Facebook Twitter
అబ్బూరి ఛాయాదేవి

   అబ్బూరి ఛాయాదేవి

 


                                         
     డా. ఎ.రవీంద్రబాబు

 


       తెలుగు కథలో ఆమెది ఓ విలక్షణ మార్గం. అమ్మలా లాలించినా, తప్పుచేస్తే ముద్దుగా దండించేలా ఉంటాయి ఆమె కథలు. స్త్రీ జీవితం చుట్టూ తిరుగుతూ వాళ్ల జీవితంలోని వివిధ పార్శ్వాలను ఆవిష్కరిస్తాయి. పురుషాధిక్య ప్రపంచాన్ని ధిక్కరిస్తూనే అందులోని తాత్విక దృక్కోణాన్ని విశధీకరించే దారులను చూపుతాయి. ఎక్కడా హడావుడి, ఆవేశం కనపడని చక్కనైన శిల్పంలా ఉంటాయి అబ్బూరి ఛాయాదేవి కథలు. తెలుగు కథా చరిత్రను రాస్తే ఆమెకు  కొన్ని పుటలు కేటాయించి అందులో ఆమె కథల గురించి తప్పక చెప్పాల్సిన అవసరం ఉంది. అబ్బూరి ఛాయాదేవి వ్యక్తిత్వమే ఆమె కథల్లో కనిపిస్తుంది.
         అబ్బూరి ఛాయాదేవి 1933లో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జన్మించారు. హైదరాబాదులోని నిజాం కళాశాలలో ఎం.ఎ. చదివారు. కాలేజ్ లో చదివే రోజుల్లోనే ఆమె కాలేజ్ మ్యాగజైన్ కు అనుభూతి అనే కథను, పెంపకం అనే నాటికను రాశారు. ఇవే వారిలోని రచనకు బీజాలు వేశాయని చెప్పొచ్చు. 1953లో ప్రముఖ రచయిత అబ్బూరి వరదరాజేశ్వరరావును వివాహం చేసుకున్నారు. న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో డిప్యూటీ లైబ్రేరియన్ గా పనిచేశారు. ఉద్యోగరీత్యా 1976-77లో డాక్యుమెంటేషన్ కోసం ప్రాన్స్ లో ఉన్నారు. 1982లో స్వచ్ఛంద పదవీ విరమణచేసి ప్రస్తుతం హైదరాబాదులో ఉంటున్నారు.
         అబ్బూరి ఛాయాదేవికి 1954లో ప్రచురించిన విమర్శకులు కథ ద్వారా తెలుగు సాహితీ లోకంలో విస్తృతమైన గుర్తింపు వచ్చింది. వీరి రచనలు-
         అబ్బూరి ఛాయాదేవి కథలు, తనమార్గం లాంటి
         కథా సంపుటాలు.
         చైనాలో యాత్రా చిత్రాలు - యాత్రాకథనం
         అనగనగా కథలు - వివిధ దేశాల జానపద కథలు
         అపరిచిత లేఖ, మృత్యుంజయ (ఒకతండ్రి కథ),
         ఇతర కథలు
         వరదస్మృతి, వ్యాస చిత్రాలు బొమ్మలు చేయడం
         స్త్రీల జీవితాలు, జిడ్డు కృష్ణమూర్తి,
         మనజీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు
         ఇలా ఎన్నో పుస్తకాలు ప్రకటించారు.
         1954లోనే కవిత పత్రికకు సంపాదకత్వం వహించారు. వనిత పత్రికకు కూడా సంపాదకత్వ బాధ్యతలు నిర్వహించారు. 1989-90లలో ఉదయం పత్రికలో మహిళా శీర్షికను నిర్వహించారు. ప్రముఖ స్త్రీ వాద పత్రిక భూమికలో కాలమిస్టుగా కూడా పనిచేశారు. వరదోక్తులు పేరిట వారి భర్త వరదరాజేశ్వరరావుగారి హాస్యోక్తులను కార్టూన్లతో సంకలనంగా తెచ్చారు. వీరి కథలు ఆంగ్లం, హింది, తమిళ, మరాఠి, కన్నడ భాషల్లోకి అనువాదాలయ్యాయి.
          వీరి రచనలపై జిడ్డు కృష్ణమూర్తి తాత్విక ప్రభావం ఉన్నట్లు తెలుస్తోంది. ఛాయాదేవి రచనల్లో ఎక్కువగా మధ్యతరగతి మహిళల జీవితాల్లోని అంశాలే కనిపిస్తాయి. పురుషాధిక్య సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న బాధలే ఉంటాయి. బోన్ సాయి బ్రతుకు, ప్రయాణం, సుఖాంతం, ఆఖరి ఐదు నక్షత్రాలు, ఉడ్ రోజ్ కథలు ముఖ్యమైనవి. బోన్ సాయి కథలో ఆడవాళ్ల జీవితాలు బోన్ సాయి చెట్లళ్లా ఎదగలేక పోతున్నాయి అని చెప్తారు. ఈ కథను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2000ల సంవత్సరంలో పదోతరగతి తెలుగు వాచకంలో చేర్చింది. సుఖాంతం కథలో సంసార జీవింతంలో ఇరుక్కున్న స్త్రీ నిద్రకు కరువై, చివరకు మత్తుబిల్లలు మింగి ఆ మత్తులో శాశ్వత నిద్రలోకి జారుకున్న విధానాన్ని అద్భుతంగా వివరించారు. ఈ కథను 1972లో నేషనల్ బుక్ ట్రస్టువాళ్లు కథా భారతి సంకలనంలో చేర్చారు. స్పర్శ కథలో తండ్రి స్పర్శకోసం తపించే పిల్లల తపనను చెప్తారు. మృత్యుంజయ కథలాంటి నవల. ఇది ఛాయాదేవి తండ్రికి, ఆమెకు మధ్య జరిగిన ఉత్తరాల సంభాషణ. దీనికే 1996లో తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ రచయిత్రి పురస్కారం లభించింది. ఉపగ్రహం కథ స్త్రీకి ఎన్ని కోరికలు ఉన్నా, ఆశలు ఉన్నా, ఆమె ఎంత చదువుకున్నా... అవన్నీ భర్త అభిరుచులతో కలిసినప్పుడే నెరవేరుతాయని చెప్తుంది. ఆఖరి ఐదు నక్షత్రాలు కథ కార్పొరెట్ వైద్యరంగంలోనే దోపిడీని కళ్లకు కడుతుంది. కర్త, కర్మ, క్రియ కథలో పురుషాధిక్య ధోరణిని ఎదిరించే వనజ పాత్రను సృష్టించారు. అలానే ఎవర్ని చేసుకోను, నిర్ణయం, స్థానమహిమ కథలు స్త్రీలు భర్తను ఎన్నుకోవడంలోని వివిధ కోణాల్ని విశధీకరిస్తాయి.
        అందుకే ఛాయాదేవి కథలు స్త్రీ గుండె అరల్లోని వెలుగు నీడల్ని, భావోద్వేగాల్ని అద్భుతంగా మనకు చూపుతాయి. సమాజంలో స్త్రీ గృహిణిగా, ఉద్యోగిగా, తల్లిగా... ... అనే పలు చట్రాలలో ఎలా జీవితాన్ని కుదించుకుని నిరాశల మధ్య జీవిస్తుందో తెలుపుతాయి. అసలు స్త్రీ జీవితంలోని వివిధ దశలు పురుషల కనుసన్నలలోనే నడుస్తున్నాయన్నది వీరి కథల్లోని అంతర్లీన సత్యం. తెలుగు నేలపై స్త్రీవాదం అనే పదం వినపడక ముందే పరాధీనతకు గురైన స్త్రీల జీవితాలను కథలుగా అందించారు. తనమార్గం కథా సంపుటిలోని కథలు 1960ల నుంచి 2005 వరకు అంటే సుమారు నాలుగు శతాబ్దాల పాటు స్త్రీల జీవితాల్లో వచ్చిన అనేక మార్పులకు సాక్షీభూతం.
         అబ్బూరి ఛాయాదేవికి కథా రచయిత్రిగా ఎన్నో అవార్డులు, రివార్డులు వచ్చాయి. 1993లో వాసిరెడ్డి రంగనాయకమ్మ పురస్కారం, 2000లో కళాసాగర్ అవార్డు, 2005లో తనమార్గం కథా సంపుటికి కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు లభించాయి. ఇంకా ఛాయాదేవికి నారాయణరెడ్డి, దుర్గాబాయ్ దేశ్ ముఖ్ అవార్డులు అందుకున్నారు. 2011లో అజోవిభో కందాళం ఫౌండేషన్ సంస్థ వీరికి జీవితకాల ప్రతిభామూర్తి పురస్కారం ఇచ్చి సత్కరించింది.
        అబ్బూరి ఛాయాదేవి సాహిత్య సంప్రదాయాలతో పాటు, విజ్ఞత కలిగిన మనీషి. స్థిత ప్రజ్ఞత కలిగిన విదుషీమణి. అందుకే తన కథల గురించి చెప్తూ- నా కథలు తీవ్రంగానో, నిష్టూర పూర్వకంగానో కాక, ఆర్ద్రత కలిగించేటట్లూ హాస్యస్ఫూరకంగానూ, వ్యంగ్య పూర్వకంగానూ ఉంటాయి అన్నారు. ఇది నిజం అని తెలియాలంటే వారి కథల్ని తప్పక చదవాల్సిందే...