Facebook Twitter
మరో మృగం

మరో మృగం

                                                                 శ్రీమతి శారద అశోకవర్ధన్

నిశీధిని చీల్చి నెమ్మది నెమ్మదిగా  పయనిస్తున్న  మార్తాండుడు మధ్యాహ్నం అయ్యేసరికి ఉద్వేగంతో ఉరకలు వేస్తున్నాడు. ఆ టైములో ఉద్యోగాలు చేసేవాళ్ళెవ్వరూ  ఇంట్లో వుండరు. ఇంట్లో వుండే వాళ్ళయితే ఎయిర్ కండిషన్ల మధ్యా, ఎయిర్ కూలర్ల మధ్యా, పంఖాల కిందా కునుకుతీస్తూ వుంటారు.
    చలికి తట్టుకోలేక  పక్షులు కూడా బయటికి రావు. ఆకుల మాటున ఎక్కడో నక్కి నక్కి కూర్చుంటాయి. పాతికేళ్ళయినా  పట్టుమని  నిండని సింధూజ ఏదో ఇంగ్లీషు నవల చదువుతూ  నిద్రలోకి  జారుకుంది.
    సింధూజ ఎమ్.ఎస్.సి. చదివింది. చదువయిందో లేదో ఒక ప్రయివేట్ కంపెనీలో ఉద్యోగం వస్తే చేరింది. అలా చేరి మూడు నాలుగు నెలలయిందో లేదో నవనీత్ తో పెళ్ళి జరిగిపోయింది.
    నవనీత్ కి హైదరాబాద్ లో పెద్ద కంప్యూటర్ కంపెనీలో ఉద్యోగం రావటం, సింధూజ తన ఉద్యోగానికి స్వస్తి చెప్పి హైదరాబాద్ రావడం అంతా గబగబా జరిగిపోయాయి.
    ఇల్లు సర్దుకోవడానికి, మద్రాసు నుంచి హైదరాబాదొచ్చిన వాతావరణానికి అలవాటు పడడానికి కొంత టైము పట్టింది. అంతలోనే సింధూజకి  తనలో కలుగుతున్న మార్పుల గుర్తులు అర్ధమయ్యాయి.
    అందుకే కొన్నాళ్ళపాటు, బిడ్డపుట్టి  కాస్త పెరిగేదాకా  ఉద్యోగ ప్రయత్నాలు  చేయకూడదని  నిర్ణయించుకుంది. అందుకే రోజూ లైబ్రరీ నుంచి ఏవేవో పుస్తకాలు తెప్పించుకుని, పరీక్షకి వెళ్ళేదానిలా  చదివేస్తూ వుంటుంది.
    "సింధూ....నీ బొజ్జలోని  బాబు ఒట్టి పుస్తకం పురుగులా  అయిపోతాడు జాగ్రత్త" అనేవాడు నవనీత్.
    "మరేం చెయ్యను? ఊరికే తిని కూర్చుంటే  తిండిపోతుగా, అసలేమీ చేయకుండా  ఉంటే సోమరిపోతులా ఉంటాడేమోనని కూడా భయం. అందుకే పుస్తకం పురుగులా పుట్టినా  ఫరవాలేదని  చదువుతున్నాను" అనేది నవ్వుతూ సింధూజ.
    "బాబోయ్! నీలా వసపిట్టపుడతాడేమో?" కొంటెగా అనేవాడు నవనీత్.
    "పోన్లెండి! మరీ మీలా ముంగిలా  ముడుచుకుపోకుండా  వుంటే చాలు" కవ్విస్తూ అనేది సింధూజ.
    "నేను ముంగినా...." ఆమెని చుట్టేసేవాడు అతను.
    "కాదు....వొదలండి" విలవిల లాడిపోయేది ఆమె.
    ఆ తరువాత ఇద్దరూ  సినిమాకో, షాపింగుకో, షికారుకో వెళ్ళిపోయేవారు.
    ఈ జంటని చూసి ఈర్ష్యపడేవి కొన్ని కళ్ళు!
    ముచ్చటపడేవి కొన్ని కళ్ళు!
    అసూయ చెందేవి కొన్ని కళ్ళు!
    ఆశీర్వదించేవి కొన్ని కళ్ళు!
    నిద్రలో వున్న సింధూజ కాలింగ్ బెల్ మోగేసరికి నవనీత్ వచ్చేశాడేమో అనుకుంటూ  గబుక్కున లేచి వెళ్ళి తలుపుతీసింది.

    "ఓ....నువ్వా శరభయ్యా....బాగున్నావా? అయ్యగారు పంపారా?" అడిగింది.
    ఏమనాలో  తెలియక వాడు తదేకంగా ఆమెనే తినేస్తున్నట్టు  చూశాడు.
    సింధూజ అతని 'వాడి' చూపులకి తట్టుకోలేక, అర్ధం తెలీక కళ్ళు కిందకు దించుకుంది. అప్పుడర్ధమయింది ఆమెకి తను గభాల్నలేచి రావడంలో పమిట జారివుందని. సిగ్గుతో క్షణంలో పమిట సరిచేసుకుంది.
    తన మనసులోని కంగారుని అతనికంట పడకుండా  జాగ్రత్త పడుతూ "అయ్యగారేమన్నా చెప్పమన్నారా?" మళ్ళీ అడిగింది.
    "లేదమ్మగోరూ! నేనే వచ్చా. అర్జంటుగా ఒక రెండు వేలు కావాలమ్మ గోరూ! కిందటిసారి అయిదొందలూ, ఈ రెండువేలూ కలిపి వచ్చేనెల యిచ్చేస్తాను. ఎల్.ఐ.సి లోనుకి పెట్టాను" అన్నాడు నీళ్ళు నములుతూ.
    "అంత డబ్బు నాదగ్గరెక్కడుంటుంది శరభయ్యా? అయ్యగారినే అడుగు" అంది.
    "అయ్యబాబోయ్! అయ్యగారినే. మొన్ననే కేకలేశారు, నీకు ఊరినిండా అప్పులున్నయ్ పొమ్మని." నెమ్మదిగా అన్నాడు.
    "మరి నేనేం చెయ్యను చెప్పు? నీ సంసారమా గంపెడంత. ఇద్దరు పెళ్ళాలు. ఏడుగురు పిల్లలు. ఎంతని అప్పులు చేస్తావ్? అయినా అంత అర్జంటుగా ఇప్పుడు రెండు వేలెందుకు?" అంది సోఫాలో కూర్చుంటూ.
    "నా చిన్న భార్యని డాక్టరుకి చూపించాలి. నాలుగో నెలట. పెద్దభార్య పెద్ద కొడుకుకి యాదగిరి గుట్టమీద పుట్టు వెంట్రుకలు తీయిస్తానని మొక్కుకుందట పెద్దామె. ఇంకా ఇంట్లో...."
    "ఆ....ఆ....చాల్లే పురాణం. ఇవన్నీ నన్నడిగితే అనవసరపు ఖర్చులే. ఇలా అప్పులు చేసి ఎన్నాళ్లు గడుపుతావు? పైగా చిన్న భార్య మళ్ళీ గర్భవతి అంటున్నావ్? ఇలాగయితే ఎలా?"
    శరభయ్య మాట్లాడకుండా  తలదించుకున్నాడు.
    కాసేపు వారిమధ్య  మౌనం గంభీరంగా నుంచుంది.
    "ఎట్టాగయినా మీరే దయ సూపించండి అమ్మగోరూ!" నసిగాడు.
    "ఎట్టాగయినా అంటే ఎలాగయ్యా? చిన్న చిన్న అమౌంట్లంటే నువ్వడిగినప్పుడల్లా  ఇస్తూనే వున్నాను. రెండువేలు నా దగ్గర రెడీగా ఎందుకుంటాయి చెప్పు?" టీపాయ్ మీదున్న పేపర్లను సర్దుతూ  చెప్పింది సింధూజ.
    "కాస్త మంచినీళ్ళిప్పించండి అమ్మగోరూ!" అన్నాడు ఎండిపోతున్న గొంతులోంచి కీచుగా వస్తున్న మాటలతో.
    "అలాగే. వుండు, కాఫీ కూడా చేస్తాను. పాపం, ఆశతో అంత దూరం నుంచి వచ్చావు" అంటూ లోపలికి వెళ్ళింది సింధూజ.   
    ఎప్పుడు శరభయ్య వచ్చినా, వాడికి కాఫీ ఇచ్చి పంపిస్తుంది. ఆఫీసులో లేటయితే, ఫైళ్ళూ, టిఫిను క్యారియరూ శరభయ్యకిచ్చి ఇంట్లో ఇచ్చి రమ్మని పంపిస్తాడు నవనీత్. లేదా శరభయ్యకి యాభయ్యో వందో అప్పుకావాలంటే నవనీత్ ని అడగకుండా, సింధూజని అడుగుతాడు వాడు.
    "వాడు నన్నడగకుండా, నిన్నడుగుతాడేమిటి అప్పు?" నవ్వుతూ అనేవాడు నవనీత్.
    "మీ పేరే నవనీత్ గాని, మీరు మహాగట్టి. అందుకే మీ దగ్గర అప్పు దొరకదని నన్నడుగుతాడు" కిలకిలా నవ్వుతూ అనేది సింధూజ.
    "అవును. నువ్వు సార్ధకనామధేయురాలివి. సింధూ నదంతటి హృదయం. నదిలోంచి  పుట్టిన లక్షీదేవంతటి కారుణ్యం!" వ్యంగ్యంగా అనేవాడు నవనీత్.
    సింధూజ మంచినీళ్ళందించింది.
    గడగడా తాగేశాడు శరభయ్య.
    సింధూజ టీ పెట్టడానికి లోపలికెళ్ళింది.
    వేడి వేడి టీ కప్పుతో  ముందు హాల్లోకి వచ్చేసరికి  శరభయ్య కనిపించలేదు.
    టీపాయ్ మీద కప్పు పెట్టి శరభయ్యకోసం  గుమ్మం వరకు వచ్చి చూసింది. శరభయ్య లేడు.
    "ఏమిటో నిలకడలేని మనిషి. డబ్బులేదు అనేసరికి నిరాశ పడినట్లున్నాడు. మరో చోటికి పరుగెత్తి ఉంటాడు. ఎప్పుడూ ఇంతే. టీ అయినా తాగకుండా పోయాడు" అనుకుంది సింధూజ.
    తలుపులు మూసి వచ్చి టీ కప్పు అందుకుంది. తానే తాగేసేందుకు సిద్ధపడింది.
    అంతలో తలుపు టక టక కొట్టారెవరో.
    సింధూజ టీ కప్పు టీపాయ్ మీద పెట్టి  వెళ్ళింది.
    తలుపులు తీసింది.
    ఎదురుగా పొట్టిగా, నల్లగా  ఉన్న ఓ యువకుడు నిలబడి వున్నాడు.
    "ఏం కావాలి?" అడిగిందామె.
    "పాత పేపర్లు కొంటాం. పోయిన వారం వస్తే మీ వారు వారం తర్వాత రమ్మన్నారు. పేపర్లు అమ్ముతారా?" అడిగాడతను.
    "ఊహూ.... పేపర్లు కావాలంటే ఆదివారం నాడు వస్తే ఆయన ఉంటారు. అప్పుడు అమ్ముతారు...." అంది సింధూజ.
    వాడు కళ్ళు పెద్దవి చేసుకొని  ఆమె చేతి ఉంగరాలనీ, మెళ్ళో గొలుసుని చూశాడు.
    ఆమె ఎత్తయిన వక్షాల వైపు లొట్టలు వేస్తూ కళ్ళప్పగించి చూస్తున్నాడు.
    సింధూజ అది గమనించింది.
    పైట సరిచేసుకుంది.
    "నువ్వు వెళ్ళొచ్చు. ఆదివారం రా" అని తలుపులు వేసేసింది.
    టకటక మంది తలుపు.
    టక్కున వెనక్కి తిరిగి వచ్చి తలుపులు తీసింది.
    మళ్ళీ వాడే!
    "ఏమిటీ" అన్నట్టు చూసింది.
    "ఆదివారం నాడు ఉదయం రమ్మంటారా? సాయంత్రమా?" వాడు ఆ మాట అడుగుతూ ముందు హాలుని పరిశీలనగా చూడసాగాడు.
    వాడి ప్రవర్తనకి చిరాకు కలిగింది సింధూజకి.
    "ఉదయం పదకొండు గంటలకి వస్తే ఆయన ఇంట్లో ఉంటారు."
    "ఇప్పుడు లేరా?"
    "లేరు!"
    "ఎప్పుడొస్తారు?"
    "సాయంత్రం. అయినా ఇవన్నీ  నీకెందుకు? ఆదివారం రా" అంటూ తలుపులు వేసేసింది.
    తలుపులు వేస్తూ చూసింది సింధూజ.
    ఎదురింటి మేడ బాల్కనీలోంచి  అతను తను ఇంటివైపే చూస్తున్నాడు.
    పనీపాటా లేదనుకుంటాను.
    నాలుగు రోజులక్రితంను కూరగాయల బండి వచ్చినపుడు కొంటూ ఉంటే....తనుకూడా వచ్చి కూరగాయలు కొనేవాడిలాగా ఫోజు.
    తననే తినేసినట్టు చూస్తున్నాడు. ఆ చూపులకి  తనకి ఒళ్ళు చచ్చిపోయింది.
    వెధవకి అంత వయసు వచ్చినా బుద్దిలేదు. వెకిలి వేషాలూ వాడూను అనుకుంటూ తలుపులు దగ్గరకి వేసేసి లోపలికెళ్ళింది సింధూజ.
    మరో అయిదు నిముషాల తర్వాత వంటగదిలో ఉన్న సింధూజ ఏదో చప్పుడు వినిపించి వెనక్కి తిరిగి చూసింది.
    అంతే - ఒక్కసారిగా గావుకేక పెట్టింది.

        *    *    *

    పోలీసులు ఇంటి ముందు జనాన్ని కంట్రోలు చేయడానికి ప్రయాసపడుతున్నారు.
    లోపల సింధూజ అనే, ఆ ఇంట్లో ఉండే ఆమె ఆ మధ్యాహ్నం హత్య చేయబడిందని అందరికీ తెలిసిపోయింది.
    సింధూజ భర్త నవనీత్ వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు.
    పక్కనే నిల్చున్న  శరభయ్య అతన్ని ఓదారుస్తున్నాడు.
    పోలీసులు అటూ ఇటూ హడావుడిగా తిరుగుతున్నారు. ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీస్తున్నారు.
    సింధూజని దారుణంగా రేప్ చేసి చంపేశారు.
    ఆమె ఒంటిమీద నగలు దోచుకున్నారు.
    కత్తిపీటతో ఆమె గొంతు కోశారు.
    ఆ కర్కోటకులకు ఆమె గర్భవతి అనే దయ కూడా లేనట్టుంది.
    అయ్యో పాపం! ఎంత ఘోరం జరిగిపోయింది.
    రకరకాలుగా జనం చెప్పుకుంటున్నారు.
    పోలీసులు ఆ కేసుకి సంబంధించి విషయ సేకరణ మొదలెట్టారు.
    శవాన్ని అంబులెన్స్ లో పోస్ట్ మార్టంకి పంపారు.
    ఆ రోజు నవనీత్ ఆఫీసుకి వెళ్ళాక ఆ ఇంటికి ఎవరెవరు వచ్చారో ఎంక్వయిరీ చేయసాగాడు ఇన్ స్పెక్టర్.
    పక్కింట్లో ఉండే నలభై అయిదేళ్ళ సుభద్ర చెప్పింది: "ప్రొద్దుట నవనీత్ గారు వెళ్ళిపోయాక నేను సింధూజని పలకరించానండి.
    "ఆయన ఉన్నారా?" అని అడిగాను.
    "ఆఫీసుకి వెళ్ళింది పది నిమిషాలయిందని" ఆమె చెప్పింది. ఆ తరువాత మధ్యాహ్నం రెండుగంటల ప్రాంతంలో నవనీత్ ఆఫీసులో పనిచేసే శరభయ్య రావటం చూశాను" అని చెప్పింది సుభద్ర.
    "ఆ తర్వాత ఎవరైనా  ఈ ఇంటికీ  రావటం చూశారా?" అడిగాడు ఇన్ స్పెక్టర్.
    "ఆ తర్వాత నేను చూడడం వీలు పడలేదు. ఇంటిపనిలో  ఉండిపోయి బైటికి రాలేదు. అయితే ఆ ఎదురింట్లో  మేడమీద ఉండే మన్మధరావుని అడిగితే తెలియవచ్చు" అంది సుభద్ర.
    "అతను ఎలా చెప్పగలడు?" సందేహం వ్యక్తం చేశాడు ఇన్ స్పెక్టర్.
    "అతనికి పనీపాటా లేదు. నలభై అయిదేళ్ళ బ్రహ్మచారి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ మేడ మీది బాల్కనీలో నిలబడి వచ్చేపోయే ఆడవాళ్ళని  చూడటం అలవాటు. అతని దృష్టి ఎప్పుడూ  సింధూజ మీదే ఉన్నట్లు నేను గమనించాను. సింధూజ తలుపు తెరిస్తే చాలు - ఆమెని తినేసేటట్టు  చూస్తుంటాడు. అందుకే అతన్ని అడగండి" అంది సుభద్ర.
    ఇన్ స్పెక్టర్ మన్మధరావుని పీల్చుకు రమ్మని కానిస్టేబుల్ ని పంపాడు. అయిదునిముషాల్లో  మన్మధరావు హాజరయ్యాడు.
    "మీరేనా మన్మధరావు?"
    "అవునండి!"
    "మీరెక్కడుంటారు?"
    "ఆ ఎదురు మేడమీద గదిలో."
    "ఏం ఉద్యోగం చేస్తుంటారు?"
    "లాండ్ బిజినెస్ చేస్తున్నాంటాను."
    "ఈవేళ నవనీత్ వాళ్ళ ఇంటికి ఎవరెవరు వచ్చారో చెప్పగలరా?"
    "ఆ....మధ్యాహ్నం ఒంటిగంటన్నరకి కూరగాయల వాడు వచ్చాడు. రెండుగంటలకి నవనీత్ ఆఫీసులో పనిచేసే శరభయ్య అనే అతను వచ్చాడు. తర్వాత పేపర్లవాడు వచ్చాడు."
    "నవనీత్ ఆఫీసులో పనిచేసే అతనంటే ఈయనేనా."
    నవనీత్ పక్కనే ఉన్న శరభయ్యని చూపించి అడిగాడు ఇన్ స్పెక్టర్.
    "అవును" అన్నాడు మన్మధరావు.
    "ఇతని పేరు శరభయ్య అని మీకెలా తెలుసు?
    "చాలాసార్లు ఈ ఇంటికి వస్తూ పోతూ ఉండటం గమనించి అతని పేరుని తెలుసుకున్నాను."
    "ఈరోజు మొత్తం వచ్చిన వాళ్ళు అంతేనా?" అడిగాడు ఇన్ స్పెక్టర్
    మన్మధరావు ఓసారి కళ్ళు మూసుకుని ఆలోచించాడు.
    "ఆఁ ....గుర్తొచ్చిందండి. సరిగ్గా మూడు గంటలకి నవనీత్ తన ఇంట్లోంచి  హడావుడిగా బయటకి వెళ్ళటం చూశాను" అన్నాడు మన్మధరావు.
    ఆ మాట విని నవనీత్ షాక్ తిన్నాడు.
    "ఇన్ స్పెక్టర్ గారూ! ఇతను అబద్ధం చెప్తున్నాడు. సరిగ్గా  మూడుగంటలకి నేను ఆఫీసులో స్టాఫ్ మీటింగులో వున్నాను" అన్నాడు.
    ఆఫీస్ స్టాఫ్ లో నలుగురైదుగురు నవనీత్ మాటని సపోర్ట్ చేశారు.
    నవనీత్ ఆఫీసులో, మీటింగ్ లో ఉంటే ఆ సమయంలో ఇంట్లోంచి  బయటికి వెళ్ళటం చూశానని మన్మధరావు చెప్పటం ఏమిటి? కావాలని చెప్తున్నాడా? తప్పుదారి పట్టించడానికి  చెప్తున్నాడా?

అలా చెప్పటం వలన అతనికేమి ప్రయోజనం?
    ఇన్ స్పెక్టర్ కి ఏం పాలుపోలేదు.
    "మీరు నవనీత్ ని సరిగ్గా చూశారా?"
    మళ్ళీ మన్మధరావుని అడిగాడు ఇన్ స్పెక్టర్.
    "చూశాను." నమ్మకంగా చెప్పాడు మన్మధరావు.
    "నవనీత్ బైటికి వెళ్ళేటప్పుడు ఏ బట్టల్లో ఉన్నారో గుర్తుందా?"
    "ఆ....రోజ్ కలర్ గళ్ళ షర్టు, బ్లాక్ పాంటు. చేతిలో పెద్ద బ్యాగ్ కూడా ఉంది." చెప్పాడు మన్మధరావు.
    ఇన్ స్పెక్టర్ నవనీత్ వైపు చూశాడు.
    అతను వైట్ షర్ట్, గ్రే కలర్ పాంట్ లో ఉన్నాడు.
    "మీరు ఈవేళ ఉదయం నుంచి డ్రెస్ మార్చారా?"
    "లేదు. ఉదయం ఆఫీసుకి వెళ్ళేటప్పుడు  ఈ డ్రెస్ లోనే వెళ్ళాను. ఈ ఘోరం గురించి తెలిసి ఆఫీసు నుంచి ఇలాగే వచ్చాను."
    ఇన్ స్పెక్టర్ మన్మధరావు వైపు సూటిగా చూశాడు.
    "నీవు నవనీత్ గారిని ఆ బట్టల్లో చాలాసార్లు చూశాను. అందుకే చెప్పగలుగుతున్నాను" అన్నాడు మన్మధరావు.
    అంతలో కానిస్టేబుల్ పేపర్లు కొనే వ్యాపారం చేసే సైదులు అనే యువకుడ్ని  వెంటబెట్టుకు వచ్చాడు.
    అతన్ని ప్రశ్నించిన తరువాత కూడా ఎలాంటి క్లూ దొరకలేదు.
    ఇన్ స్పెక్టర్ ఆలోచిస్తూ నవనీత్ ని నిశితంగా పరిశీలించాడు.
    జరిగిన సంఘటనకి  అతను బాగా బాధపడుతున్నాడు. ఎటో శూన్యంలోకి  చూస్తున్నాడు. తనలో తను గొణుక్కుంటున్నాడు.
    అతని పక్కనే శరభయ్య నిలబడి నవనీత్ ని ఓదారుస్తున్నాడు.
    ఉన్నట్లుండి  ఇన్ స్పెక్టర్ దృష్టి శరభయ్య మెడమీద నిలిచింది.
    అక్కడ ఎర్రగా చిన్న గాయం కనిపించింది. శరభయ్యని దగ్గరికి పిలిచాడు ఇన్ స్పెక్టర్.
    "ఏమైందిక్కడ?" అడిగాడు.
    శరభయ్య కంగారు పడ్డాడు.
    "అబ్బే, ఏం లేదు నిన్న మా అబ్బాయి నాతో ఆడుతూ గోరుతో గిచ్చాడు" అన్నాడు శరభయ్య.
    ఇన్ స్పెక్టర్ జాగ్రత్తగా పరిశీలించాడు. అది నిన్నటి గాయంలా లేదు. రక్తం ఇంకా మెరుస్తోంది. ఇన్ స్పెక్టర్ కి అనుమానం దృడపడింది.
    "శరభయ్యా, నిన్ను అరెస్టు చేస్తున్నాం!" అన్నాడు.
    అందరూ కంగారుపడ్డారు.
        *    *    *
    ఇంటరాగేషన్ లో శరభయ్య నేరం ఒప్పుకున్నాడు. మానభంగం,  హత్య, దొంగతనం కేసులు ఆధారాలతో నిరూపించబడ్డాయి. శరభయ్యకి ఉరిశిక్ష వేశారు.
    ఆరోజు జరిగిన విషయం శరభయ్య వివరించాడు:
    "నాకు డబ్బు ఎంతో అవసరం వచ్చింది. అప్పు అడుగుదామని సింధూజ గారి దగ్గరికి వచ్చాను. ఆమె చాలాసార్లు  నాకు అవసరానికి వంద రెండువందలు ఇస్తూ ఉండేవారు. కానీ రెండువేలు ఇవ్వటానికి ఆమె ఒప్పుకోలేదు. కాని నా అవసరం నన్ను ఎంతో టెన్షన్ కి గురి చేసింది. వేరే మార్గం కనపడలేదు.
    అప్పుడు నా దృష్టి సింధూజ ఒంటిమీద ఉన్న నగలు, ఉంగరాల మీద పడింది. అవి దొంగిలిస్తే చాలు - నా అవసరం తీరుతుంది అనుకున్నాను. ఆశ, అవసరం అనే మృగాలు నాలో నిద్రలేచాయి.
    సింధూజ టీ తేవటానికి వంట గదిలోకి వెళ్ళినప్పుడు  నేను పక్క గదిలోకి వెళ్ళి అక్కడ నాకు కనిపించిన కత్తిపీటని సిద్ధం చేసుకున్నాను. అంతలో పేపర్లవాడు వచ్చి మాట్లాడి వెళ్ళాడు. వాడు వెళ్ళాక నేను వంటగదిలోకి వెళ్ళాను. సింధూజ కత్తిపీటతో నిలబడ్డ నన్ను చూసి గావుకేక పెట్టబోతే నోరు నొక్కేశాను.
    ఆ సమయంలో నాలో దాగివున్న  కామం అనే మృగం మేల్కొంది. అంతే. ఆమె నోట్లో గుడ్డలుకుక్కి  అరవకుండా  చేశాను. నా కోరిక తీర్చుకున్నాను. ఆమె ఎంతో పెనుగులాడింది. నన్ను రక్కింది. అయినా, నా బలం ముందు ఆమె ప్రయత్నం ఫలించలేదు. నా కామానికి బలైపోయిన సింధూజని కత్తిపీటతో గొంతుకోశాను. ఆమె ఒంటిమీద నగలు ఒలుచుకున్నాను. మూట కట్టుకున్నాను. నా బట్టలు రక్తసిక్తం అయ్యాయి. వాటిని విప్పి నవనీత్ గారి బట్టలు వేసుకున్నాను. పెద్దబ్యాగ్ లో రక్తపుబట్టలు, నగలు పెట్టుకొని బైటపడ్డాను. దారిలో ఒకచోట బట్టల్ని గొయ్యితీసి  పాతేశాను. ఇంటికెళ్ళి బట్టలు మార్చుకుని ఆఫీసుకి వెళ్ళిపోయాను. అంతే. తర్వాత  నవనీత్ గారికి ఫోన్ వచ్చింది. ఇంటి దగ్గర జరిగిన ఘోరం గురించి తెలుసుకుని ఆయన హడావుడిగా వెళ్ళారు అంతే!"
    "బాబూ! ఆవిడ ఎంతో మంచి తల్లి. ఎంతో సాయం చేసింది నాకు. దేవతలాంటిది. నేను పాపాత్ముణ్ణి, దుర్మార్గుడినైపోయి ఆమెను బలి తీసుకున్నాను. మృగంలా ప్రవర్తించాను. రాక్షసుణ్ణయిపోయాను. నన్ను క్షమించకండి. నన్ను వెంటనే ఉరితీయండి?" అంటూ అరిచాడు శరభయ్య కనీళ్ళు కారుస్తూ.
    శరభయ్యని చట్టం ఉరితీసింది కానీ, సింధూజని ఎవ్వరూ మళ్ళీ బతికించలేకపోయారు. మతి పోగొట్టుకొని పిచ్చివాడైన నవనీత్ ని ఏ డాక్టరూ మామూలు మనిషిని చెయ్యలేకపోయాడు.
    'అయ్యో పాపం!' అంటారు అతని కథ తెలిసిన మరికొందరు.
    ఎందరో శరభయ్యలు - ఎందరినని ఉరితీస్తాం ఈరోజున? శరభయ్యలని ఉరితీసి లాభంలేదు. వారిలో నానాటికి పెరుగుతున్న గొంతెమ్మ కోర్కెలు, స్వార్ధం, ధనాపేక్ష. కష్టపడకుండా  డబ్బులు కావాలి, సుఖాలు పొందాలి అనే తపన. ఎదుటివారిమీద కనీసం సానుభూతైనా ఉండని ప్రవర్తన. ముందు వాటిని ఉరితీయాలి. అందుకు ప్రతి ఒక్కరూ ఆత్మవిమర్శ చేసుకోవాలి.
   

అప్పుడు శరభయ్యలు పుట్టరు!

    సింధూజలు చావరు!

    నవనీత్ లు పిచ్చివాళ్ళుగా మారిపోరు!