Facebook Twitter
బహుముఖ ప్రజ్ఞాశాలి... భానుమతీ రామకృష్ణ

  బహుముఖ ప్రజ్ఞాశాలి... భానుమతీ రామకృష్ణ

 

 

- డా. ఎ.రవీంద్రబాబు


         
భానుమతి ముందుతరం తెలుగు పాఠకులకు, సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కరలేని పేరు. సినీరంగంలోని అన్ని రంగాలలో తన ప్రతిభను నిరూపించుకున్న మణిరత్నం. సంగీతం, దర్శకత్వం, నటన, నిర్మాత, గాయని, ... ఒకటేంటి అన్నిటిలోను ఆమెకు ప్రవేశం ఉంది. తెలుగు సాహితీ రంగంలో ఆమె సృష్టించిన అత్తగారి పాత్ర ఎప్పటికీ చిరస్మరణీయమే.

        భానుమతి ప్రకాశం జిల్లా దగ్గరున్నదొడ్డవరం గ్రామంలో 1939, సెప్టెంబరు 9న జన్మించారు. తండ్రి బొమ్మరాజు వెంకట సుబ్బయ్య. తల్లి సరస్వతమ్మ. వీరికి సంగీతంలో తొలి గురువు తండ్రిగారే. సంప్రదాయమైన కుటుంబం కావడం వల్ల భానుమతి పూర్తిగా కట్టుబాట్లతో పెరిగారు. అయినా 13 సంవత్సరాల వయసులోనే తండ్రిగారిని ఒప్పించి 1939లో వరవిక్రయం సినిమాలో నటించారు. ఈమె తొలిసినిమాకు తీసుకున్న పారితోషకం 350 రూపాయలు. ఆ రోజుల్లో పూర్తిగా మగవాళ్లే రాజ్యమేలుతూ, స్త్రీ పాత్రలు కూడా పురుషులే పోషిస్తున్న కాలంలో భానుమతి సినీరంగంలోకి అడుగుపెట్టారు. తనదైన సొంత ముద్రతో ఎదిగారు. భానుమతి గారిది బహుముఖీనమైన ప్రజ్ఞ. నటనపరంగా నభూతో నభవిష్యతి. చారిత్రక, పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో విభిన్నమైన, వైవిధ్యమైన పాత్రలు పోషించారు. ఎక్కడా ఆమె తలవొంచుకుని ప్రవర్తించేది కాదు. తన మాట చెల్లాలనే మనస్తత్వం. చాలా మంది ఈమె ఆత్మాభిమానాన్ని చూసి పొగరు అనుకునేవారు. కానీ భానుమతి మాత్రం మొక్కవొని ధైర్యంతో తన అపారమైన ప్రజ్ఞతో అనేక విజయాలను సాధించారు. 1943 ఆగస్టు 8న నిర్మాత, దర్శకుడైన పి.యస్. రామకృష్ణను ప్రేమించి, అనేక అవరోధాలను తట్టుకొని వివాహం చేసుకున్నది. వీరి సంతానం భరణి. ఆ పేరుమీదే స్టూడియోను నిర్మించి ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు భానుమతి.
         1939లో వరవిక్రయం ద్వారా ప్రారంభమైన భానుమతి సినీ ప్రస్థానం 1998 పెళ్లికానుకతో ఆగింది. సుమారు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషలలో వందకు పైగా చిత్రాలలో నటించారు. దర్శకురాలుగా- అసాధ్యురాలు, రచయిత్రి, చండీరాణి, భక్తధృవ మార్కండేయ (1, 2) వంటి పలు చిత్రాలకు పనిచేశారు. ఇక నిర్మాతగా మారి బాటసారి, విప్రనారాయణ, చింతామణి, ప్రేమ, లైలామజ్ఞు వంటి చిత్రాను నిర్మించారు. సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలైతే చింతామణి, చక్రపాణి, ప్రేమ లాంటివి ఎన్నో ప్రేక్షకుల మన్ననలు పొందాయి. అంతేకాదు ప్రేమ చిత్రానికి కథను కూడా అందించారు. ఇలా అర్థశతాబ్దం పాటు సినీరంగంలో తిరుగులేని పాత్ర పోషించారు. ఇలా అన్ని విభాగాలలోను పనిచేసిన మహిళ భారతదేశంలో ఈమె ఒక్కరే. వీరి నటనాపరంగా డా. సర్వేపల్లి రామకృష్ణ, బెజవాడ గోపాలరెడ్డి, పి.వి. రాజమన్నారు, కొడవటిగంటి కుటుంబరావు, చక్రాపాణీలు వీరిని ఎక్కువ అభిమానించే వారు. 
        భానుమతి ఒక్క సినీరంగానికి సంబంధించిన వారే కాదు భిన్నమైన రంగాలలో కూడా ప్రతిభను కనపరిచారు. ఈమె చిత్రకారిణి, జ్యోతిష్యురాలు.  తాత్వికమైన అంశాలలో మంచి ప్రవేశం ఉంది. నాలో నేను పేరిట ఆత్మకథను రాసుకున్నారు. ఇది టెలీ సీరియల్ గా కూడా వచ్చింది. వంటలు చేయడంలో అందివేసిన చెయ్యి. చెన్నై నగరంలో డా. భానుమతి రామకృష్ణ మెట్రిక్యులేషన్ స్కూలు స్థాపించి ఉచిత విద్యను అందించారు. తమిళనాడు ప్రభుత్వ సంగీత కళాశాలకు ప్రిన్సిపాల్ గా కూడా పనిచేశారు. తిరుపతి తిరుమల దేవస్థానం బోర్డు మెంబరుగా కూడా కొంతకాలం ఉన్నారు.
         అన్నిటిని మించి భానుమతి మంచి రచయిత్రి. తెలుగువారు గర్వించదగ్గ అత్తగారి కథలు రచించారు. వీరు రచించిన కథలు- 1967లో అత్తగారి కథలు(7), 1971లో అత్తగారూ - నక్సలైట్లూ (9), 1985లో అత్తగారి కథలు (8), 1991లో భానుమతి కథలు (20) పేరిట ముద్రితమై అందుబాటులోకి వచ్చాయి. వీరి కథల్లోని అత్తగారు హాస్యాన్ని పండిస్తూనే తన పెద్దరికాన్ని నిలబెట్టు కుంటుంది. మానత్వాన్ని ప్రదర్శిస్తుంది. అత్తగారి ప్రవర్తన, మాటలు, చేతలు హాస్యాన్ని పుట్టిస్తూ ఆసక్తిగా సాగుతాయి. ఈ కథల్లోని అత్తగారు మద్రాసులో ఉంటారు. ఇంట్లో, చుట్టుపక్కల ఇళ్లల్లో ఈమె మాటకు తిరుగు ఉండదు. అందరూ ప్రేమను అభిమానాన్ని ఈమె పై కురిపిస్తారు. ఆవకాయ పెట్టడం నుంచి అరటి కూర చేయడం వరకు అందివేసిన చెయ్యి. పాతకాలపు పెద్దమనిషి. తెలుగు సాహిత్యంలో గిరీశం, ఎంకి, బుడుగు పాత్రలు ఎలా నిలిచిపోయాయో భానుమతి అత్తగారి పాత్రకూడా అలానే నిలిచిపోయింది. ఇవి ఆంగ్లంలోకి కూడా అనువాదమయ్యాయి.                 

        భానుమతి కృషికి ఎన్నో అవార్డులు, పురస్కారాలు వచ్చాయి. 1956లోనే రాష్ట్ర గౌరవ పురస్కారం వచ్చింది. 3 సార్లు జాతీయ పురస్కారాలు పొందారు. తమిళులు ఈమెను తమ రాష్ట్ర అష్టవధానిగా కీర్తిస్తారు. కేంద్రప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ఇచ్చింది. 1975లో ఆంధ్రవిశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదును ప్రధానం చేసింది. 1984లో మద్రాసు ప్రభుత్వం కలైమణి బిరుదు ఇచ్చింది. 1986లో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు ప్రధానం చేసింది. 1986లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ దర్శకురాలిగా గుర్తించింది. అత్తగారి కథలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారి సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది.

         ఇలా బహుముఖీన ప్రతిభతో వివిధ రంగాలలో కృషి చేసిన భానుమతి 2005, డిసెంబర్ 24 న మరణించారు. ఆమె నేటి తరానికి ఆదర్శం. ఆమె పట్టుదల ఓ పాఠం. ఎందరో మహిళలకు ఆమె ఒక లెజెండ్.