Facebook Twitter
వకీలు వెంకయ్య

వకీలు వెంకయ్య
                                                

సురవరం ప్రతాపరెడ్డి

         సురవరం ప్రతాపరెడ్డి తెలంగాణలో తెలుగు కథకు మార్గదర్శకుడు. కథా సాహిత్యంలో తెలంగాణ నుడికి, పలుకుబడికి స్థానం కల్పించిన రచయిత. ఉర్దూ భాషా పదాల సోయగంతో తెలుగు కథకు కొత్త హంగులు అద్దిన కథా శిల్పి. నిజాం కాలం, ఆ తర్వాతి కాలం నాటి చరిత్రను తన కథల ద్వారా అందించిన దార్శనికుడు. అందుకే- వీరి కథలు చరిత్ర రచనకు ఆధారాలు. ముఖ్యంగా తెలుగు కథల్లో తెలంగాణ ఉనికిని చాటిన ప్రత్యేక సిరులు. అలాంటిదే వకీలు యెంకయ్య కథ.
        వకీలు యెంకయ్య కథ ఒకప్పటి తెలంగాణ జీవితాన్ని, అక్కడి దొరల పాలనలోని దురాగతాలను మనకు తెలియజేస్తుంది. అప్పటి ఉర్దూభాషతో కలిసిన తెలుగును అందంగా పొదివి పట్టి మనకు అందిస్తుంది. కథ- వకీలు యెంకయ్య జీవితమే ఈ కథలో ప్రధాన వస్తువు. వకీలు యెంకయ్య అసలు పేరు వెంకటరెడ్డి. అతనిది పాలమూరు అంటే నేటి మహబూబ్ నగర్ జిల్లాలోని సింగారం. బళ్లో చిన్నప్పుడు భారతం, భాగవతం, చదవడం రాయడం, వడ్డీ లెక్కలు లాంటివి నేర్చుకున్నాడు. కానీ తండ్రి తిట్టడంతో ఊరు వదిలి హైదరాబాదుకు వెళ్తాడు. అక్కడ పేరున్న పెద్దలాయరు, తిమ్మినిబమ్మని చేయగల వకీలు ఖాజా కమాలుద్దీన్ దెహలవీ కాళ్లమీదపడి ఆయన శిష్యరికం చేస్తాడు. అతనికి అన్ని పనులు చేసిపెడ్తూ అంతోఇంతో నేర్చుకుంటాడు. 5-6 పెద్దపుస్తకాలు కొనుక్కొని మళ్లీ ఊరికి తిరిగి వెళ్తాడు. ఊరుఊరంతా అతని వాలకం చూసి వకీలు యెంకయ్య అని అని పిలుస్తారు. 23 ఏండ్లు వచ్చేసరికి అదిరించి, బెదిరించి వకీలు యెంకయ్య పటేలిగిరీ సంపాదిస్తాడు. కానీ ఆ ఊరి పట్వారీ, మాలీ పటేలుకు ఇతనంటే పడదు.
          ఊరిలో ఓ ఖూనీ జరిగితే అమీన్ సాహెబ్ కు అన్ని మర్యాదలూ చేసి, ఆ హత్య మాలీ పటేలు చేసినట్లు వకీలు యెంకయ్య సాక్ష్యం సృష్టించి అతడిని జైలుకు పంపిస్తాడు. అతనితో పాటు మరో పది మందికి కూడా శిక్షపడుతుంది. అట్లానే వారికి ఇరవై వేలు ఖర్చూ అవుతుంది. దాంతో ఆ ఊర్లోనే కాకుండా చుట్టుపక్కల ఊళ్లళ్లో కూడా వకీలు యెంకయ్య అంటే భయం కలుగుతుంది. కాలం గడిచి శిక్ష అనుభవించి మాలీ పటేలు ఊరికి తిరిగి వస్తాడు.
          ఆ ఊర్లోనే ఉండే బోయవాడు బాలయ్య భార్య యెల్లి అందానికి వకీలు యెంకయ్య మనసు పారేసుకుంటాడు. పనికి ఇంటికి పిలిచి కోర్కె తీర్చమంటాడు. ఈ విషయం తెలుసుకున్న బాలయ్య తెలివిగా తన స్నేహితుడితో ఓ పన్నాగం పన్నుతాడు. యెల్లి వకీలు యెంకయ్యకు భర్త ఇంటిదగ్గర లేడని చెప్పి, రాత్రికి రమ్మంటుంది. వకీలు యెంకయ్య మురిసిపోయి యెల్లి ఇంటికి వెళ్తాడు. సరైన సమయానికి భర్త ఇంటి తలుపుకొట్టడంతో యెంకయ్యని గరిసెకొట్టడి (ధాన్యం నిలువ ఉంచేది) లో దాస్తుంది. భర్త బాలయ్య యెల్లికి ఓ డబ్బా ఇచ్చి దీనిలో పచ్చలు, రత్నాలు ఉన్నాయి, జాగ్రత్తగా దాచు అని చెప్తాడు. దాన్ని యెల్లి గరిసెకొట్టడిలో వేస్తుంది. వకీలు యెంకయ్య ఆశతో ఆ డబ్బాలో చేయ్యి పెడతాడు. దానిలో ఉన్న తేలు కుడుతుంది. పెద్దగా అరుస్తాడు. దాంతో బాలయ్య, అతని స్నేహితుడు వకీలు యెంకయ్యని కొట్టి బయటకు యీడుస్తారు.
        ఆ అవమానంతో వకీలు యెంకయ్య మంచం పడతాడు. ఊరిలో సర్కారీ ఈతచెట్టు వకీలు యెంకయ్య వల్లె ఎవరో కొట్టేశారని మాలీ పటేలు అమీన్ కు రిపోర్టు చేస్తాడు. బాగా లంచం ఇచ్చి శిక్షపడేటట్లు కూడా చేస్తాడు. యెంకయ్యకు నాలుగు యేండ్లు శిక్ష పడుతుంది. దాంతో వకీలు యెంకయ్య ఎద్దులు, పొలము, ధాన్యము, స్థలము అన్నీ ఊరిలో వాళ్లు ఆక్రమించుకుంటారు. చివరకు శిక్షాకాలం పూర్తి చేసుకుని వచ్చిన వకీలు యెంకయ్య చిన్న పాతకొంపలో కాపురం చేస్తున్న తన కుటుంబాన్ని చూసి అరే వకాలతు ఎంత పనిచేసింది అని మూర్ఛపోతాడు.
       కథంతా ఓ దారిలో నడిచినట్లు యెంకయ్య జీవితంలోని ఉద్దానపతనాలను తెలియచేస్తుంది. ఎటువంటి ముందు వెనుకలు లేకుండా పాఠకుడు కథలో లీనమవుతాడు. రచయిత చరిత్రను కథగా రాస్తున్నాను అని చెప్పడానికి కథలో మొదట సమారు 40 సంవత్సరాల క్రితం అని చెప్పడం, పాలమూరు జిల్లాలోని సింగారము అని కథా స్థలాన్ని చెప్పడం కనిపిస్తుంది. అదే విధంగా ఆనాటి పేర్లు పాలమూరు అంటే మహబూబ్ నగర్, జానంపేట అంటే నేటి హైదరాబాదులోని ఫర్రుఖ్ నగర్ అని చెప్పాడు. ప్రతాపరెడ్డి తెలంగాణలోని గ్రామీణ వ్యవస్థలో ఉన్న పటేలు, పట్వారీల దురాగతాలను కళ్లకు కట్టారు. లంచాలతో న్యాయాన్ని ఎలా తారుమారు చేసేవాళ్లో అమీన్ పాత్ర ద్వారా చూపారు. దొరల పాలనలో కింది కులాల స్త్రీల దైన్య పరిస్థితిని యెల్లి పాత్ర ద్వారా చూపారు. అందుకే ఈ కథ ఆనాటి సమాజపు వాస్తవచిత్రం. ఇక భాష విషయానికి వస్తే ఉర్దూభాషాపదాలతో కూడిన తెలుగు ఆనాటి ప్రజల భాషకు పట్టం కడుతుంది. వకాలతు, మౌల్వీసాబ్, పౌజ్దారీ, పెద్ద ఖానును, బేడీ హత్కడీ, డబ్బీ, బావర్చి (వంటమనిషి)... ఇలాంటివి ఎన్నో ఆనాటి ప్రజల వాడుకలో ఉన్న ఉర్దూ పదాలు కథలో కనిపిస్తాయి.
       ఊళ్లల్లో ప్రచారం అయ్యే పుకార్లను చెప్తూ ప్రతాపరెడ్డి ఇలా రాస్తారు- వెంకటరెడ్డి మళ్ళీ వచ్చాడంటే వూరంతా తలక్రిందు అయ్యింది. కొందరు అతడు సన్యాసుల్లో కలిసినాడని, తాము రామేశ్వరము పొయ్యే బైరాగలలో అతన్ని చూచి బాగా గుర్తు పట్టినా మనిన్నీ, కొందరు అతడు పెద్ద జానంపేటలో తురకలతో కలిసినా డనిన్నీ, వక మాదిగదాన్ని పెండ్లి చేసుకున్నాడనిన్నీ, కొందరు అతడు కృష్ణలోపడి చచ్చినాడనిన్నీ-- యిట్లెన్నెన్నో పుకారులు పట్టించి వుండిరి. అదే విధంగా కథా కాలం నాటి సాంస్కృతిక జీవితాన్ని తెలుపుతూ యెల్లి ఆభరణాలను వర్ణిస్తాడు రచయిత. చేతికి వెండి కడియాలు, నడుములో వెండి డావు, ముక్కెర, ముత్యాల పోగులు, మెళ్ళో పగడాల దండ, మట్టెలు, గల్లు గల్లు మంటవి. వెండి కడియాలు కాళ్ళలో కాపురం....
       అదే విధంగా ఆనాడు 30 యేండ్ల బాలయ్య, 15 యేండ్ల అమ్మాయిని పెళ్లి చేసుకునే అలవాటు ఉన్నదన్న విషయాన్ని చెప్పారు ప్రతాపరెడ్డి. ఈ కథ కొన్ని సంఘటనలు, సన్నివేశాల కలయికగా ప్రతాపరెడ్డి రాసినా ఎక్కడా కథా శిల్పం దెబ్బతినదు. ఇది రచయిత ప్రతిభకు నిదర్శనం. అందుకే ఈ కథ నాటి చరిత్రకు, నేటి కథా సాహిత్యానికి మూలం లాంటిదని చెప్పొచ్చు.
                                                                                                                                                 

డా. ఎ.రవీంద్రబాబు