Facebook Twitter
కాలువ మల్లయ్య

  కాలువ మల్లయ్య             

                                             
 
 
డా. ఎ.రవీంద్రబాబు
 

         తెలుగు కథను తెలంగాణ మట్టిలో పండించాడు. ప్రజా ఉద్యమాలకు కథా రచనతో ప్రచారం కల్పించాడు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రజల పక్షం వహించి కథలు రాశాడు. స్థానికతలోని విభిన్నతను, వైవిధ్యాన్ని కథల ద్వారా వివరించాడు. ఎక్కడా వస్తువులో, శిల్పంలో సారూప్యత లేకుండా సుమారు ఎన్నో కథలు, నవలు రచించాడు. అంతేకాదు విమర్శకునిగా, కవిగా, వ్యాసకర్తగా బహు ముఖీనమైన ప్రజ్ఞాశాలి డా. కాలువ మల్లయ్య.

       కాలువ మల్లయ్య తెలంగాణలోని కరీంనగర్ జిల్లా జూపల్లి మండలం తేలుకుంట గ్రామంలో జనవరి 12, 1953లో జన్మించాడు. చిన్నప్పుడే కాలినడకన 7మైళ్లు నడిచి పదవతరగతి చదువుకున్నాడు. ఆపై బియస్సీ, బి.ఎడ్. పూర్తి చేసి ఉపాధ్యాయునిగా ఉద్యోగజీవితాన్ని ప్రారంభించాడు. కానీ చదువుపై మక్కువతో ఎం.ఎ. తెలుగు చదవడమే కాకుండా తెలుగులో ప్రగతిశీల కథా సాహిత్యం పై పరిశోధన చేసి డాక్టరేట్ పొందాడు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో కెమిస్ట్ గా పనిచేసి నిర్భంద పదవీ విమణ చేశాడు.
          స్కూలు, కాలేజీ రోజుల్లోనే మల్లయ్య రచనలు చేయడం ప్రారంభించాడు. ప్రేమ్ చంద్, టాల్ స్టాయ్, మాక్సిమ్ గోర్కీ, శ్రీశ్రీ రచనల ప్రభావానికి లోనయ్యాడు. 1980లో వెెలి అనే తొలికథను సృజన పత్రికలో ప్రచురించాడు. రచనావ్యాసంగం ప్రారంభ రోజుల్లో కవితా సౌరభం, కవితాఝరి అనే కవితా సంపుటాలు కూడా  వెలువరించాడు. ఇప్పటి వరకు సుమారు 850 కథలు, 12 నవలలు, అనేక వ్యాసాలు రాశాడు.
        కట్నం కథలు, ఘర్మజలానికి ఖరీదు కట్టే షరాబులేడు, రాజు - కోడి, మా కథలు, అవ్వతోడు గిది తెలంగాణ, కాలువ మల్లయ్య కథలు, చెప్పుల తయారి...లాంటి ఎన్నో కథా సంపుటాలను ప్రచురించాడు. భూమి పుత్రుడు, సాంబయ్య చదువు, మాట్లాడే బొమ్మలు, బతుకు పుస్తకం, ఎక్స్ (డబ్బు) - తృప్తి ఈజ్ ఈక్వల్టూ దుఃఖం, గువ్వల చెన్నా అనే నవలలు వీరికి మంచి పేరు తెచ్చాయి. అంతే కాదు వీరి కథలు కొన్నికన్నడ, హిందీ, తమిళ, మళయాళ భాషల్లోకి అనువదింపబడ్డాయి.
      వీరి రచనల్లో భూస్వామ్య వ్యవస్థలోని లోపాలు, రైతులు, దళితులు, కార్మికులు, ముఖ్యంగా స్త్రీల జీవితాలలోని కష్టాలు, కన్నీళ్లు, చైతన్యాలు కనిపిస్తాయి. విప్లవోద్యమం, మానవ జీవితాల్లోని వైవిధ్యం, మధ్యతరగతి ప్రజల్లోని ఆడంబరాలు, ప్రపంచీకరణ పరిణామాలు... ... ఇలా తెలంగాణ సమాజమంతా ఇతని కథలకు నేపథ్యమే. దొరసాని చీర కథ దొరల పశుత్వ లైంగిక దోపిడీకి నిదర్శనం, పంజరం కథ జంమిందారీ వ్యవస్థలోని స్త్రీల అణచివేతలకు ప్రతిబింబం. నేలతల్లి కథలో రైతు భూమికి దూరమైన వైనం, వెలి కథలో దొరల పెత్తనాన్ని సవాల్ చేసిిన కిందికులాల చైతన్యం... ఇలా అనేక సమస్యలను చూపెడతాయి కాలువ మల్లయ్య కథలు. ఎంగిలిచేత్తో కథ దుబ్బమ్మ అనే దళిత స్త్రీ కన్నీళ్లను చిత్రించింది. చావుకథలో సంప్రదాయాల వల్ల మనుషులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలియజేస్తుంది. చేతులు కథ వివిధ వర్గాల్లోని విలువలను వివరింగా విశదీకరిస్తుంది.
          ఏ కథకి ఆ కథ శిల్ప వైవిధ్యాన్ని చాటుతుంది. ప్రారంభాలు, ముగింపులు, సన్నివేశాలు... అన్నీ వస్తువును బట్టి ప్రత్యేకంగా ఉంటాయి. భాష విషయంలో తెలంగాణ భాషకు ఇవి పెట్టన కోటలు. కానీ వ్యవహారికభాషే ఎక్కువగా కనిపిస్తుంది. నాకు తెలిసింది మాండలిక భాష, నాచుట్టు ఉన్న వాళ్లు మాట్లాడేది మాండలిక భాష, నేను చిన్నతనంలోగానీ, ఆ తర్వాతగానీ మాట్లాడింది మాండలిక భాష. మాండలికం సజీవం. గలగల పారే సెలయేరు లాంటిది అని తన రచనల్లో భాష గురించి చెప్తారు కాలువ మల్లయ్య. సామెతలు, పలుకుబడులు, నానుడులు... ఎన్నో తెలంగాణ భాషలోని మాణిక్యాలు వీరి రచనల్లో దొరుకుతాయి.
         వీరికి ఎనో బహుమతులు, అవార్డులు వచ్చాయి. రావిశాస్త్రి స్మారక బహుమతి, జాషువా సాహిత్య పురస్కారం, వీరి బతుకు పుస్తకానికి ఆమెరికా తెలుగు అసోసియేషన్ పురస్కారం (ఆటా) లభించాయి, వీరు పత్రికలలో రాసిన ఎన్నో కథలు పోటీలలో గెలుపొందాయి. అంతేకాదు కాలువ మల్లయ్య ఎన్నో ఉన్నతమైన పదువులు కూడా అలంకరించారు.
      తెలుగు భాషమీద, సాహిత్యం మీద ఎంతో మక్కువ ఉన్న వీరి రచన తెలంగాణ మట్టివాసనను, తెలంగాణ ప్రజల స్నేహ పరిమళం, తెలంగాణ ప్రజా ధారబోస్తున్న రక్తరాగం చదువురలను మురిపిస్తాయి. ఉద్రేకపరుస్తాయి. ఉరికిస్తాయి. ఈ పని తన స్వతంత్రమార్గం ఏర్పరచుకున్న రచయితకు మాత్రమే సాధ్యం అన్నాడు ప్రముఖ సాహితీ వేత్త దాశరథి రంగాచార్య.
         తెలంగాణ కాలువల్లోంచి సాహిత్య వ్యవసాయం చేసి తెలుగుకథా పువ్వులను పూయించిన సాహిత్య సేద్యకాడు కాలువ మల్లయ్య.