TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
యావజ్జీవితం
- భవానీ దేవి
"పందిట్లో పెళ్ళవుతున్నది. కనువిందవుతున్నది" బ్యాండు మేళంలో పాటను అందరి హృదయాలు ఆనందంగా హమ్ చేస్తున్నాయి.
"బంగారు బొమ్మ రావేమే! పందిట్లో పెళ్ళి జరిగేనే"! అందరి మనస్సులో అపురూప దృశ్యాలెన్నో మెదుల్తున్నాయి.
"బాబూ! అమ్మాయి చేయి పట్టుకో!"
పురోహితుడి ఉపదేశంతో అత్యుత్సాహంగా మోటుగా తన కుడిచేతి చిటికెన వేలుని పెడగా విరిచి పట్టుకున్న రమణకేసి చురచురగా చూసింది వాణి. రమణకిదేమీ పట్టినట్లులేదు. అతనసలు వాణి ఫీలింగ్స్ పట్టించుకునే మూడ్ లో లేడు. ఎప్పుడెప్పుడీ పెళ్ళితంతు పూర్తి చేసుకోవాలా అనేంత హడావుడిగా కార్యక్రమాన్ని ఏకాగ్రంగా నిర్వర్తిస్తున్నాడు. కనునొసల నుంచి రమణ హడావుడి చూసిన వాణి నలుగురు చూపులు తనమీదే ఉంటాయన్న ఆలోచన రాగానే చూపుల్ని నేలకి తాకించింది.
"కొంగులు ముడివేసి కోర్కెలు పెనవేసి" బ్యాండ్ మేళం పాటల సాక్షిగా ఇద్దరు ఒక్కటయ్యారు.
రమణ వాలకం చూస్తుంటే వాణికి వళ్ళుమండి పోతోంది. బెంగగా కూడా ఉంది. "ఏదోలే! ఎర్రగా బుర్రగా ఉన్నాడు. బుద్దిమంతుడు. ఇంజనీర్ గా మంచి ఉద్యోగమే చేస్తున్నాడని" ఈ పెళ్ళికి ఒప్పుకుంది. కానీ ఇంత నాన్ సెన్సిటివ్ అనుకోలేదు. పెళ్ళిలో రమణకి వాణి గురించిన స్పృహే లేదు.
తలంబ్రాలు పోయమన్నదే తడవుగా.... ఉత్సాహం ఆపలేనట్లు పళ్ళెం ఎత్తి కుమ్మరించాడేగానీ ఒక్కసారన్నా కళ్ళల్లో కళ్ళుంచి చూశాడా! పెదవుల కొసన చిరు కొంటెనవ్వయినా! ఉహు... పైగా ఆ పళ్ళాన్ని వాణి తలకేసి తగిలించాడు కూడా. తొందరపాటుతో. కోపంగా పెద్ద పెద్ద కళ్ళు మరింత విశాలం చేసి చూడబోయింది వాణి. అతగాడేమో ఇదేమీ పట్టనట్లు పెళ్ళిమంత్రాలు చెప్తున్నాడు.
'పోన్లే... తొందరగాబోలు' అని సరిపెట్టుకుంది. ఇక అప్పగింతల సీనులో సరేసరి. అమ్మా నాన్న ఏడుస్తున్నారు.
'పోయిరాగదమ్మా జానకి' ఈసారి సన్నాయి మేళగాళ్ళు ఆలపిస్తుంటే అందరికీ మరింతగా దుఃఖం ముంచుకొస్తోంది. బహుశ ఎవరి పెళ్ళిళ్ళు వాళ్ళకి గుర్తొచ్చి ఉంటాయి.
వాణికి ఇదంతా చూస్తుంటే కళ్ళ నీళ్ళు తిరిగాయి. ఎక్కడో పుట్టి, పెరిగి, ఎక్కడికో పోయి ఎవరితోనో బతకాలి అమ్మా నాన్నలని వదిలి. ఆడపిల్లలే ఎందుకు వెళ్ళాలి? వస్తువును అప్పగిస్తున్నట్లు ఈ అప్పగింత లేమిటి? ఏనాటి సంప్రదాయాలో! చిన్నపిల్లలకి పెళ్ళిళ్ళు చేసే రోజుల్లో పసిపిల్ల కాబట్టి అప్పగించేవాళ్ళు. మరి ఇప్పుడెందుకీ తంతు. "రమణ, అనే భర్త తన పట్ల ఎలా ప్రవర్తిస్తాడు. ప్రేమగానీ... బాధ్యత గానీ మొక్కబడి బంధంతోనా... అమ్మ కౌగిలించుకుని ఏడుస్తుంటే బ్రహ్మముడి దగ్గర పట్టుకుని లాగాడు రమణ.
"ఎందుకేడుస్తావు? ఏడవకూడదు" అన్నాడు. వాణికి మండిపోయింది. "ఎందుకేడవ్వొద్దు ఇంతకష్టం వచ్చిపడ్డాక? అసలు ఎవరైనా ఏడవాలన్నా వద్దన్నా ఇంకొకరి పర్మిషన్ కావాలా! నన్ను ఏడవ్వొద్దంటానికి కూడా ఇంక ఇతగాడి ఇష్టమేనా? నా యిష్టం. ఏడుస్తానంతే!". మరింతగా కావాలని ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్న వాణికేసి నిస్సహాయంగా చూశాడు రమణ.
వాణికిప్పుడు చాలా ఆనందంగా ఉంది. ఆనందంగా మరిన్ని కన్నీళ్ళు కార్చింది.
అత్తగారింట్లో కొత్త పెళ్ళి కూతురికి అన్నీ పరీక్షలే! ఏం తింటుంది. ఏం తినదు. ఇష్టం లేని కూరలేమిటి... ఏం పన్లు వచ్చు... ఏవి రావు... అన్నీ ఆరాలే! వాణికీ వాతావరణం మరీ చిరాకుగా ఉంది. అన్నీ తినటం అలవాటు చేసేయాలని వాణికి ఇష్టం లేని కూరలు, పచ్చళ్ళు రోజూ ఒకటి చేసి వడ్డిస్తున్నారు. మొహమాటంగా వాణి నంజటం అత్తగారింట్లో అందరికీ సంతోషంగా ఉంది.
"అమ్మలుకి పదహారు రోజుల పండగ దాకా ఎంగిలి తినిపిస్తుండు రమణా!" పెద్ద ముత్తయిదువ పెళ్ళిలో అన్నట్లు గుర్తు.
రమణ రోజూ ఏదో ఒక ఎంగిలి తినిపించాలని నిజాయితీగా ప్రయత్నం చేస్తున్నాడు. వాణికిదంతా కంపరంగా ఉంది. ససేమిరా ఎంగిలి తిననని భీష్మించుకుంది. అందరూ బుగ్గలు నొక్కుకున్నారు చాటుగా... ఎదురుగా...
వాణి తనకేమయినా తిని పెడుతుందేమోనని ఎదురు చూసిన రమణకి నిరాశే మిగిలింది.
తొలిరేయి. సినిమాల్లో చూపించే సరిగమలు కనిపించటం లేదు సరిగదా నవలల్లో చదివిన గిలిగింతలేవీ లేవు. కరెంటు లేదు. ఒకటే ఉక్కపోత... బయట పోలీసుల్లా బంధువుల కాపలా... వాణికి తిక్కగా ఉంది. రమణకి వాణి ధోరణి అర్ధంగాక తికమకపడుతుండగానే తెల్లారిపోయింది.
తెల్లవారాక ఆడబడుచు సరసం వింటే వాణికి కారం రాసుకున్నట్లయింది.
వాణి ఎన్నో సినిమాలు చూసింది. నవలలు చదివింది. జీవితం అలా ఎందుకు లేదు. అవన్నీ రంగుల కలలేనా? రమణ సినీ హీరోలా తనను ఆరాధించలేడా...
ఇటువంటి ద్వైదీభావాల మధ్య ఆమె నేలని తాకేలోపు ఇద్దరు బిడ్డల తల్లి అవటం సృష్టి సహజమే! ఆర్ధిక సమస్యలూ అంతే సహజం కాబట్టి దగ్గర్లో ఓ స్కూల్లో టీచర్ గా కూడా చేరింది. జీవితంలో చాలావరకు రాజీపడిపోయింది.... రమణ పెళ్ళప్పుడు ఎలా ఉన్నాడో... ఇప్పుడూ అలాగే ప్రవర్తిస్తున్నాడు. అదే కంగారు... అదే తొందర ప్రతి పనిలోనూ... ఇప్పుడు వాణికి రమణ అలా ప్రతిదానికి తొందరపడటం కూడా అలవాటయిపోయింది.
ఓ రోజు స్కూలునుంచి తలనొప్పిగా ఉందని కాస్త ముందుగా ఇంటికొచ్చిన వాణి బెడ్ రూంలో కనిపించిన దృశ్యం చూసి కొయ్యబారిపోయింది. బడుద్దాయి, ముద్దపప్పు అని ముద్దుగా తను పిల్చుకునే రమణ కౌగిట్లో ఎదురింటి సరోజ...
వాణికి నోట మాటరాలేదు.
సరోజ వాణిని చూస్తూనే రమణ చేతులు విడిపించుకుని పారిపోయింది.
రమణ తలొంచుకుని నిలబడ్డాడు. 'ఇదేమిటండీ?' అని వాణి ప్రశ్నిస్తే ఏం జవాబివ్వాలా అని ఆలోచిస్తున్నాడు. కానీ అతనికా అవసరం వాణి రానివ్వలేదు.
మౌనంగా లోపలికి పోయి యధావిధిగా పనిలో నిమగ్నమయింది.
ఆమె మనస్సులో బద్దలైన అగ్ని పర్వతాలు రమణ ఊహించగలడు... కానీ అతని తొందరపాటుకి శిక్ష ఏమిటో? అదే అతనిలో గిల్టీనెస్.
ఇలాగే రోజులు గడుస్తున్నాయి.
నాల్రోజులయ్యాక వాణి కోపం చల్లారాక అవీ ఇవీ చెప్పి ఆమెను ప్రసన్నం చేసుకోవాలని రమణ ఆలోచన.
వాణి యాంత్రికంగా తన పని ముగించుకుని ఉద్యోగం చేస్తూ వస్తున్నది. పిల్లలతో కూడా ముక్తసరిగా ఉంటోంది.
వాళ్ళు ఇంట్లో లేనప్పుడు ఇల్లు మరీ శ్మశానంలా నిశ్శబ్దంగా ఉంటోంది.
ఓ రోజు రమణే ధైర్యం చేసి అడిగేశాడు "ఇంకా నన్ను క్షమించలేవా, వాణీ?" అని దీనంగా చూశాడు.
ఆమె కళ్ళల్లో రాజీలేని నిరాసక్తత.
పిల్లల పెళ్ళిళ్ళు మధ్యవర్తుల ద్వారా అయిపోయాయి. పెళ్ళిలో కూడా మౌనంగానే బాధ్యత నిర్వర్తించిందామె.
కాలానికి ఏదీ పట్టదు. మౌన ప్రవాహానికి చెరోవైపు ఇద్దరూ మిగిలారు. అపరాధిలా అతను. విరాగినిలా ఆమె.
ఓ రోజు ఉదయం నిద్రలేచిన వాణికి అడుగుపడలేదు. నిలువునా నేలమీద పడిపోయింది. 'దబ్బు' మనే శబ్దం విని రమణ లేచాడు. డాక్టర్ చూసి 'పెరాలిసిస్' అన్నాడు. వాణికి కాలు, చెయ్యి పడిపోయాయి. మాట మాత్రం మిగిలింది. ఎంతమంది డాక్టర్లకి చూపించినా ఫలితం లేకపోయింది. మంచంలో ఉన్న వాణికి రమణ తనకి సేవలు చేయటం, అతని సాహచర్యం అసహనీయంగా ఉన్నాయి. మాట్లాడగలిగినా ఒక్కమాట కూడా మాట్లాడకుండా మూగతపస్సు చేస్తోంది మృత్యువు కోసం.
అలాగే కుంగి కృశించి పోయింది. రోజులు గడిచే కొద్దీ ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. కళ్ళు మాత్రం జ్యోతుల్లా వెలుగుతున్నాయి. రమణకి దిగులుగా ఉంది. ఆరోజు డాక్టర్ చెప్పేది ఆమెకి అర్ధమయింది.
"ఇక అట్టే బతకదు... లాస్ట్ మూమెంట్స్..." అని పెదవి విరిచాడు డాక్టర్.
రమణ వాణి చేయి పట్టుకొని దీనంగా అడిగాడు "వాణీ! ఇప్పటికైనా నన్ను క్షమించలేవా?" క్షమించానని ఒక్కమాట చెప్పు. పదహారేళ్ళుగా ఈ ఒక్కమాట కోసమే ఎదురుచూస్తున్నాను వాణీ! ప్లీజ్"
వాణి కళ్ళనుండి రెండు కన్నీటి చుక్కలు రమణ మునిచేతి మీదికి వెచ్చగా జారాయి.
"అదేపని నేను చేస్తే క్షమించేవారేనా?" అని ప్రశ్నిస్తున్నట్లున్నాయి చలనం ఆగిపోయిన ఆమె కళ్ళు.
పదహారేళ్ళ మౌనశిక్ష ముగించి అలసినట్లు శాశ్వత విశ్రాంతిలోకి నిష్క్రమించింది వాణి.
అతను మాత్రం యావజ్జీవిత శిక్షను మోస్తూ... ఇంకా అలాగే...
* * *