Facebook Twitter
దేవుడు వస్తున్నాడు

దేవుడు వస్తున్నాడు

 


                                                   

- నోరి నరసింహశాస్త్రి


 
          నోరి నరసింహశాస్త్రి చారిత్రక నవాలాకారుడు. పద్యకవి, నాటకకర్త, అనువాదకుడు. సమకాలీన సాంఘిక జీవనాన్ని యథార్థంగా చిత్రించిన రచయిత. అపూర్వమైన సాహితీ సంపద ఆయన సొత్తు. మనిషి సాంప్రదాయ వాదిగా కనిపించినా ఆయన రచనలు మాత్రం ఆధునికం. సమాజంలోని మూఢాచారాలను, ఛాందస భావాలను ఎండగడతాయి. ఆయన అభ్యుదయవాది. ఆయన రచనలు ప్రగతిశీలమైనవి. దేవుడు వస్తున్నాడు కథ సమాజంలోని భిన్న మనస్తత్వాలను, ఆచారాలను, నమ్మకాలలోని వైవిధ్యాన్ని, మనుషుల్లోని స్వార్థాన్ని మనకు అద్దంలా చూపుతుంది.
         మహానగరంలో ఓ వార్త దావానలంలా కాకపోయినా పుకారులా వ్యాపిస్తుంది. అదే దేవుడు వస్తున్నాడు అని. వచ్చే మంగళవారం సరీగా మధ్యహ్నానికి దేవుడు వస్తున్నాడు అని. ఇక నగరంలో చిన్నా పెద్ద, ముసలి ముతక అనే తేడా లేకుండా, స్థలం ఏదైనా, కులం ఏదైనా, బీదవాళ్లైనా, ధనవంతులైనా అందరి మధ్య ఇదే చర్చ. దేవుడు వస్తున్నాడు అని. కానీ ఈ మాట చెప్పింది మాత్రం గోదావరి ఒడ్డున పేదరింకంలో నిత్యం భగవన్నామ స్మరణలో ఉండే ఓ అరవై ఏళ్ల వృద్ధుడు. ఈ వార్త ఆనోట ఈ నోట పడి నగరమంతా వ్యాపిస్తుంది. ఎవరి పాటికి వాళ్లు భగవంతుడ్ని ఎలా ప్రసన్నం చేసుకోవాలి... ఎలాంటి సపర్యలు చేయాలి... ఎలా మెప్పించాలి... ఎలాంటి లాభాల్ని పొందాలి... అని ఆలోచన చేస్తుంటారు.
         పత్రికలు కూడా పోటీపడి వారివారి దృష్టితో ఆ వార్తను ప్రచురిస్తాయి. సంపాదకీయాలు కూడా రాస్తాయి. నాస్తిక పత్రిక ఎర్ర అక్షరాలతో దేవుడు వస్తున్నాడు. మన నగరయోగి భేషజం - మన నగర గుత్తదారులకు భలే అవకాశం అని ప్రచురిస్తుంది. నగరంలోని మరో వృద్ధ పత్రిక భగవంతుడు భక్తులకు నిత్యమూ ప్రత్యక్షమే... ... ఏ రూపంలో వస్తాడో చెప్పలేము.... తరించడానికి మంచి అవకాశము లభించింది. ఉత్తిష్ఠత, జాగ్రత... అని ప్రచురిస్తుంది. గురువారం రోజు భగవంతుణ్ణి ఎలా ఎదుర్కోవాలి, ఎవరి ఇంట్లో విడిది చేయించాలి... ఇలాంటి విషయాలను చర్చించడానికి ఓ పెద్దసభేే జరుగుతుంది. పలు రకాలుగా చర్చలు జరుగుతాయి. చివరకు ఈ విషయం చెప్పిన యోగిని అడుగుదాము అనుకుంటారు. కానీ అతను ధీక్షలో ఉండటం చేత బలవంతంగా కూడా సభకు తీసుకురాలేక పోతారు. కొదంరు విష్ణు విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయాలని, మరికొందరు శివలింగాన్ని ప్రతిష్ఠ చేయాలని, మంచి మతాధిపతిని తీసుకురావాలని, దుర్గమ్మను తీసుకురావాలని మాట్లాడుకుంటారు. మాటలతో పోట్లాడు కుంటారు. రాజకీయ పార్టీలు రాజే నేడు మంత్రి కాబట్టి మంత్రిని తీసుకొచ్చి, మహానగరానికి మంచినీటి సౌకర్యాన్ని కలిగించాలని ఆలోచిస్తారు. ఈ వార్తలను కూడా ఆయా పత్రికలు పెద్ద ఎత్తున ప్రచురిస్తాయి.
            మంగళవారం నాటికి విమానాలు, రైళ్లల్లో అందరూ మహానగరానికి విచ్చేస్తారు. హంగామా మొదలవుతుంది. హడావుడిగా నగరమంతా సందడిసందడిగా ఉంటుంది.  మంత్రిగారు మాత్రం కొంత ఆలస్యంగా వస్తాడు. కానీ పేదయోగి ఆరోజు కూడా పురుషోత్తమ ప్రాప్తి పారాయణ చేసే సరికి దండ కమండలాలు చేతులలో పూని కాషాయాంబర ధారి వాళ్ల ఇంటికి వస్తాడు. భార్యాభర్తలు ఇద్దరూ ఆయనకు మనస్కరించి సకల మర్యాదలు చేస్తారు. పాద పూజ నుంచి, సుష్ఠుభోజనాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. చివరకు ఆయన మేము విశ్వేశ్వరాలయంలో నిద్రించి ఉదయమే వెళ్తాం అని చెప్పి అదృశ్యుడవుతాడు.
           ఇదంతా పసికట్టిన నాస్తిక పత్రిక శ్రామిక రూపంలో, ఎర్ర బట్టలతో భిక్షుకుని ఛాయాచిత్రాన్ని ముద్రిస్తుంది, వృద్ధ పత్రిక ఆర్ద్రశిఖవలె వెలిగే పరమహంస చిత్రాన్ని ముద్రిస్తుంది. దేవుడిని చూద్దామని వెళ్లిన నగర ప్రజలకు గుడిలో వెలిగే దీపజ్యోతి కనపడుతుంది. అందరూ నిరాశాదృక్కులతో వెనక్కు వెళ్లిపోతారు.
            ఈ కథలో దేవుడికోసం చేసే పనులలో సమాజంలోని భిన్న మనస్తత్వాలను, భిన్న నమ్మకాలను, భిన్న ఆచారాలను, భిన్నఆర్థిక భేదాలను ఈ కథలో చెప్పాడు నోరి నరసింహశాస్త్రి. కథ ప్రారంభించినప్పటి నుంచి ఒకే ఉత్కంఠతో పరుగులు పెడుతుంది. పత్రికల నుంచి ప్రభుత్వం వరకు అన్నిటిలోని లోపాలను కరాఖండిగా చెప్పాడు రచయిత. ఎత్తుగడ, సంఘటనలు, వివరణ, శైలి మనల్ని కథలో లీనం చేస్తాయి.  అప్పటికీ గ్రాంథిక భాష ఉన్నా, నోరి వారు అందమైన వ్యవహారికాన్ని కథలో వాడారు. ఆస్తిక, నాస్తిక భావజాలల మధ్యగల స్వార్థచింతనను కూడా నోరివారు అద్బుతమైన రీతిలో చెప్పారు. కథలో వర్ణించిన పరిస్థితితులకు నేటి సమాజంలోని పరిస్థితులకు మార్పు లేదు. అందుకే ఈ కథ ఎప్పటికీ ఓ సమాజాకి ప్రతిబింబమే...    

                                                 
    డా.ఎ. రవీంద్రబాబు