TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
నాకున్నది ఒక చక్కని బొమ్మ
ఎపిసోడ్- 4
- వసుంధర
వాళ్ళు బాబాయికి ఏం చెబుతున్నారో వినిపిస్తోంది. ఆ మాటలు వింటుంటే నాకు చాలా ఏడుపు వచ్చేసింది. నేనేదో చాలా పెద్ద నేరం చేసినట్లు చెబుతున్నారు వాళ్ళు. దీనికి బాబాయి ఏమంటాడో?
వాళ్ళు చెప్పేదంతా విని బాబాయి నవ్వేశాడు.
"ఇందులో దాని తప్పేముంది? తప్పంతా మీదే! వుండండి దాన్ని పిలుస్తాను...." అంటూ నా గదిలోకి వస్తున్నాడు బాబాయి.
నాకు చాలా ఉక్రోషం వచ్చింది. బాబాయి పిలిచినా సరే వెళ్ళకూడదనుకున్నాను. చేతిలోని పుస్తకాన్ని గట్టిగా పట్టుకుని దానికేసే చూస్తున్నాను. ఎంత శ్రద్ధగా చూద్దామన్నా ఒక్క అక్షరం కూడా నాకు కనబడ్డం లేదు. బాబాయి ముఖమే కనబడుతోంది.
"అమ్మలూ!" అన్నాడు బాబాయి.
నేను ఊఁ అనలేదు. పుస్తకంలో అక్షరాలు కనబడక పోయినా గుర్తుకు వచ్చిన పాఠం గట్టిగా పైకి చదవసాగాను.
"అదేమిటమ్మా సైన్సు పుస్తకం పట్టుకుని తెలుగు పద్యాలు చదువుతున్నావు?" అన్నాడు బాబాయి.
"నేను చదువుకోవాలి. డిస్టర్బ్ చెయ్యొద్దు" అన్నాను.
"బడి వున్నప్పుడు చదువుకోవాలి. సెలవులు ఇచ్చినప్పుడు ఆడుకోవాలి. మరి పుస్తకం మూసేసి నాతో రా!" అన్నాడు బాబాయి.
ఎవరైనా బ్రతిమాలుతుంటే నా పట్టుదల పెరిగి పోతుంది. నేనెందుకు రావాలి? రాను...." అన్నాను.
"ఎందుకు రావాలంటే నీ బాబాయి పిలుస్తున్నాడు కాబట్టి! నేను అమెరికా నుండి ఎందుకు వచ్చాననుకుంటున్నావు? నీ కోసమే వచ్చాను. ఈ ఇంట్లో కనుక నువ్వు లేకపోతే అసలు ఎప్పుడూ అమెరికాలోనే వుండిపోయేవాడిని. మరి నువ్విలా కూర్చుంటే ఎలా?" అన్నాడు బాబాయి.
"నేను రాను" అన్నాను.
"నువ్వు రాకపోతే మీ అమ్మకూ, నాన్నకూ బుద్ధి చెప్పడమెలా అన్నాడు బాబాయి.
"ఏంకాదు. వాళ్ళంటే నీకూ భయమే!" అన్నాను.
"నాతో రా! వాళ్ళంటే నాకు భయముందోలేదో చూద్దువుగాని!" అన్నాడు బాబాయి.
"నేను రాను" అన్నాను మళ్ళీ.
"రానంటే ఎత్తుకుని తీసుకుపోతాను" అని బాబాయి చటుక్కున చేతిలో పుస్తకం తీసి బల్లమీద పారేసి నన్ను ఎత్తుకున్నాడు.
నేను గింజుకుంటూ "నేను రాను వాళ్ళు నన్ను తిట్టారు" అన్నాను. బాబాయి లెక్కచేయకుండా నన్ను అమ్మా నాన్నల దగ్గరకు తీసుకువెళ్ళి "ముందు మీరు దీనికి క్షమాపణ చెప్పుకోండి" అన్నాడు.
అమ్మ రుసరుస లాడుతూ "చాలా బాగుంది. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి క్షమాపణ చెప్పకూడదు" అంది.
అదే తప్పు. అందుకే మన ఇండియా ఇలాగుంది. అమెరికా అంత పెద్దదైపోయింది" అంటూ బాబాయి అమెరికా పద్ధతులు చెప్పుకునివచ్చాడు.
అమెరికాలో పెద్దవాళ్ళని చిన్నవాళ్ళు గౌరవించరట. అక్కడ మనుషులందరూ సమానమేనట. పెద్దవాళ్ళయినా సరే. వున్నవాళ్ళయినా సరే. తప్పుచేసినప్పుడు- చిన్న వాళ్ళనయినా, లేని వాళ్ళయినా సరే క్షమాపణ చెప్పి తీరాలట.
"అయితే మరక్కడ ఎవరూ ఎవర్నీ గౌరవించుకోరా?" అనడిగింది అమ్మ.
"ఎందుకు గౌరవించుకోరు?" అన్నాడు బాబాయి.
మనకు చేతకాని పని ఎవడైతే చేయగలడో అలాంటి వాళ్ళను గౌరవిస్తారుట. అందుకే గొప్ప గొప్ప ఆటగాళ్ళనూ, సైంటిస్టులనూ, కళాకారులనూ వాళ్ళు గౌరవిస్తారట.
"మరి డబ్బు సంపాదించడం కూడా అందరికీ చేతకాని విషయమే కదా. లేనివాడు వున్నవాడిని ఎందుకు గౌరవించకూడదు?" అనడిగారు నాన్నగారు.
"అదీ చెబుతానన్నయ్యా!" అన్నాడు బాబాయి. "నువ్వు నీకోసం డబ్బు సంపాదించుకుంటావు. అది నీకు మాత్రమే ఆనందం కలిగిస్తుంది. కానీ కళాకారులు, సైంటిస్టులు, ఆటగాళ్ళు తాము సంపాదించిన దానివల్ల పదిమందికీ ఆనందాన్ని కలిగిస్తారు. అదీ తేడా!"
"ఇంతకీ ఇప్పుడు మేము చేసిన తప్పేమిటి?" అంది అమ్మ.
"అలా అడుగు చెబుతాను. ఇంట్లో మన అమ్మ వుంది. పెద్దరికం మినహా యిస్తే ఆవిడలో గొప్పతనం ఏముంది? చదువా లేదు. తెలివి తేటలా అంతంత మాత్రం. తన పనికూడా తాను చేసుకోలేదు. అయినా వయసులో పెద్దదికదా అని మనమంతా గౌరవిస్తున్నాం. వయసులో మన అందరి కంటే పెద్దదైన పనిమనిషిని గౌరవించడం లేదు సరి కదా! అలా గౌరవించడం తప్పు అనే అభిప్రాయాన్ని పిల్లలకు కలిగిస్తున్నాం. మనుషులందర్నీ ఒక్కలాగే చూడడం పిల్లలకు నేర్పాలి. ఆ పనిమనిషికి మనం డబ్బులు ఇస్తున్నాం. మనం ఇచ్చే డబ్బుకు అది చేసే పని ఎక్కువ. నువ్వేమో దానికి నెలకు ఇరవై రూపాయలు ఇస్తున్నావు. అందుకని అది ఇల్లూడుస్తుంది, గిన్నెలు తోముతుంది, బట్టలు వుతుకుతుంది. అమెరికాలో అయితే ఈ పనులన్నీ చేయాలంటే నెలకు మూడు వేలిచ్చినా చాలదు" అన్నాడు బాబాయి.
"నీ అమెరికా ఉపన్యాసానికో నమస్కారం. ఇదంతా వినడం కంటె అమ్మాయిని క్షమాపణ అడగడమే సుఖంలా వుంది" అంది అమ్మ.
అమ్మా, నాన్న నన్ను క్షమాపణ అడిగారు. అప్పుడు నాకు చాలా గర్వం వచ్చింది. సంతోషం పట్టలేక పక్కకు తిరిగిపోయాను నవ్వుకోడానికి. బాబాయి అది కనిపెట్టేశాడు.
"అదిగో అలా నవ్వేసుకుంటే కాదు. ఈ రోజునుంచీ మనుషులందర్నీ ఒక్కలా చూడాలి తెలిసిందా?" అని అన్నాడు బాబాయి.
"అలాగే" అన్నాను.
"నువ్వు చాలా మంచి పిల్లవు. నీకు దేవుడు చాలా మేలు చేస్తాడు" అన్నాడు బాబాయి.
"నాకెంతో సంతోషంగా వుంది బాబాయ్! ప్రతి ఇంట్లోనూ ఒక బాబాయి అమెరికా వెళ్ళి వచ్చి వుంటే బాగుంటుంది" అన్నాను.
ఎందుకో బాబాయి ముఖం అదోలా అయిపోయింది. నిట్టూర్చుతూ అన్నాడూ -"మనుషులంతా ఒక్కటేనని తెలుసుకుందుకు విదేశాలు వెళ్ళాలా ? ఈ దేశం ఎప్పటికి బాగుపడేను ?" అని.
బాబాయి మాటలు నాకు అర్ధంకాలేదు. కానీ ఈలోగా అక్కడికి మామ్మ వచ్చింది.
"అంతా వింటున్నారా. నేనెందుకు పనికి మాలినదాన్నా? పెద్దదాన్ని కాబట్టి గౌరవిస్తున్నావా ? నేనూ పనిమనిషి ఒక్కటే నంటావా? ఇదిట్రా నువ్వు అమెరికా వెళ్ళి నేర్చుకొచ్చిన చదువు అంటూ బాబాయిని తిట్టడం మొదలుపెట్టింది.
బాబాయి వెంటనే వంగి మామ్మ కాళ్ళకు దణ్ణం పెట్టి లేచి నిలబడి అమ్మా నువ్వంటే ఎప్పుడూ గౌరవమే నాకు. చిన్నపిల్లలకు అర్ధమయేలా చెప్పడం కోసమని ఏవో అంటూంటే అవి నిజాలనుకుని ఇలా దెబ్బలాడతావేమిటమ్మా!" అన్నాడు.
బాబాయి దణ్ణం పెట్టగానే మామ్మ కరిగి పోయింది. "నాకు తెలుసురా- నువ్వు అమెరికాకే కాదు, ఆ చంద్రమండలానికి వెళ్ళొచ్చినా నీకు నా మీద గౌరవం పోదు. ఇంకా చాలా గొప్పవాడైపోయి ఇలాగేనన్ను గౌరవిస్తూ వుండు" అంది.
నాకు మాత్రం పెద్ద అనుమానమే వచ్చింది. బాబాయి ఎవరికి నిజం చెప్పాడు? నాకా, మామ్మకా?
నా అనుమానం తీరడానికి ఎంతో సేపు పట్టలేదు. భోజనాలు కాగానే బాబాయి నన్ను ప్రత్యేకంగా పిలిచి "నేను నీకు చెప్పిందే నిజం. మామ్మకు చెప్పింది నిజం కాదు. రేపు ఉదయం లేచేసరికి నీ కోసం ఓ మంచి బహుమతి ఎదురు చూస్తూంటుంది. పెందరాళే పడుకుని పెందరాళే లేవాలి మరి" అని చెప్పాడు.
"అదేమిటో నాకు చెప్పవా బాబాయ్" అని అడిగాను.
"చెప్పను. ఎదురు చూడాల్సిందే" అన్నాడు బాబాయి.
వెళ్ళి పడుకున్నాను. ఎప్పటికీ నిద్రరాదె౧ బాబాయి నాకు ఇచ్చే బహుమతి గురించి ఒక్కటే ఆలోచన.
అది కానీ అమెరికా బొమ్మ కాదు గదా అనిపించింది. అయినా అంత అదృష్టమా నాకు? బొమ్మ తెస్తే బాబాయి ముందే ఇచ్చేవాడు కదా! బాబాయి వచ్చిన రోజు రాత్రే అమ్మను అడిగాను. "అమ్మా బాబాయి నాకోసం బొమ్మతెస్తానన్నాడు. తేలేదేమే?" అని.
"మీ నాన్నగారి వంశం వాళ్ళంతా అంతేనమ్మా! తెస్తానని చెబుతారు, ఏమీ తేరు" అంది అమ్మ.
అమ్మ మాటలు వింటే మా నాన్నగారి వంశం వాళ్ళని తిట్టడానికి సరదా పడుతోందనిపించింది. బొమ్మతేనందుకు బాధపడలేదని అనిపించింది.
బాబాయినే అడిగేద్దామా అంటే వెంటనే అడిగేయడానికి మొహమాటం వేసింది. నాలుగు రోజులు ఆగితే అడగొచ్చు మరి.
పోనీ మామ్మతో చెబుదామా అంటే బాబాయిని పిల్చి తిట్టేస్తుందేమోనని భయం వేసింది. మరి మామ్మ అలాంటిదే! అప్పుడు బాబాయికి నా మీద చెడ్డ అభిప్రాయం కలుగుతుంది. తనమీద పితూరీ చేశానని కోపం కూడా వస్తుంది. అది నాకు ఇష్టం లేదు.
నాన్నగారిని అడుగుదామంటే 'వాడికిదే పని అనుకున్నావా?' అని తిడతారు. అసలు నేను ఏమి అడిగానో సరిగ్గా వినకుండా ముందే తిట్టేస్తారాయన. నేనంటే చాలా ఇష్టం. నేను అడగకుండానే నా కోసం ఎన్నో కొనిపెడతారు. కానీ ఆయనకు చిరాకు ఎక్కువ. చిరాకు లేనప్పుడు ముద్దు చేస్తారు. నాన్నగారికి చిరాకు లేకపోతే బాగుండును అనిపిస్తుంది నాకు. కానీ మా నాన్నగారికే కాదు, అందరి నాన్నలకూ అంతేనట. ఈ విషయం కిష్టిగాడు చెప్పాడు.
నాన్నగారి కంటే బాబాయే చాలా నయం. నేను అడిగిన ప్రశ్నలన్నింటికీ వివరంగా సమాధానాలు చెబుతాడు.
మామ్మతో ఒక లాగా, నాతో ఇంకోలాగా చెప్పినందుకు కారణమడిగితే ఎంత బాగా చెప్పాడో?
మామ్మ ఆలోచనలన్నీ తప్పట. కానీ ఇప్పుడు మామ్మని మార్చడం చాలా కష్టంట. మార్చాలనుకోవడం అనవసరం కూడా అన్నాడు బాబాయి. నేనేమో భావిభారత పౌరురాల్నిట. నా ఆలోచనల్ని సరైనదారిలో పెట్టడం అవసరం అని బాబాయి చెప్పాడు.
బాబాయి చాలా తెలివైన వాడు. అందుకే అమెరికా వెళ్ళి వచ్చాడు. నేనూ తెలివైన దాన్నేమో! అందుకని బాబాయి నాకోసం బొమ్మ తెస్తాను లేకపోతే అమ్మతో మాత్రమే చెప్పాడు. మామ్మకు, నాన్నగారికి చెప్పలేదు. అయినా అమ్మ నన్ను 'ఆలోచన లేనిదానా'! అని తిడుతుంది.
నేనింత బాగా ఆలోచిస్తానా? మరి బాబాయి నా కోసం ఏం తెచ్చాడో ఆలోచించలేక పోతున్నానేమిటీ?
ఆఁ సందేహం లేదు. అది బొమ్మే అయ్యుంటుంది....
ఎప్పుడో నిద్ర పట్టేసింది. నిద్రలో కల. కలలో అమెరికా బొమ్మ. ఎంత బాగుందో అది. ఆ బొమ్మతో నేను ఎన్నో రకాల ఆటలాడుకున్నాను. అలా ఆడుకుంటూంటే ఎంత సరదాగా వున్నదో!
ఆ సరదా అంతా అమ్మ నిద్రలేపడంతో పోయింది.
ఆమెప్పుడూ ఇంతే! మంచి కలలు వచ్చినప్పుడే నిద్ర లేపుతుంది. అమ్మతో నా ఆట అంతా కలే అయిపోయినందుకు నాకు చాలా బాధ అనిపించింది. ఇంకా నా బాధ ఏమిటంటే అమ్మ నిద్ర లేపగానే నేను కలలో అమ్మ ఎలా వుందో మర్చిపోయాను. ఎంత గుర్తు చేసుకుందా మనుకున్నా గుర్తు రావడం లేదు. ఆటలు మాత్రం అన్నీ గుర్తున్నాయి. బొమ్మ కూడా గుర్తుంటే కిష్టిగాడిని నా దగ్గర బొమ్మ వుందని అబద్ధం చెప్పి ఆటపట్టిద్దామనుకున్నాను. ఇప్పుడింక అది సాధ్యం కాదు.
అమ్మ నాకు తలంటి పోసింది.
"ఎందుకే?" అన్నాను. తలంటు అంటే నాకు చాలా చిరాకు. ఎప్పుడూ సబ్బుతో రుద్దుకుంటే సరిపోతుందా! ఆ రోజు సున్నిపిండి పెట్టి వళ్ళంతా మంటపుట్టేలా పామి తోమేస్తుంది అమ్మ. ఇంక కుంకుడుకాయ పులుసు సంగతి సరేసరి. కళ్ళలో పడిందంటే ఎంత బాధగా వుంటుందో! అదేం కర్మో గానీ నేనెప్పుడు తలంటి పోసుకున్నా కళ్ళలో పులుసు పడుతుంది.
అమ్మ నాకు నలుగు పెడుతూంటే వంటికి మంటగా వుంది. నేను గోల పెడుతూంటే "చూడు, నీ వంటి మీంచి పాములెలా వస్తున్నాయో" అంది అమ్మ.
నిజమే! సున్నిపిండి నావంటి మీద నలిగి సన్నగా పొడుగ్గా పాము పిల్లల్లా కిందపడుతోంది. ఆ పిండి నల్లరంగులో వుంది.
"పచ్చటి పిండి నల్లగా అయిపోయింది. నీ వంటిమీద ఎంత కుళ్ళు పేరుకుని పోయిందో చూడు...." అంది అమ్మ.
పాముల్ని చూసే ధ్యాసలో నేనుండగా అమ్మ నావంటికి నలుగు పెట్టడం పూర్తిచేసింది.
అమ్మ మాటలు అప్పుడే అక్కడికి వచ్చిన మామ్మ విని "అందుకే వారానికొక్కసారయినా పిల్లలకు నలుగు పెట్టి తలంటి పోయాలి. ఇప్పుడందరూ ఇవి మానేస్తున్నారు. మనింట్లోనైనా ఎన్నాళ్ళులే ? నేనున్నన్నాళ్ళేగా సాగేది అని వెళ్ళిపోయింది.
అమ్మ నాకు తలంటు మొదలుపెట్టింది. కళ్ళు మూసుకుని కూర్చోగానే నాకు ఏడుపు మొదలయింది.
"పెద్ద దాని వౌవుతున్నావు. ఇంకా చిన్న పిల్లలా ఏడ్వడమేమిటి?" అని అమ్మ నన్ను తిట్టింది.
ఇప్పుడిలా తిట్టిందా కాసేప్పోయాక పెద్దాళ్ళ కబుర్లలో నేనూ మాట కలిపితే "చిన్న పిల్లవు పోయి ఆదుకోక మా కబుర్లు నీకెందుకే?" అంటుంది అమ్మ.
అసలు అమ్మ మూలంగానే నేను పెద్దదాన్నో చిన్నదాన్నో తెలియకుండా పోతోంది. మా అమ్మేకాదు, కిష్టిగాడి అమ్మా అంతే! నేను పెద్దా, వాడు పెద్దా అన్న విషయం మా అమ్మల కారణంగానే తేలకుండా వుండి పోయింది.
మళ్ళీ నాకు కంట్లో పులుసుపడింది. కళ్ళు మండుతున్నాయి. అమ్మ తల పిడప కట్టేక ఏడుస్తూ మామ్మ దగ్గరకు వెళ్ళాను.
"మళ్ళీ కంట్లో పులుసు పడిందా? మీ అమ్మెప్పుడూ ఇంతే. నేను తలంటితే కంట్లో ఒక్క చుక్క పులుసు కూడా పడనివ్వను" అంది మామ్మ. మామ్మ ఎప్పుడూ అలాగే అంటుంది.
ఈ మాట అమ్మ దగ్గర అంటే "అలాంటప్పుడు పోనీ ఆవిడే అంటొచ్చుగా" అంటుంది అమ్మ.
అందుకు మామ్మ బోసినోటితో నవ్వుతూ "ఇప్పుటికీ నేనే అంటితే నువ్వెప్పుడు నేర్చుకుంటావే ?" అంటుంది.
(సశేషం)