Facebook Twitter
అమ్మ మనసు

అమ్మ మనసు

 

- శ్రీమతి శారద అశోకవర్ధన్

"శరత్!....శరత్!" పరుగెత్తుకుంటూ  వొచ్చి  పిలిచింది, రోడ్డు దాకా వొచ్చి జగదాంబ. సూటుకేసు చేతిలో పట్టుకుని, పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ, వెనక్కి తిరిగి చూడకుండా, తనని కాదన్నట్టు  నడుస్తూ  పోతున్నాడు శరత్.

    "శరత్! శరత్!"  ఇంచుమించు పరుగెట్టినట్టుగా నడుస్తోంది  జగదాంబ.

    శరత్ పక్కనున్న ఆటో ఎక్కి 'పోనీ' అన్నాడు.

    "శరత్!" అని పెద్దగా అరుస్తూ  పిలిచింది జగదాంబ, అది రోడ్డు అన్న సంగతి కూడా మర్చిపోయి  ఆటో ఆమె గుండెల మీదుగా పోతూన్నట్టుగా అనిపించింది. గుండె  ముక్కలైనట్టనిపించింది కళ్ళు తిరిగి కనుగుడ్లు  రోడ్డుమీద పడిపోయినట్లుగా అనిపించి, చీకటికి  రోడ్డుమీద ఏమీ కనిపించక ధబాలున అక్కడే పడిపోయింది జగదాంబ.

    "ఎవరో పాపం! ఉన్నట్టుండి పడిపోయింది."

    "ఎవర్నో పిలుస్తూ పిలుస్తూ  పరుగెత్తింది. ఆ అబ్బాయి వినిపించుకోకుండా ఆటోలో  వెళ్ళిపోయాడు. అంతే! ఈమె పడిపోయింది."

    "వెంట ఎవ్వరూ  ఉన్నట్టు  లేదు. ఇప్పుడేం చేద్దాం? ఆసుపత్రికి తీసికెళ్ళి చేర్పిద్దామా?" మరో కంఠం.

    "ఆఁ....మనకెందుకు? ముట్టుకుంటే  ముప్పులొస్తయ్." మరో గొంతు.

    "అయ్యో! నన్ను  ఆసుపత్రికి  తీసికెళ్లకండి. ఇంట్లో పడెయ్యండి" అని చెప్పాలనుకుంది. నోట మాట రావడం లేదు. కళ్లు తెరిచి వారికేసి చూడడానికి ప్రయత్నం చేసింది. చుట్టూ జనం మసక మసకగా  కనిపిస్తున్నారు. పెదవి విడడం లేదు మాట్లాడడానికి.   

    "పాపం, ఆడకూతురు! ఆసుపత్రిలో చేర్పించేసి  పోదాం. దిక్కులేని దానిలా వుంది" అంటూ కొందరు ఒక ఆటో ఆపి ఆమెని మోసుకుని ఆటోలో పడుకోబెట్టారు మెల్లగా.

    ఆసుపత్రిని  తలుచుకుంటే ఆమె గుండె మరీ వేగంగా కొట్టుకోవడం మొదలెట్టింది. అనుకోని  ఈ సంఘటనకి  ఒళ్ళు జలదరించి పోతూంటే, శరత్ జ్ఞాపకం వచ్చి కళ్లు వర్షించాయి.

    ఆటోలో  నుంచి ఒకతను దిగి ఆసుపత్రి అవుట్ పేషంటు  డాక్టరుకి చెప్పి స్ట్రెచ్చరు తెప్పించి  ఆమెను దింపి  లోపలికి పంపించి, వెళ్ళిపోయాడు. నర్సులు ఆమెని లోపల పడుకోబెట్టారు. ఆసుపత్రి వాతావరణం చూడగానే, నిజంగానే సొమ్మసిల్లి పోయింది ఆమె. "నీ పేరు...." తట్టి తట్టి కొట్టి అడుగుతూన్న నర్సుతో మెల్లగా చెప్పింది "జ....గ....దాం....బ...." అని.

    బి.పి. బాగా ఎక్కువగా ఉందని అడ్మిట్ చేసుకున్నారు ఆసుపత్రిలో.  కళ్లు తెరిచి చూసిన జగదాంబ వార్డులో మంచం మీద పడుకునుంది. పక్క మంచం పేషంటు దగ్గరున్నావిడ జగదాంబను చూసి, "హమ్మయ్య! ఇక ఫరవాలేదు. మూడు రోజుల తరవాత  ఇప్పుడు కళ్లు తెరిచి చూశారు" అంది. నర్సు గబగబా వొచ్చి నాడి చూసి నవ్వుతూ, "ఓ.కే! ఫరవాలేదు" అంది.

    జగదాంబ కూడా సమాధానంగా చిరునవ్వు నవ్వింది.

    "మీదేవూరు?" అడిగింది నర్సు.

    "ఈ ఊరే."

    "మీ ఇల్లెక్కడ?"

    "హిమాయత్ నగర్."

    "మీరు రోడ్డుమీద  పడిపోతే  ఎవరో పట్టుకొచ్చి ఇక్కడ చేర్పించారు. మీ వాళ్లెవరూ రాలేదు. బహుశ చేర్పించినవాళ్ళకి  మీ యిల్లు తెలీదు. మీ వాళ్ళకి మీ రిక్కడున్నట్టు తెలీదు. మీ వాళ్ళకి చెప్పమంటారా?"

    "ఒద్దు, నేనే వెళ్ళిపోతాను." కంగారుగా అంది జగదాంబ.

    "మీరు వెళ్ళే స్థితిలో లేరు. కనీసం రెండు మూడు రోజులైనా  ఉండాలి. పేపర్లో  ప్రకటించినట్టున్నారు మీ గురించి."

    జగదాంబ కంగారుపడుతూ "ఏమని?" అడిగింది. 

    "ఫలానా పేరుగల వ్యక్తి, ఫలానా చోట పడిపోతే ఆసుపత్రిలో చేర్పించారు. బంధువులూ, కుటుంబ సభ్యులూ  ఫలానా ఆసుపత్రికొచ్చి ఆమెని చూసుకుని వెళ్ళొచ్చు అని."

    జగదాంబ కళ్ళలో నీళ్ళు సుళ్ళు తిరిగాయి. ఏదో అవమానంగా ఫీలయింది. సిగ్గుతో బిక్కచచ్చినట్టనిపించింది. కానీ వెంటనే ఏదో స్పురించినట్టయి కళ్లు కాంతివంతమయ్యాయి.

    "సిస్టర్!" అని పిలిచింది.

    "ఏమిటి?" సిస్టర్ నవ్వుతూ దగ్గరికొచ్చింది.

    "నాకోసం  ఎవరైనా వొచ్చారా?" అడిగింది ఆత్రంగా.

    "లేదు" అంది సిస్టర్.

    "మీ ఫోటో, మీ పేరూ రెండూ పేపర్లో కూడా వేయించాం. పోలీసు రిపోర్టు రాగానే!"

    "అవునా?" కంగారుగా లేచి కూర్చోబోయింది జగదాంబ.

    ఒళ్ళు తూలినట్టయి లేవలేకపోయింది.

    "లేవకండి, పడుకోండి. ఏం కావాలి మీకు?" అడిగింది మెల్లగా వెల్లకిలా పడుకోబెడుతూ  నర్సు.

    "ఏం వొద్దమ్మా! నాకోసం ఎవరూ రాలేదా?" దుఃఖాన్ని దిగమింగుకుంటూ  జాలిగా నర్సు కళ్ళల్లోకి  చూస్తూ అడిగింది.

    ఆమె మాటల్లో, ఆమె చూపుల్లో ఆమె ఎవరికోసమో ఎదురుచూస్తూ  తపించి పోతోందని అనుకుంది సిస్టర్.

    "ఎవరూ రాలేదండీ! మీరు ఎవరికోసం ఎదురుచూస్తూన్నారు?" సందేహంగా  అడిగింది.

    జగదాంబ  మొహంలో  బొట్టూ, కాటుకా ఏమీ లేకపోవడమూ, మట్టెలూ, మంగళసూత్రాలూ  ఏమీ లేకపోవడంవల్ల ఆమె విధవరాలో, అవివాహితో అర్ధంకాక అలా అడిగింది.

    జగదాంబ సిస్టరడిగిన ఏ ప్రశ్నకీ సమాధానం చెప్పలేదు. గట్టిగా కళ్ళు మూసుకుని ఆలోచనల్లో పడిపోయింది. అది చూసి సిస్టర్ ఆమెని యింకే ప్రశ్నా అడగకుండా వెళ్ళిపోయింది.

    రోజులు గడుస్తున్నాయి. జగదాంబ బి.పి. తగ్గడంలేదు. ఆసుపత్రివారిచ్చే భోజనం  ముట్టడంలేదు. ఎవ్వరితోటీ  మాట్లాడడంలేదు. ఎప్పుడూ  శూన్యంలోకి చూస్తూ ఏదో ఆలోచిస్తూ పడుకునుంటోంది డాక్టర్లూ, నర్సులూ, ఇరుగుపొరుగు పేషంట్ల తాలూకువాళ్ళు ఎవ్వరితోటీ  మాట్లాడదామె. ఆమె మనస్తత్వం ఎవ్వరికీ అర్ధంకావడంలేదు. 'సైక్రియాట్రిస్ట్' వొచ్చి చూసివెళ్ళాడు. ఆమెనిండా గుబులు నిండివుందనీ, ఎవరికోసమో ఆమె తీవ్రంగా  ఎదురుచూస్తోందనీ, ఆ నిరాశవల్లే ఆమె మాట్లాడలేకపోతుందనీ, ఆమె ఎదురుచూసే వ్యక్తి కనిపిస్తే తప్ప ఆమె పరిస్థితి మారడం కష్టమనీ చెప్పి వెళ్ళాడు.

    మామూలుగా అయితే ఈ ధర్మాసుపత్రిలో కానీ ఖర్చు చెయ్యని యిటువంటివారి గురించి  ఎవరూ పట్టించుకునుండేవారు కారు. కానీ సిస్టర్ లూసీకి ఎందుకనో జగదాంబ పైన ఒకరకమైన జాలి ఏర్పడి, ఆమె డాక్టర్లందరికీ జగదాంబ తనకి దూరపు బంధువనీ, చాలాకాలం తరువాత కలుసుకోవడం వల్ల మొదట గుర్తుపట్టలేదనీ ఏవో కథలు చెప్పి- పెద్ద డాక్టర్లందరిచేత పరీక్ష చేయిస్తోంది.

    దాదాపు పది రోజులు గడిచిపోయాయి. ఈ పది రోజుల్లోనూ ఆమె ఒక్క మాట కూడా ఎవ్వరితో మాట్లాడలేదు. మతిస్థిమితం పోయిందేమో, మెదడు వ్యాధుల ఆసుపత్రికి పంపించాలని కొందరు డాక్టర్లు అభిప్రాయపడ్డారు.

    సిస్టర్ లూసీ పెషంట్లందరికి టెంపరేచర్ చూసి, మందు లివ్వవలసిన వాళ్ళందరికీ మందులిచ్చేసి, తన డ్యూటీ అయిపోవడంతో, జగదాంబ మంచం దగ్గరకొచ్చి "వెళ్ళొస్తాను. నా డ్యూటీ అయిపోయింది" అని చెప్పింది. జగదాంబ మామూలుగా అయితే ఉలుకూ పలుకూ లేకుండా వూరుకునేదే. కానీ అలాకాక సిస్టర్ చెయ్యిపట్టుకుని "నాకోసం ఎవరూ రాలేదా?" అని అడిగింది.

    "లేదు" అని సిస్టర్ లూసీ తలూపి, "మీ అడ్రస్ చెప్పండి. మీవాళ్ళని నేను పిల్చుకొస్తాను" అంది. జగదాంబ సమాధానం చెప్పలేదు.

    సైగచేసి చూపించింది కాగితమూ, పెన్సిలూ తెమ్మని. లూసీ గబగబా వెళ్ళి డాక్టరు రూములో నుంచి కాగితమూ పెన్సిలూ తెచ్చియిచ్చింది.

    "బాబూ శరత్! అమ్మ మనసు నీ కర్ధంకాలేదురా! పెళ్ళినాటినుంచీ నువ్వు భూమిమీద పడేవరకూ కట్నం ఎక్కువ తీసుకురాలేదని, నన్ను రాసి రంపాన పెట్టేరు అత్తమామలు. నిండు చూలాలినని కూడా దయా దాక్షిణ్యాలు లేకుండా  గొడ్డులా  చాకిరీ చేయించుకుని, పట్టెడన్నం  పెట్టకుండా  మలమల మాడ్చి చంపినా నీమీద ప్రేమతో ఆత్మహత్య చేసుకోకుండా  బతికేను కానీ ఆ చిరాకులో, పరాకులో నువ్వు పుట్టినా, నువ్వేడుస్తూవుంటే  ఎత్తుకుని లాలించక నీమీద విసుక్కున్నానని కోపగించావా బాబూ ఈ అమ్మపైన?

    వొంటిమీది నగలన్నీ మీ నాన్న తాగుడుకి నిలువుదోపిడీ యిచ్చి, నువ్వు గోళీకాయలు కొనుక్కుంటానన్నా, పతంగులు కొనుక్కుంటానన్నా  డబ్బులు లేవన్నానని అలిగావా బాబూ అమ్మపైన?

    తాగిన మైకంలో మీ నాన్న నన్ను కుక్కను బాదినట్టు బాదితే, ఆ బాధ భరించలేక తిరిగి ఏమీ చెయ్యలేక ఆ కోపం నీమీద చూపించాను- నువ్వేదో కావాలని గొడవచేస్తూవుంటే, చెళ్ళున చెంపమీద కొట్టి  అసహ్యించుకున్నాననా బాబూ? అమ్మంటే కోపం?

    ఎన్ని రోజులు వస్తున్నా, ఎన్ని దెబ్బలు తిన్నా, ఎన్ని చీదరింపులు భరించినా, అన్నీ నీకోసమే ఓర్చుకుని బతికున్నానని నీ చిన్ని మనసు కేం తెలుసు?

    అత్తమామలు ఇంట్లోంచి తన్ని తగిలేసినా, మీ నాన్న మరొక మనిషిని చేసుకుని నన్నొదిలేసినా, నేనింకా బతికేవున్నానంటే  అది నీకోసమేనని నీ పసి మనసుకేం తెలుసు?

    నాకు కూడు లేకపోయినా, నీ గోడు చూడలేక ఊడిగం చేసి, వొళ్ళమ్ముకుని నీకోసమే ప్రాణాలతో మిగిలేనని నీకెలా చెప్పను బాబూ?

    నువ్వెక్కడున్నా క్షేమంగా వుండాలి! ఎప్పటికైనా అమ్మ గుర్తుకొస్తే, నా గాధ నిన్ను కదిలిస్తే, నే చెప్పింది నిజమనితోస్తే రెండు కన్నీటిబొట్లు కార్చు!  నా పరితప్త హృదయానికవి ఉపశమనం కలిగిస్తాయి!

    బాబూ, ఒక్కమాట! నువ్వు పెరిగి పెద్దవాడివయ్యాక ఏ ఆడపిల్ల మనసునీ కష్టపెట్టకు బాబూ! ముఖ్యంగా కట్టుకున్నదాన్ని కన్నీరు పెట్టకుండా చూడు బాబూ! ఇదే నేను నిన్నడిగే వరం! నువ్వు నాకిచ్చే ప్రతిఫలం! అంతకన్నా  ఇంకేదీ కోరను బాబూ! నిన్ను చూడాలనే కోరికతో ఇన్నాళ్ళూ ఒళ్ళంతా కళ్ళు చేసుకుని బతికున్నాను బాబూ! ఇంక నావల్ల కాదు. వెళ్ళిపోతున్నాను.  మళ్ళీ  జన్మంటూ వుంటే నువ్వే నాకు బిడ్డగా పుట్టాలనీ, నా వొళ్లోంచి నిన్ను దింపకుండా ముద్దులు కురిపిస్తూ పెంచాలనీ ఆశిస్తూ కళ్ళు మూసుకుంటున్నాను. క్షమించు బాబూ! ఈ జన్మకి ఇంకేమీ చెయ్యలేను.

                     

                         ప్రేమతో,
                        మీ అమ్మ..
                        జగదాంబ."

   

ఉత్తరాన్ని మడిచి నర్సు చేతికిచ్చింది. "దీన్ని అచ్చువేయించమ్మా పేపర్లో" అంది మెల్లగా. అంతే! ఆమె తల పక్కకి వాలిపోయింది. నర్సు హడావుడిగా పల్సు చూసింది. కంగారుగా డాక్టర్ని పిలిచింది. డాక్టరు పెదవి విరిచాడు.

    ఏనాటి బంధమో! చుట్టమని  చెప్పినందుకు ఆమె బాధ్యత నర్సు లూసీ మీద పడింది. టాక్సీని పిలిపించి నలుగురు మనుష్యులకి డబ్బిచ్చి శవాన్ని తీయించి దహనసంస్కారాలు చేయించింది. ఆమె రాసిన ఉత్తరాన్ని ఆమె కోరిక ప్రకారం అన్ని పేపర్లలోనూ  వేయించింది. ఎవరైనా ఒస్తారేమోనని ఎదురుచూసింది. కానీ ఎవ్వరూ రాలేదు. "ఎక్కడున్నాడో, పాపం!" అనుకుంటూ ఆసుపత్రికి వొచ్చిన నర్సుకి "లూసీ! ఎవరో శరత్ అనే అబ్బాయొచ్చి వెళ్ళిపోయాడు ఆ జగదాంబగారికోసం" అని చెప్పింది సిస్టర్ జానకి.

    "ఎక్కడి కెళ్ళాడు? ఏం చెప్పాడు?" ప్రశ్నించింది లూసీ.

    "ఏమీ చెప్పలేదు. ఆమె చనిపోయింది అని చెప్పగానే వెళ్ళిపోయాడు కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ" అంది.

    అంతే! అప్పటినుంచి ఇప్పటివరకూ సిస్టర్ లూసీ శరత్ కోసం ఎదురు చూస్తూనేవుంది....!