Facebook Twitter
జంగయ్య - చందమామ

జంగయ్య- చందమామ

రచన - సౌజన్య,  5 వ తరగతి. 



ఒక ఊరిలో జంగయ్య అనే పిల్లవాడు ఉండేవాడు. జంగయ్యకు ఏడేళ్ళు.
ఎప్పుడూ ఏదో ఒకపని చేస్తుంటాడు; ఏదో ఒకటి ఆలోచిస్తూంటాడు.

ఒక రోజు కులాసాగా పడుకున్న జంగయ్యకు ఒక ఆలోచన వచ్చింది. చందమామ మీదకు వెళ్తే ఎంత బాగుంటుంది! ఇదీ, జంగయ్య కొత్త ఆలోచన!

ఆరోజు సాయంత్రం జంగయ్య ఒక రాకెట్ సంపాదించాడు. దాని మీద కూర్చొని చందమామ దగ్గరికి బయలు దేరాడు. వెళ్తూ వెళ్తూ ఉండగా దారిలో చీకటి పడింది. జంగయ్యకు భయం వేసింది. ఆ చీకట్లో చందమామ ఎక్కడున్నాడో జంగయ్యకు కనబడలేదు. దారి కూడా తెలీలేదు! అయినా అతను పట్టు వీడలేదు; వెనక్కి తిరగ లేదు. జంగయ్య ఎక్కిన రాకెట్ ఇంకా ఇంకా పైకి వెళ్లింది.

చాలా దూరం వెళ్ళాక అతనికి చందమామ కనిపించాడు. జంగయ్య ఆనందానికి అంతులేదు. అతను రాకెట్ మీదినుండి చందమామ మీద దిగాడు; అటూ ఇటూ తిరిగాడు- అంతా ఎడారిలాగా ఉంది. అక్కడక్కడా రాళ్ళు. దూరంగా కొండలు. చూద్దామంటే ఒక్క చెట్టు కూడా లేదు- కనీసం గడ్డి కూడా కనబడలేదు-

ఒక పిట్టకానీ , ఒక జంతువు కానీ లేదు. తాగటానికి నీళ్లు కూడా లేవు. సరిగా ఊపిరాడటం లేదు. ఇదేం చందమామ ? ఇక్కడేం బాగాలేదు. మావూరే దీనికన్నా చాలా బాగుంది అనిపించింది జంగయ్యకు. తిరిగి అక్కడి నుండి బయలు దేరి ఊరి ముఖం పట్టాడు. ఊరు చేరుకునే సరికి ప్రాణం లేచి వచ్చినట్లైంది. అంతలోనే మెలకువ కూడా వచ్చింది. ఆ తరువాత అతను చందమామ మీద చూసిన విషయాలు ఊరందర్నీ పిలిచి చెప్పాడు.


కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో