Facebook Twitter
మాక్లీదుర్గంలో కుక్క

మాక్లీదుర్గంలో కుక్క (కథ)       

 

         

                                               
- విశ్వనాథ సత్యనారాయణ
 
 
 
       విశ్వనాథ సత్యనారాయణ కవిసామ్రాట్ బిరుదాంకితుడు. ప్రాచీన సాహిత్యానికి పెట్టని కోట. సంప్రదాయవాదిగా అతనిని అందరూ గుర్తించారు. రచనల్లో ప్రాచీన ఆచారాలకు ప్రత్యేక స్థానం ఇచ్చాడు. అసలు విశ్వనాథ రచనలే అందుకు చేశాడు. తెలుగు, సంస్కృతం, ఆంగ్ల భాషల్లో అపార పాండిత్యం కలవాడు. తెలుగులో తొలిసారిగా వీరి రచన శ్రీమద్రామాయణ కల్పవృక్షానికి జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది. వీరు తెలుగు సాహిత్యంలోని కథ, నవల, ఆధునిక కవిత్వం, ప్రాచీన పద్య కవిత్వం, విమర్శ... ఇలా ప్రతి ప్రక్రియను చేపట్టారు. వీరి  అన్ని రచనల్లాగే కథలు కూడా సంప్రదాయ భావాలకు, సనాతన ధర్మానికి కట్టుబడే ఉంటాయి. వీటిలో అందరికీ తెలిసిన కథ మాక్లీదుర్గంలో కుక్క.
     మాక్లీదుర్గం గుంతకల్లు నుంచి బెంగళూరు పోయే మధ్యలో ఉన్న ఒక రైల్వేస్టేషను. చిన్న స్టేషను. అక్కడ ఓ కుక్క ఉంటుంది. స్టేషను పక్కనే ఉన్న లోయలో ఉన్న వాగుల్లో నీళ్లు తాగటం, స్టేషనులో ఉన్న ఒకే ఒక్క దుకాణం వాడు మిఠాయి పెడతాడని ఎదురు చూడడం దానికి అలవాటు. ఒకరోజు స్టేషనుకు ఓ పెద్దమనిషి సీమ ఆడకుక్కను తీసుకొని వస్తాడు. ఆ సీమకుక్కకు వయసు రావడంతో దానిని బెంగళూరులో ఉన్న అదే జాతి కుక్కల దగ్గరకు తీసుకెళ్తూ మాక్లీదుర్గం స్టేషనులో దిగుతాడు అతను. అనుకోకుండా స్టేషను మాస్టారుతో పరిచయం ఏర్పడుతుంది. స్టేషను మాస్టారు వర్ణవ్యవస్థ ఉండాలి. సనాతన ధర్మాలు ఇప్పటికీ పాటించాల్సిన అవసరం ఉంది. వర్ణాంతర వివాహాలు పనికిరావు అని వాదిస్తే, అతను మాత్రం అవన్నీ ఇప్పుడు పనికిరావు. వాదనకు నిలబడవు అని చెప్తాడు. అంతలో అతని సీమకుక్క అక్కడున్న స్టేషను కుక్కతో కలుస్తుంది. అది గమనించిన ఆయన ఆ కుక్కను దెబ్బతగిలేటట్టు కొట్టి తన కుక్కకు స్నానం చేయించి, శుభ్రపరిచి తీసుకెళ్తాడు.
          కుక్క అడవిలోంచి వచ్చిన వేగోలాన్ని పసిగట్టి పోరాడి చంపేస్తుంది. అది గమనించిన స్టేషను మాస్టారు, దుకాణం అతను ఆరోజు నుంచి కుక్క పౌరుషాన్ని పొగడడం మొదలు పెడతారు. అన్నం వేస్తారు. ఒకరోజు దుకాణం అతను ఎవరూ కొనని మిఠాయిని కుక్కకు పెట్టాడు. కుక్క తిన్నది. ఆ రోజు నుంచి కుక్క ఆరోగ్యం పాడైంది. క్రమంగా బాగా చిక్కి, చర్మానికి కూడా రోగం వచ్చి నడవలేక పోతుంది.  అంతకు ముందు పరిచయం అయిన జాతికుక్కను పెంచుకునే అతను వస్తాడు. ఆ కుక్క నాలుగు పిల్లలను కనిందని అవి  జాతి కుక్కల్లా కాకుండా, ఈ కుక్కలానే ఉన్నాయని చెప్తాడు. చివరకు స్టేషనులోని కుక్క రైలుకిందపడి మూలిగిమూలిగి చనిపోతుంది.
        స్టేషను మాస్టారు కోరిక ప్రకారం ఓ కుక్క పిల్లను తెచ్చి ఇస్తాడు సీమకుక్కను పెంచుకునే అతను. అది పెరిగి పెద్దదై మొదటి కుక్కలా పెరుగుతుంది. కానీ మనుషులంటే దానికి గిట్టదు. దుకాణం దారుడు పెట్టే తిండి తినదు. పౌరుషంతో అడవిలోని జంతువులను వేటాడుతుంది. తల్లిపోలికతో తోక కూడా బలుస్తుంది. మనుష్యగాలి తగిలితే కోరలు చాస్తుంది.
           క్లుప్తంగా ఇదీ కథ. కానీ కథలో అంతర్గతంగా సంప్రదాయ భావాలను, వర్ణవ్యవస్థను పునరుద్ధరించాలనే తత్వం కనిపిస్తుంది. దీనికి కుక్కను ప్రతీకగా చేసుకుని చెప్పాడు విశ్వనాథ. సంప్రదాయభావాలను చీదరించుకొనే వ్యక్తి తన సీమకుక్క వీధి కుక్కతో కలవడాన్ని ఒప్పుకోడు. అలానే వీటి కలయిక వల్ల పుట్టిన కుక్క చివరకు మళ్లీ స్టేషనుకే పరిమితమైంది. అంటే వర్ణసంకరం వల్ల జరిగే అనర్థాలను అన్యార్థబోధకంగా చెప్పాడు ఈ కథలో విశ్వనాథ సత్యనారాయణ. అలానే ఇద్దరు విద్యార్థుల మధ్య సంభాషణలో కూడా కుక్కకు వేసినట్లైనా పేదవాళ్లకు అంత తిండి వేయరు అన్న విద్యార్థి, తన దగ్గరకు వచ్చేసరికి కుక్కను కాలితో తంతాడు. ప్రతి మనిషి సనాతాన భావాలను వ్యతిరేకించేవాడే, కానీ ఆచరణలో మాత్రం వాటినే పాటిస్తాడు అని రుజువు చేసాడు కథలో రచయిత.
    విశ్వనాథవారి సరళ గ్రాంథిక భాష కథకు ప్రత్యేక అలంకారం. అలానే కథ, శిల్పం దృష్ట్యాం చూస్తే... శీర్షిక మాక్లీదుర్గంలో కుక్క అన్నట్లే... రైల్వే స్టేషను వర్ణన, కుక్క స్థితిగతులను అద్భుతంగా చెప్పారు విస్వనాథ. చెప్పాలనుకున్న భావాలను పాత్రల సంభాషణల రూపంలో చెప్పడం విశ్వనాథ ప్రత్యేకత.
  స్టే.మా.- అయితే మీరు వర్ణవ్యవస్థను తీసిపారేయాలి అంటారా...
  పె.మ.- తీసివెయ్యాలంటాను. ఈ వ్యవస్థమూలంగా అనేక భేదాలేర్పడతున్నవి. కొందరు అనవసరంగా తాము గొప్పవాళ్లమనుకుంటున్నారు. తక్కువ కులాల మీద అధికారం చెలాయిస్తున్నారు... ....
     ఇలా విశ్వనాథ సత్యనారాయణ తన ఆలోచనలను అద్భుతంగా కథలో అంతర్ముకంగా చెప్పాడు. అతని శైలి కథకు మరో ప్రధాన ఆకర్షణ.    
 
 
విశ్వనాథ సత్యనారాయణ గారి జయంతి సందర్భంగా......

         

- డా. ఎ.రవీంద్రబాబు