Facebook Twitter
అర్థంలేని టెలిగ్రామ్ లు

  అర్థంలేని టెలిగ్రామ్ లు

 


                              
                        - ఆరుద్ర


        
ఆరుద్ర కవిగా, పరిశోధకునిగా, విమర్శకునిగా, పాటల రచయితగా అందరికీ సుపరిచితమే. కానీ ఆరుద్ర కథలు కూడా రాశాడు. వీరి కథలు ఊరు ఊరుకుంది, నే చెప్పానుగా పేరిట సంపుటాలుగా వచ్చాయి. ఆరుద్రకు కథలు రాయడమంటే సరదా... అలవోకగా కథలు అల్లేవారు. ఎప్పుడు సాహిత్య వాతావరణంలో ఉండే ఆరుద్రకు డిటెక్టివ్ కథలు రాసే టెంపోరావు, వైవీ రావు, కొమ్మూరి సాంబశివరావు మంచి మిత్రులు. అప్పుడప్పుడు అలా డిటెక్టివ్ కథలు రాశారు. అయితే ఇవి పూర్తిగా కథా నిర్మాణాన్ని కలిగి, ఆద్యంతం ఆసక్తిగా సాగుతాయి. పాఠకుడిని ఉత్సాహంగా చదివిస్తాయి. అలాంటి కథే అర్థంలేని టెలిగ్రామ్ లు.


         అర్థంలేని టెలిగ్రామ్ లు కథ పూర్తిగా సస్పెన్స్, మర్డర్ మిస్టరి, హత్య ఎవరు చేశారు. ఎందుకు చేశారు. చేయాల్సిన అవసరం ఏమిటి... అనే విషయాలు చివరి వరకు తెలియవు. కథలోకి వెళ్తే... టెలిగ్రాఫ్ బంట్రోతు రామయ్య గంగిగోవు లాంటి వాడు. శత్రువులు ఉండరు. ఒకరోజు పదిగంటలకు టెలిగ్రామ్ లు ఇవ్వడానికి ఊళ్లోకి వెళ్తాడు. మొత్తం ఇవ్వాల్సినవి ఆరు. మొదటిది సుందరం అండే సన్స్ వారి షాపులో ఇచ్చి వస్తుంటే దారిలో నులకవీధి కేశవరావుకు ఏమైనా టెలిగ్రామ్ లు ఉన్నాయా అని అడుగుతారు. రామయ్య మామూలుగానే ఉంది... అని చెప్పి ఇవ్వడాని వెళ్తాడు. ఈ లోపే రామయ్యను ఎవరో హత్య చేశారని ఇన్ స్పెక్టర్ వేణుకు ఫోన్ వస్తుంది. వేణు సబ్ ఇన్ స్పెక్టర్ చంద్రంతో వెళ్లి హత్య జరిగిన ప్రదేశాన్ని, శవాన్ని పరిశీలిస్తాడు. ఎవరో కత్తితో రామయ్యను పొడిచి చంపి ఉంటారు.


          ముందు టెలిగ్రామ్ మాస్టారుతో మాట్లాడతాడు. తర్వాత రామయ్య ఇంటికి వెళ్లి విచారిస్తాడు. అక్కడో విషయం తెలుస్తుంది. రామయ్య భార్యకు, పెట్రోలు బంకులో పనిచేసే రాఘవులకు అక్రమసంబంధం ఉందని, రామయ్య రాఘవులను కొడితే, నిన్ను చంపేస్తానని రాఘవులు అన్నాడని తెలుస్తుంది. వేణు రాఘవులను కూడా విచారిస్తాడు. కానీ హత్య జరిగినప్పుడు రాఘవులు పెట్రోలు బంకులో ఉన్నట్లు రుజువు అవుతోంది. ఇలా కథంతా రామయ్యను ఎవరు చంపారు, ఎందుకు చంపారు... అన్న ఉత్కంఠతో నడుస్తుంది. వేణు టెలిగ్రామ్ ఆఫీసుకు వెళ్లి మాస్టారును విచారిస్తూ ఉండగా కేశవరావు వస్తాడు. తనకు టెలిగ్రామ్ వచ్చింది ఇవ్వండి అని అడుగుతాడు. దాంతో వేణుకు కేశవరావుపై అనుమానం కలుగుతుంది. ఎంక్వరీ చేయగా కేశవరావుకు ఈ మధ్య కావాల్సినంత డబ్బు వచ్చిందని, వారం రోజులనుంచీ రోజూ టెలిగ్రామ్ లు వస్తున్నాయని తెలుస్తుంది. వేణు అన్నిటిని చదువుతాడు. కానీ అవి అర్థంకావు. కానీ వేణు ఆరోజు వచ్చిన టెలిగ్రామ్ ను  కేశవరావుకు వెనకది ముందు, ముందుది వెనుక మార్చి చెప్తాడు. ప్లీజ్ సెండ్ ది హోల్ స్టాక్ - స్టాప్ కేన్సిల్ అవర్ ఓల్డ్ ఆర్డర్ అని ఉంటే కేన్సిల్ అవర్ ఓల్డ్ ఆర్డర్ సెండ్ హోల్ స్టాక్ అని చెప్తాడు. ప్లీజ్, స్టాప్, ది, అవర్ అన్న పదాల్ని చెప్పడు. కేశవరావు వెళ్లిన తర్వాత వారం రోజుల నుంచి వచ్చిన వార్తా పత్రికల్ని తిరగేస్తాడు.
           సుందరం అండ్ సన్స్ షాపు పక్కన కేశవరావు బ్రాకెట్ ఆడుతుంటే వేణు పట్టుకుంటాడు. అతని నెంబర్లు కరెక్టు కావు, అని తన నెబర్లు చెప్తాడు. వచ్చిన టెలిగ్రామ్ లో మొదట ఐదు మాటలు తర్వాత స్టాప్ తర్వాత నాలుగు పదాలు ఉన్నాయి. అంటే ఆ నెబర్లకు బ్రాకెట్ వస్తుందని అర్థం. కేశవరావుకు టెలిగ్రామ్ ద్వారా ఈ విషయాలు లీక్ అవుతున్నాయి. దాంతో అతను బ్రాకెట్ ఆడుతూ ధనవంతుడయ్యాడని తెలుసుకున్న దుకాణందారు రామయ్యను ఆ టెలిగ్రామ్ ఇవ్వని బెదిరించాడు. ఇవ్వక పోయే సరికి కత్తితో చంపేశాడు. ఇక్కడ నెంబర్లు లీకవుతున్నాయని పేపర్లలో వార్తలు కూడా వస్తున్నాయి. అదీగాక కేశవరావుకు టెలిగ్రామ్ వచ్చిందా అని ఈ స్థలంలోనే అడిగారు కాబట్టి... దుకాణం దారే హత్య చేసిన వ్యక్తిగా వేణు గుర్తించి అరెస్టు చేస్తాడు.


             క్రైం కథకు ఉండాల్సిన అన్ని లక్షణాలు దీనికి ఉన్నాయి. కథాకాలం నాటికి ఇది వాస్తవ చిత్రణ. ముందుగా కథలో హత్య చేసింది రాఘవులు అన్న అనుమానం కలిగేలా చేసి, తర్వాత ఉత్కంఠ రేపి, చివరి వరకు కథను నడిపారు ఆరుద్ర. మిస్టరీ కథల్లోలాగే మోటర్ సైకిల్ కు ఎర్రగుర్రం అని పేరుపెట్టారు. ఈ కథ ఎప్పుడు చదివినా చివరి వరకు మనల్ని చదివిస్తుంది. ఆరుద్ర ఏ రచన నైనా గొప్పగా చేయగల మేధావి అని ఈ కథవల్ల యిట్టే తెలిసిపోతుంది.      

 
డా. ఎ.రవీంద్రబాబు