Facebook Twitter
ప్రేయసికో ప్రేమలేఖ

  ప్రేయసికో ప్రేమలేఖ

 - డా. ఎ.రవీంద్రబాబు.

 రోజూలాగే ఈ రోజూ బద్దకంగా తెల్లారింది. మరో రోజూ నిర్దయగా నా మీద నుంచి నడిచి వెళ్లడానికి సిద్ధమైంది. నీకు తెలుసు కదా... పక్కమీద కళ్లు మూసుకుని, వళ్లు విరుచుకుంటూ నిన్ను దగ్గరగా తీసుకోవడం నాకెంత ఇష్టమో... ! ఉదయాన్నే నా మత్తుకు నీ స్పర్శ మందేమో...!!
      కళ్లు తెరుచుకోగానే నా చేతులతో పాటు, నీ హృదయం కూడా నీ కోసం వెతికాయి. ఏం చేద్దాం...!? నీ వులేవని ఆ రెండిటికీ తెలుసు. ఏ మంత్రశక్తో నిన్ను నా పక్కన ఉంచితే ఎంత బావుణ్ణు...!! స్పర్శలేని ప్రేమను ఎలా ఊహించగలం చెప్పు. అసలు స్నేహానికి, ప్రేమకు మధ్య ఈ చిన్న అడ్డంకు లేకపోతే..., నువ్వు అన్ని రోజులు  నా బెస్ట్ ఫ్రెండ్ వని దూరంగా ఉంచేదానివేమో కదా...!! అయినా లోకానికి నీతి నియమాలకు భయపడి ఎన్ని ప్రేమలు స్నేహం మాటున రగిలిపోతున్నాయో కదా...? ఎన్ని బంధాలు దొంగ ముసుగు లేసుకుని ఈ కపట ప్రపంచంలో రాజ్యమేలుతున్నాయో కదా... ?!
      ఉదయాన్నే... నిద్రలో గమ్మత్తుగా పక్కకు ఒత్తిగిలే నిన్ను చూడ్డాం నా కెంతోసరదానో...!! నా చెయ్యిని అలా గుండెల మీదకు లాక్కొని.., 'నాకెంట్రా నువ్వున్నావు' అనే నీ మాట గుర్తుకొచ్చింది.  అయినా నిద్ర లేచే ముందు నీ ముఖంలో అంత అందం ఎక్కడ నుంచి వస్తుంది?. రాత్రంతా దేవలోకంలో సుఖాలలో తేలియాడిన అప్సరసలు, ఆ తృప్తి తాలూకూ భావనని నీలో నింపి ఉండాలి. బెడ్ లైట్ లాంప్ లో మెరిసే నీ బుగ్గ నిగారింపు...,రాత్రి తలస్నానం చేసిన నీ కురుల పరిమళం నా గుండెకు ఎంత హాయినిచ్చేవో...!!
       ఏంటో నీకు కోపం వస్తుందని భయమేస్తుంది గానీ...! ఎన్ని రహస్యపు వానల సువాసనల్ని భద్రంగా భద్రపరిచావో ఈ చిన్ని గుండెపై...!! అవన్నీ ఇప్పుడు గాయాలు చేసి సుతిమెత్తగా ఆ గుండెనే కోస్తున్నాయి. 'నేను నీ లవర్ని' అని నీవు చెప్పిన ఆ పదాన్ని నేను వినడంలో జరిగిన ఆలశ్యానికి ఇప్పటికీ సారీ చెప్తూనే ఉన్నాను మౌనంగా...!! అయినా- ఏదీ ఎప్పుడూ డైరెక్టుగా చెప్పే మనస్తత్వం కాదు నీది. అందుకే నీ మనసును పరిపూర్ణంగా అర్థం చేసుకోవడంలో నేను ఫెయిల్ అయ్యానేమో...!! లేకపోతే ఈ తుంటరి తగాదా మనల్ని విడదీసి ఉండేదా...??
     అయినా ఇప్పుడు ఎన్నని ఏం లాభం?. నీవు లేని క్షణాలు, ఘడియలు, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు... నా ప్రయాణం... ఇలా వ్యర్థంగా గడిచిపోతున్నాయి. అవును నీ గురించి నేను ఇంతగా తపన పడుతున్నాను కదా...! ఇదంతా నీకు తెలుస్తుందా...!? ఋషులకు ఏదో అద్భుత శక్తి ఉండేదట. వారి హృదయాలలోని భావాలు ఒకరికొకరికి తెలిసేవట...! అలాంటి శక్తి మన హృదయాలకు ఉండకూడదా...?! ఎందుకంటే- వాళ్లు పొందే అలౌకిక ఆనందమూ, ప్రేమికులు పొందే సౌందర్య పరామానందము ఒకటే కదా...!!
      ఇప్పుడు ఒంటరిగా లేచి, ఒంటరిగా రడీయై, ఒంటరిగా ఆఫీసుకు వెళ్లాలి. నా చుట్టూ ఎంతమంది ఉన్నా, నువ్వు లేని ఒంటరి తనమే బాధిస్తుంది. ఇప్పుడిక్కడ సమయం ఉదయం 8.00 గంటలైంది. ఈ టయంలో నువ్వు ఏం చేస్తుంటావు?. నీకు నిద్ర లేవగానే నేను గుర్తుకు వస్తున్నానా...? దూరమై ఇంతకాలమైనా ఎంతకాలమిలా బాధిస్తావు. 'మనిషికి మరుపు దేవుడిచ్చిన వరమట' ఆత్రేయ అన్నాడు. మరి నా మనసుకెందుకు మరుపు అనేది రావడం లేదు?. ఇక ఎప్పటికీ రాదా...! అసలు నిన్ను మర్చిపోవడం అంటే నన్ను నేను మర్చిపోవాలేమో...!!
       అవును- ఈ ప్రపంచం నిండా ప్రేమికులే... ఒకరి మనసు వేరొకరి దగ్గర తప్పక ఉంటుంది. మనసులన్నీ ఏకమై ఏ దివ్యలోకాల్లోనో మీటింగ్ పెట్టుకొని ఉంటాయి. అవి లేని మనం ఇలా వ్యర్థ బతుకులను గడుపుతున్నాం. మనసులు ఏకమైన జీవితాల కోసం అన్వేషిస్తూ జీవితాలను వ్యర్థం చేసుకుంటున్నాం. నా మనసు నీ దగ్గర ఉందని, నీవు లేని నేను ఉండలేని క్షణాలు నీకు తెలిసే క్షణాలు ఇక రావని తెలిసినా...!! ఏమిటో ఈ పిచ్చి...!?
                                  

ఉంటాను...
ఒంటరిగానే....