Facebook Twitter
వట్టికోట ఆళ్వారుస్వామి

వట్టికోట ఆళ్వారుస్వామి


                                             

     

  - డా.ఎ. రవీంద్రబాబు

 


                జీవితంలో అగాథాల లోతులను చవి చూశాడు. సాహిత్య సృష్టిలో అంతులేని పర్వతాలను అధిరోహించాడు. ఉద్యమాల బాటలో ప్రజల పక్షాన నిలబడి పోరాడారు. జైలుపాలై ఆ జీవితాన్నే కథలుగా అందించాడు. ఎక్కడా ఆయన జీవితం వడిదుడుకులు లేకుండా సాగలేదు. కానీ ఆయన మాత్రం నిక్కచ్చిగా సారస్వత జీవితాన్ని, ప్రజా జీవితాన్ని సాగించాడు. ఆయనే తెలంగాణ వైతాళికుల్లో ఒకరైన వట్టికోట ఆళ్వారు స్వామి.
              వట్టికోట ఆళ్వారు స్వామి నల్లగొండ జిల్లాలోని నకిరేకల్ దగ్గరున్న చెరువు మాదారంలో 1915 నవంబర్ 1న జన్మించాడు. తల్లి సింహాద్రమ్మ, తండ్రి రామచంద్రాచార్యులు. కానీ చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో అనేక బాధలు పడ్డాడు. సీతారామారావు అనే ఉఫాధ్యాయుడికి వంటావార్పు చేసి పెడుతూ చదువుకున్నాడు. సుమారు 13,14 ఏళ్ల వయసులో సూర్యాపేటలోని గ్రంధాలయంలోని పుస్తకాలు చదవడం ద్వారా జ్ఞానాన్ని, ప్రపంచాన్ని తత్వాన్ని తెలుసుకున్నాడు. సొంతగా తెలుగు, ఆంగ్ల భాషలను, సాహిత్యాన్ని అధ్యయనం చేశాడు. సూర్యాపేట, నక్రేకల్, కందిబండల్లోని ఇళ్లల్లో వంటపనులు, విజయవాడ హోటల్లో సర్వర్... ఇలా బతుకు తెరువుకోసం అనేక పనులు చేశాడు. 1936-37 ప్రాంతాల్లో హైదరాబాదు చేరి గోల్కొండ పత్రికలో ప్రూఫ్ రీడర్ గా పనిచేశాడు. గ్రంధాలయోద్యమంలో పాల్గొన్నాడు. నిజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాటంలో పాల్గొని జైలు జీవితాన్ని అనుభవించాడు. ఆంధ్రమహాసభ నల్లగొండ జిల్లా అధ్యక్షునిగా కూడా పనిచేశాడు. అభ్యుదయ రచయిత సంఘం, తెలంగాణ రచయితల సంఘం, పౌరహక్కుల ఉద్యమం, రిక్షాకార్మికుల సంఘం, రైల్వే కార్మికుల సంఘం, గుమస్తాల పోరాటాలలో పాల్గొని చైతన్యవంతమైన పాత్రను నిర్వహించారు.
                ఆళ్వారు స్వామిలోని మరో కోణం సాహితే వేత్త. కథకుడు, వ్యాసకర్త, విమర్శకుడు, నవలా రచయిత, కవి, పాత్రికేయుడు, ప్రచురణ కర్త... ఇలా ఆయన ప్రజాపోరాటాలతో పాడు అక్షరాన్ని వెంటేసుకుని తిరిగిన బాటసారి. 1938లో దేశోద్ధారక గ్రంధమాలను స్థాపించి అనేక పుస్తకాలను ముద్రించారు. వీరు ప్రచురించిన పుస్తకాలలో...
        సురవరం ప్రతాపరెడ్డి - హైందవ ధర్మవీరులు
        గ్రధాలయోద్యమం
        జానపాటి సత్యనారాయణ - ప్రజలు ప్రభుత్వం
        కాళోజి - నాగొడవ
        దివాకర్ల వేంకటవాధాని - అనుమానం
        పల్లాదుర్గయ్య - మాయరోగం... ఇలా ఎన్నో ఉన్నతమైనవి ఉన్నాయి.
        పాత్రికేయనిగా వీణ, గుమస్తా పత్రికలకు సేవలందించారు. అభ్యుదయ రచయితల సంఘం పక్షాన 1944-46లో తెలుగుతల్లి పత్రికను నిర్వహించారు.
        వీరు రాసిన రచనలు..
        సుమారు మూడు ఏళ్లు జైలు శిక్షను అనుభవించి అక్కడి అనుభవాలను కథలుగా రాశారు. ఆ కథలే జైలు లోపల సంపుటిగా వచ్చియి. తెలంగాణ ప్రజల జీవితాలను కూలంకషంగా చిత్రించిన నవల ప్రజల మనిషి.  1940-45 మధ్యకాలంలోని రాజకీయ, సాంఘిక ప్రజా ఉద్యమాల చిత్రణ అంటే సాయుధ పోరాటాల పురిటి నెప్పులు గంగు నవల.1956-57లో మచలీపట్నం నుంచి వెలువడే విద్యార్థి మాసపత్రికలో రామప్ప రభస శీర్షికన వ్యాసాలు రాశారు. ఇవి అప్పటి రాజకీయాలను చర్చకు పెట్టాయి. సామాజిక సమస్యలపై వట్టికోట ఆళ్వారు స్వామి వ్యగ్యం రచన ఇది. ఇవన్నీ అప్పటి తెలంగాణ జీవితాలను, భాషను రికార్డు చేశాయి.
          జైలు లోపల కథల్లో... ఆళ్వారు స్వామి ఐదు ప్రాంతాల్లో జైలు జీవితాన్ని గడిపాడు. అనేక మంది ఖైదీలతో ఆత్మాయంగా మెలిగాడు. అందుకే ఈ కథలు సామాజికంగా, జీవన పరంగా, ఆర్థిక రాజకీయ రంగాలలోని వైవిధ్యానికి నిదర్శనంగా కనిపిస్తాయి. మానవీయ విలువలను, సిద్ధాంతాల జీవితాలను ప్రజలకు అందజేస్తాయి. కాఫిర్లు కథ  హిందూ ముస్లీంల మధ్య గల మత వైషమ్యాల గురించి, మత మార్పిడుల గురించి వివరిస్తుంది. బదనిక కథ అధికారులు, వారి భార్యలు తమ కింద పనిచేసే వారిని ఎలా పీడిస్తారో తెలియజేస్తుంది. పరిసరాలు కథ తెలంగాణలో పోలీస్ యాక్షన్ తర్వాత ఏర్పడిన ప్రభుత్వం తెలుగును ప్రోత్సహిస్తూ, ఉర్దూ నేర్చుకున్న వారి ఉద్యోగాలను కొల్లగొట్టిన వైనాన్ని చెప్తుంది.  గిర్దార్ కథలో కమ్యూనిస్టుల సాయుధ పోరాటాలను, ప్రజాభ్యున్నతికి చేపడుతున్న పనులను, రాజకీయ బాధితులను మనకు చూపెడుతుంది. వీరి కథల్లోని భాషకూడా ఒకప్పటి తెలంగాణలో ఉన్న ఉర్దు, తెలుగు భాషల సమ్మేళనం.
           వీరి జీవితాన్ని, రచనా వ్యాసంగాన్ని విస్తృతంగా తెలిపే ప్రజల మనిషి వట్టికోట సాహిత్య జీవితం వ్యాససంకలనం నేడు అందుబాటులో ఉంది.
          ఇలా ప్రజాజీవితంతో మమేకమై సాహిత్యాన్ని దానికి భూమిక చేసుకున్న వట్టికోట ఆళ్వారు స్వామి 1961, ఫిబ్రవరి 5న మరణించారు. ప్రముఖ కవి దాశరథి వారి కవితా సంపుటిని వీరికి అంకితం ఇస్తూ...
          అసలు ఆళ్వార్లు పన్నెండు మందే
          పదమూడో ఆళ్వార్ మా
          వట్టికోట ఆళ్వార్ స్వామి
          నిర్మళ హృదయానికి
          నిజంగా అతడు ఆళ్వార్
          దేవునిపై భక్తి లేకున్నా
          జీవులపై భక్తి ఉన్న వాడు ... అని అన్నాడు.
        దాశరథి రంగాచార్య జనపదం, అంతెందుకు పుస్తకాలను కూడా ఇతనికే అంకితం ఇచ్చి తన అభిమానాన్ని చాటుకున్నాడు.
          నిజంగా తెలంగాణ ప్రాంతం 20వ శతాబ్దం తొలి అర్ధభాగంలో ఆళ్వారు స్వామి వైతాళికుడు. జీవితం అన్నివిధాలా అస్తవ్యస్తంగా సాగినా తను మాత్రం ఎదిరించి పోరాడి ఎందరికో ఆదర్శమూర్తిగా నిలిచాడు. వీరి రచనలు అప్పటి తెలంగాణ చరిత్రకు అద్దం వంటివి.