TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
- డా|| సి|| ఆనందారామం
పార్ట్ - 2
ఈ రెండు లక్షణాలతో రమణరావు అన్నయ్యకు బాగా నచ్చాడు.
తన అయిష్టం ఎంతగా వ్యక్తపరుస్తోన్నా పట్టించుకోవటం లేదు.
అన్నింటికంటే జానకి మాటలు తలుచుకున్నప్పుడల్లా భయం కలుగుతోంది.
రమణరావు పేరు వింటోనే ఎగిరిపడింది జానకి.
"రమణరావును ఎంతమాత్రం చేసుకోకు. నా మాట విను . బ్రతికినంత కాలం ఏడుస్తూ కూచోవాలి."
"ఏం? ఎందుకు?"
జానకి సమాధానం చెప్పలేదు.
"చెప్పు జానకీ!"
జానకి భుజాలు కుదుపుతూ అడిగింది.
జానకి సమాధానం చెప్పకపోగా ఏడ్చేసింది.
"నన్ను క్షమించు ఒక వేళ మీ అన్నయ్య నిన్ను ఆ రమణ రావుకే ఇచ్చి పెళ్ళి చేస్తాడేమో! అప్పుడు నేనేమీ చెప్పకూడదు, భగవంతుడి దయవల్ల అలా జరుగని పక్షంలో అంతా చెపుతాను. నీకు కాక ఎవరికీ చెప్పుకుంటాను?"
ఈ మాటలన్నీ రాజారావుకు చెప్పెయ్యాలనిపించిందిసుశీలకి.
కానీ చెప్పలేదు.
జానకితో మాట్లాడానని చెపితేనేమండిపడతాడు రాజారావు
ఇంక జానకి మాటలకు విలువ ఇస్తాడా?
వద్దన్నా రహస్యంగా జానకితో మాట్లాడుతున్నందుకు తనను చీవాట్లు పెడుతాడు,
జానకితో ఈ రహస్య సమావేశాలు కూడా కరువవుతాయి.
జానకి తల్లి ఒక్కప్పుడు తమ ఇంట్లో వంట మనిషి, వితంతువు.
ఆ తరువాత ఆవిడ గర్భావతి అయింది. జానకిని ప్రసవించింది.
జానకి తండ్రి ఎవరో ఎవరికీ తెలియదు. ఈ సంగతులు జరిగే నాటికి సుశీల పుట్టలేదు. అయినా ఆ నోటా, ఈ నోటా చాలా కథలు వింది.
జానకి తల్లి తులశమ్మ వంటపని మానేసింది. ఆవిడకు ఎలా నచ్చిందో ఏమో, వంటలు చేసుకోవలసిన అవసరం లేకుండా నాలుగెకరాల నిక్షేపబలాంటి మాగాణి వచ్చింది.
రాజారావు పసితనమంతా దర్జాగా గడిపాడు. కానీ తండ్రి కళ్ళు మూసి యాజమాన్యం వచ్చాక తమ సంసారపు దర్జా అంతా మేడిపండు వంటిదని తెలుసుకున్నాడు.
ఆస్తికి మించిన అప్పుల్ని చేసిపోయారు లక్ష్మీపతిగారు.
తల గిర్రున తిరిగింది రాజారావుకు. ఆ అప్పులన్నీ తీర్చి ఆస్తిని సంరక్షించట మెలాగా అన్నదే రాజారావును పట్టుకున్న పెద్ద సమస్య అయిపోయింది.
ఆ ధ్యేయంతోనే ఎద్దులా కృషి చేస్తున్నాడు. ఇంట్లోదర్జాలు తగ్గించుకోమని నచ్చజెప్పలేక సతమతమవుతున్నాడు.
కొడుకు నోటితో చెప్పకపోయినా అతడి మనసుఅర్థం చేసుకుని వంటమనిషిని మాన్పించింది శారదమ్మ.
శారదమ్మ కేకాస్తనలతగా ఉన్నా, ఎలా తెలుసుకుంటుందో తులశమ్మ రెక్కలు కట్టుకు వాలి వంటంతా చేసి వెళుతుంది.
ఇది రాజారావుకు ఏమాత్రం నచ్చకపోయినా తల్లి అనారోగ్యం పరిస్థితీ, ఇంట్లో పసిపిల్లల ఆలనా, పాలనా ఆలోచించి సహించి ఊరుకునే వాడు,
ఒక వితంతువు కూతురిగా పడుతూనే అప్రతిష్ఠ నెత్తిన పెట్టుకు వుట్టిన జానకికి పులిమీది పుట్రలా మరో అనర్థం చుట్టుకొంది.
జానకి నిండు కోర్టులో ముద్దాయిగా నిలబడవలసి వచ్చింది.
డబ్బుకోసం ఎవరినో వలలో వేసుకోవాలని ప్రయత్నించిందనీ అతను అడిగినంత డబ్బు ఇయ్యకపోవడం వలన, పోలీసులను పిలిచి అల్లరి పెట్టాలని ప్రయత్నించిందనీ కేసు
తనను ఎవరో దుండగులు బలాత్కారంగా కారులో లాక్కుని వెళుతోంటే సహాయం కోసం "పోలీస్ పోలీస్!" అని అరిచానని కన్నీళ్ళతో జానకి మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకపోయింది.
జానకిని ఎంత సౌమ్యురాలో బాగా తెలిసిన వాళ్ళు కూడా జానకిని చూడగానే చెవులు కొరుక్కునేవారు.
"ఏమోనమ్మా! ఆ తల్లికి కూతురు కాదూ! ఏం జరిగిందో ఎవరికీ తెలెసు?"
అని సరదాగా చెప్పుకున్నారు.
జానకి నడివీధిలో తల యెత్తుకు నిలబడలేని పరిస్థితి వచ్చేసింది.
సుశీల కన్న జానకి ఒక సంవత్సరమే పెద్ద. ఇద్దరూ చిన్నప్పటి నుండి కలసి చదువుకున్నారు.
ఊళ్ళోగొడవకి వేగలేక జానికి చదువు మానుకొని మెడ్రాస్ వెళ్ళి పోతోంటే వెక్కి వెక్కి ఏడ్చింది సుశీల.
"ఏడవకు సుశీ! మనం అక్కచెల్లెళ్ళలా కలసిమెలసి తిరిగాం! కొంతకాలం మెడ్రాస్ లో ఉండి అక్కడే చదువుకుని ఈ దుమారం కాస్త తగ్గాక మళ్ళీ ఇక్కడికి వస్తాను."
బాధగా అంది జానకి.
"అన్నీ మోసాలు! అబద్దాలు ! ఇలా లేనిపోని గాధలు పుట్టించి నీ బ్రతుకు బండలు చేస్తే వాళ్ళకేం వస్తుందని?"
ఉక్రోషంతో అంది సుశీల.
"అబద్దాలని నువ్వూ నేనూ అరిస్తే నిజాన్ని అబద్దంగా మార్చగలిగిన వాళ్లు భయపడతారా? ఆపదలో రక్షకదళాన్ని పిలిచినందుకు వాళ్ళీవిధంగా నన్ను భాక్షించారు."
కన్నీళ్లతో విడిపోయిన జానకి సుశీల మళ్ళీ అయిదేళ్ళకి కలుసుకున్నారు.
జానకి పూర్తిగా మారిపోయింది.
వెనుకటి ఉత్సాహం చిలిపితనం ఎగిరిపోయి పూర్తిగా ఉదాసీనంగా తాయారయింది.
ఊళ్ళో వెనుకటి ఉధృతం తగ్గినా జానకిని చూడగానే చెవులు కోరుక్కోవటం మానలేదు
రాజారావుకు జానకి పట్ల అర్థ్రభావం లేకపోలేదు.
చిన్నతనంనుంచీ అతను జానకిని సొంత చెల్లెలిలా అభిమానించాడు.
జానకిని దోషిగా అతని అంతరంగం ఊహించలేకపోతోంది.
కానీ. జానకి అల్లరిపడింది కోర్టులకెక్కి పత్రికలపాలయి నలుగురినోళ్ళలో నానింది.
అతనికి అన్నింటికంటే తన కుటుంబ క్షేమమూ సమాజంలో ప్రతిష్ఠా ముఖ్యం.
ఆ కారణంచేత జానకితో మాట్లాడటానికి వీల్లేదని సుశీలను కఠినంగా శాపించాడు.
పాపం! జానకి రమణరావును గురించి చెప్పిన మాటలు సుశీల రాజారావుకు ఎలా చెప్పగలదు ?
నల్లని చీర కట్టుకుని తాటికాయంతబొట్టు పెట్టుకుని విసుగు నణచుకునే ప్రయత్నంలో చికాకు ఎక్కువ కాగా హాల్లోకి వచ్చింది సుశీల.
"హలో! సుశీలా దేవీ!"
ఎంతో సభ్యతతో పలకరించాడు రమణరావు.
అదేం పాపమో రమణరావు ఏది చేసినా, ఏం మాట్లాడినా కృతకంగానే అనిపిస్తుంది సుశీలకి!
"హలో!" అంది పోడగా.
"నే నిప్పుడే వస్తాను."
కావాలని సుశీలా రమణరావులను వదిలి వెళ్ళిపోయాడు రాజారావు.
సుశీల మనసులో గుర్రుమంది.
రాజారావు ఉద్దేశం అర్థంచేసుకున్న రమణరావు సుశీల వైపు తిరిగి చిరునవ్వు నవ్వాడు.
సుశీల తిరిగి నవ్వలేదు.
ముఖం తిప్పుకుంది.
అన్న దగ్గిరలేడు గనుక తన తిరస్కారాన్ని సాధ్యమయినన్ని విధాల ప్రకటించడానికే సిద్దపడింది సుశీల.
సుశీలలో ఈ సంచలనం రమణరావు అర్థంచేసుకొకపోలేదు.
కానీ సుశీల సౌందర్యం అతడికి పిచ్చెక్కిస్తోంది.
అదీగాక రాజారావు ఆస్తిని గురించే తప్ప అప్పుల గురించి తెలియదు, రాజారావు లాంటి ఐశ్వర్యవంతుడి చెల్లెన్ని - అందాల రాశిని సుశీలని - ఈ తిరస్కారాలకి భయపడి వదులుకోదలచలేదు రమణరావు.
"మీరీ నల్ల చీరలో చాలా అందంగా ఉన్నారు. నాకు నలుపంటే ఇష్టం" అన్నాడు.
ఒళ్ళు మండింది సుశీలకు__
"నాకు నలునంటే అసహ్యం. నాకు ఇష్టంలేని వ్యక్తులదగ్గిరకు విధిగా వెళ్ళాల్సి వస్తే, ఈ నల్ల చీర కట్టుకుంటాను"
తల తిరిగింది రమణరావుకు. ఎంతయినా సుశీల తన అనిష్టాన్ని ఇంత స్పష్టంగా ప్రకటిస్తుందని అనుకోలేదు.
పాలిపోయిన రమణరావు అంతకూ ఇంతకూ నిరుత్సాహపడే రకం కాదు.
సుశీల కోపాన్నంతమా సరసం క్రింద మారుస్తూ "ఆడవారి మాటలకు అర్థాలు వేరులే!" అన్నాడు చిలిపి నవ్వుతో ...
నిర్ఘాంతపోయింది సుశీల.
అతనిమీద చీదరింపు మరింత ఎక్కువయింది.
అతని ముఖం చూడటం ఇష్టం లేక చేతి కందిన విశ్వనాథ వారి 'చెలియలికట్ట ' చదువుతూ కూర్చుంది.
"ఏమిటి చదువుతున్నారు?"
"చెలియలికట్ట!"
"ఏం వస్తుంది, ఆ పుస్తకాలు చదివితే? కూడు పెడతాయా గుడ్డ పెడతాయా?