఏమీ చెయ్యలేకపోయారు. టాగోర్ అప్పటికప్పుడు చిన్నారిని దృష్టిలో ఉంచుకుని ఈ కింది కవిత చదవడం ప్రారంభించారు....
ఓహో
ఆ చిన్నారిలాంటి అందమైన
ప్రకృతిసిద్ధమైన
ఒక కవితను
నేను రాయగల వాడినైతే.......
అని చదువుకుపోతున్నారు.
అంటే ఓ చిన్నారిలాంటి అందమైన సహజసిద్ధమైన ఒక కవితను రాయాలన్నది ఆయన కోరిక. ఆశ. నిజమైన సృష్టి కర్తలో ఉండవలసిన నిజమైన తపనే ఇది. చాలామందిలో ఆ తపన అలాగే ఉండిపోతోంది. ఎందుకంటే అటువంటి కవిత రాయడం అంత సులువైన పని కాదు. చిన్నారి అని అనగానే దానికో అందం ఉంటుంది. ఆ అందం ఎలా వస్తోంది? ఈ అందానికి మొదటి కారణం నవ్యత. ఒక్కో చిన్నారి ఓ నవ్యతను మిళితం చేసుకునే ఈ భూమ్మీదకు వస్తుంది. అందుకే అందం చిన్నారి సొంతం. ఆ తర్వాత చెప్పుకోవలసింది ఆ చిన్నారి చిన్న రూపం. భారీగా ఉండటం కన్నా చిన్నగా ఉండడంలోనే ఓ అందం ఉంటుంది. పెద్దదాన్ని చిన్నది చేసి ఊహించండి. అందం దానంతట అది వచ్చేస్తుంది. చిన్నారి కూడా "ఓ పెద్ద" దాని తొలి రూపం. అందుకే అది అందంగా ఉంది. చిన్నారి ప్రతి కదలిక అందంగా అనిపిస్తుంది. కారణం అది సహజసిద్ధంగా చేస్తుంది దేనినైనా. అందులో కల్మషం ఉండదు. కపటం ఉండదు. నటన ఉండదు. అన్నీనూ తనకు తోచినట్టు చేసేస్తుంటుంది. చిన్నారి తనకేది కావాలనుకుంటుందో దానికేసి చెయ్యి చాస్తుంది. కానీ పెద్దలం అలా చెయ్యలేం. కొన్ని కట్టుబాట్లు ఉంటాయి సామాజికంగా. చిన్నారి ఏడుపు వస్తే ఏడ్చేస్తుంది. నవ్వొస్తే నవ్వేస్తుంది. కానీ పెద్దవాళ్ళం చెప్పుకోవడానికి పెద్దోళ్ళమే... మనసారా ఏడవలేం... నవ్వలేం. సమయ సందర్భాలు చూసుకుంటాం. అప్పుడే ఏడవగలం. నవ్వగలం.మరొకటి గమనించవచ్చు. పెద్దలు ఏడుస్తున్నప్పుడు చిన్నారి నవ్వొచ్చు.పెద్దలం కొన్నిసార్లు అబద్దంగా ఏడవ వచ్చు. అలాగే అబద్దపు నవ్వూ నవ్వొచ్చు. కానీ చిన్నారికి అలాంటివి తెలియదు. అయినా వీటన్నింటికన్నా మరొక గొప్ప విషయం వారికుంది.
పెద్దవాళ్ళమయ్యే కొద్దీ మనలో చేరుకుంటూ పోయే మురికి, అసూయ వంటికి చిన్నారిలో ఉండవు. చిన్నారి పువ్వంత స్వచ్చంగా ఉంటుంది. ముత్యమంత స్వచ్చంగా ఉంటుంది. అందుకే దానికున్న అందం చూసేవారికీ హాయిగా ఉంటుంది. ఆ అందాన్నీ టాగోర్ చూసి పరవశించిపోయారు. చిన్నారి వైపే చూస్తూ చదవడం ఆపేశారు. చిన్నారి సహజసిద్ధంగా ప్రకృతిలా ఉంటుంది. పెద్దలలో కృత్రిమపాలు ఎక్కువ. చిన్నారి తనకు తోచినట్టు ప్రవర్తిస్తుంది. స్వతంత్రంగా తాను చెయ్యవలసిన పని చేసుకుపోతుంది. స్వతంత్రతే అందం. స్వతంత్రతే ప్రకృతి. అంతేకాదు. అంతకన్నా మరో మెట్టు పైనే ఉంది చిన్నారి లోకం. చిన్నారి నిష్కపట నవ్వు...అర్ధముందనుకున్న పెద్దల భాషకన్నా ఎంతో గొప్పది. అందమైనది. అందమైన ఆ చిన్నారి భాషను పూర్తిగా అర్ధం చేసుకోలేకపోతున్నాం. అక్కడే మన లోపం ఉంది. ఆ అందంలో దాగిన రహస్యాలే మనల్ని ఆకట్టుకుంటాయి. కానీ మనం పైపైనే ఆ అందాన్ని ఆస్వాదిస్తున్నాం. పూర్తిగా చూస్తున్నాం అనుకుంటున్నాం గానీ చూడటం లేదు. ఇప్పుడు చెప్పండి. ఒక చిన్నారిలాంటి అందమైన కవితను సృష్టించడం సులభమేనా...కనుక టాగోర్ పెను నిట్టూర్పులో అర్ధముంది. ఓ చిన్నారిలాంటి ఒక కవితను రాయడం ఓ అపూర్వమైన సంఘటన. ఓ చిన్నారిలాంటి అందమైన కవిత పుట్టించాలంటే కవి ఏం చెయ్యాలి. అతను ఆమెగా మారాలి. అందుకు చదవాలి. చదువుతోపాటు ఆ రచనకు ఒక ప్రేమికుడు కావాలి. "ఆమె" అనే కవికి అనుభవమేగా చదువు చెప్పే ప్రేమికుడు. ఆ అనుభవమే కవిత పుట్టిస్తుంది. ఒక స్త్రీ పడే ప్రసవ వేదనలాంటి వేదన కవిత పుట్టుక సమయంలోనూ కవికి ఉండాలి. అప్పుడే కవి మనసు నుంచి పుట్టుకొచ్చే కవితలోని అందం ఇతరులకీ అందమైన అనుభవాన్ని కలిగిస్తుంది. హాయినిస్తుంది.
- యామిజాల జగదీశ్