Facebook Twitter
మల్లెజడ

మల్లెజడ

                                                                                                                     శ్రీమతి శారద అశోకవర్ధన్

        ఊరంతా తిరిగి తిరిగి ఆకుపచ్చా, తోపుకుంకం రంగు కలిసిన కలనేత నెమలి కంఠం రంగు పట్టుకు, జానెడంత జరీ మెరిసిపోతూ  ఎంతో  అందంగా వున్న పట్టు పరికిణీ గుడ్డ కొని, దాన్లో  బొద్దుగా ముద్దుగా వుండే 'సమీక్ష'ని ఊహించుకొని మురిసిపోయింది జానకమ్మ. పసిడిరంగు శరీరానికి ఈ పరికిణీ జాకెట్టు ఎలా కొట్టొచ్చినట్టు కనిపిస్తుందో  తలుచుకుంటూ మురిసిపోయింది. ఆ చిన్ని జడకి ముద్దొచ్చే మూడు గంటల్లా ముద్దగా అమర్చిన జడకుచ్చులు ఎంత బాగుంటాయో? ఆలోచన రావడమేమిటి వెంటనే బ్యాంకుకు బయలుదేరింది. ఎన్నేళ్ళ నుంచి వున్నాయో అవి బ్యాంకులో! ఎంతో ముచ్చటపడి వాసంతికి చేయించింది ఆ జడ కుప్పులు. పద్నాలుగేళ్లు నిండేవరకూ వాసంతో ఎంతో సరదాగా ఆ జడ కుప్పులూ, జడ మధ్యన కెంపులూ ముత్యాలూ కలిపి తయారుచేసిన చామంతి బిళ్ళా, తలమీద మూడువెళ్ళ వెడల్పుతో లక్ష్మీ విగ్రహం కింద గజ్జెలూ కలిపి తయారు చేసిన నాగరం, నడుముకి వొడ్డాణం, చెవులకి రాళ్ళ జుంకీలూ, చేతికి వంకీలూ, వాసంతిని చూసిన వాళ్ళంతా సాక్షాత్తూ లక్ష్మీదేవి, చిన్ని రూపంలో వీళ్ళింట్లో వెలిసుంటుందని అందరూ ముచ్చటపడేవారు. ఎండాకాలంలో  పుట్టింది వాసంతి. వసంత ఋతువులో పుట్టిందని వసంతా, వాసంతి అని పేరు పెట్టారు జానకమ్మా రామారావుగార్లు.

    మూడేళ్ళు నిండినప్పటినుంచీ, మల్లెపూలతో  పూల జడలు వేసేది జానకమ్మ వాసంతికి. ఒకరోజు వొంకీజడ, ఒకరోజు ముద్దజడ. ఇలా రోజుకో రకంగా వేసి మురిసిపోయేది జానకమ్మ. వాసంతికి లేని నగలేదు. రకరకాల నెక్లెసులూ, లోలక్కులూ, చంద్రహారాలూ చంద్రవంకలూ, ఎన్నో  ఎన్నో....! అందరూ వాసంతిని పొగుడుతూ వుంటే, మురిసి ముద్దయిపోయేది జానకమ్మ. రోజూ, ఉప్పూ, మిరపకాయలూ, నూనెలో తడిపిన గుడ్డని చుట్టూ తిప్పి కాల్చి పారేసేది పెరట్లో జానకమ్మ. ఆ తరవాత కూతురికి దిష్టి దిగిపోయిందని తృప్తిగా నిద్దరపోయేది. నిద్దట్లో కూడా  జానకమ్మకి వాసంతి ధ్యాసే! అటూ ఇటూ ఎగిరిపోయిన దుప్పటిని  సరిగ్గా కప్పి, నిద్దరపోతూన్న  వాసంతి బుగ్గలనీ, నుదుటినీ తనివితీరా నిమురుతూ, ముద్దులవర్షం కురిపించేది. "ఏయ్! అన్ని ముద్దులూ అటేనా? కాస్త ఇటు కూడా  ఇవ్వు...." అనేవారు నవ్వుతూ రామారావుగారు. "ఛీ పోండీ...." అనేది గోముగా తను. అయినా అతను బలవంతంగా అతడివేపు బలంగా లాక్కొని, కౌగిట్లో కదలకుండా  బంధించేసేవారు. ఆ పరిష్వంగంలో కోటిస్వర్గాలు చవిచూసేది జానకమ్మ. రామారావుగారు తన్మయత్వంతో ఆమె అణువణువూ  చుంబించేవారు. ఆ సమయంలో కూడా జానకమ్మగారి ఒక కన్ను వాసంతి వైపే వుండేది!


        *    *    *


    రామారావుగారు సికింద్రాబాదులోని  ఒక ప్రభుత్వ పాఠశాలలో హెడ్ మాస్టరుగా వుండేవారు.  ఈరోజుల్లో బడిపంతులంటే  బతకలేనివాడని అర్ధాలు చెబుతూ చిన్న చూపు చూస్తారు. అందులో ప్రభుత్వపాఠశాల  అంటే మరీనూ. కానీ ఆ రోజుల్లో మాస్టారంటే ఎంత గౌరవం! ఇంట్లో అమ్మా నాన్నల తరవాత విద్యనేర్పేటి గురువుగారంటే  దేముడితో సమానం.

    జానకమ్మగారికి మూఢనమ్మకాలులేవుగానీ, మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి, మన ధర్మాన్ని మనం నెరవేర్చాలి అన్న నమ్మకం మాత్రం చాలా వుంది.  అందుకే ఉమ్మడి కుటుంబంలో వుంటూ  అందరికీ తల్లోనాలుకలా మసిలేది. అలా వుండడం అందరికీ సాధ్యంకాదు. దానికి చదువుకన్నా ఎంతో సంస్కారం కావాలి. అది జానకమ్మలో పుష్కలంగా వుంది. "ఒకదేశాన్ని పరిపాలించే మంత్రికి ఎన్నిబాధ్యతలూ బరువులూ వుంటాయో అన్ని బాధ్యతలూ అవీ ఇల్లాలికి వుంటాయి" అనేది నవ్వుతూ జానకమ్మ.పరిపాలనలో ఎన్ని గ్రూపుల వాళ్ళని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు  తీసుకోవాలో, ఇంట్లో  పరిపాలనలో కూడా అత్తా మామా, ఆడపడుచులూ, తోటికోడళ్ళూ, బావమరుదులూ, పిల్లా పాపలు, బంధువర్గాలూ, స్నేహబృందాలూ - ఇలా....ఇలా....ఎన్నో వర్గాలు అందరినీ సముదాయించుకుంటూ నడవడం ఎంత కష్టమో చెప్పఖ్కర్లేదు. అయితే ఆ రోజుల్లో అందరూ అనురాగానికీ ఆప్యాయతలకీ గౌరవాన్నిచ్చేవారు. ఇప్పటిలాగా డబ్బుని చూసి గౌరవించడమో, హోదాని చూసి పలకరించడమో వుండేది కాదు. అందుకే ఉమ్మడి కుటుంబం అంటే మమతల పందిరి అనుకునేవారు. పెళ్ళిళ్ళు కూడా నలుగురున్నవాళ్ళ కుటుంబాన్ని  ఎంచి ఎంచి చూసి చూసేవారు జానకమ్మగారి మరిది కూతురు సుమన ఇంచు మించు  వాసంతి వయసుదే! ఇద్దరికీ కలిపి నలుగు స్నానం, పూల జడలూ అన్నీ జానకమ్మగారే చేసేవారు.

    గతం కళ్ళ ముందు గబగబా సినిమారీలులా  కదులుతూంటే  కారు మెల్లగా నడుస్తున్నట్టనిపించింది జానకమ్మకి. "డ్రైవర్! బ్యాంకు మూసేస్తారు. టైమయిపోతోంది. త్వరగా పోనీ.... ఇవాళ శనివారం కదా! జనం కూడా ఎక్కువగానే వుంటారు" అంది.

    డ్రైవర్ స్పీడు పెంచాడు.

    "కాలంలో ఎన్ని మార్పులు!' అనుకుని తన మాటకి తనే నవ్వుకుంది. కాలం మారలేదు. మనుషులే చెప్పలేనంతగా మారిపోయారు. నాగరికత అనే పేరుతో సంస్కృతినే మార్చేశారు. ఎక్కడా ఉమ్మడి కుటుంబాలు కనిపించవు. బంధుత్వంలో ప్రేమలు లేవు. ఎవరికి ఎవరూ అక్కర్లేదు. అందరికీ కావలసింది డబ్బు! డబ్బు....! డబ్బు....!


        *    *    *


    ఒక్క కూతురైనా అంత గారాబంగా పెరిగినా,  వాసంతి ఈ కాలం లాగా మారలేదు. దానికీ తనలాగే మనుషులు కావాలి. "అయ్యో! మరిచేపోయాను. దానికి రసాల మామిడిపళ్ళంటే ఎంత ఇష్టమో! దానికోసమని నూజివీడు నుంచి తెప్పించే వాడాయన రసాలు ఆరోజుల్లో. ఏమిటో! అదొస్తోందని తెలిసి కూడా ఆయన ఆ సంగతే మర్చిపోయారు, ఈ మగాళ్ళంతా అంతే. ఏదీ జ్ఞాపకం వుంచుకోరు." ఆలోచనల్లో మునిగిపోయిన ఆమె. "అమ్మగారూ, బ్యాంక్ వొచ్చేసింది" అనగానే ఉలిక్కిపడి తెలుపుతెరిచి దిగింది.

    బ్యాంకులో వున్న  నగలన్నీ  తీసుకుని, సమీక్షని ఆ నగలలో ఊహించుకుంటూ ఇల్లు చేరుకుంది. పట్టు పరికిణీలు, మామిడిపళ్ళు కోసేవి, నగలు, మల్లెపూలు - ఇంకా ఏమిటేమిటో పట్టుకుని  కారు దిగుతున్న జానకమ్మ గారిని చూసి నవ్వుతూ ఎదురొచ్చారు రామారావుగారు.

    "ఎందుకా నవ్వు?" చిరుకోపం ప్రదర్శిస్తూ  అడిగింది జానకమ్మ.

    "అమెరికా....టు....ఆంధ్రా! ఇవన్నీ వాళ్ళకెందుకే? వాళ్ళ అభిరుచులు, రుచులూ, అన్నీ మారిపోయుంటాయి."

    "ఏమీ మారవు. నా వాసంతి సంగతి నాకు తెలీదూ? అయినా, దాని కోసం మీరు రసాలు తెప్పించ లేదేమిటి?" అంది హడావుడిగా, తను తెచ్చిన వస్తువులన్నీ సర్దుతూ.

    "సరేలే!....నీ తృప్తికోసం అవీ పట్టుకొస్తాను" అంటూ క్షణంలో పంచె మార్చుకుని బజారుకెళ్ళారు రామారావుగారు.

    రామారావుగారు పళ్ళకోసం  వెళుతూవుంటే జానకమ్మ మళ్లీ పాత జ్ఞాపకాలల్లో మునిగిపోయింది.

    ఆ సంవత్సరం ఎండలు విపరీతంగా వున్నయ్.  భారమైనా కొత్తావకాయా, పెరుగు, రసాలపళ్ళూ తప్ప ఎవ్వరూ  కూరలూ, పసుపులూ ముట్టుకోవడంలేదు. మంచి పళ్ళు బాగా రసమున్నవి తీసి పక్కన పెట్టింది జానకమ్మ - రాత్రి భోజనాల ముందు వాసంతి కివ్వాలని. ఇంటికెవరో  రావడంతో అత్తగారు వెంకటలక్ష్మమ్మ గారు, ఆ రెండు పళ్ళూ రసం తీసి వాళ్ళ కిచ్చింది. రాత్రి భోజనం ముందు వాసంతి మామిడిపళ్ళు  కావాలని మారాం చేసింది. రామారావుగారు వెంటనే బజారుకెళ్ళి బుట్టడు పళ్ళు కొనుక్కొచ్చారు. దాని సంతోషానికి అవధుల్లేవు. సమీక్షకి కూడా వాసంతిలాగే మామిడిపళ్ళూ, మల్లెపూలు ఇష్టమేనేమో! అసలు అమెరికాలో దొరుకుతాయా పాడా? వాళ్ళిక్కడున్నన్నాళ్లూ తిన్నన్ని మామిడిపళ్ళు  పెట్టాలి. రోజుకోరకం మల్లెపూల జడ వెయ్యాలి. మళ్ళీ వాసంతి పసిపిల్లయి తిరుగుతూన్నట్టు సమీక్షని చూసి మురిసిపోవాలి అనుకుంటూ వసంతా పూర్తిచేసి, తొట్టెలోని చల్లటి నీళ్ళతో స్నానం చేసి, కొన్ని మల్లెపూలు దండగా గుచ్చి, సిగచుట్టూ చుట్టుకుంది.

    బుట్టడు రసాల మామిడి పళ్ళతో లోపలికొచ్చారు రామారావుగారు.

    రామారావుగారు నిజంగా  శ్రీరామచంద్రుడి లాంటివారే. తరగని తాతల నాటి ఆస్తివున్నా అహంకారం కించిత్ కూడా లేదు. ఎమ్. ఏ, ప్యాసయి లెక్చరరుగా  ఉద్యోగం వొస్తే ఒద్దని, పసి పిల్లలతో  ఆడుతూ పాడుతూ  పాఠాలు చెప్పే బడిపంతులు ఉద్యోగాన్నే కోరుకున్నారు. "కడుపున పుట్టిన బిడ్డ ఒక్కర్తే అయినా, బళ్ళో పిల్లలంతా  నావాళ్ళే" అంటారాయన. అతణ్ణి జానకమ్మగారినీ చూసిన వాళ్ళంతా "నిజంగా వీళ్ళిద్దరూ  సీతారాములే" అంటారు.  

    "ఇన్ని పళ్ళు తెచ్చేరేమిటండీ ఒక్కసారిగా?" అంది జానకమ్మ ఒక్కొక్కటే తీసి లోపల పెడుతూ. "మళ్ళీ ఇంటికెవరైనా  వొస్తే వాళ్ళకీ పళ్ళు రసం తీసి ఇచ్చేస్తే, నీ గారాల బిడ్డ, పళ్ళకోసం  మారాం చేస్తే అప్పటికప్పుడు  నేను బజారుకి పరుగెత్తాలి. అందుకనే  ఏకంగా  ఇన్ని తెచ్చేశాను" అన్నారాయన జానకమ్మ కళ్ళల్లోకి చూస్తూ.

    "మీకూ జ్ఞాపకం వుందీ ఆ విషయం!?" అంది ఉప్పొంగిపోతూ జానకమ్మ.

    "జానకీ!....నువ్వు, వాసంతి  నాకు రెండు కళ్ళు. నా కళ్ళసంగతి నాకు తెలీదూ. కాకపోతే, అమెరికాలో అయిదేళ్ళు  కాపరం చేసిన వాళ్ళ అలవాట్లు ఎలా మారాయో తెలీక. నీ సంబరానికి బ్రేకు వేస్తూ వొచ్చాను" అన్నారు ఆమెను కళ్ళతోనే తినేసేలా చూస్తూ.

    "నా తల్లి ఎన్నటికీ  మారదు మొన్న పంపించిన ఫోటోలో  అదీ సమీక్షా ఎలా వున్నారు. వాసంతికి ఈ కాలపు  పిల్లల్లాగా  జానెడు పిలకో, బెత్తెడు పిలకో లేదు. బారెడు జడ ముందుకేసుకుని, కంచిపట్టు చీరలో  మహాలక్ష్మిలా లేదూ! సమీక్షకి మాత్రం, మూరెడు జుట్టూ, పట్టులంగా. అమెరికా కాదు, అంతరిక్షంలో కాపురం పెట్టినా, నా చిట్టితల్లి మారదండీ! నాకు తెలుసు" అంది మళ్ళీ అల్మారాలోవున్న  ఫోటోలని తీసి తనివితీరా చూసి మురిసిపోతూ, అతనికి చూపిస్తూ.

    రామారావుగారు చిన్నగా నవ్వేరు.

    ఆ నవ్వులో ఎక్కువ వ్యంగ్యం కనిపించింది జానకమ్మకి. వ్యంగ్యమే కాదు, "నీ అంచనా తప్పవుతుందేమో" అన్న ఉద్దేశ్యం కూడా కనిపించింది. అయితే ఆమె "సరే చూద్దామా - అది మారిపోయి బాబ్ డ్ హెయిర్ తో వస్తుందో, ఇలా ఈ ఫోటోలోలాగా  బారెడుజడతో వొస్తుందో" అంది.

    రామారావుగారు మాట్లాడలేదు. నవ్వేసి ఊరుకున్నారు.

    "ఏమిటా నవ్వు?" అంది ఉక్రోషంగా.

    "జానకీ! నీ ఉక్రోషం చూస్తూవుంటే, దేవదాసు కథలో  పారూ ఉడుకుమోతుతనం జ్ఞాపక మొస్తోంది" అన్నారు బుగ్గమీద చిటికేస్తూ.

    "ఛీ....పొండి....రేపు మన సరసం సమీక్ష చూసిందీ అంటే....?"

    "ఏమీ అవదు. అది అంతకన్నా  ఎక్కువే ఆ దేశంలో చూసుంటుంది" అన్నారు నవ్వుతూ.

    అతని నవ్వుతో శ్రుతి కలిపింది జానకి.

    ఆనందభైరవి రాగం ఆ గదంతా  మ్రోగినట్టయింది.


        *    *    *


    పెసరరంగు జరీపువ్వుల చీరకి  గులాబీరంగు బార్డర్ ఎంతో హుందాగా, గౌరవంగా కనిపించింది. నిజానికి నిగనిగలాడే వాసంతి మేనుమీద, ఆ చీరకే కొత్త అందం వొచ్చినట్టనిపించింది. వోదులుగా అల్లుకుని మెడమీద నుంచి ముందుకు వేసుకున్న జడ నడుస్తుంటే తొడలను తాకుతూ గిలిగింతలు పెడుతూన్నట్టుంది. కాటుక కళ్లూ, పొడుగ్గా, నిటారుగా వెలిగే జ్యోతిలా మెరిసిపోతూన్న  ఎర్రటి తిలకంబొట్టూ, మెళ్లో మంగళసూత్రాలూ, నల్లపూసలూ. సమీక్ష ఎరుపురంగు జరీ అంచు, పట్టులంగా, జుంకీలూ, పొడుగాటి జెడ. వీళ్ళు అమెరికా కాదు. అమలాపురం నుంచి వస్తున్నట్టుగా  అనిపించింది జానకమ్మకి. మొహంలో  గర్వం తొణికిసలాడుతూ వుంటే, రామారావుగారివైపు  చూసింది. అతను నవ్వుతూ చిన్నగా 'నువ్వే గెలిచావులే' అన్నారు. "మామూలు గెలుపా ఇది? ఇండియా - పాకిస్తాన్ తో క్రికెట్ లో గెలిచినంత గెలుపు" అంది అతణ్ణి ఉడికించాలనే ఉద్దేశ్యంతో. రామారావుగారు నవ్వి ఊరుకున్నారు.

        *    *    *

    ఏర్ పోర్ట్ నుంచే కారులో జోగిపోతున్నారు వాసంతీ ,సమీక్షా. అక్కడి రాత్రి ఇక్కడి పగలూ, ఇక్కడి పగలు అక్కడి రాత్రీ అవడంతో, 'జెట్ లొగ్'లో తూలిపోతూ ఇల్లు చేరుకున్నారు.

    "అమ్మా! అన్ని విషయాలూ, మెల్లగా తీరిగ్గా  మాట్లాడుకుందామమ్మా....కళ్ళు మూసుకుపోతున్నయ్" అంటూ చీరమార్చి నైటీ వేసుకుని, సమీక్షకి కూడా నైటీ వేసేసి తన గదిలోకెళ్ళి  పడుకుంది వాసంతి, "సారీ మమ్మీ...." అంటూ.

    "కొంచెం మామిడికాయ పులిహోర తినవూ....నీ కోసం చేశాను" అంది జానకమ్మా అప్పటికప్పుడే ప్లేటులో పెట్టితెస్తూ.

    "ఒద్దు మమ్మీ....ప్లైట్ లో హోమ్ బర్గు సమోసా....ఏమిటేమిటో పెట్టారు ప్లీజ్" అంటూ  ఒక్కటే చెంచా నోట్లో వేసుకుని గ్లాసుడు నీళ్ళుతాగి పడుకుంది వాసంతి.

    "మమ్మీ....వేర్........ఐ....స్లీప్?" అడిగింది సమీక్ష.

    "నా దగ్గర పడుకుంటావా?" అడిగింది జానకమ్మ.

    "నో....నో....నాకు వేరే రూములేదా?" అడిగింది సమీక్ష.

    "మమ్మీ దగ్గర పడుకోవా?" అడిగింది జానకమ్మ.

    "నో.... నో....నా గది చూపించు" అంది సమీక్ష.

    వెంటనే పక్కనే వున్న గెస్ట్ రూం చూపించారు రామారావుగారు. గబగబా వెళ్ళి మంచం మీద పడుకుంటూన్న సమీక్షికేసి గుడ్లప్పగించి చూస్తూండిపోయింది జానకమ్మ.

    ఆమె పరిస్థితిని  అర్ధం చేసుకున్న  రామారావుగారు, ఆమె భుజంమీద చెయ్యివేసి, తన గదిలోకి తీసికెళ్ళారు.

    జానకమ్మ మనసులో ఏదో బాధ. సమీక్షని గుండెల హత్తుకుని మామిడి పళ్ళ ముక్కలు తినిపిస్తూ, అనగా అనగా రాజు కథ చెబుతూ, జో అచ్యుతానంద జోజో అంటూ జో కొడుతూ, లాలిపాటలు పాడుతూ ,దాని బుజ్జి బుజ్జి మాటలకి మురిసిపోతూ, చిలిపి ప్రశ్నలకి సమాధానం చెబుతూ ఆనందతరంగాలలో  మునిగిపోవాలన్న  కమ్మని ఊహలను, ఏదో పెద్ద అల వొచ్చి కొట్టేసినట్టుగా  బాధపడింది జానకమ్మ. కూతురితో తెల్లవార్లూ కబుర్లతో మునిగిపోవాలనుకున్న  తను, పెద్ద కెరటం ఒడ్డుకి విసిరి కొట్టేసినట్టుగా విలవిలలాడిపోతూ, బాధను కడుపులోనే  దిగమింగే ప్రయత్నం చేస్తూ, వండిన వంటకాలవైపు పిచ్చిగా చూస్తూ, తనూ విశ్రమించింది జానకమ్మ. "రెస్టు తీసుకో" అంటూ గదిలో ఫాన్ ఆన్ చేసి, పేపరు తీసుకుని  సావిట్లో చదువుకుంటూ  కూర్చున్నారు రామారావుగారు.

        *    *    *

    జానకమ్మకి ఏం చెయ్యాలో తెలీడంలేదు. ఏవేవో చెయ్యాలనుకుంది. కానీ, దేనికీ కాలూ, చెయ్యీ ఆడట్లేదు. సుమన ఇంజనీరింగ్ పూర్తయ్యే వరకు పెళ్ళి చేసుకోనని భీష్మించుకు కూర్చోవడంవల్ల, ఆ తరవాత వొచ్చిన సంబంధాలు  ఒకళ్ళకి నచ్చితే మరొకళ్ళకి నచ్చకపోవడంవల్లా, సుమన పెళ్ళి ఇప్పటికిగాని ఫిక్సవలేదు. సుమన పెళ్ళికోసమే ఇప్పుడు వాసంతి వచ్చింది.

    "దొడ్డమ్మా....పెళ్ళిలో కాస్త గమ్మత్తు  చెయ్యాలి. మా ఇద్దరికీ ఒకే రకం చీరలు కొంటాను. ఒకేలాగా మా ఇద్దరికీ నువ్వే పూలజడలు వెయ్యాలి. పందిట్లో వాళ్ళంతా ఇద్దరూ ఒకేలా వున్నారే అని ఆశ్చర్యంలో మునిగిపోవాలి, పెళ్ళికొడుకుతో సహా" అంటూ పకపకా నవ్వేది. అలాగే ఇద్దరికీ ఒకేరకం పట్టుచీరలు కొంది. సాయంత్రం రిసెప్షనుకి ఏవేవో మాటలు చెవులో రింగుమంటూంటే, ఎక్కడెక్కడి జ్ఞాపకాలో ఆమెని ఉక్కిరి బిక్కిరి చేస్తూ వుంటే, పరుపులూ, దిళ్ళూ రాళ్ళలాగా, ముళ్ళపొదల్లాగా అనిపించి, లేచి గదిలో కొచ్చింది. మల్లెపూలు విచ్చుకుని వెన్నెల గుట్టగా వెలిసినట్టనిపించింది. ఇల్లంతా మల్లెల పరిమళం మత్తెక్కిస్తున్నట్టుంది. పూలజడలు వేసుకోకపోయినా చక్కగా దండలు కట్టి  పెట్టుకుంటారేమోనని చూసి, వాసంతి గదిలోకి వెళ్ళింది. ఒళ్ళు మరచి పడుకున్న  వాసంతిని తనివితీరా చూసి మురిసిపోయింది. నిద్దట్లో ఇప్పటికీ చిన్న పిల్లలాగే  అనిపించింది జానకమ్మకి. ఫ్యాను గాలికి అటూ ఇటూ ఎగురుతూన్న నైటీని సవరించి, సమీక్ష గదిలో కెళ్ళింది.

    పెద్ద ఆరిందాలా రెండు చేతులూ తలకి ఇరువైపులా పెట్టుకుని నిద్రపోతోంది. బొద్దుగా, ముద్దుగా వున్న సమీక్షని గుండెలకి హత్తుకోవాలనిపించింది. కానీ, దానికి నిద్రాభంగ మవుతుంది కదా! అందుకని ఆ కోరికని అణచి పెట్టి, బయటి కొచ్చింది, ఇదంతా గమనిస్తూన్న రామారావుగారు, "జానకీ....మరీ....ఇంత ప్రేమ పెంచుకోకూడదు. వాసంతి మన బిడ్డే కావొచ్చు. ఈనాడు మరొకరికి భార్య. సమీక్ష మనకి మనవరాలే కావొచ్చు. కానీ మన కేమాత్రమూ ఏ రకమైన అధికారమూ లేదు ఆ పిల్లమీద. వాళ్ళకేం కావాలో అందించి నీ మమకారాన్ని పంచాలే తప్ప, నీకేం కావాలో చెప్పి కాదు" అన్నారు ఆమెని ఊరడించే ధోరణిలో. అతనికి తెలుసు జానకమ్మ మనసు వెన్నపూస అని, ఆమె ప్రేమ ప్రవాహానికి ఆనకట్టలు లేవని. అయితే ఆమెను ఈరెంటికి కాస్త దూరంగా ఎలా అట్టే పెట్టాలో ఆడే తెలీదు. ఆమె మనస్సు చివుక్కుమంటే తట్టుకోలేదు. అందుకే అలా కనిపెట్టుకు తిరుగుతున్నారు.

    "జానకీ!" పిలిచారు రామారావుగారు.

    పరధ్యానంగా కాఫీ కలుపుతూన్న జానకమ్మ  ఉలిక్కిపడి  "ఆ!...." అంది కంగారుగా.  

    "ఏ లోకంలో వున్నావ్? కొంపదీసి నిల్చునే నిద్రపోవట్లేదు కదా?" నవ్వుతూ అన్నారు.

    జానకమ్మ కూడా చిన్నగా నవ్వింది.

    "చూడూ ఈ పూలన్నీ  దేముడికి పెట్టెయ్. కొన్ని పక్కింటికీ, ఎదురింటి వాళ్ళకీ పంపేయ్" అన్నారు.

    "అవును నిజమే! రేపో ఎల్లుండో దాని బడలిక తీరాక, బోలెడు పువ్వులు కొని ముద్దజెడలు కుడ్తాను" అంటూ పూలన్నీ పనిపిల్ల నాగమణిచేత అందరికీ పంచేసింది.

    కొత్తావకాయ, అందులోనూ ఉల్లావకాయ వాసంతి కిష్టమని జాడీలోంచి సీసాలోకి వేసింది. వేడిగా అన్నం చేసింది మిగిలినవన్నీ పొద్దున్న చేసినవి అలాగే వున్నాయ్.

    రాత్రి దాదాపు పది గంటలకి లేచింది వాసంతి. "భోంచేద్దువుగాని లే తల్లీ!" అంది జానకమ్మ వాసంతి తలనిమురుతూ.

    "ఒద్దమ్మా.... తేనుపులొస్తున్నయ్. స్టమకప్సెట్టయినట్టుంది" అంది. "నీ కోసం ఉల్లావకాయా, పెరుగూ, మామిడి పండు ముక్కలూ...."

    "మై గాడ్! ఆవకాయ తింటే స్ట్రెయిట్, అమెరికాలో పడ్తాను. అమ్మా.... కారం అస్సలు తినం మేము. అది చూస్తేనే మంటగా అనిపిస్తుంది మీ అల్లుడుగారికి. కారంవాడేచోట మిరియాల పొడి చేసుకుంటాం." అంది నవ్వుతూ వాసంతి. జానకమ్మని ఆవకాయ సీసా వెక్కిరిస్తూన్నట్టనిపించింది. "నేనూ....సమీక్షా....పాలు తాగేస్తాం. ఇంకేం వొద్దు. పాలున్నాయా?" అంది అప్పుడే 'మమ్మీ' అంటూ లేచొచ్చిన సమీక్షని ఎత్తుకుంటూ.

    "ఉన్నాయమ్మా పాలు. జానకీ! వాళ్ళకి పాలిచ్చేసి, నాకు వడ్డించు" అన్నారు రామారావుగారు. జానకమ్మ కంట్లోని నీటిపొరని చూసి కంగారు పడిపోతూ.

    జానకమ్మ లోపలి కెళ్ళింది.

    "నాన్నా....ఎంత వేడిగా వుంది బాబూ ఇక్కడ? ఈ ఆరేళ్ళలోనూ ఎండ చూడలేదేమో, బాంబే వొచ్చినప్పటినుంచీ, ఫ్రెషర్ కుక్కర్ లో కూర్చున్న ట్టుంది.  పూర్.... సమీక్ష ఎలా భరిస్తోందో" అంటూ సమీక్ష నుదుటి మీద ముద్దుల వర్షం కురిపిస్తూన్న  వాసంతికి జానకమ్మగారు పాల గ్లాసులతో  రావడంతో బ్రేకు పడింది.

        *    *    *

    మర్నాడు పొద్దుటే లేచి, ఇడ్లీ కారప్పొడీ టిఫిన్ చేసి సుమనని చూసి ఒక గంటలో ఒచ్చేస్తానని వెళ్ళిన వాసంతి పన్నెండు గంటలకి తిరిగొచ్చింది. వాసంతినీ, సమీక్షని చూసిన జానకమ్మ కనురెప్పలు మూతపడలేదు. నోట మాట పెగలక పెదవులు బిగుసుకుపోయాయి. మెదడు మొద్దుబారినట్టయింది. కళ్లు బైర్లు కమ్మినట్టయి, సోఫాలో కూలబడిపోయింది జానకమ్మ. పరిస్థితి అర్ధం చేసుకున్న రామారావుగారు, ఆమె పక్కనే కూర్చుని "చూడవోయ్....ఇప్పుడూ....ఇప్పుడు మనమ్మాయి అమెరికా అమ్మాయనుకుంటారు. అంతకుముందు, అమలాపురమో, ఆముదాల వలసో అనుకుని వుంటారు" అన్నారు నవ్వుతూ.

    "అమ్మా....సుమన ఇంటికి వెళ్ళడానికి ముందు 'బ్యూటీ పార్లర్' కి వెళ్ళాను. నాకూ సమీక్షకీ కూడా చచ్చేంత చిరాగ్గా వుంది ఈ జుట్టు. మొన్నా మధ్యన అమెరికాలో మిసెస్ ఇండియా పోటీల్లో, 'అచ్చమైన తెలుగు మహిళ' పోటీకి పదివేల డాలర్ల  బహుమతి పెట్టారు. అందులో పాల్గొనమని మీ అల్లుడు నితిన్, మిగిలిన స్నేహబృందం బలవంతం చేశారు. కష్టపడి ఆరునెలలు జుట్టు పెంచుకొని పోటీలో పాల్గొన్నాను. ఎంత బాగా పెరిగిందో? నా జాడా, నా పట్టుచీరా, ప్లెస్ నా ఉపన్యాసం, పదివేల డాలర్లు గెల్చుకున్నాను. అచ్చమైన తెలుగు మహిళా కిరీటం నాకే పెట్టారు. నేను పెంచుకోవడం చూసి, సమీక్ష కూడా పెంచుకుంది. ఇంక ఇక్కడ చిరాగ్గా వుంది. అందులో పెళ్ళికూడానూ' అంది బెల్ బాటమ్ లో వున్న వాసంతి, చిన్న నిక్కరూ బనియన్ లో వున్న సమీక్షని ఎత్తుకుని అలిసిపోయి కిందికి దింపుతూ. ఇద్దరిదీ ఇంచుమించు బాయ్ కట్ అనొచ్చు!

    జానకమ్మ కళ్ళముందు ముద్దకుట్టు మల్లెజడా, జడకుచ్చులూ, వొడ్డాణం అన్నీ వంకర టింకరగా గెంతుతూ ఆమెని గేలి చేస్తూ నాట్యం చేస్తున్నాయ్! ఒళ్ళంతా చెమటలు పడ్తున్నాయ్. 'అచ్చమైన తెలుగు మహిళ' ఫోటోలు తేవడానికి గదిలో కెళ్ళింది వాసంతి.

    "జానకీ! చెప్పానా, లేనిపోని  ఆశలు పెట్టుకోవద్దని? వాసంతి నువ్వు చిన్నప్పుడు  గోరుముద్దలు తినిపిస్తూ ,పిట్టకథలు  చెబితే కేరింతలు కొడుతూ ఆడుకున్న పసిపాప కాదు. తనకేం కావాలో తను తెలుసుకో గలిగిన యువతి. తన యిష్టాయిష్టాలు తనవి. తన జీవితం తనది. మనం కేవలం ఆమెకు జన్మనిచ్చిన కన్నవాళ్ళం మాత్రమే. మారేకాలంతో మనమూ మారితే, మనకీ, వాళ్ళకీ కూడా సుఖం. లేదా బతుకంతా దుఃఖమయమే! లే - లేచివెళ్ళి ఆ ఫోటోలు చూడు. నవ్వుతూ మాట్లాడు" అంటూ ఉపదేశం చేశారు.

    జ్ఞానోదయం కలిగిన బుద్దుడిలా లేచి, వాసంతి గదిలోకి వెళ్ళి, ఆమె నవ్వుతూ తుళ్ళుతూ వ్యాఖ్యానిస్తూ చూపిస్తూన్న ఫోటోలను, ఎవ్వరికీ కనబడని నీటిపొర కళ్ళకి అడ్డంగా వున్నా, చూడ్డానికి ప్రయత్నించింది జానకమ్మ. ఆమె కళ్ళలో ఆ ఫోటోలకన్నా  ముద్దగా కట్టిన మల్లెజెడే కదలాడుతూ కనిపించింది. రామారావుగారి మనసులోనూ జానకమ్మ ఊహల్లోని  మల్లెజెడే మొదటిసారిగా, ప్రత్యేకంగా కనిపించింది. అతనికీ చిన్నముల్లు గుండెకి సూదిలా గుచ్చుకున్నట్టయింది ఒక్క క్షణం!