Facebook Twitter
పేర్లతో తిప్పలు

పేర్లతో తిప్పలు

సేకరణ- డా.ఎ.రవీంద్రబాబు         

     
ఒకఊరిలో ఓ కుటుంబం ఉండేది. ఆ కుటుంబ యజమాని ఎప్పుడూ ఒక అతిథికి భోజనం పెట్టి, అన్నం తినేవాడు. రోజూ భర్త, పిల్లలతో పాటు మరొకరికి భోజనం వండి పెట్టలేక భార్య చాలా బాధపడేది. కానీ భర్తమాత్రం అసలు పట్టించుకొనే వాడు కాదు. ఎవరో ఒకర్ని వెతికి మరీ భోజనానికి తెచ్చేవాడు. అతను తిన్న తర్వాత మాత్రమే తను తినేవాడు. ఇంట్లో ఆహారపదార్థాలు ఉన్నాయో, లేవో కూడా ఆలోచించేవాడు కాదు. అది వండిపెట్టు, ఇది వండిపెట్టు అని విసిగించేవాడు. వండటానికి కావాల్సిన సరుకులు కూడా అన్ని తెచ్చిఇచ్చేవాడు కాదు.
     చివరకు విసిగిపోయిన భార్య, భర్త అలవాటు పోడొట్టడానికి ఓ మంచి పథకం చేసింది. అయితే వాళ్ల ఇంట్లో ముద్దు పేర్లు చాలా విచిత్రంగా ఉండేవి. అందుకు వాటిని తన పన్నాగానికి అనుకూలంగా వాడుకోవాలని అనుకుంది.
      ఆరోజు భర్త పనిమీద బయటకు వెళ్లాడు. ఇంతలో ఆ ఇంట్లో మంచి భోజనం దొరుకుతుందని తెలుసుకున్న ఒకతను ఇంటికి వచ్చాడు. "ఈ రోజు అతిథిగా నేను వచ్చాను. మీరు వంట చాలా చక్కగా చేస్తారటకదా... " అని ఆమెను పొగడడం ప్రారంభించాడు. బార్య అతని తిక్క, భర్త అలవాటు మార్చడానికి ఇదే సరైన సమయం అనుకుంది. "మీరు ఇప్పుడే భోజనం చేస్తారా...? నెయ్యి వచ్చేదాకా ఆగుతారా...?" అని అడిగింది. 'ఓహో...! వీళ్ల భర్త నెయ్యి తేవడానికి బయటకు వెళ్లినట్లు ఉంది' అని అనుకున్న అతిథి "నెయ్యి వచ్చిందాకా ఆగుతాను" అన్నాడు. కొంత సేపటికి భర్త వచ్చాడు. వరండాలో కూర్చొన్న అతిథి 'భర్త వచ్చాడు, నెయ్యి తెచ్చి ఉంటాడు, భోజనానికి ఇక పిలుస్తారు' అని ఎదురు చూస్తూ ఉన్నాడు. భర్త రాగానే వరండాలో అతిథిని చూసి చాలా సంతోషించాడు. 
        "అతిథిని కట్టేసి, దెయ్యాన్ని విప్పమంటావా?" అని భార్యను అడిగాడు. భార్య "సరే... విప్పండి, సమయం మించిపోతుంది." అన్నది. ఈ మాటలు వరండాలో కూర్చొన్న అతిథి విన్నాడు. 'ఏంటి...! నన్ను కట్టేసి దెయ్యాన్ని విప్పుతారా...!!' అని భయపడ్డాడు. అంతే...! చెప్పాపెట్టకుండా వీధిలోకి ఒకటే పరుగు. పరుగెత్తుతూ, పరుగెత్తుతూ... "వాళ్లింట్లోకి భోజనానికి ఎవరూ వెళ్లకండి... వెళ్లినవాళ్లని కట్టేసి దెయ్యానికి ఆహారంగా వేస్తున్నారు" అని అరుస్తూ పరుగెట్టాడు.
       భర్త అతథిని భోజనానికి రమ్మనటానికి వరండాలోకి వచ్చి చూస్తే కనపడలేదు. భార్య అతిథి పరుగెత్తడం గమనించి. తిక్క కుదిరింది అని మనసులోనే నవ్వుకుంది.

      అసలు విషయం ఏమిటంటే-!!
భర్తను ముద్దుగా భార్య నెయ్యి అని పిలుచుకుంటుంది. వాళ్లింట్లో ఉండే ఆవును అతిథి అని, దూడను దెయ్యం అని పిలుచుకుంటారు. అందుకే- బయటనుంచి వచ్చిన భర్త పాలుతీయడానికి ఆలశ్యం అయింది, ఆవును (అతిథిని) కట్టేసి దూడను (దెయ్యాన్ని) విప్పి, పాలు తీస్తాను అని ముద్దు పేర్లతో అన్నాడనమాట.