Facebook Twitter
షాక్ ట్రీట్ మెంట్

  షాక్ ట్రీట్ మెంట్    

- శారద అశోకవర్ధన్


         
  
  నరసరాజుగారూ రామస్వామిగారూ మంచి స్నేహితులు. గత మూడు దశాబ్దాలుగా నరసరాజుగారు ఒక ప్రైవేటు సంస్థలో హోదాగల ఉద్యోగమే చేస్తున్నారు.

    అతనికి అన్నీ వున్నా  భగవంతుడు  ఏదో ఒక వెలితి పెట్టాలి కాబట్టి, యాభై ఏళ్ళు దాటీ దాటకుండానే  తనకి ప్రాణంలో ప్రాణంగా, అడుగులకు మడుగులొత్తే అనుకూలవతి, ప్రేమమయి అయిన భార్యని  పోగొట్టుకున్నాడు. భగవంతుడు మరీ క్రూరుడు కాదని తన ఉనికిని తెలిపి నిలుపుకోవడానికేమో  బంగారంలాంటి  కొడుకునీ, కూతుర్నీ యిచ్చాడు. కొడుకు డాక్టర్ సుధీర్, కూతురు ఇంజనీరు  సునయన. తల్లిపోయాక పిల్లలిద్దరూ  నరసరాజుగారిని కళ్ళల్లో పెట్టుకుని కనిపెట్టుకుంటున్నారు సర్వీసులో  వుండగానే పెళ్ళిళ్ళు చేసెయ్యమని, స్నేహితులూ బంధవులూ  యిచ్చిన  సలహామేరకు  నరసరాజుగారు, మంచి సంబంధాలకోసం  చూసి చూసి, ఇద్దరికీ పెళ్ళిళ్ళు  చేసేశారు. సునయన భర్త పోలీసాఫీసరు సుధీరు భార్య  అమూల్య ఎం.కామ్. అందరూ ఉద్యోగస్తులే. నరసరాజుగారంటే  అటు అల్లుడికీ, ఇటు కోడలికి కూడా ప్రాణమే. భార్యలేని  లోటు తప్ప. మిగతా విషయాలలో  ఆయనకి ఏ సమస్యా లేదు.

    రామస్వామిగారికి  హోమియో మందులు  తయారుచేసే  ఫ్యాక్టరీ వుంది. ఒద్దనుకున్నా దానిమీద అతనికి  కనీసం ఖర్చులుపోను  పదివేల  దాకా వొస్తుంది. అదికాక మందులు  అమ్మకంచేసే  షాపుకూడా వుంది. దానిపైన  కూడా ఖర్చులు పోను  దాదాపు  పదివేలదాకా  వొస్తాయి. రెండు కార్లూ, నౌకర్లూ, డబ్బూ, గోల్డు అన్నీ వున్న రామస్వామిగారి  భార్య  కనకవల్లికి  మాత్రం  తన తండ్రి తన వివాహ సమయంలో రాసిచ్చిన  విజయనగర్ కాలనీలోని  ఇల్లే  గొప్పగా  అనిపిస్తుంది. ఆ యింటి మీద వొచ్చే అద్దె మూడువేలూ  తన పేరిట  బ్యాంకులో  వేసుకుంటూ, డబ్బు  పెరిగిన కొద్దీ  అహం  పెంచుకుంటూ, సంసారాన్ని  సామ్రాజ్యంగా, భర్తా పిల్లలూ అంతా సామంతరాజుల్లా  నడుపుతోంది కనకవల్లి. ఆమె గీచిన గీత రామస్వామిగారు నుంచి  పిల్లలు  చెంగల్వ,రాకేష్, ఉదయులకు కూడా లక్ష్మణ రేఖే. ఆమె మాటకు  తిరుగులేదు. ఆమె మాట అందరికీ ఆర్డర్. ఆమె నోరువిప్పితే  అందరికీ హడల్! ఒక్కొక్కసారి  ఆమె ప్రవర్తన అందరిలోనూ  తరగని  అసంతృప్తినీ, చెరగని అసహ్యాన్నీ కలగచేస్తున్నది. రామస్వామికి పిచ్చెక్కినంత పనౌతుంది! 

    చాలాకాలం తరువాత  ఒకరోజున అనుకోకుండా సరస్వతీ గానసభవారు ఏర్పాటుచేసిన డాక్టర్  మంగళంపల్లి బాలమురళీకృష్ణగారి గాత్రం, శ్రీమతి శోభానాయుడి కూచిపూడి నృత్యం  కార్యక్రమానికి వెళ్ళడం వలన స్నేహితులిద్దరూ కలుసుకున్నారు. ప్రశాంత  వాతావరణంలో  మనసువిప్పి మనసులోని  మాటలెన్నో  చెప్పుకున్నారు. అన్నింటిలోకీ  రామస్వామిగారిని సంభ్రమాశ్చర్యాలలో  ముంచి మాటరాకుండా అక్షరాలు గొంతులో అడ్డుపడిన  విషయం నరసరాజుగారు, తన ఆఫీసులోనే పనిచేసే ఎక్కౌంటెంటు శివకామేశ్వరిని పెళ్ళి చేసుకోవడం! సరసరాజుగారి భార్య సుశీల రామస్వామిగారిని 'అన్నయ్యా' అని పిలిచేది. సుశీల లేనిదే నరసరాజుగారు ఏపనీ  చేసేవారు కాదు. ఆమెతోటే  ఈ జగం! ఆమెతోనే సోయగం! ఆమెలేని బ్రతుకు వ్యర్ధం అన్నట్టు గడిచింది వారి జీవితం. అటువంటి  నరసరాజుగారు  మళ్ళీ పెళ్ళిచేసుకున్నారు  అంటే చెప్పలేనంత ఆశ్చర్యంగా  వుంది రామస్వామిగారికి. రామస్వామిగారి మౌనాన్నిబట్టి  వారి ఆలోచనలను గ్రహించిన  నరసరాజుగారే చెప్పడం మొదలెట్టారు:

    "రాముడూ"....'పిలిచారు నరసరాజుగారు. మనసు ఆత్మీయతతో అల్లుకుపోయినప్పుడో, ఆనందంతో నిండిపోయినప్పుడో, బాధతో మనసు కృంగిపోయినప్పుడో  అతను రామస్వామిగారిని  రాముడూ అని పిలుస్తారు. అలాగే రామస్వామిగారు నరసరాజు గారిని 'రాజా' అని పిలుస్తారు.

    "చెప్పు రాజా!" అన్నారు రామస్వామిగారు.

    "నీకు తెలుసు  నేను సుశీలని ఎంతగా  ప్రేమించానో! సుశీలనే కాదు మా ప్రేమ ఫలితాలు సుధీర్, సునయనలు కూడా నాకు పంచప్రాణాలే కదా! అయితే ఈ మధ్యన  ఈ పిల్లలు  ఎవరి గొడవల్లో వాళ్ళుండి, నేను గ్లాసు మంచి నీళ్ళడిగినా విసుక్కుంటున్నారు. ఆ మధ్య వైరస్ ఫీవరొచ్చి వారం రోజులు నేను మంచం దిగలేదు. అల్లుడికి గోవాలో  ఏదో ట్రైనింగ్ వుందని, ఫామిలీతో సహా ఏదో ప్రోగ్రాం పెట్టుకున్నాడు. సుధీర్ కి మెడికల్ కాన్ఫరెన్సు. కోడలు పిల్లలతో  సతమతమయి పోతూ, నాకేసి చూడడానికే టైములేక నలిగిపోయింది. రాను రాను నేను వాళ్ళందరికీ భారమైపోతున్నానిపించింది. నాలుగు రోజులు  ఆఫీసుకి వెళ్ళకపోవడం చూసి ఆఫీసువాళ్లే ఇంటికొచ్చారు. డాక్టరు దగ్గరికి తీసుకెళ్ళారు. పరీక్షలు చేయించారు. అందులో  శివకామేశ్వరి నన్నంటి పెట్టుకునే వుండి, వేళకి  మందివ్వడం, పళ్ళరసం ఇవ్వడంవంటి సపర్యలు  చేసింది. ఆమె అలా చేస్తూ వుంటే పన్నెత్తి పలకలేదు. కన్నెత్తి చూడలేదు. సుధీర్, కోడలూ కూడా మౌనంగా వుండిపోయారు. అమూల్య ఇప్పుడు కేవలం తన భర్త, పిల్లలూ తప్ప ఇంకేమీ పట్టించుకోవడంలేదు. రాముడూ! ఇప్పుడే ఇలా అయితే నేనింకో పదేళ్ళు బతికితే, ఇంకా పెద్దరోగాలేమైనా వొస్తే నన్ను తీసికెళ్ళి ఏ నర్సింగ్ హోంలోనో పడెయ్యడమో, లేకపోతే, 'హోం ఫర్ ది ఏజ్ డ్' లో చేర్పించడమో, లేకపోతే ఏ నర్సునో పెట్టి చూసుకోవడమో చేస్తారు. మనసువిప్పి  కాస్సేపు మాట్లాడుకోవాలన్నా, కష్టసుఖాలు  చెప్పుకోవాలన్నా  ఒకరికొకరు తోడుండడం అవసరం. ఆ తోడు ఒక్క వివాహబంధానికి మాత్రమే ఉంది. ఏమంటావ్?...." అన్నారు రామస్వామి మొహంలోకి ఆత్రంగా చూస్తూ. రామస్వామి కళ్ళు చెమర్చాయి. నోటమాట పెగలలేదు ప్రయత్నించినా.

    "నేను చేసింది తప్పంటావా రాముడూ?" అడిగేరు నరసరాజుగారు.

    "అననురా రాజా! ఎందుకంటే  - ఆమె అవివాహిత. నువ్వు భార్యని పోగొట్టుకున్నవాడివి. ఇద్దరికీ కూడా ఒక వయస్సులో  ఇదే ప్రశ్న ఎదురవుతుంది. ఇష్టపడి, ఒకరినొకరు అర్ధం చేసుకుని కలిసి వుండాలనుకుంటే తప్పేముంది? అందుకు మన దేశంలో, మన సంప్రదాయం ప్రకారం, అలా కలిసుండడానికి కళ్యాణం ఒక్కటే మార్గం. అయితే, నిన్ను చూసి కాస్త ఈర్ష్యపడుతున్నాను నేను" అన్నారు రామస్వామి. నరసరాజు అదోలా  చూశారు అతనివైపు, అతనేమైనా  వేళాకోళం చేస్తున్నాడేమోనని! అలా ఏమీ అనిపించలేదు.

    "ఎందుకా అని విస్తుబోతున్నావా? చెబుతాను విను. అపుడు సుశీలా, ఇప్పుడు శివకామేశ్వరీ కూడా నిన్ను నిన్నుగా  ప్రేమిస్తూ, నీకోసం తపిస్తూ, నీ సేవలో అంకితమైపోయారు. ఎంత అదృష్టంరా అది?" కళ్ళు తుడుచుకున్నారు రామస్వామి. 

    నరసరాజు  గారికి, రామస్వామిని చూస్తూ  ఉంటే  అతనిలో  నిగూఢంగా ఏదో బాధ కనిపించింది.

    "రాముడూ! నీకు మాత్రం ఏం తక్కువ? చచ్చేంత  ఆస్తి, భార్యాబిడ్డలూ -" అతని మాటల్ని  మధ్యలోనే  ఆపుతూ, "అవున్లే ....అవన్నీ వున్నాయ్. ఏం లాభం? భార్యాభర్తల నడుమ ఉండవలసిన ఆప్యాయతా, ప్రేమా, గౌరవభావం అవే లేవు. మా ఆవిడకి తన ఆస్తి, డబ్బూ, హోదా - అవన్నీ  తన పుట్టింటివి కనుక అవే ముఖ్యం  మొగుడూ, పిల్లలూ అంతా అనవసరం. ఆమె అంటే మాకు ప్రేమకన్నా  భయమెక్కువ. నన్నొక మనిషిలా అనుకోదు ఆమె. ఆమె కోసం ధనార్జన చేసే యంత్రాన్ని  మాత్రమే నేను! ఆమె స్టేటస్ కి సింబల్ని మాత్రమే నేను! ఆమె బిడ్డలకి రక్షకభటుడ్ని నేను అంతే! అంతకుమించిన స్థానం నాకు లేదు. ఇది గ్రహించిన  పిల్లలు కూడా ఆమె ప్రాపుకే పాకులాడుతున్నారు గానీ, నాన్న అనే ప్రేమని చూపించలేకపోతున్నారు. ఆమె ఆధిపత్యాన్ని కాదంటే  ఏం గొడవ జరుగుతుందోనని వాళ్ళకీ భయమే! ఇలా  భార్య ప్రేమకీ, పిల్లల ప్రేమకీ నోచుకోని నేను, వాళ్ళకి దాసుడిగా  మనసుని  చంపుకుని  బ్రతుకుతున్నాను జీవితం అంటే విరక్తి పుట్టిందిరా!" అన్నారు రామస్వామి గారు, చెమ్మగిల్లిన కళ్ళను కర్చీఫ్ తో తుడుచుకుంటూ. నరసరాజుగారి గుండె ఆర్ద్రతతో  నిండిపోయింది. మనస్సు  బాధతో ద్రవించిపోయింది. అంతలోనే ఆయన  మెదడులో ఒక ఆలోచన మెరుపులా  మెరిసింది. నాలుగురోజులక్రితం  పేపర్లోచూసిన  వార్త ప్రిన్స్ ఆగా పాతికేళ్ళ  తరువాత  భార్యతో  విడాకులు పుచ్చుకున్నాడు అని. ఆ వార్త అతనిలో  కొత్త ఆలోచనలు రేకెత్తించింది.

    "రాముడూ!" పిలిచారు.

    "చెప్పు" అన్నారు రామస్వామిగారు.

    నరసరాజు చెప్పిన ఆలోచన రామస్వామికి  నచ్చింది.

    ఇద్దరూ  ఇంటికెళ్ళారు.

    "ఇంత రాత్రిదాకా  ఎక్కడికెళ్ళారు? మా అందరి భోజనాలు అయిపోయాయి. టేబుల్ మీద అన్నీ వున్నాయ్. పెట్టుకు తినండి. నాకు నిద్దరొస్తోంది" అంది కనకవల్లి.

    "నువ్వు లేచివెళ్ళి వడ్డించు." గర్జిస్తున్నట్లుగా అన్నారు రామస్వామిగారు.

    ఆ కంఠం, అతడి ధైర్యం చూసి ఆశ్చర్యపోయి  క్రమంగా తేరుకున్న కనకవల్లి "నామీద అరుస్తున్నారా? నేను లేచివెళ్ళి  వడ్డించాలా రాత్రి పదకొండు గంటలకి?" సాగదీస్తూ అంది కనకవల్లి.

    "అవును. నువ్వే వడ్డించాలి. పదకొండు  గంటలేకాదు - రాత్రి రెండు గంటలకొచ్చినా  నువ్వే వడ్డించాలి. నువ్వు నా భార్యవి!" అన్నాడు రామస్వామి.

    పిల్లలు సయితం  తండ్రి తల్లితో  అంత గట్టిగా  మాట్లాడ్డం  విని ఆశ్చర్యపోతూ  చెవులు  రిక్కపొడుచుకుని వింటున్నారు, నిద్రపోతున్నట్టు  నటిస్తూనే.

    "భార్య అంటే బోయివాడూ కూలివాడూ కాదు, నీ మోచేతికింద  నీళ్ళు తాగి పడుండడానికి!" గట్టిగా  అరుస్తూ  అన్నాడు రామస్వామి.

    ఆమెలో  ఆవేశం  పెరిగిపోయింది. "మీరిచ్చే జీతంరాళ్ళు పెద్ద గొప్ప కాదు. మా నాన్నగారిచ్చిన  ఇల్లూ దానిమీద  అద్దే చాలు - నేనూ  నా పిల్లలూ  కాలుమీద  కాలేసుకు కూర్చుని  తినడానికి."

    "అయితే  అలాగే చెయ్యి! నేను నీకు విడాకులిస్తున్నాను. నువ్వూ, నీ పిల్లలూ  మీదారి మీరు చూసుకోండి."

    "పాతికేళ్ళు  సంసారం చేసి విడాకులు తీసుకుంటానని చెప్పడానికి సిగ్గు లేదూ?" రెచ్చిపోయింది కనకవల్లి.

    "సిగ్గెందుకు? కావాలంటే  నాకు మరో పెళ్ళాం దొరుకుతుంది. నాకు వ్యాపారముంది. నా డబ్బుని చూసి నాకు నచ్చిన, నేను మెచ్చినపిల్ల  దొరక్కపోదు. చూడూ  ఈ వార్త" అంటూ  పేపరు గిరాటేశారు రామస్వామి.

    ఆమె పేపరు గబగబా  తిప్పి  చూసింది. "ఓ యబ్బో! మీరేదో  గొప్ప ప్రిన్స్ అనుకుంటున్నారేమో! మీ మొహం చూసి ఎవరూ  రారు" అంది.

    "నరసరాజు వాళ్ళ ఆఫీసులో  పనిచేసే  అమ్మాయినే పెళ్ళి చేసుకున్నాడు తెలుసా - కొడుకు, కూతురు ఎవరు చూసుకోవడం లేదని!" అన్నారు బట్టలు మార్చుకోవడం  పూర్తిచేసి  రామస్వామి.

    "ఏమిటీ, నరసరాజుగారు  పెళ్ళి చేసుకున్నారా? ఈ వయస్సులో...."

    "ఏం, తప్పా? పెళ్ళికీ, ప్రేమకీ వయసుందా? వుంటే  అది మనం పెట్టుకున్న అడ్డుగోడే"

    కనకవల్లి  గుండె ఆగిపోయినట్టనిపించింది. వెంటనే  తేరుకుని__

    "అతనికంటె భార్య పోయింది. ఇక్కడ  విడాకులివ్వడానికి  నేనొప్పుకోవాలిగా!" అంది లాపాయింటు చెబుతూ.

    "రెండేళ్ళు మీకు కనబడకుండా  పారిపోతాను, ఆ తరవాత కనిపించి నీవల్లే  పారిపోయానని సాక్ష్యాలూ, ఋజువుల ద్వారా నిర్ధారించి విడాకులు పుచ్చుకుంటాను, శతకోటి  దరిద్రాలకి  అనంతకోటి ఉపాయాలు. అన్నీ లాయరుగారిని సంప్రదించే వొచ్చాను" అన్నారు రామస్వామి మంచంమీద వాలుతూ.

    మొట్టమొదటిసారి కనకవల్లికి  భయమేసింది. అతడు అన్నంతపనీ చేస్తాడేమోనని పిల్లలంతా ఒక్క ఉదుటున లేచొచ్చి "నాన్నగారూ! మీరు మమ్మల్నొదిలెయ్యకండి! మేమూ  మీతోనే  వుంటాం" అన్నారు.

    కనకవల్లికి మతిపోయింది. పిల్లలతో  వయస్సుమళ్ళాక  తోడుండేదెవరు? కేవలం డబ్బు పనికిరాదే? ఆస్తి, అంతస్తు ఆదుకొనేది కొంతవరకే. కనకవల్లి  ఆలోచనలో పడిపోయింది. పిల్లలంతా  ఏడుస్తుంటే  ఎలాగో అనిపించింది. నిజంగా అలా జరిగితే? తను తట్టుకోగలదా? వెళ్ళి అతని కాళ్ళమీద పడింది.

    ఊహించని  ఈ పరిణామానికి  ఉక్కిరిబిక్కిరయిపోతూ రామస్వామిగారు కనకవల్లిని రెండు భుజాలు పట్టుకుని  లేవనెత్తారు. "భార్యస్థానం పాదాల దగ్గర కాదు. పనికిరానివాణ్ణిగా భావించి మొగుడ్ని నెత్తికెక్కడమూ  కాదు. ఎవరు ఎవరికీ దాసీలూ కాదు, బోయిలూ కారు! భార్యాభర్తల మధ్య వుండవలసింది ప్రేమానురాగాలు. ఒకరి అభిప్రాయాలను ఒకరు  గౌరవించుకుంటూ  ఒకరికి ఒకరు తోడుగా, విడివడని జోడీగా నడచుకోవాలి. ఇరువురూ  కలిసి పాపల్ని కంటిపాపల్లా చూసుకోవాలి. అంతేగానీ - డబ్బూ, లెక్కలూ, అంతస్తులూ, హోదాలూ - ఇవేవీ  అడ్డు నిలవకూడదు. అలా నిలిస్తే పాతికేళ్ళయినా, ముప్పై ఏళ్ళయినా వాళ్ళ జీవితాలు  కలవని రైలు పట్టాల్లా, ఎండిన మోడులా  సాగిపోతాయి.

    "అలా కానప్పుడే  వయస్సుతో ప్రమేయం లేకుండా  కాపురాలు కొనసాగుతాయి! పెళ్ళంటే డబ్బూ, పలుకుబడీ లేదా లైంగికసంబంధం మాత్రమే కాదు.  రెండు శరీరాల కలయిక అసలేకాదు! రెండు మనస్సులు పెనవేసుకుపోయే పవిత్రబంధం! ఒకరి అవసరాలు  ఒకరు తెలుసుకుని, ఒకరి అభిప్రాయాన్ని మరొకరు గౌరవించి స్నేహితుల్లా, ప్రేమికుల్లా కలకాలం కలిసిమెలిసి మనవలసిన అనుబంధం! ఇందులో  నేను ఎక్కువా కాదు, నువ్వు తక్కువా కాదు, లేదా నేను తక్కువా కాదు, నీవు ఎక్కువా కాదు" అన్నారు తల నిమురుతూ రామస్వామి.

    పసిపిల్లలా  భోరున  ఏడ్చేస్తూ  కనకవల్లి  అతణ్ణి  కౌగిలించేసుకుంది.

    ఆ ఆలింగనంలో కోటిస్వర్గాలు  చూసినంత  తృప్తి!

    మొదటి రాత్రి లేలేతసిగ్గుల  దొంతరలవెనుక  దాగివున్న  సంతోషంకన్నా వెయ్యిరెట్లు  సంతోషం!

    "కనకం! ఇదే నేను కోరుకునేది. ప్రేమ, అభిమానం!"

    "అవునండీ! నేనేం పోగొట్టుకున్నానో కూడా ఇప్పుడే అర్ధమయింది" అంది కౌగిలి  విడిపించుకుని అన్నం వడ్డిస్తూ.

    పిల్లలు  దుప్పటి కప్పుకుని  ప్రశాంతంగా  నిద్రపోయారు. మనసులోనే నరసరాజుగారికి ధన్యవాదాలు చెబుతూ. ఆ రాత్రి తారాశశాంకుల్లా  రతీమన్మధుల్లా, శివపార్వతుల్లా ఒకరిలో ఒకరు  లీనమైపోయారు రామస్వామి, కనకవల్లి దంపతులు!

    ఈ వార్త విన్న నరసరాజుగారు పొంగిపోయారు.

    ఒక గురజాడ, ఒక తిలక్, ఒక చలం, ఒక శ్రీశ్రీ, ఒక వీరేశలింగం పంతులు - ఇంకా ఇంకా ఎందరో  వారి అభిప్రాయాలకి  ప్రాణంవొచ్చినట్టు హాయిగా నవ్వుతూ  కనిపించారు  ఆయన కళ్ళముందు. నరసరాజుగారు  తృప్తిగా నిట్టూర్చారు.

    "రాజు! నీ సలహా మ్యూజిక్ లా పనిచేసింది" అన్నారు రామస్వామిగారు.

    "మ్యాజిక్ కాదురా రాముడూ, మందులా పనిచేసింది. దివ్యౌషధం!"

    "కాదులే! కాలం  చేసిన కనికట్టు!"

    ఇద్దరూ హాయిగా నవ్వుకున్నారు.


                        (అన్వేషణ 1 జూన్ 1995)