Facebook Twitter
నేనే రాజవుత

నేనే రాజవుత

- నారాయణ

 

 

ఒకసారి కుందేలుకు ఒక కోరిక పుట్టింది - తను అడవికి రాజునైతే బాగుండుననిపించింది. ‘ఎప్పుడూ సింహమే రాజు ఎందుకు అవ్వాలి? రాజవ్వటం అనేది వంశపారంపర్యం కాకూడదు. సింహమూ, దాని కొడుకూ, మళ్ళీ దాని కొడుకూ - ఇదే క్రమం అయితే మిగతా జంతువులకు అవకాశం రాదు గద!’

కొన్ని రోజులపాటు ఆలోచించిన పిమ్మట అది ఇక ఊరుకోలేకపోయింది. సింహంగారి దర్బారుకి వెళ్ళి అడిగేసింది - "సింహంగారూ! అడవికి మీరే ఎప్పుడూ రాజవ్వటం బాగాలేదు. మేమూ ఉన్నాం జంతువులం. మాకూ అవకాశం ఇవ్వండి." అని.

సభికులంతా నివ్వెరపోయారు. సభంతా నిశ్శబ్దంగా వణికిపోయింది. సింహం ఇక కుందేలును రాజద్రోహ నేరంకింద శిక్షించి తీరుతుందని అందరూ ఊపిరి బిగపట్టారు.

అయితే సింహం చిరునవ్వు నవ్వింది. "అవును మిత్రమా, మరిచాను. ప్రజాస్వామ్య భావజాలం పరుచుకున్న ఈ రోజుల్లో మేం ఇంకా ఇలా రాజసింహాసనాన్ని అంటిపెట్టుకు కూర్చోవడం బాగాలేదు. నీకే ఇస్తున్నా మొదటి అవకాశం. ఈ క్షణం నుండీ ఈ అడవి మొత్తానికీ సర్వం సహా చక్రవర్తివి నీవే. నేను నీకు వెన్నుదన్నుగా రాజ్యరక్షణ భారం వహిస్తాను."

"అదికూడా అవసరం లేదు మిత్రమా! అన్నది కుందేలు రాజోచితంగా." రాజ్య రక్షణ ఇకపై మా బాధ్యత. మీరు అంత:పురంలో విశ్రాంతి తీసుకోండి, లేదా వనాంతాలకు వెళ్ళి తపస్సు చేసుకోండి."

సభలోని వారికి ఎవరికీ నోటమాట రాలేదు. సింహం గద్దె దిగుతూ" ప్రజలారా! ప్రజాస్వామ్య భావనలను గౌరవిస్తూ మేం రాజపదవి నుండి తప్పుకొని, కుందేలుకు తొలి అవకాశం ఇచ్చాం. మీరంతా రాజౌన్నత్యాన్ని గౌరవిస్తూ మీ కొత్త రాజు పట్ల విదేయులుగా వర్తిస్తారనీ, వనశాంతిని సంరక్షించడంలో మీ బాధ్యతల్ని గుర్తించి మసులుకుంటారనీ ఆశిస్తున్నాను" అని ముగించి నిష్క్రమించింది.

అందరూ కుందేలు మహారాజుకు జయం పలికారు. కానీ ఎవరికివారు నోళ్లు నొక్కుకున్నారు. ముఖ్యంగా పులి సేనాపతీ, గుంటనక్క మంత్రీ నోరు మెదపలేదు. వాళ్ళిద్దరూ చాలా రోజులుగా రాజ్యాన్ని కబళించే యోచనలోనే ఉన్నారు. ఇప్పుడు సింహమే తమ మార్గాన్ని సుగమం చేసింది! కుందేలు పని ముగించటం ఎంతసేపు? ఇలా సాగుతున్నాయి వాటి ఆలోచనలు.

ఆ రోజు రాత్రి కుందేలుకు నిద్రపట్టలేదు. ప్రపంచం అంతా కొత్తగా అనిపిస్తోంది. తను తీసుకురావాల్సిన మార్పులు ఏమున్నాయని ఆలోచిస్తుండగానే తెల్లవారింది. అంతలోనే అంత:పురం గగ్గోలెత్తింది. పులి సేనానీ, గుంటనక్క మంత్రీ తిరుగుబాటు చేశారు. తమ బలాలతో కోటను పూర్తిగా ముట్టడించారు.

కుందేలు మహా రాజు అత్యవసర సమావేశం నిర్వహించింది. పులికీ, నక్కకూ తానే స్వయంగా బుద్ధి చెబుతానన్నది. జన నష్టం తనకు ఇష్టంలేదు కనుక , ఒక్క ఏనుగుపైనెక్కి తాను తన ప్రతాపం చూపిస్తానన్నది.

ఏనుగు పూర్తిగా తయారై, రాజుగారిని అంబారీమీద ఎక్కించుకొని, కోట తలుపులు తెరిచి, ముందుకు ఉరికింది. ఎదురుగా పులీ, నక్కా తమ సైన్యాలను మోహరించి నిలబడి ఉన్నాయి. ఏనుగు వాటికి ఎదురుగా నిలబడి, కుందేలు మహారాజు వేస్తానన్న శరపరంపరలకోసం ఎదురుచూస్తున్నది.

కానీ ఆశ్చర్యం! ఒక్క బాణమూ రాలేదు! ఏనుగు తొండంతో తన వీపును తడుముకొని చూసింది. అక్కడ కుందేలు మహారాజు లేడు. శత్రుమూకల శబ్దానికి వెరచి ఏనాడో పలాయన మంత్రం పఠించారు వారు!

బిక్కచచ్చిపోయిన ఏనుగు ప్రళయకాల ఘర్జనలా వినవచ్చిన సింహనాదంతో అకస్మాత్తుగా మేలుకున్నది. తన పక్కనే నిలబడి సింహం భీకరంగా గర్జిస్తున్నది. శత్రుసైన్య సమూహం ఆ గర్జనకు కకావికలై దారీతెన్నూ తెలీకుండా పరుగులు పెడుతున్నది! సింహం వారిని తరిమి, అందినవారిని అందినట్లు విసిరేస్తున్నది.

పులి సేనానీ, గుంటనక్క మంత్రీ ఇక ఎవ్వరికీ కనిపించలేదు.

కుందేలు కూడానూ!

తిరిగి అడవిని సింహమే పరిపాలించవలసి వచ్చింది.

అసమర్థులైన రాజులు రాజ్యానికి వన్నె తేలేరని అందరికీ మరోసారి తెలిసివచ్చింది.                                 

కొత్తపల్లి వారి సౌజన్యంతో