Facebook Twitter
నీకు రెండు - నాకు మూడు

నీకు రెండు - నాకు మూడు

ముసలయ్య, ముసలమ్మ చాలా పేదవాళ్లు. అంతేకాదు- పరమ పిసినారులు కూడా! ఒకరి పొందు ఒకరు మెచ్చరు! " ఒకరు కట్టె ఏది? అంటే మరొకరు తెడ్డు ఏది?" అంటారు.

ఒకరోజు ముసలయ్య కష్టపడి నాలుగు రూపాయలు సంపాదించాడు. దానితో అరశేరు జొన్న పిండి తీసుకుని వచ్చి, ముసలమ్మకిచ్చి, రొట్టెలు చేయమన్నాడు. మరునాడు ఉదయాన్నే ముసలమ్మ రొట్టెలు కాల్చింది- సరిగ్గా ఐదు రొట్టెలు తయారయ్యాయి.

రొట్టెలు తయారవ్వగానే ఇద్దరూ తినేందుకు కూర్చున్నారు. ముసలయ్య పళ్ళెంలో రెండు రొట్టెలు వేసి, తన పళ్ళెంలో మూడు రొట్టెలు వేసుకుంది ముసలమ్మ. ఇది చూడగానే ముసలయ్యకు పిచ్చి కోపం వచ్చింది: "ఏమే! కష్టపడి సంపాదించింది నేను- మరి నాకు తక్కువ; ఊరికే కూర్చునే నీకు ఎక్కువనా?” అని చిందులేశాడు. ముసలమ్మ కూడా ఏమీ తగ్గలేదు- "నేను కష్టం చేసి రొట్టెను కాల్చాను- కాబట్టి నాకు మూడు; నీకు రెండు- ఇదే న్యాయం!" అంది.

ఇద్దరూ చాలా సేపు వాదించుకున్నారు. చివరికి- "సరే, ఇద్దరం ఒక పందెం వేసుకుందాం- మన ఇంట్లో రెండు నులక మంచాలు ఉన్నాయి కదా! వాటి నిండా నల్లులే. వాటి మీద కదలకుండా పడుకోవాలి ఇద్దరమూ. ముందుగా ఎవరు కదిలితే వాళ్లు ఓడిపోయినట్లు! ఓడినవాళ్లకు రెండు; గెలిచిన వాళ్లకు మూడు- సరేనా? " అని పందెం వేసుకున్నారు.

పందెం ప్రారంభం అయింది. ఇద్దరూ మంచాలమీద బిర్ర బిగుసుకొని పడుకున్నారు. మధ్యాహ్నం అయింది- ఎవ్వరూ కదల లేదు. సాయంత్రం అయింది- అయినా కదలేదు! పట్టిన పట్టు వదల లేదు ఇద్దరూ. నల్లులు బాగా కుట్టి పండగ చేసుకుంటున్నాయి. ఒళ్ళంతా దద్దుర్లు లేచాయి.

అయినా ఏ ఒక్కరూ కదలలేదు; మెదల లేదు! 'కదిలితే రొట్టె పోతుంది' అనే ఆలోచన! ఇద్దరూ అలాగే శవాల మాదిరి పడుకుండి పోయారు. రాత్రి అయింది- మళ్లీ తెల్లవారింది- అయినా ఇద్దరిలో ఏ ఒక్కరూ కదలలేదు.

'ఇంటి తలుపులు తెరుచుకోలేదు- మధ్యాహ్నం అయింది- ఇంట్లో ఎలాంటి అలికిడీ లేదు- అని పొరుగిళ్ళ వాళ్ళకి అనుమానం వచ్చింది. అందరూ‌ కలిసి, తలుపులు త్రోసి, లోపలికిపోయి చూస్తే ఏముంది- ఇద్దరు ముసలోళ్లూ శవాల మాదిరి పడివున్నారు, మంచాలమీద. రెండు శరీరాలూ ఎర్రగా కందిపోయి ఉన్నాయి. ఉలుకు లేదు-పలుకు లేదు. అందరూ గుమిగూడారు. 'పాపం! చనిపోయారు' అని ఏడిచారు. అయినా వీళ్లిద్దరూ విన్నారు తప్పిస్తే- కదల లేదు! 'కదిలితే రొట్టెలు పోతాయి' అని ఊరుకున్నారు.

'శవాలని అలా వదిలేస్తే ఎలా?' అని, వీళ్ళను మంచాలతో‌ సహా దహనం చేద్దామనుకున్నారు పొరుగు వాళ్ళు. రెండు మంచాలనూ 'ఎత్తండంటే ఎత్తండి' అని, అందరూ కలిసి ఎత్తుకొని, స్మశానానికి బయలు దేరారు. రెండు చితులు పేర్చి, ఇద్దరినీ చితులమీద పడుకోబెట్టారు. అయినా ముసలమ్మగాని, ముసలయ్యగాని కదలనే లేదు- కదిలితే రొట్టె పోతుందని!

సరే, అందరూ కలిసి చితికి నిప్పంటించారు; ఎవరికి వాళ్లు వెళ్ళిపోయారు. ఇంకొక్క ఐదుగురు మాత్రం ఉన్నారు అక్కడ. ఆలోగా చితుల మీద పడుకున్న ఇద్దరికీ వేడి తగలసాగింది. అయినా భరిస్తున్నారు తప్ప ఏ ఒక్కరూ కదలలేదు! చివరికి వేడి శరీరాలకి అంటుకోసాగింది! ఇంక ఓర్చుకోవడం ముసలయ్యవల్ల కాలేదు- గట్టిగా మొత్తుకుంటూ, ఒక్క ఉదుటున చితి నుండి బయటికి దూకాడు!

మరుక్షణంలోనే ముసలమ్మ "నువ్వే ఓడావు- నీకు రెండు; నాకు మూడు" అని అరుస్తూ తను కూడా చితి నుండి బయటికి దూకింది!

ఇంకేముంది? 'పిచ్చాపాటిలో మునిగిఉన్న ఐదుగురూ "పరుగెత్తండి రోయ్! ఇవి అప్పుడే దయ్యాలయ్యాయి! మనల్ని పంచుకోవడానికి వాదులాడుకుంటున్నాయి!” అని కాలి బిర్రున పరుగెత్తారు.

ఇది చూసిన ముసలయ్య, ముసలమ్మ తమ ప్రవర్తనకు తామే సిగ్గుపడ్డారు. ఇక ఆ ఊరు లోకి పోవడానికి వాళ్లకు మొహం చెల్లలేదు. అందుకని వాళ్ళు బుద్ధిగా వేరే ఊరికి పోయి బ్రతుక్కున్నారు!



రచన: కె.గంగమ్మ,
ఉపాధ్యాయురాలు,
టింబక్టు బడి, చెన్నేకొత్తపల్లి
.

కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో