TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
నాకున్నది ఒక చక్కని బొమ్మ
ఎపిసోడ్ - 6
- వసుంధర
అమ్మెప్పుడూ నాన్ననే కొట్టమంటుంది. ఒక్కగానొక్క కొడుకుని గదా! తనసలు కొట్టలేదు నన్ను. నాన్నతో అలా చెప్పగానే ఆయన 'సరే కొడతాను కానీ ఎంతసేపు కొట్టాలి' అని అడిగారు. 'ఇదీ నన్నడగాలా ఏడ్చేదాకా కొట్టండీ' అంది అమ్మ. అమ్మ నోట్లోమాట పూర్తికాకుండానే నేను పెద్దగా ఏడుపు మొదలెట్టాను. ఒక్కగానొక్క కొడుకును కదా! నాన్న నా ఏడుపు చూడలేకపోయాడు. 'సరేలే! ఇంకెప్పుడూ ప్లేట్లు బద్దలు కొట్టకు' అని నాన్న వెళ్ళిపోయారు" అన్నాడు కిష్టిగాడు.
"మరి మీ అమ్మ, మీ నాన్నగారు నీ వీపు బద్దలు కొట్టారని చెప్పింది" అనడిగాడు.
"అదా. అమ్మెప్పుడూ అలాగే అబద్ధాలు చెబుతుంది. అమ్మలూ, నాన్నలూ వాళ్ళ వాళ్ళ పిల్లల గురించి ఇరుగువాళ్ళకీ, పొరుగువాళ్ళకీ కొంచెం అబద్ధాలు చెప్పాలిట. నేనెంత అల్లటి చేసినా సరే-మావాడు అస్సలు అల్లరి చేయడు అనాలిట. ఎప్పుడైనా అల్లరి చేస్తే చావా చితకదన్నేస్తాం అని చెప్పాలట. అలా చెప్పకపోతే అంతా నీతులు, సలహాలు మొదలెడతారు. చిన్నపిల్లల్ని చిన్నప్పట్నించీ అదుపులో పెట్టకపోతే పాడైపోతారంటారుట. 'మొక్కైవంగనిది మానై వంగుతుందా ?' అని సామెతలు కూడా చెబుతారట. నీతులు, సామెతలు చెప్పడానికేగాని వినడానికి బాగుండవుట. సలహాలు కూడా అంతే. ఇవ్వడానికే గానీ పుచ్చుకోవడానికి బాగుండవుట" అన్నాడు కిష్టిగాడు.
"సరేలే, నా కొత్త గౌను బాగుందా ?" అనడిగాను.
"కొత్త గౌనా ! చెప్పేదాకా నాకు తెలియలేదే?" అన్నాడు కిష్టిగాడు.
వాడెప్పుడూ ఇంతే! అస్సలు దేనికీ మెచ్చుకోడు. అయినా తప్పదు, నాకు వాడు తప్ప వేరే స్నేహితులు లేరు మరి !
"ఇది మా బాబాయి అమెరికా నుంచి తెచ్చాడు. తెలుసా!" అన్నాను.
"అమెరికా నుండి నీకు గౌను తెచ్చాడా? మరి బొమ్మ తెస్తానన్నాడు, తేలేదా?" అనడిగాడు కిష్టిగాడు.
"బొమ్మ కూడా తెచ్చాడు. నాతో వస్తే చూపిస్తాను...." అన్నాను.
కిష్టిగాడి కళ్ళు పెద్దవయ్యాయి. వాడిది ఊహించినట్లు లేదు. చాలా ఆశ్చర్యపడ్డాడు. "నిజంగా?" అన్నాడు.
"నీకులా నేనేమీ అబద్ధాలు చెప్పను తెలుసా?" అందామనుకున్నాను. కానీ అలాగంటే వాడు నా బొమ్మను చూడ్డానికి రానంటాడు. వచ్చినా బొమ్మ బాగోలేదని తీసిపారేస్తాడు. అందుకని "నాతో రా- నీకే తెలుస్తుంది!" అన్నాను. వాడు వచ్చి నా బొమ్మను చూసి మెచ్చుకుంటేగానీ నాకు తృప్తిగా వుండదు.
కిష్టిగాడు నాతో వచ్చాడు. బొమ్మను చూశాడు. వాడి ముఖం చూడగానే నాకు తెలిసిపోయింది బొమ్మ వాడికి నచ్చిందని.
వాడు బొమ్మను పడుకో పెట్టాడు. నోట్లోంచి పాలపీక తీసి ఏడ్పించాడు. వీపు వెనుక బటన్ నొక్కి పాట పాడించాడు.
"బాగుందే!" అన్నాడు.
"నీకు నచ్చిందా?" అన్నాను.
"నచ్చింది. కానీ ఈ బొమ్మకు ప్రాణం వుంటే ఇంకా బాగుంటుందిగా" అన్నాడు కిష్టిగాడు.
"ప్రాణం వుండడం అంటే?" అని అడిగాను.
"నాకు తమ్ముడు పుడుతున్నాడని అమ్మ చెప్పింది. ప్రాణం వున్న బొమ్మ అంటే అది!" అన్నాడు కిష్టిగాడు.
కిష్టిగాడు అసూయతో అన్న మాటలివి. నాకు తెలుసు. అందుకే వాడిని ఏడిపించాలని "ఈ బొమ్మకు నేనే అమ్మను. తెలుసా?" అన్నాను.
"అయితే ఏం?"
"తమ్ముడినైతే నీ యిష్టం వచ్చినట్లు ఆడించడానికి వుండదు. నా బొమ్మ నా యిష్టం. దీన్నేం చేసినా నన్నెవ్వరూ తిట్టరు. దీంతో అన్ని సరదాలూ తీరుతాయి. పైగా ఇది ఉచ్చ పోయదు. బట్టలు పాడుచేసుకోదు. బొమ్మకే అమ్మగా వుంటే ఎంతో సుఖం" అన్నాను.
"నువ్వు చెప్పిందీ నిజమే! కానీ నీ బొమ్మ ఆడదైపోయింది. 'మనమెప్పుడైనా బొమ్మలా పెళ్ళి చేసుకున్నామనుకో అప్పుడు నువ్వు ఆడ పెళ్ళివారి వైపోతావు. నాకు ఆడపెళ్ళి వారి జట్టు ఇష్టం వుండదు" అనేసి వెళ్ళిపోయాడు కిష్టిగాడు.
నేను రెండు పెళ్ళిళ్ళకు వెళ్ళాను. రెండు పెళ్ళిళ్ళలోనూ మగపెళ్ళివారు చాలా అధార్టీ చేశారు. ఆడ పెళ్ళివారు అణగి మణగివున్నారు.
నేను వెంటనే బాబాయి దగ్గరకు వెళ్ళి "నాకు మగబొమ్మ తేకుండా ఆడబొమ్మ తెచ్చావేం బాబాయ్?" అని అడిగాను.
"ఏ బొమ్మ అయితే ఏం?" అన్నాడు బాబాయి.
నేను ఆడపెళ్ళి వారి గురించి చెప్పాను.
"చూడమ్మా అమ్మలూ! ఆడపెళ్ళి వారు, మగపెళ్ళి వారు అంతా సమానమే! ఆడపెళ్ళి వారు మగపెళ్ళివారిని గౌరవించడం పాత పద్ధతి. అలాంటి పాత పద్ధతులకు నువ్వు స్వస్తి చెప్పాలి. అందుకే నీ కోసం ఆడబొమ్మ తెచ్చాను" అన్నాడు బాబాయి.
అప్పటికింకేమీ అనలేదు నేను. కానీ నా సమస్య మళ్ళీ మొదటికి వస్తుందని అప్పటికి తెలియదు నాకు.
సాయంత్రం కిష్టిగాడు ఓ కుర్రాడిని వెంట బెట్టుకుని వచ్చాడు. మా వీధికి రెండు వీధులవతల ఓ డాక్టరుగారు ఉన్నారుట. వాళ్ళబ్బాయిట వాడు. పేరు సుధాకర్ అని చెప్పాడు.
'మేము మగపెళ్ళి వారం. పిల్లను చూసుకునేందుకు వచ్చాం. మీ అమ్మాయిని చూపించు. మర్యాదలు బాగా చేయాలి. లేకపోతే పిల్ల నచ్చలేదని అనేస్తాము" అన్నాడు కిష్టిగాడు.
వాడేమంటున్నాడో నాకు అర్ధం కాలేదు. కాసేపటికి తెలిసింది. సుధాకర్ ఇంట్లో కూడా ఓ మంచి బొమ్మ వున్నదట. అది అబ్బాయి బొమ్మ అట. ఆ బొమ్మకూ, నా బొమ్మకూ పెళ్ళి చేయించాలని కిష్టిగాడి తాపత్రయం.
"మర్యాదలేమీ చెయ్యను. మీరు మర్యాదగా మాట్లాడితేనే నా బొమ్మను చూపిస్తాను" అన్నాను.
"ఉత్తుత్తినే సరదాకు అన్నానే! చూపించవే" అన్నాడు కిష్టిగాడు.
వాళ్ళిద్దరూ నా బొమ్మను చూశారు.
"ఎంత బాగుందో!" అన్నాడు సుధాకర్.
"ఇంకేం. పిల్ల నచ్చినట్లే" అన్నాడు కిష్టిగాడు.
"మీకు పిల్ల నచ్చినా నేను ఇవ్వను గదా!" అన్నాను.
సుధాకర్ అన్నాడూ "నా బొమ్మను తీసుకొస్తాను. ఇక్కడ ఆడుకుందామా!" అని.
"అలాగే తీసుకురా" అన్నాను.
కాసేపట్లో సుధాకర్ వాడిబొమ్మతో వచ్చాడు. ఆ బొమ్మ కూడా బాగానే వుంది. అది అమెరికా బొమ్మ కాదు. కాని నా బొమ్మంత ఎత్తూ వుంది. నిలబడినప్పుడు కళ్ళు తెరిచి, పడుకున్నప్పుడు కళ్ళు మూస్తుంది.
"రెండు బొమ్మలకూ పెళ్ళి చేద్దాం" అన్నాడు కిష్టిగాడు.
"నువ్వు మర్యాద పేరెత్తకూడదు మరి!" అన్నాను.
"ఎందుకని? మగపెళ్ళి వారికి మర్యాద చేయకుండానే నీ బొమ్మకు పెళ్ళి చేస్తావా?" అన్నాడు వాడు.
నేను ఒక్కసారి రెండు బొమ్మల్నీ పరీక్షగా చూశాను. ఇంచుమించు ఒక్కలాగే వున్నాయని. అప్పుడు నాకో ఉపాయం స్పురించింది. నా బొమ్మ జుట్టును పక్క పాపిడిలో దువ్వాను. సుధాకర్ బొమ్మను చేత్తో పట్టుకుని "ఈ బొమ్మలకు బట్టలు మారుద్దామా, ఎలా వుంటాయో చూద్దాం" అన్నాను. సుధాకర్ ఒప్పుకున్నాడు.
నా బొమ్మ బట్టలు సుధాకర్ బొమ్మకి, సుధాకర్ బొమ్మ బట్టలు నా బొమ్మకి మార్చాను. సుధాకర్ బొమ్మకి రెండు జడలు వేశాను.
ఆశ్చర్యం! ఇప్పుడు నా బొమ్మ అబ్బాయిగానూ, సుధాకర్ బొమ్మ అమ్మాయిగానూ మారిపోయాయి.
"ఇప్పుడు ఎవరు ఎవరికి మర్యాదలు చేయాలిరా కిష్టిగా!" అన్నాను.
కిష్టిగాడికి నోట మాట రాలేదు.
నేను పాట ప్రారంభించాను.
"నాకున్నది ఒక చక్కని బొమ్మ దానికి నేను అమ్మ
అది అమ్మాయా, అబ్బాయా! అని అడగకూడదు
గౌను తొడిగితే అమ్మాయి
అది పాంటు తొడిగినపుడబ్బాయి"
సుధాకర్ చప్పట్లు కొట్టి "భలేభలే పాట చాలా బాగుంది" అన్నాడు.
నాకు సుధాకర్ చాలామంచివాడులా కనిపించాడు. వాడు ఎలాంటి వాడో అసలు విషయం తర్వాత నాకు తెలిసింది.
మళ్ళీ బొమ్మల బట్టలు, వేషం యథా ప్రకారం మార్చేశాం.
నాకు ఇప్పుడు చాలా సంతోషంగా వుంది. బొమ్మకు రకరకాల డ్రస్సులు కుట్టించాలను కున్నాను. కొన్ని అబ్బాయివి, కొన్ని అమ్మాయివి.
సుధాకరూ, కిష్టిగాడు వెళ్ళిపోయాక జరిగిందంతా బాబాయికి చెప్పాను. బాబాయి నన్ను చాలా మెచ్చుకోవడమే కాకుండా మర్నాడు టెయిలర్ని ఇంటికి రప్పిస్తానని చెప్పాడు.
రాత్రి నేను బొమ్మను పక్కలో పెట్టుకుని పడుకున్నాను. అలా పడుకుంటే ఎంత బాగుందో! అందుకేనేమో నేను తన పక్కలో పడుకోనంటే నా చిన్నప్పుడు అమ్మ నన్ను బ్రతిమాలి మరీ పడుకో బెట్టుకునేది. ఇప్పుడు పెద్దదాన్నయి పోయాను కాబట్టి వేరే పడుకుంటున్నాను.
మర్నాడు ఉదయం నిజంగానే మా ఇంటికి టెయిలర్ వచ్చి బొమ్మకు కొలతలు తీసుకుని వెళ్ళాడు. రెండు రోజుల్లోనే అరడజను అమ్మాయి బట్టలు, అరడజను అబ్బాయి బట్టలు తెచ్చి ఇచ్చాడు.
బాబాయి కొద్ది రోజులు వుండి బొంబాయి వెళ్ళిపోయాడు. బాబాయికి అక్కడ ఉద్యోగంట.
బాబాయి వెళ్ళిపోయాక ఇంట్లో నా కష్టాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు నేను కిష్టిగాడి దగ్గరకు కూడా వెళ్ళడం మానేశాను. నా బొమ్మతోనే నాకు కాలక్షేపమై పోతోంది.
"ఇరవై నాలుగు గంటలూ బొమ్మతో ఏం చేస్తావే?" అని అమ్మ నన్ను కసురుతూంటుంది.
కానీ అమ్మకేం తెలుసు. నా బొమ్మ కదలదు, మెదలదు అనుకుంటుంది అమ్మ. కానీ అది చేసే అల్లరి ఇంతా అంతా కాదని అమ్మకు తెలియదు. అందుకే నన్ను కసురుతుంది.
బొమ్మకు చక్కగా జడ వేసి కూర్చోపెట్టి చదువు చెప్పాలనుకుంటాను. దానిచేత చెయ్యి పట్టి అఆలు దిద్దించాలనుకుంటే అప్పుడేం జరుగుతుందో తెలుసా! అది కూర్చున్నదల్లా ముందుకో, వెనక్కో పడిపోతుంది. ముందుకుపడితే పలకమీద సుద్ద అంటుకుంటుంది, వెనక్కు పడితే జడ రేగిపోతుంది.
ఒకోసారి దాని బట్టలు సరిచేస్తూంటే వెనకాలున్న మీట నొక్కుకుని పాట పాడడం ప్రారంభిస్తుంది. నేనేమో ఉలిక్కిపడి చేతిలోంచి జారవిడుస్తాను. కింద పడుతుంది. నోట్లో పాలపీక లేదు కాదా, ఒకటే ఏడుపు. పడుకోగానే దాని నోట్లో పాలపీక వుండాలి.
నేనెంత జాగ్రత్తగా వున్నప్పటికీ బొమ్మకు ఏవో అంటుకుంటూనే వుంటాయి. గోళ్ళరంగులో తిలకమో, కాటుకో ఏదో ఒకటి! వెంటనే దానికి స్నానం చేయించాలి కదా!
ఇలా నాకు బొమ్మతో ఎన్నో పనులు వుంటాయి. బొమ్మకు నీళ్ళోసి, జడవేసి, బొట్టుపెట్టి, అక్షరాలు దిద్దించి, అన్నం పెట్టి పడుకోబెట్టాలి. దాని బట్టలు వుతకాలి. అన్నీ జాగ్రత్తగా దాచాలి.
అమ్మకెన్ని పనులున్నాయో నాకూ అన్ని పనులూ వున్నాయి. కానీ అమ్మ అర్ధం చేసుకోదు. మహా-తనే అమ్మనని అనుకుంటుంది. నేను మాత్రం నా బొమ్మకు అమ్మను కానా?
ఈ బొమ్మ గురించి రోజూ అమ్మకీ నాకు పెద్ద గొడవ.
నేను బొమ్మకు నీళ్ళోద్దామని కూర్చుంటాను. దాని బట్టలు విప్పుతాను. అప్పుడు అమ్మ పెద్దకేక పెడుతుంది. "ఒసేయ్ అమ్ములూ నీళ్ళోసుకుందువు గాని రావే!" అని.
ఇంక తప్పదు మరి. నా బొమ్మకు నీళ్ళోయడం మానేసి అమ్మ దగ్గరకు వెళ్ళాలి.
నేను బొమ్మకు లెక్కలు చెబుతూంటాను. మళ్ళీ అమ్మ పెద్ద కేక "ఏమే అమ్ములూ సెలవుల్లో నీకు హోంవర్కు చేయమని ఇచ్చారు గదా! అసలు ఒక్కసారైనా పుస్తకాలు ముట్టుకున్నావా?" అని.
ఇంకేం చేస్తాను. బొమ్మకు చదువు చెప్పడం మానేసి నేనే చదువుకోవడం మొదలెడతాను.
పెద్దాళ్ళయితే ఇంచక్కా అదృష్టం. చిన్న వాళ్ళకి నీతులు చెప్పొచ్చు. ఇప్పుడు నేనూ అమ్మనేగా! నా బొమ్మకు బుద్దులు నేర్పుతుంటాను. మళ్ళీ అమ్మ కేక- అల్లరి చేయొద్దని.
ఇలాగుంటుందా! తీరా నా బొమ్మని నిద్రపోగొట్టే సరికి మాత్రం అమ్మా, కిష్టిగాడి అమ్మా కలసి పెద్ద గొంతులతో కబుర్లు. మరి అది మాత్రం అల్లరికాదూ? వాళ్ళలా అల్లరిచేస్తూంటే నా బొమ్మకు నిద్రెలా పడుతుంది?
అమ్మతీరు ఇలా వుంటే నా బొమ్మ ఎలాగు బ్రతుకుతుంది? నా బొమ్మ కోసం నా తల్లి ప్రాణం గిలగిలలాడిపోతూంటుంది. కానీ అమ్మ అర్ధం చేసుకోదు. నాకేమైనా అయితే అమ్మ ఎంత కంగారు పడిపోతుందో? నాకు కాస్త జ్వరం వచ్చిందంటే అమ్మ కళ్ళలోకి నీళ్ళు కూడా వస్తాయి. అమ్మకు నేనంటే ఇంత ప్రేమకదా? తనకు తల్లిప్రేమ తెలుసును గదా! మరి నా బాధను అర్ధం చేసుకోదేం?
నేను నా బాధను మామ్మకు చెబితే మామ్మ నవ్వేసింది. దీన్నే 'పిల్లికి చెలగాటం ఎలక్కి ప్రాణసంకటం' అంటారు. మామ్మకు నేనేం చెప్పినా ఆటగానే వుంటుంది. కానీ తర్వాత మాత్రం అమ్మను పిలిచి తిట్టింది.
అమ్మ విసుక్కుని "దీనికీ వెధవ బొమ్మ తప్ప ఇంకేమీ అక్కర్లేదులా వుంది. ఆ బొమ్మను ఎవరికైనా అమ్మేసినా బాగుండును. ఇది బాగుపడేది" అంది.
అమ్మలు పిల్లల్ని ప్రేమిస్తే చెడిపోతారా? అమ్మ అలాగనడం నాకు నచ్చలేదు. కానీ అమ్మ ఏ ముహూర్తాన ఆ మాట అన్నదోకానీ బొమ్మకు నిజంగానే బేరం వచ్చింది. నాకు విలన్ కిష్టిగాడే కదా!
(సశేషం)