Facebook Twitter
దాసరి పాట

  దాసరి పాట
                              
                

చింతాదీక్షితులు

 


     

తెలుగు కథా సాహిత్యానికి ప్రాణం పోసిన తొలితరం కథా రచయితల్లో చింతాదీక్షితులు ఒకరు. ఆయన 100కు పైగా వైవిధ్యమైన కథలు రాశారు. విభిన్న వృత్తుల వారి జీవితాలను ఇతివృత్తంగా తీసుకొని అనేక కథలు అల్లారు. ఆయా వృత్తులకు సంబంధించిన పదాలు వాడి తెలుగుభాషలోని భాషా వైవిధ్యాన్ని కూడా చూపాడు. ఆయన రాసిన కథల్లో దాసరి పాట కథ సంచార జీవనం చేస్తూ కథలు గానం చేసే వారి జీవితంలోని విషాదాన్ని, దైనందిన జీవితాన్ని కళ్లకుకడుతుంది.
     కథ పూర్తిగా సంచారజీవనం చేస్తూ తెలుగువారి కథలను, పురాణాలను గానం చేసే ఓ కుటుంబానికి సంబంధించినది. కథలు గానం చేసే దాసరి వర్ణనతో ప్రారంభమవుతుంది. అతని కుటుంబమూ సంచారం చేస్తూ ఉంటుంది. అలా తెలుగు నేలంతా, ప్రతి గ్రామము అతనికి సుపరిచితమే. రాత్రైతే ఏ చెట్టుకిందో పడుకుంటారు. అతనికి ఆస్తి కూడా కేవలము తాంబ్రా, గుమిసి, రెండు అంజెలలు మాత్రమే. కానీ అతని దృష్టి అంతా పాడే పాటమీదే ఉంటుంది. ఇరవయ్యోయేట పెళ్లి చేసుకున్నాడు. అతని భార్యకూడా అతనికి తగిన ఇ్లలాలే. భర్తే ఆమెకు సర్వము. భర్తతోనే ఆమె ప్రయాణము. వాళ్లది అన్యోన్య దాంపత్యము. వారిద్దరూ కలిసి పాటపాడితే నవరసభరితం. పదములోని వీరరసము భర్త వెలువరించేటప్పుడు ఆమె హృదయము వీరరసముతో ఉప్పొంగేది. కరుణ రసము తన పదమునకు భర్త ఒప్పించే టప్పుచేటప్పుడు ఆమె కళ్ల వెంబడి వచ్చిన కన్నీళ్లు గుమిసిని తడిపేవి... ... కొంటెతనముతో అతడు మీసము మీద చెయ్యివేసి నాయికానాయకుల శృంగారమును వర్ణించేటప్పుడు ఆమె తలవంచి గుమిసి తప్పు వాయించేది.
           వారి ప్రేమకు గుర్తుగా కొడుకు పుడతాడు. వాడికి ఐదేళ్లు వచ్చేసరికి అయిదారు కథలు ఒక మోస్తరుగా పాడటమూ నేర్చుకున్నాడు. వాళ్లు బొబ్బిలికథ, తిమ్మరాజు కథ, సర్వాయిపాపడు కథ, కాకమ్మకథ, కాంభోజరాజు కథ, చెంచుకథ ఇలా అనేక కథలు రసభరితంగా చెప్పగల నేర్పులు.
           కానీ ఒకరోజు గ్రామంలో కోడిపుంజులు కథ చెప్తుంటే అతనిలో ఉత్సాహం లేదు. పౌరుషములైన వాక్యాలు నీరసములై పోయాయి. అతని చూపులన్నీ పక్కన భార్య ఒడిలో జ్వరంతో బాధపడుతున్న కొడుకుపైనే ఉంటాయి. హృదయంలోని బాధతో అతను పాట సరిగా పాడలేక పోయాడు. ఇది అర్థం చేసుకోని ప్రజలు అనేక విధాలుగా ఆలోచనలు చేస్తారు. ఆ రోజు రాత్రి మూడు గంటలకు కథ పూర్తయ్యాక కొడుకు కాలిగాయానికి పసురు కట్టు కట్టి రాళ్లమీదే నిద్రపోతారు. కానీ మరునాడు పాటపాడందే వారికి పొట్టనిండదు. అందుచేత తర్వాత రోజు కొడుకును భుజం మీద పడుకో బెట్టుకొని బొబ్బిలి కథ చెప్పడం ప్రారంభిస్తాడు. మధ్యమధ్యలో కొడుకుపై చెయ్యి వేసి జ్వరాన్ని చూస్తూ ఉంటాడు. కొడుకు శరీరం చల్లగా అనిపించడంతో జ్వరం తగ్గిందని భావించి... ప్రజలకు ఉత్సాహం కలిగేలా కథ చెప్తాడు. బొబ్బిల కోట ముట్టడిని, విజరామరాజు క్రౌర్యాన్ని అద్భుతంగా పాడి వినిపిస్తాడు. కానీ తాండ్రపాపయ్య రౌద్ర రూపాన్ని అంతగా రక్తి కట్టించలేకపోతాడు. అప్పటికే అతనికి కొడుకు మరణించాడని తెలుస్తుంది. కథతో మమేకమై తనూ ఏడుస్తాడు.
           కథలో తాండ్ర పాపయ్య బంధువుల మరణమునకై ఎన్నడూ ఎప్పుడూ విలపించనట్లు ఆరోజున విలపించేడు.... పాపయ్యతోపాటు దాసరితోపాటు ప్రజలు కూడా కన్నీళ్లు విడిచి విలపించారు. ఈ విధంగా కథ కరుణరసాత్మకంగా ముగుస్తుంది. దాసరివాళ్ల జీవితాన్ని హృదయవిదారకంగా మనకు చూపెడుతుంది.

             కథాశిల్పం విషయానికి వస్తే- కథ ప్రారంభం దాసరి పాటను, అతని దైనందిన జీవితాన్ని చెప్పడంతో ప్రారంభమవుతోంది. ముగింపు దాసరి చెప్పే కథ, అతని జీవిత కథ కలిసిన బాధతో ముగుస్తుంది. వెరసి ఒక జీవితాన్ని తెలియజేస్తుంది. కథలోని భాషలో తాంబ్రా, గుమిసి అనే వాయిద్యాలు, అంజెలు అంటే వాళ్లు కథ చెప్పేటప్పుడు కిందవేసుకునే బట్టలు... మిగిలిన కథంతా వ్యవహారిక భాషలో రాశారు చింతాదీక్షితులు. 1927 నాటికి ఇది కథా సాహిత్యంలో విప్లవమే అని చెప్పాలి. కథ క్రమక్రమంగా వస్తువులోకి పాఠకుడ్ని లాక్కొనిపోతుంది. ఓ విషాద వాతావరణాన్ని మనలో నింపి వదిలేస్తుంది.
          దేశసంచారం చేస్తూ, కథలు చెప్పే వారి గొప్పతనాన్ని, నైపుణ్యాన్ని రచయిత వాస్తవంగా గొప్పగా చెప్పారు. వ్రాలు చేయలేని భట్రాజులు, దాసరులు, జంగములు.... మాటేమిటి. భారతభాగవతములను, మహావీరుల దేశీయ కథలను ఇతరులకు బోధించగల వీరు చేవ్రాలు చేయలేని వారనే కారణముచేత చదువురాని వారని త్రోసివేయవచ్చునా... ... లాంటి ప్రశ్నలు, భిక్షకులై దేశములోని అజ్ఞానమును ఒకవిధముగా పోగొట్టుచున్నారు.... ... వారికి భైక్ష్యవృత్తి నీచము కాదు. వారి దేవుడే ఒక భిక్షకుడు కాబట్టి... ... ఇలాంటి సత్యాలు మనలను ఆలోచింపజేస్తాయి.   
     
                                                   
డా.ఎ. రవీంద్రబాబు