Facebook Twitter
బలవంతుని గర్వభంగం

 

 

బలవంతుని గర్వభంగం

 

 

రచన: నరేష్


ఒకనాడు ఒక బలవంతుడు సోము దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు:

’ప్రపంచంలో నువ్వు తెలివైన వాడివి, నేను బలమైన వాడిని. నా ఉద్దేశం ప్రకారం మనుషులకు బలం కావాలి తప్ప, తెలివి తేటలతో పనిలేదు. అందువల్ల, నువ్వు, నేను తలపడక తప్పదు. నువ్వు గొప్పో, నేను గొప్పో ఈ రోజున తేలిపోవలసిందే.’

సోము బలవంతుడిని ఒకసారి తేరిపార చూశాడు. "నీ బలమెంత?" అని అడిగాడు. "నేను ఒక చేతితో ఒక టన్ను బరువును ఎత్తి సులభంగా ఈ ప్రహరీ గోడ పైనుండి పట్టణం మధ్యకు విసిరివేయగలను" అని బలవంతుడు సమాధానమిచ్చాడు గర్వంగా.

"నాకు నమ్మకం కలగటంలేదు" నెమ్మదిగా అన్నాడు సోము

"అయితే నా బలాన్ని నీ ముందే నిరూపిస్తాను. ఏ బల పరీక్షకైనా నేను తయారు." అన్నాడు బలవంతుడు.

"సరే, అయితే నీకొక చిన్న బలపరీక్ష పెడతాను. అందులో నెగ్గితే నువ్వు ప్రపంచంలోకెల్లా గొప్పవాడివని అంగీకరిస్తాను" అని సోము బలవంతుడిని ప్రహరీ గోడ దగ్గరకు తీసుకెళ్లాడు.

తన జేబులో ఉన్న సిల్కు రుమాలును బలవంతుని చేతిలో పెట్టి, " దీన్ని ఈ ప్రహరీ గోడ అవతలికి విసిరి చూపించు చాలు" అన్నాడు.

బలవంతుడు నవ్వుకుంటూ జేబు రుమాలును విసిరేశాడు. అది ప్రహరీ గోడను దాటలేదు. సోము అప్పుడు ఆ రుమాలును తీసుకొని, దానిలో ఒక చిన్న రాయిని కట్టి, దాన్ని ప్రహరీగోడ అవతలికి సులభంగా విసిరేశాడు.

బలవంతుడు సిగ్గుతో తలదించుకొని, తన ఓటమిని అంగీకరించాడు. "బలం, తెలివి రెండూ గొప్పవే, ఈ ప్రపంచంలో మనిషికి రెండూ అవసరమే. ఏది లేకున్నా పరాజయం తప్పదు" అని అతన్ని ఊరడించాడు సోము.

 

Courtesy..
kottapalli.in